జాబిల్లి

ప్రకాశం బ్యారేజీ మీదకి కారు రాగానే.. ప్రియాంక ఒక్కసారిగా నిటారు అయ్యింది…
ప్రమోద్‌…! ప్రమూ..! కారు స్లోగా పోనీరు…
‘కృష్ణమ్మ చూడు ఎన్ని వయ్యారాలు పోతూ.. పడుచుపిల్ల గుండెలా ఎలా తుళ్లిపడుతుందో…’ అంటూ విండో గ్లాస్‌ దించేసి రెండుచేతులతో అద్దాన్ని పట్టుకుని పరవళ్లు తొక్కుతున్న కృష్ణానదిని చూస్తూ చిన్నపిల్లలా పరవశించిపోతోంది ప్రియాంక.
ఆ స్థితిలో ప్రియాంకను చూసి మురిసిపోయాడు ప్రమోద్‌.
బ్యారేజీ దాటేవరకూ ప్రియాంక భంగిమలోగానీ.. ఆమె మోములోని పరవశంలోకానీ లేశమైనా మార్పు లేదు.
బ్యారేజీ దాటగానే… సర్దుకుని కూర్చుంటూ.. నేనెప్పుడు ఇటువైపుగా వెళ్లినా.. ఈ దృశ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వను ప్రమూ…! ఆర్ద్రంగా కళ్లు రెపరెపలాడిస్తూ చెప్పింది ప్రియాంక.
వెంటనే కుడిచేత్తో స్టీరింగ్‌ నడుపుతూ ఎడమచేత్తో ప్రియాంక నడుం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకొని కనురెప్పలపై ముద్దాడాడు ప్రమోద్‌…
‘థాంక్యూ…ప్రమూ…’ కళ్లు బరువుగా మూస్తూ చెప్పింది ప్రియాంక.
‘అంతేనా…?’ అన్నాడు ప్రమోద్‌..
అతనికి మరింత హత్తుకుపోతూ… అతని చేతిని తన చేతిలో తీసుకొని ముద్దాడింది ప్రియాంక.
బ్యారేజీ దాటాక సెంటర్‌లో కారాపాడు ప్రమోద్‌…
అప్పుడు కళ్లు తెరిచి చూసింది ప్రియాంక. అక్కడ చాలామంది మల్లెపూలు రాసులు పోసి వరుసగా కూర్చున్నారు.
ప్రమోద్‌ ఎందుకు కారాపాడో అప్పుడర్థమైంది ప్రియాంకకు.
తామరాకులో చుట్టిన మల్లె దండల్ని తెచ్చి ప్రియాంక చేతిలో పెట్టాడు ప్రమోద్‌. ఎంతో మురిపెంగా వాటినందుకుంది ప్రియాంక. తనొచ్చి డ్రైవింగ్‌ సీట్లో కూర్చొని కారు స్టార్ట్‌ చేశాడు ప్రమోద్‌.
రోడ్డుకిరువైపులా అరటితోటలు.. పసుపు తోటలు.. ములగ తోటలు.. కర్వేపాకు, గులాబీ, లిల్లీ తోటలు.. ఒక పక్క పచ్చగా.. మరోపక్క పరిమళాలు వెదజల్లుతూ మనస్సును మైమరిపిస్తోంది ఆ వాతావరణం…
‘అబ్బా..! ఎంత బాగుంది ఈ వాతావరణం…’ అని పైకే అనేసింది ప్రియాంక..
‘అవునా..!’ అని.. ‘ఏమనిపిస్తోంది…’ అంటూ చిలిపిగా అడిగాడు ప్రమోద్‌..
‘ఛీ.. పో…’ అంటూ అతని భుజానికి తలను ఆనించి తన రెండు చేతులను అతని ఎడమచేతికి పెనవేసింది.
