కూ.. కూ.. అంటూ కోయిల తియ్యని సంగీతానికి కళ్లు తెరిచాను.
రాత్రే కొత్తగా ఆ ఇంట్లోకి దిగడం వల్ల సామన్లు సర్దే హడావిడిలో చూట్టూ వాతావరణాన్ని అంతగా పరిశీలించలేదు..
పనితో అలసిపోయి ఉండటంవల్ల రాత్రి పడుకోగానే నిద్ర పట్టేసింది. కోయిల రాగంతోగానీ మెలకువ రాలేదు.
ఏమైనా చక్కని కోయిల రాగంతో ఉషోదయం కావడం మనస్సుకు చాలా ఆహ్లాదంగా.. ఆనందంగా అనిపించింది.
కోయిలమ్మ అడ్రస్ తెలుసుకుందామని బద్ధకంగా దుప్పటి తీసి లేచి, కిటికీ దగ్గరకు వెళ్లి చూశాను.
పక్కనే ఉన్న మేడమీద ఒక పెంకుటిల్లు కనిపించింది.. చూస్తానికి చాలా ముచ్చటగా ఉంది.
వర్షం కూడా పడినట్లుంది. చెట్లమీద ఆకుల చివర్ల నుండి నీటిబిందువులు రాలుతూ.. రోడ్లన్నీ వర్షం నీటితో కడిగినట్లు ఉన్నాయి.
కనబడుతున్న చెట్ల మధ్యలో ఒక చెట్టు చిటారుకొమ్మన ఊయలూగుతోంది కోయిలమ్మ..
కాఫీ పెట్టుకోవటానికి వంటింట్లోకి వెళ్లాను.. అమ్మ ఉంటే ఈ చేతులు కాల్చుకోవాల్సిన బాధ ఉండేది కాదు..
కొంచెంసేపు ఆగి కాఫీ కప్పుతో మళ్లీ కిటికీ దగ్గరకు వెళ్లాను.
కోయిల ఈసారి రెట్టించి రెట్టించి కూస్తోంది…. కోయిల గొంతుతో పాటు మరింకేదో తియ్యని గొంతు వినపడినట్లు అనిపించింది.
అటువైపు చూస్తే.. ఆ పెంకుటింట్లో నుంచి ఓ చిన్నిపాప నోటికి చేతులు అటూ ఇటూ పెట్టి కూ.. కూ.. అంటూ కోయిలని రెచ్చగొడుతూ కనిపించింది.
బహుశా ఆరేడేళ్లు ఉండొచ్చు.. చక్కగా.. ముద్దుగా ఉంది.
గ్రానీ.. కోయిల చూడు నాతోపాటు ఎలా అరుస్తుందో.. అంటూ అప్పుడే మెట్లెక్కి పైకి వస్తున్న ఒక పెద్దావిడ వైపు పరుగుపెట్టింది..
ఉండవే బంగారుతల్లీ.. అలా పరిగెత్తితే పడిపోతావ్.. అంటూ ఆ చిన్నారి చేయి పట్టుకొని మేడమీదకి నడిచింది ఆవిడ.
చేతిలోని గింజల్ని మేడమీద చల్లడం ప్రారంభించింది…
చిన్నారి కూడా నేనూ జల్లుతా అంటూ చేతిలోని కొన్ని గింజలకోసం కాళ్లు ఎత్తి మరీ ముసలావిడ వద్ద నుంచి లాక్కుంటోంది.
ఆగవే.. తల్లీ.. అంటూ కొన్ని గొంజలు ఆ చిన్నారి చేతిలో పెట్టింది.
తన చిట్టి చిట్టి చేతులతో గింజలను విసిరింది చిన్నారి.
ఆ చుట్టూరా ఉన్న చెట్లన్నింటిమీదా నిల్చొని గింజలకోసమే ఎదురుచూస్తున్న పావురాలన్నీ ఒక్కసారిగా అక్కడ వాలాయి.