ముసిముసిగా నవ్వుకుంటూ కారు డ్రైవ్‌ చేస్తున్నాడు ప్రమోద్‌…
000
ప్రమోద్‌ మొదటి నుంచి వాళ్లింట్లో అందరికన్నా ప్రత్యేకంగా ఉండేవాడు. ఆలోచనలు కూడా వేరుగా ఉండేవి. తల్లితండ్రులిద్దరూ కూలీలు. ‘తామిలా కూలీలుగా ఉండడమేమిటి? కొందరికే ఎక్కువ భూములుండటమేమిటి? తమకు జానెడు జాగ లేకపోవడమేమిటని?’ ఇలాంటివెన్నో ప్రశ్నలు అతని మస్తిష్కాన్ని తొలుస్తుండేవి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం శోధిస్తూనే ఉండేవాడు. ప్రమోద్‌ ఇంటర్‌కు వచ్చాక ఆ ఊరిలో పేద ప్రజలకోసం పనిచేసే వెంకట్రామయ్యతో పరిచయం ఏర్పడింది. ఆయనిచ్చే పుస్తకాలు చదవడం ప్రమోద్‌కు నిత్యకృత్యమైంది. అలా పుస్తకాలు చదివాక తన ప్రశ్నల్లో చాలావాటికి సమాధానాలు తెలుసుకోగలిగాడు ప్రమోద్‌. అలా తెలుసుకున్న విజ్ఞానంతో ప్రమోద్‌ మరింత రాణించాడు. ఆ తర్వాత తన అభిరుచులకు అనుగుణమైన ప్రియాంకను వివాహం చేసుకున్నాడు. ప్రియాంక ఉన్నత కుటుంబంలో పుట్టినా ఆమె అభిప్రాయాలు అవే కావడంతో.. పేదింటివాడైన, కులాలు వేరైనా ప్రమోద్‌ చేసుకోవడానికి ఏమాత్రం సందేహించలేదు. ప్రమోద్‌ ఇంట్లో ఆమెకు కొత్తగా ఏమీ అనిపించలేదు. చాలా సౌకర్యవంతంగా అనిపించింది. మనస్సులు కలిస్తే మనుగడ సుఖంగానే ఉంటుంది. ప్రియాంక విషయంలో అదే జరిగింది.
000
‘ఏమమ్మా…పాపక్కారు..! మీ కోడల్ని మాకు చూపించవా?’ అంటూ అమ్మలక్కలు వచ్చారు. ‘ఎందుకు చూపించనూ..? అమ్మా! ప్రియాంక ఒకసారి ఇటురామ్మా!’ అని పిలిచింది పాపమ్మ. ‘ఆ…. వస్తున్నా అత్తయ్యా..!’ అంటూ వచ్చింది ప్రియాంక.
గులాబిరంగు చీర కట్టుకుంది. విత్‌ బ్లౌజ్‌ వేసుకుంది. పెద్ద జడ. అందులో మల్లెదండలు నాలుగైదు వరసలు పెట్టింది. వచ్చి అత్తగారి పక్కనే కూర్చుంది.
‘ఏమమ్మా.. మీ అత్త చాటుగా కూర్చుంటున్నావు.. ఇటురా..! మా దగ్గరకు అంటూ’ గడుసుగా అడిగింది పార్వతమ్మ. ‘వెళ్లమ్మా… వాళ్లు గట్టిగా మాట్లాడినట్లు ఉంటుందికానీ.. కల్మషం లేని మనుషులు..’ అంటూ కోడలితో అంది పాపమ్మ. ప్రియాంక లేచి వాళ్ల దగ్గరగా కూర్చుంది. ‘చూడచక్కని ముఖం. ఆపై తీర్చిద్దినట్లున్న కనుబొమ్మలు. దోసగింజ ఆకారంలో బొట్టు. కళ్లకు చక్కగా కాటుక పెట్టుకుంది. కాళ్లకు మెట్టెలు పెట్టుకుంది… ఎంత బాగున్నావమ్మా…! నా దిష్టే తగిలేటట్లుంది’ అంటూ అందరిలోకీ పెద్దావిడ శంకరమ్మ రెండు చేతుల్తో మొటికలు విరిచింది.
‘ఈ చీర నీకు బాగా నప్పిందమ్మాయి… నువ్వే కొనుక్కుంటావా..? మీ అమ్మ కొంటుందా?’ అడిగింది మణి ఆసక్తిగా… ‘నేనే కొనుక్కుంటా’ అంటూ బదులు చెప్పింది ప్రియాంక. ‘అబ్బ నీ గొంతు కూడా చాలా బాగుందమ్మారు… బాగా చదువుకున్నావు కూడా.. నీలో ఇన్ని మంచి సుగుణాలుండబట్టే మా అబ్బాయి నిన్ను చేసుకున్నాడు’ అంటూ చేత్తో ప్రియాంక బుగ్గలు సవరదీసి ముద్దుపెట్టుకుంది వెంకటరమణమ్మ.