ఆ గింజలు తింటున్న పావురాళ్ళ గుంపును చూపిస్తూ..
గ్రానీ.. వీటికెందుకు రోజూ ఆం పెడుతున్నావ్.. అని అడిగింది చిన్నారి.
ఉదయమే ఇలా పచ్చని చెట్లని, కోయిలమ్మని, పావురాళ్ళనీ పలకరించామనుకో రోజంతా బాగుంటుందే బంగారు.. అంటూ ఆ చిన్నారి తల నిమిరింది ఆవిడ.
మరి సూర్యుడిని కూడా చూడాలన్నావ్‌గా గ్రానీ.. అంటూ ఆవిడ చీర చెంగట్టుకొని అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టింది చిన్నారి.
ఔనురా.. సూర్యశక్తి అపారమైనది.. అందుకే ఆయన్ని రోజూ పొద్దున్నే చూశామనుకో.. ఆయన కిరణాలవల్ల మనకూ చాలా ఆరోగ్యం.
సరే కాని ముందు స్కూలుకి ఆలస్యమైపోతుంది పద స్నానం చేద్దువు అంటూ లోపలికి తీసుకెళ్ళిపోయింది…
000
అప్పుడే రెండురోజులు అయిపోయింది నేను ఈ ఇంట్లోకి వచ్చి..
రోజూ ఆఫీస్‌కి వెళ్ళడం ఒక యుద్ధకాండ అయిపోయింది… ఉరుకులు.. పరుగులు.. అంతకన్నా ఇబ్బందికరమైన ట్రాఫిక్..
ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన బస్ గురించి.. అందులో ఉండిపోయిన నా పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే..
ఒక హెలికాఫ్టర్ కొనుక్కుంటే అని మెరుపులాంటి ఆలోచన వచ్చింది..
ఒకవైపు చిరాకుగా ఉంటే మళ్ళీ వెనక నుంచి హారెన్‌ల మోత.. సగం ఈ ప్రయాణంలోనే అలసిపోతున్న నా ఈ దుస్థితిని తిట్టుకుంటూ కిటికీలోంచి తల పక్కకి తిప్పాను..
ఈనాడు, హిందూ, ప్రజాశక్తి, ఇలా అన్ని పత్రికలు చదవటం అయిపోతుంది ఆఫీసు బస్‌లోనే.. ఒక ఐదడుగుల దూరంలో ఆగి ఉన్న స్కూల్ బస్.. నాకు సరిగ్గా పక్కగా ఉన్న కిటికీ పక్కన కూర్చొని ఉంది ఎదురింటి చిన్నారి.
ఎందుకో ఆ చిన్నారిని చూడగానే అలసట మాయమైపోయింది..
హలో అంటూ చేయి ఊపాను ఆ చిన్నారికి కనపడేలా..
బదులుగా కాస్త భయంగా నావైపు చూస్తూ తల దించేసుకుంది.. ఒక్క నిమిషం ఆగి..
మళ్ళీ తల ఎత్తి నావైపు చూసింది..
నేను మళ్లీ చేయి ఊపాను.. ఈసారి కాస్త చిరునవ్వు చిందించింది..
తను కూడా చిట్టి చేయి ఊపటం మొదలుపెట్టింది…
ఎప్పుడూ బ్యాగ్‌లో చాక్లెట్స్ పెట్టుకొని తిరగడం నాకు అలవాటు..
ఇంత వయస్సు వచ్చినా చాక్లెట్స్ తింటావేంటి ఇంకా అని ఎంతమంది వెక్కిరించినా..
నా ఈ తీయని అలవాటు అయితే మానలేకపోయాను..
బ్యాగులో నుంచి ఒక చాక్లెట్ తీసి కిటికీలో నుంచి చేయి బైటకు చాపి ఆ చిన్నారికి అందించే ప్రయత్నం చేశాను..
వెంటనే తన బుజ్జి బుజ్జి చేతులని కిటికీలోంచి బైటకు పెట్టి చాక్లెట్స్‌ను అందుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది..
చాలా చిన్ని చిన్ని చేతులు అవ్వడం వల్ల అందుకోలేకపోయింది..
వీలయినంత నా చేయిని చాపి అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నేను..
ఈలోపల ఏమయిందో.. తల లోపలికి పెట్టి బ్యాగ్ వెతికి స్కేలు బయటకు తీసింది..
ఆ స్కేల్‌ని పట్టుకొని నా చేయిదాకా అందించగలిగింది.. చాక్లెట్‌ని ఆ స్కేల్ అంచున ఉంచాను..
అతి జాగ్రత్తగా ఆ స్కేల్‌ను అలాగ్గా లోపలికి తీసుకుంది.
ఇదంతా రెప్పవేయకుండా చూస్తున్న ఆమె మిత్రబృందం అంతా ఒక్కసారిగా చప్పట్లు చరుస్తూ కేరింతలు కొట్టారు.
ఏదో విజయం సాధించా అన్న గర్వంతో నావైపు చూస్తూ మళ్ళీ చేయి ఊపింది చిన్నారి.. బస్ కదిలింది.
000
ఆదివారం సాయంత్రం కాస్త గాలి పీల్చుకునేందుకు తీరిక దొరికే సమయం..
మళ్లీ తెల్లారితే హడావిడే..
కథల పుస్తకాలు రెండు మూడు పట్టుకొని పార్కుదాకా నడుచుకుంటూ వెళ్లా..
అక్కడ పిల్లల కేరింతలతో చాలా సందడిగా ఉంది.
ఈ ప్రపంచాన్నే మర్చిపోయి ఆటలమీదే ధ్యాసపెట్టి ఆడుతున్నారు ఆ చిన్నారులు..
ఆ పిల్లల గుంపులో చిన్నారి కనిపించింది..
తెల్లటి కుచ్చుల కుచ్చుల గౌను వేసుకొని ఊయ్యాల ఊగుతోంది…
ఊపు ఊపుకు పెద్దపెద్దగా నవ్వుతోంది..
చాలా ముద్దుగా అనిపించి దగ్గరకు తీసుకోవాలనిపించింది…
వెంటనే చేయి ఊపాను ఇటు రమ్మని…
రాను అన్నట్లు తలూపింది..
కాసేపు ఆగి మళ్లీ తనే పరిగెత్తుకుంటూ వచ్చింది..
నీ పేరు ఏంటి అన్నాను.
వెన్నెల అంది.
దగ్గరకు తీసుకుంటూ.. వెన్నెల అంటే ఏమిటో తెలుసా? అన్నాను..
వెంటనే ఆకాశంలో చందమామకేసి వేలు చూపించింది.
నేనుకూడా వెన్నెల అంత చల్లగా ఉండాలని మా అమ్మ పెట్టిందంట ఆ పేరు.. చెప్పింది.
నువ్వు ఏ క్లాస్
ఫస్ట్ క్లాస్
మీ నాన్న ఏం చేస్తారు?
దేవుడి దగ్గర ఉన్నారంట. సైకిల్ వేసుకొని వస్తాడని మా గ్రానీ చెప్పింది..
కాని ఇప్పుడే రాడట.. నేను బాగా చదువుకొని పెద్దయ్యాక.. అప్పుడు బోల్డన్ని చాక్లెట్స్ తీసుకొని వస్తారంట.
ఏదో తెలియని బాధ ఒక్క నిమిషం అనిపించింది.
వెంటనే మీ అమ్మ ఎక్కడ అని అడిగా..
అమ్మ కూడా నాన్న దగ్గరే ఉందంట.. గ్రానీ చెప్పింది..
నేను అన్నం తినకపోతే అమ్మ ఏడుస్తుంది అట..