వాళ్లవి కల్మషం లేని మాటలు అని తెలుస్తున్నా.. మరీ అంతా ఎదురుగ్గా పొగుడుతుంటే కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది ప్రియాంకకు.
‘ఉండండి..! అందరికీ టీ పెట్టుకొస్తాను…!’ అంటూ అక్కడ నుంచి లేచింది. ‘నువ్వు చాలా అదృష్టవంతురాలివే పాపమ్మా! పట్నం కోడలు వచ్చినా కాలుమీద కాలేసుకుని కూర్చోక మీలో కలిసిపోయింది. ఒకళ్లకు పెట్టేబుద్ధి బాగా వుంది.’ అంది పార్వతమ్మ. ‘ఎన్నిమాట్లొచ్చినా ఒక్కనాడైనా పాపమ్మ చిన్నమ్మ టీ తాగమన్న పాపాన బోదుగందా!’ అంది మణి. ‘చాల్లేవే… సంబడం.. పెట్టినియ్యన్నీ పోయినాయా..? నీ దుంపతెగ.. ఈసారి నీకేమీ పెట్టను చూడూ..’ అంటూ మణి వీపుమీద ఒక్కటేసింది పాపమ్మ. ‘అబ్బా! ఏంటి చిన్నమ్మా!’ అంటూ దెబ్బ పడినచోట వీపు సవరదీసుకుంది మణి. ఈలోపు అందరికీ టీ పెట్టుకొచ్చింది ప్రియాంక. అందరూ టీలు తాగారు.
‘అమ్మాయి నీకు వంట వచ్చా?’ అడిగింది శంకరమ్మ. ‘వచ్చు అమ్మమ్మా!’ అంది ప్రియాంక. ‘నా తల్లే.. ఎంత చక్కగా పిలిచావమ్మా! నూరేళ్లు చల్లగా ఉండమ్మా!’ అంటూ బుగ్గలు నిమిరింది. ‘ఆ వస్తాం పాపమ్మా…!’ అంటూ అందరూ బయల్దేరారు. అత్తాకోడళ్లిదరూ గేటుదాకా వార్ని సాగనంపారు..
000
ఒకరోజు ఉదయం… కోయిలమ్మ కమ్మని కంఠం కిటికీ పక్కనున్న బాదం చెట్టు మీద నుంచి వినిపిస్తోంది. నెమ్మదిగా లేచింది ప్రియాంక. తనమీద వేసి ఉన్న ప్రమోద్‌ చేతిని మెల్లగా తీసి పక్కకు పెట్టింది. కిటికీలోంచి చూస్తే ఎదురుగా ఎత్తుమీద ఒక పెంకుటిల్లు ఉంది.
అక్కడ ఓచిన్ని పాప తన చిట్టి చేతులతో బకెట్లో నీళ్లను టపాటపా కొడుతుంది. అందులో నీళ్లు చింది, నీటి తుంపర్లు మొహంపై పడుతుంటే తెలినవ్వులు చిందిస్తూ పరవశిస్తోంది ఆ చిన్నారి. ఆ దృశ్యం ప్రియాంకు చాలా నచ్చింది. అలాగే చాలా సేపు చూస్తూ కూర్చుండి పోయింది. ఈలోపు ఎవరో ఒక బక్కపల్చని శరీరంతో ఎండిపోయిన ఆకులా ఉన్న ఆవిడ పాప వీపుమీద చటుక్కున ఒక దెబ్బ వేసింది. అంతే అప్పటిదాకా నవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారి భళ్లున ఏడ్చింది. ప్రియాంక మనస్సు చివుక్కుమంది. వెంటనే గబగబా బయటకు వచ్చి గేటువరకూ వచ్చి ఆగిపోయింది.