అందుకని నేను ఆం తొందర తొందరగా తినేస్తాను గ్రానీ పెట్టగానే..
మనస్సంతా బరువుగా అయిపోయింది..
వెన్నెల తలమీద చేయి ఉంచి.. వెన్నెలా! గ్రానీ నీతో రాలేదా అన్నాను..
లేదు.. గ్రానీ ఇంట్లో పడుకుంది.. గ్రానీకి అబ్బు వచ్చింది కదా మరి..
అందుకని సోనీని తోడుగా ఉంచి నేను ఒక్కతినే ఆడుకోవడానికి వచ్చాను అంది.
ఎందుకో వెంటనే ఆమెను చూడాలనిపించింది నా మనస్సుకు.
వెన్నెల చేయి పట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్ళు అన్నాను.
ఎందుకు ఆంటీ… అంది.
ముందు తీసుకెళ్ళు అన్నా…
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరాము.
కాలింగ్ బెల్ కొట్టాను. తలుపు తీసి ఉంది రారా అంటూ వినబడింది ఆమె గొంతు.
తలుపు తీసి లోపలికి వెళ్ళాను.
ఒక్కరే మంచం మీద పడుకొని ఉన్నారు.. నన్ను చూడగానే అరుస్తూ మీదకు వచ్చింది ఓ కుక్క.
ఒక్క ఉదుటన బైటకు దూకాను.
ఫర్లేదులే అమ్మా ఏం అనదు.. వెన్నెలా.. ఈ సోనీని బైట కట్టేసిరా అంటూ వెన్నెల చేతికి ఆ కుక్క చైన్ అందించింది ఆవిడ.
అప్పటికి నా ప్రాణం కుదుటపడింది.
ఇంతకీ సోనీ అంటే ఈ కుక్కా.. దీనినా వెన్నెల గ్రానీకి తోడుగా పెట్టి వచ్చానందీ.. అనుకున్నా.
మెల్లగా వెళ్లి ఆవిడ మంచం మీద పక్కగా కూర్చున్నాను.
నమస్కారం అండీ.. ‘నా పేరు సహజ. మీ పక్క బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఈ మధ్యనే కొత్తగా దిగాను.
ప్రతిరోజు మిమ్మల్నీ, వెన్నెలని చూస్తూ ఉంటాను.
మీకు ఒంట్లో బాగాలేదని తెలిసి పలకరిద్దామని వచ్చాను’ అని ముగించాను.
ఆవిడ నావైపు చూసి నవ్వుతూ మంచిదమ్మా.. ఏం చేస్తుంటావు అని అడిగారు.
నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని చెప్పాను.
సంతోషం తల్లీ.. మా వెన్నెలని కూడా ఇంజనీర్‌ని చెయ్యాలని నా ఆశ.. వాళ్ళ అమ్మ ఆశ కూడా…
మా అబ్బాయి కూడా ఇంజనీరే.. ఉద్యోగం చేస్తుండగానే పోయాడు… అంటూ బాధపడ్డారు..
ఏమని చెప్పి ఓదార్చాలో అర్థం కాలేదు నాకు.
వెంటనే ఆవిడ చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ.. అదే యాక్సిడెంట్లో వెన్నెల అమ్మానాన్నా పోయారు.
కూతురు, అల్లుడు, కొడుకు ముగ్గురూ ఒకేసారి నన్ను ఒక్కదాన్నే చేసి వెళ్ళిపోయారు తల్లీ..
నేనొక్కదాన్నే ఎలా వెన్నెలను పెంచాలో ఏమిటో?
ఇదంతా జరిగి ఐదేళ్ళు అయినా నాకు ఇంకా ప్రతిరోజూ నిన్నే జరిగినంత బాధ..
బాధపడుతున్న ఆవిడని రెండు చేతులతో పట్టి లేపి కూర్చోబెట్టా..
మీకు ఏంటి అనారోగ్యం.. అని అడిగాను..
ఏముంది తల్లీ.. వార్ధక్యం కదా.. సహజంగా వచ్చే నీరసం, ఆయాసం, షుగర్, బిపి అన్నీ ఉన్నాయిలే..
అవే ఇలా అప్పుడప్పుడు దాడి చేస్తుంటాయి.
అన్నింటికి మించి అప్పుడప్పుడు గుండెల్లో కలుక్కుమని అనిపిస్తూ ఉంటుంది తల్లీ..
అయ్యో మరి డాక్టర్‌కి చూపించుకోవాల్సింది కదండీ అన్నాను. ఆవిడకు మంచినీళ్ళు అందిస్తూ..
ఆ మందులూ ఉన్నాయి కదా అని.. అయినా ఒక్కదాన్నే వెళ్ళలేక ఆగాను తల్లీ అన్నారు..
అదేంటండి చుట్టాలు ఎవరూ లేరా కనీసం ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి సాయపడటానికి అని అడిగాను.
లేకేం ఉన్నారు.. కాని ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకాలు..
మా వెన్నెలని పెంచుకుంటాం అని కూడా ముందుకు వచ్చారు మొదట్లో..
దానిమీద ప్రేమతో అనుకునేవు.. వారికి డబ్బుమీద వ్యామోహం..
నా కొడుకు.. అల్లుడు ఇద్దరి ఆస్తికి వెన్నెల వారసురాలు.
మూడునెలల క్రితం వరకూ బాగానే వచ్చిపోయేవారు.
మా అబ్బాయి, అల్లుడూ కలిసి చేసిన వ్యాపారం కోసం ఎక్కడో పెద్దమొత్తంలో అప్పు చేశారు.
ఆ అప్పు కింద ఉన్న ఆ కాస్త ఆస్తిని స్వాధీనం చేసుకొన్నారు కోర్టు వాళ్ళు..
గతిలేక ఈ ఇంట్లో ఉంటున్నాము అద్దెకు..
మా వారి పేర ప్రతి నెల పెన్షన్ వస్తుంది.. దానితోనే ప్రస్తుతం నెట్టుకొస్తున్నాను.
ఇదంతా జరిగాక ఆ చుట్టాలు కనపడడం లేదు.
నాకేమీ భయంలేదు.. కాని నేను పోతే వెన్నెల అనాధాశ్రమానికి వెళ్ళాలి.. అదే నా దిగులంతా..
అల్లారుముద్దుగా చూసుకునేది వాళ్ళ అమ్మ.
రేపు ఆశ్రమానికి పంపితే ఆ తల్లి కోరికైనా నెరవేర్చలేకపోతున్నానే అని పెద్దగా ఏడ్చేశారు ఆవిడ..
వెంటనే ఆమెను గుండెలకు హత్తుకున్నాను. నన్ను మరింత గట్టిగా పట్టుకుని ఏడ్చేశారు తనివి తీరా.
000
ఆఫీస్ నుంచి రాగానే వెన్నెల ఇంటికి వెళ్ళడం అలవాటయిపోయింది.
ఆవిడకు మందులు వేయడం, వెన్నెలకి హౌమ్‌వర్క్ చేయించడం, ముగ్గురం కలిసి భోజనం చేయడం..
హార్ట్ స్పెషలిస్ట్‌కు చూపించాక ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం కాస్త కుదుటపడింది.
వెన్నెలతో నా అనుబంధం మరింత బలపడింది. చిన్నారుల నవ్వంత స్వచ్ఛత ఇంకోటి ఉండదు.
ఆ పసివాళ్ళ మనసులు చాలా త్వరగా అల్లుకుపోతాయి.
బామ్మగారికి దగ్గు బాగా పెరిగిపోవడంతో వాళ్లింట్లోనే పడుకోవాలని నిర్ణయించుకున్నాను.