నిదానంగా ఇంట్లోకి వెనుదిరిగింది. ప్రమోద్‌ నిద్ర లేచాడు. డల్‌గా వస్తున్న ప్రియాంకను చూసి దిగ్గున లేచి.. ఏమైందిరా..! అలా ఉన్నావు అన్నాడు దగ్గరగా వచ్చి దగ్గరకు తీసుకుంటూ… విషయం చెప్పింది ప్రియాంక.. అంతే ఒక్కసారి ప్రమోద్‌ మౌనంగా మంచంపై కూర్చుండిపోయాడు. ఆ పాప గురించిన వివరాలు నీకు తర్వాత చెప్తాలే.. లే ముఖం కడుక్కో… అంటూ ప్రియాంకను లేవదీశాడు. ఇద్దరూ టిఫిన్‌ చేస్తున్నారు. ప్రియాంక మెదడును మాత్రం ఆ పాప గురించిన ఆలోచనలు ఒకటే తొలిచేస్తున్నాయి. ఇక ఉండబట్టలేక. ‘ప్రమూ! చెప్పవా ఆ పాప గురించి’ అని గారాలు పోయింది. ఆ పాప గురించి ప్రియాంక ఆరాటాన్ని అర్థంచేసుకుని చెప్పడం ప్రారంభించాడు.
‘మనింటి ఎదురుగా ఉన్న ఇల్లు వాళ్లది. వాళ్ల పెద్దబ్బాయి చెప్పాపెట్టాకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. రెండో అబ్బాయి కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. వాడు నా వయస్సువాడే. కానీ వాడికి నాలుగేళ్ల క్రితమే పెళ్లైంది. ఇందాక నువ్వు పాపను కొట్టిందని చెప్పావే. ఆవిడే అతని భార్య. పెళ్లప్పుడు చాలా బాగుండేది’ అని ప్రమోద్‌ చెప్తుండగా..
‘ఎవరి గురించిరా చాలా బాగుండేదని చెప్తున్నావు? అడిగింది అప్పుడే అక్కడకు వచ్చిన పాపమ్మ. అదే మన పార్వతక్క వాళ్ల కోడలి సంగతి అన్నాడు ప్రమోద్‌. అవునమ్మా! ఆ అమ్మాయి చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్లు ఉండేదమ్మా! మంచిపిల్ల. చక్కటి పనిమంతురాలు, గుణవంతురాలు. ఈరోజుల్లో అలాంటివాళ్లు అరుదు. ఆ దేవుడికి ఏం కన్నుకుట్టిందో.. ఆ పిల్ల నుదుట అలాంటి రాత రాశాడు’ అంటూ తనదైన వేదాంతంగా మాట్లాడింది పాపమ్మ.
‘ఏమైంది అత్తయ్యా?’ ఆందోళనగా అడిగింది ప్రియాంక. ‘ఆ అబ్బాయి చెడు తిరుగుళ్లు తిరిగి ప్రాణంమీదకు తెచ్చుకోవడం గాక. ఆ పిల్ల ప్రాణంమీదకు తెచ్చాడు’ అంది పాపమ్మ. ‘ఏంటో నాకు సరిగ్గా అర్థమయ్యేట్లు చెప్పు ప్రమోద్‌… ఏమైంది అతనికి?’ అడిగింది ప్రియాంక. ‘వాడు రెండేళ్లక్రితం ఎయిడ్స్‌తో చనిపోయాడు. అప్పటికే పాపకు ఎనిమిది నెలలు. తల్లీ, బిడ్డలకు టెస్టులు చేయించారు. భార్యకు కూడా ఎయిడ్స్‌ సోకిందని చెప్పాడు డాక్టర్లు. పాపకు మాత్రం సోకలేదని చెప్పారు.’ అంటూ ప్రియాంక కళ్ల వెంట కన్నీళ్లు చూసి చెప్పడం ఆపాడు ప్రమోద్‌. ‘ఏంట్రా ప్రియా! అంత బేలపోతే ఎలా?’ అంటూ ఎడమచేతిలో ప్లేట్‌ను కింద పెట్టి ప్రియాంకను దగ్గరకు తీసుకున్నాడు.’ కళ్లు తుడుచుకుంటూ ‘ఇప్పుడు ఆవిడకు, ఆ పాపకు వయస్సు ఎంత? వారిని ఎవరు చూస్తున్నారు?’ అని అడిగింది. ‘ఆ అమ్మాయికి పాతికేళ్లుంటాయనుకుంటా! పాపకు రెండెల్లి మూడో ఏడు వచ్చింది’ అంది కళ్లుతుడుచుకుంటూ పాపమ్మ. ‘ఆ అమ్మాయిని పుట్టింటోళ్లు రావద్దన్నారు. ఆ అబ్బాయి చనిపోవడంతో ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడన్న బాధతో తండ్రి గుండె ఆగి చనిపోయాడు. తల్లి మంచాన పట్టి ఇవాళో.. రేపో అన్నట్లుంది. ఆ అమ్మాయి చూస్తే.. రోజులు లెక్కబెడుతూ ఎండుటాకులా రెపరెపలాడుతోంది.’ అంది పాపమ్మ.