చల్లగాలికి కాసేపు మేడ మీద చాప వేసుకొని పడుకున్నాను.
ఆంటీ కథ చెప్పవా అంటూ వెన్నెల పక్కన చేరింది.
చందమామ పుస్తకం పక్కన పెట్టి.. అప్పుడే చదివిన ఒక కథ చెప్పాను.
ఊ కొడుతూ నిద్రలోకి జారిపోయింది.
తీసికెళ్ళి గదిలో పడుకోబెట్టా…
పక్కనిండా పుస్తకాలు పడేసి ఉన్నాయి. వాటిని మెల్లగా తీసి సర్ది టేబుల్ మీద పెడుతుండగా కనపడింది ఓ పుస్తకం.
అది వెన్నెల దగ్గర ఎప్పుడూ ఉండే పుస్తకం.
మొదటిపేజీలో ఒక బొమ్మ వేసి గ్రానీ అని పేరు పెట్టింది.
రెండో పేజీలో మూడు బొమ్మలు వేసి అమ్మ, నాన్న, మామయ్య అని పేర్లు పెట్టింది.
మూడో పేజీలో ఒక చిన్న పాప బొమ్మ వేసి పరిమళ అని రాసింది.
తన మనసులో చోటుచేసుకున్న వాళ్లందరికీ ఆ పుస్తకంలో కూడా చోటు ఇచ్చింది కాబోలు.
ఏదో తెలియని తీయని అనుభూతి.. పసివాళ్ళ హృదయాలంత కల్మషం లేని చోటు మరెక్కడ..
ప్రపంచంలో పడ్డాక అదే హృదయంలో ఎక్కడ నుండి వస్తోంది ఆ కుటిలత్వం..
అమాయకంగా ముద్దుగా నిద్రపోతున్న వెన్నెలని ఒక్కసారి ముద్దు పెట్టుకున్నా.
000
అమ్మానాన్నని తీసుకురావడానికి విజయవాడ వెళ్ళాను.
అక్కడ మిగిలి ఉన్న సామాను అంతటినీ తీసుకొని బయలుదేరాము.
దారిలో అమ్మకి వెన్నెల గురించి అంతా చెప్పాను.
ఏమిటీ.. వెన్నెల నీకు బాగా నచ్చినట్లు ఉంది..
నీ సొంత కూతురి ముచ్చట్లు చెప్పినట్లు చెప్పుకుంటున్నావు మురిపెంగా అంటూ నవ్వేసింది అమ్మ…
అమ్మా నిన్ను కూడా వెన్నెల గ్రానీ అంటుంది సరేనా.. అన్నాను అమ్మవైపు చూస్తూ..
దానికేం భాగ్యంగానీ.. అలానే పిలవమను.. నీ హడావిడి చూస్తుంటే ఆ పిల్లని త్వరగా చూడాలనిపిస్తోంది సహజతో అంది అమ్మ.
మరే ఔనురా నాకు కూడా అన్నారు నాన్నగారు.
మెల్లగా ఇంటికి చేరాము. సామాను అంతా దించగానే అమ్మ వెన్నెలను చూస్తానని తొందరపెట్టింది.
వెంటనే అందరం వెన్నెల ఇంటికి చేరాము.
వెన్నెల ఒక్కతే బైట కూర్చొని ఉంది.
నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళు చుట్టేసింది.
వెంటనే ఎత్తుకొని ముద్దుపెట్టి చాక్లెట్ ఇచ్చాను చేతికి. వద్దు అంటూ తల ఊపింది..
కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి వెన్నెలకి..
నాకేదో అనుమానం వచ్చి గ్రానీ ఏదీ అన్నాను.
ఏమో తెలియదు.. రమ్య ఆంటీ ఏమో అమ్మమ్మ.. అమ్మ దగ్గరికి వెళ్ళింది అని చెప్పింది అంది.
గుండె జల్లు మంది ఒక్క నిమిషం.
ఒక్క ఉదుటన పక్కింటి రమ్యగారి ఇంట్లోకి వెళ్ళిపోయాను.
నన్ను చూడగానే ఆవిడ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది.
వచ్చావా.. సహజా!.. నీ ఫోన్ నెంబరు కూడా లేకపోయింది నాదగ్గర.. మొన్న రాత్రి నువ్వు అలా వెళ్ళగానే దగ్గు మందు పోశాను. అయినా లాభం లేకపోయింది.. నిద్రలోనే ప్రాణాలు పోయాయి..
చుట్టాలంతా వచ్చారు.. ఎవరో వాళ్ళ చెల్లెలి గారి అబ్బాయి అట.. కొడుకు వరస కదా.. తల కొరివి పెట్టాడు అన్నారు.
నా మెదడు మొద్దు బారిపోయింది. అసలేం జరిగిందో అర్థంకాలేదు… తేరుకొని వెన్నెల కోసం వెతికాను.
నా ఆత్రం చూస్తూ.. సహజా! నిన్న సాయంత్రం వాళ్ళ గ్రానీని తీసికెళ్ళినప్పటి నుంచి ఏం తినలేదు.. ఒకటే ఏడుపు.. నీకోసం..
సహజా! ఆవిడ మొన్న రాత్రి నేను మందు వేయటానికి వెళ్ళినప్పుడు నీకు చెప్పమని నాలుగు మాటలు చెప్పారు అన్నారు.
ఏంటి అన్నట్టు చెమర్చిన కళ్ళతో ఆవిడ వైపు చూశాను.
నా చూపులో ప్రశ్న అర్థం అయినట్లుగా తనకు ఏదన్నా అయితే, నీకు ముందుగా చెప్పినట్టు, వెన్నెలని అనాధాశ్రమంలో చేర్చమన్నారు. అక్కడైతే పిల్లల్ని బాగా చూస్తారట. అడ్రస్ వివరాలు డైరీలో ఉన్నాయి అని చెప్పారు.
బైటకు వెళ్ళి చూశాను.. గులాబీమొక్కకు నీరు పోస్తూ బాల్కనీలో నిల్చుంది వెన్నెల..
దగ్గరకు వెళ్ళి తలమీద చేయి వేశాను..
నా వైపు చూస్తూ.. మొక్కలకి నీరు పోస్తే హాయిగా తాగేసి నాలా పచ్చగా ఉండండి అని దీవిస్తాయి అట గ్రానీ చెప్పింది ఆంటీ.. అంది..
గుండెను మెలిపెడితే ఇలాంటి నొప్పే ఉంటుందేమో అనిపించింది.
000
సహజా! నువ్వు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అడిగింది అమ్మ.
అమ్మా! నేను ఆలోచించకుండా ఏ పనీ చేయను. అది నీకు తెలుసు.. తెలిసి మరీ అడగటంలో ఏంటి నీ ఉద్దేశ్యం అన్నాను విసుగ్గా..
అది కాదురా తల్లీ! రేపు నీకు పెళ్ళి అవుతుంది.. ఆ వచ్చే అబ్బాయి నీ నిర్ణయాన్ని సమర్థించలేదనుకో..
ఏంటి పరిస్థితి అంది దిగులుగా..
పక్కనే ఉన్న నాన్నగారు. అర్థం చేసుకున్నవాడే వస్తాడులే శేషూ! ఊరికే దిగులు పడకు.. అయినా అది మనం ఎలా పెంచామో అలానే ప్రవర్తిస్తుంది.. సుమతీ శతకాలు, వేమన శతకాలు వల్లె వేయించావు నువ్వు.. వివేకానందుడి జీవిత చరిత్రని చదివి వినిపించాను నేను. మరి అవన్నీ గాల్లో వదిలేయలేదు కదా! సహజ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇక నువ్వు వేరే ఏమీ ఆలోచించకుండా, వెళ్ళి వెన్నెలకి అన్నం పెట్టు అన్నారు.