‘మరి వాళ్లనెవరు చూస్తారు?’ ఆందోళనగా కళ్లింత చేసి అడిగింది ప్రియాంక. ‘ఎవరం మాత్రం ఏం చేస్తామమ్మారు. ఎవరికి దేవుడు ఎలా రాసిపెట్టాడో.. ఆ అమ్మాయికి ఆ జబ్బుంటే ఎవరుమాత్రం వెళ్తారు.’ అంది పాపమ్మ. ‘అదేమీ అంటువ్యాధి కాదత్తయ్యా!’ అంది ప్రియాంక. ‘నీకెందుకులేమ్మా ఈ పాడు ఆలోచనలు.. కొత్తగా పెళ్లయ్యిందానివి…’ అంది పాపమ్మ. ‘అది కాదత్తయ్యా’ అంటున్న ప్రియాంక ప్రమోద్‌ చేసిన సైగతో ఆగిపోయింది. అప్పటికే ప్రియాంక మెదడులో ఆలోచనలు చాలా వేగంగా అనేక నిర్ణయాలు చేసేస్తున్నాయి. సాయంత్రం ప్రమోద్‌తో కలిసి అలా బయటకు వెళ్ళడానికి బయల్దేరింది ప్రియాంక.
ఇద్దరూ ఉండవల్లి గుహలకు వెళ్లారు. గుహలపక్కనే పార్కులాగా చాలా బాగా డెవలప్‌ చేసి ఉంది. అక్కడ కూర్చుంటే చుట్టూ అరటి, బంతి, జామ, సపోట తోటలు… వాటి మధ్యలోంచి కొండవీటి వాగు వయ్యారాలు పోతూ ప్రవహిస్తోంది. ఆ వాతావరణం భారంగా ఉన్న ప్రియాంక మనస్సును కాస్త తేలికపర్చింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్ధం తర్వాత… ముందుగా ప్రియాంకే మొదలు పెట్టింది.
‘ప్రమూ! నేనొక నిర్ణయానికి వచ్చాను’ అంది. ‘ఏమిటి?’ అన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు ప్రమోద్‌. ‘అదే మన ఊళ్లో ఎయిడ్స్‌ గురించి చాలా అపోహలున్నట్లు అనిపిస్తోంది. ఎయిడ్స్‌ గురించి అవగాహన కలగజేసే వాళ్ల గురించి నాకు తెలుసు. వాళ్లను ఒకసారి పిలిపించి మన ఊళ్లో రెండు, మూడు మీటింగ్‌లు వేద్దామా!’ అంది ప్రియాంక. ‘ఉపయోగం ఉంటుందా?’ సందేహంగా అడిగాడు ప్రమోద్‌. ‘తప్పకుండా… నువ్వేమీ సందేహించొద్దు.. చాలామంది యువకులు సన్మార్గంలో ఉండడానికి, ఎయిడ్స్‌ వచ్చిన వారిపట్ల ఎలా ఉండాలో కూడా అందరికీ అర్థమవుతుంది.’ అంది ప్రియాంక. ‘సరే అలాగే చేద్దాం..’ అంటూ ప్రియాంక లేవడానికి చేయి అందిస్తూ పైకి లేచాడు ప్రమోద్‌.
‘ఎప్పుడో కాదు రేపు సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం’ అంది ప్రియాంక తన స్నేహితురాలికి ఫోన్‌ చేస్తూ.. ‘ఓకే అంటోంది నిర్మల’ చెప్పింది ఆనందంగా ప్రియాంక. ప్రియాంకలోని ‘బాధ్యత’ ను చూసి గర్వంగా ఫీలయ్యాడు ప్రమోద్‌.
000
మొదటి సమావేశం అయ్యింది.
అత్తగారిని ఒప్పించమని ప్రమోద్‌ను బతిమిలాడి ఆ తర్వాత రోజు ఆ పాప వాళ్ల ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో సంఘటన జరిగాక వెళ్లిన మొదటి మనిషి ప్రియాంక. ప్రియాంకను చూడగానే.. ఆ ఎండుటాకులాంటి శరీరం ఒక్కసారి తేటబడినట్లు అయ్యింది.