నాన్న దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను. ఏమిటి రా! అంటూ నా చేయి పట్టుకున్నారు..
ఎందుకో తెలియని బాధ పెల్లుబికింది.. నాన్నని గట్టిగా పట్టుకున్నాను.
తండ్రి స్పర్శలో ఉన్న ధైర్యం కొండంత ఊరటనిచ్చింది ఒక్కసారిగా..
నాన్నగారు.. ఎప్పుడో వయస్సు అయిపోయాక ఏదో చెయ్యాలి.. ఒక ఆశ్రమం పెట్టాలి.. పసివారికి, అనాథలకి చేయూతనివ్వాలి అని ఎంతో అనుకునేదాన్ని..
ఎప్పుడో ఎందుకు ఇప్పుడే ఎందుకు కాదు అనిపిస్తూ ఉండేది అప్పుడప్పుడు..
చూస్తూ చూస్తూ నా బాధ్యతని విస్మరించలేకపోయాను నాన్నగారు..
అందుకే మీ అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పైతే క్షమించండి..
వెన్నెల మీద జాలితో ఈ నిర్ణయం తీసుకోలేదు నాన్నగారు..నా స్వార్థంతో తీసుకున్న నిర్ణయం ఇది..
వెన్నెల పసితనపు నవ్వులో ఉన్న నిర్మలత్వం, ఆ చిన్న మనస్సులో ఉన్న ప్రేమ, ఆ చిలుకపలుకుల్లో ఉన్న తియ్యదనం..
ఇవన్నీ తనివితీరా ఆశ్వాదించాలన్న స్వార్థం.. ఒక మంచి బాధ్యత తీసుకున్నానన్న సంతృప్తి.. అంతే..
సహజా! నీ నిర్ణయం సరి అయ్యింది అనుకున్నప్పుడు ఎవరినీ అడగాల్సిన అవసరం లేదురా!
అందులో తప్పు ఏమీ లేదు.. లేచి వెళ్ళి అన్నం తిని పడుకో..
రేపు పొద్దున్న పదిగంటలకే ముహూర్తం..
ఆ దత్తత స్వీకారం ఏదో అయ్యాక అప్పుడు తీరిగ్గా నీ కూతురుతో పాటు కూర్చొని మరీ కబుర్లు చెప్పుకుందాం సరేనా..
అంటూ చల్లగా నా బుగ్గని తాకింది ఆయన చేయి..
ఇదే ఊరట, ఇదే స్థయిర్యం నేను కూడా వెన్నెలకి అందించగలిగితే..
నాన్న నాకు నేర్పిన విద్య.. నేను వెన్నెలకి అందించగలిగితే..
అది కూడా ఈ ప్రపంచాగ్నికి సమిధి కాగలదేమో.. అనిపించింది..
లేచి బెడ్రూంలోకి వెళ్ళాను.. వెన్నెల మంచం మీద కూర్చొని బొమ్మలు వేస్తుంది…
ఈసారి ఆ బొమ్మకి సహజ ఆంటీ అని పేరు పెట్టింది..
ఆ స్వచ్ఛమైన మనస్సులో స్థానం సంపాదించిన ఆనందంలో వెన్నెలని గట్టిగా హత్తుకొని ముద్దాడాను.
నవ్వుతూ తిరిగి నాకూ ముద్దు పెట్టింది వెన్నెల.
తొలకరి జల్లు చిట్టిగులాబీపై పడినప్పుడు పడే నీటిబొట్టు ఆ గులాబీకి అందించే స్పర్శ…
అబ్బా.. ఎంత బాగుంది ఈ అనుభూతి.
000
- శాంతిశ్రీ
0 Response to "వెన్నెల"
కామెంట్‌ను పోస్ట్ చేయండి