‘నిన్ను చూడాలని ఉన్నా! రాలేని దౌర్భాగ్యురాలిని’ అంటూ ‘చాలా మంచి పని చేశారమ్మా!’ అంటూ చేతులెత్తి నమస్కరించింది ఆమె. ‘అలాంటివేమీ మనస్సులో పెట్టుకోకమ్మా! మనమంతా మనుషులం.. అందరం ఒక్కటే.. నీ పేరేంటి?’ అంది. లక్ష్మి. ‘ఎవరే …? ఎవరితో మాట్లాడుతున్నా?’ వణుకుతున్న గొంతుతో లోపలి నుండి అడుగుతుంది పార్వతమ్మ. ‘మన పాపమ్మ అమ్మమ్మ వాళ్ల కోడలు’ అంది లక్ష్మి. ‘అవునా! ఎంత దయమ్మా నీకు మామీద! నీగురించి లక్ష్మి రాత్రి చెప్పింది. చల్లగా ఉండమ్మా అంటూ చేతులు జోడించింది.’ అంది మంచం దగ్గరకు వచ్చిన ప్రియాంకతో. ‘పెద్దవాళ్లు మీరు నాకు నమస్కారం చేయకూడదు’ అంటూ తన రెండుచేతులతో ఆమె చేతులు పట్టుకుంది ప్రియాంక.
‘నిన్ను అక్కా! అని పిలవచ్చా! అడిగింది లక్ష్మి.’ ‘తప్పకుండా…!’ అంది ప్రియాంక. ‘అదేంటి అలా అడుగుతా ఎర్రిమొఖమా! ప్రమోద్‌ మామయ్య భార్యను అక్క అని పిలవపోతే ఏమని పిలుస్తా..?’ అంది పార్వతమ్మ.
అప్పటి వరకూ ఎక్కడ ఆడుకుంటుందో గోడవారగా నిలబడి ప్రియాంకను అలాగే చూస్తోంది పాప. పాపను చూడగానే ప్రియాంకకు ఎక్కడలేని సంతోషం ముంచుకొచ్చింది. ‘దా…దా…’ అంటూ లలితంగా పిలిచింది ప్రియాంక. ‘వెళ్లమ్మా! మన వాళ్లే…నీకు ఆమ్మ (పెద్దమ్మ) అవుద్ది!’ అంది పార్వతమ్మ. దగ్గరకు వచ్చింది.. ‘నీ పేరేంటి?’ అడిగింది ప్రియాంక. ‘జాబిల్లి’ అంది. దగ్గరకు తీసుకొని వళ్లో కూర్చోబెట్టుకుని పర్సులోంచి చాక్లెట్లు తీసి ఇచ్చింది.
‘ఆ పేరు వాళ్ల నానే పెట్టాడమ్మా!’ అంది ఏడుస్తూ పార్వతమ్మ. ‘నాన్న ఆచ్‌ పోయాడు… నేను బాగా చదువుకున్నాక వస్తాడంట… నాకప్పుడు బోలెడు చాక్లెట్లు, బొమ్మలు తెస్తాడు…’ అంటూ చక్రల్లాంటి కళ్లు తిప్పుతూ బుల్లినోరు ముద్దుగా ముందుకూ వెనక్కు సాగదీస్తూ చెప్తోంది జాబిల్లి. ప్రియాంకకు చాలా ముచ్చటేసింది జాబిల్లి మాటలకు.. ‘మహా మాటకారి అక్కా!’ అంది లక్ష్మి.
‘వాళ్ల నాన్న ఇట్టాంటి పాపిష్టి పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదమ్మా!’ అంది పార్వతమ్మ మూల్గుతూ.. ‘సర్లే.. సర్లే.. పడుకో… ఇప్పుడవన్నీ ఎందుకు తవ్వుతావు…! నా కర్మ ఇట్లా కాలాలని ఉంది. ఏం చేస్తాం..?’ అంటూ బాధపడింది లక్ష్మి. ‘ఊరుకోమ్మా…!’ అంది లక్ష్మి భుజం మీద చేయివేసి ప్రియాంక.
‘నాన్నను అమ్మే పోయి తీసుకొస్తుందంట…!’ నోరంతా తెరిచి చెప్తోంది జాబిల్లి. గుండెనెవరో మెలిపెట్టినట్లయింది ప్రియాంకకు.
మళ్లీ వస్తానంటూ… చెప్పి వచ్చేసింది ప్రియాంక.
ప్రియాంక, ప్రమోద్‌ హైదరాబాద్‌ వెళ్లేలోపు మరో రెండు సమావేశాలయ్యాయి. ఆ ఊర్లో చాలా మార్పు వచ్చింది. ఊళ్లో అందరూ ప్రియాంక, ప్రమోద్‌ను మెచ్చుకున్నోళ్లే ఎక్కువ. తిట్టినోళ్లు చాలా తక్కువ.
జాబిల్లి కూడా ప్రియాంకకు బాగా మచ్చిక అయ్యింది. ఎక్కడో మారుమూలున్న వారి పొలానికి ఇప్పుడు రేటొచ్చింది. దాన్ని అమ్మి వచ్చిన ఐదు లక్షల రూపాయల్లో రెండులక్షలు జాబిల్లి పేరున వేసి, మిగిలిన మూడులక్షలు వారి కుటుంబం గడిచేలా, లక్ష్మి, పార్వతమ్మ మందులకు ఖర్చుచేసుకునేలా ఏర్పాటు చేశాడు ప్రమోద్‌. పాపను స్కూల్లో జాయిన్‌చేసి, చదివించమని, అన్ని జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్‌ బయల్దేరారు ప్రియాంక, ప్రమోద్‌.
000
హైదరాబాద్‌ వచ్చిన కొద్దిరోజులకే పార్వతమ్మ కాలం చేసింది.
ఆరునెలలు గడిచింది…
ఒకరోజు ఉదయమే ఫోన్‌ వచ్చింది లక్ష్మి చనిపోయిందని.. ఒక్కసారే ప్రియాంకకు కళ్లల్లో జాబిల్లి కదలాడింది. కళ్లు ఏకధాటిగా వర్షిస్తున్నాయి. ప్రమోద్‌ ఎంత ఓదార్చినా.. వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది ప్రియాంక. కొద్దిసేపయ్యాక.. ‘రాత్రికి బయల్దేరదామా!’ అడిగింది ప్రియాంక.. ‘మనం వెళ్లేటప్పటికి తెల్లవారుతుందిగా.. ఉంచరంట..అర్ధరాత్రి దాటగానే చనిపోయిందంట!’ అన్నాడు ప్రమోద్‌. ‘జాబిల్లి గురించి ప్రమూ…! ఆ చిన్న మనస్సు ఎలా అల్లాడిపోతుందో…’ అంది ప్రియాంక.. ‘అలాగే ప్రియా…! వెళ్దాము. నా మట్టి బుర్రకు ఆ ఆలోచన రాలేదు.. అలాగే వెళ్దాం’ అన్నాడు ప్రమోద్‌.
000
కారులోంచి దిగుతూనే ప్రియాంక జాబిల్లి ఇంటివైపు అడుగులు వేసింది. జాబిల్లి అమ్మమ్మవాళ్లు అనుకుంటా…
‘ఈ పాపం మాకొద్దమ్మా! మేం ఎవరం తీసుకుపోం.. ఏ అనాథాశ్రమంలోనైనా చేర్పించేయండి.. పొలం అమ్మకుండా ఉంటే అదన్నా అట్లా ఉండేది. ఆరిపోయే దీపాలు ఎట్లాగో ఆరిపోతాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ పిల్ల పేరున డబ్బులూ కరిగిపోయాయి. ఎవరికి మాత్రం పట్టింది? అయినా చూసి చూసి ఈ శనినెవరు నెత్తిన పెట్టుకుంటారు?’ అంటూ చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ల మాటలకు ఒళ్లు గగుర్పొడిచింది ప్రియాంకకు. వాళ్లను అడగడం అనవసరమనుకుని.. జాబిల్లి కోసం చుట్టూ చూసింది ప్రియాంక.
బిక్కు బిక్కు మంటూ గోడకు ఆనుకుని నిలబడి ఉంది… బుగ్గలపై కన్నీటి చారికలు ఎండిపోయి ఉన్నాయి. ఎవరూ స్నానం కూడా చేయించినట్లు లేరు.. వాళ్ల నోటికి దడిచి ఊళ్లో వాళ్లు కూడా ఎవరూ అటువైపు వచ్చినట్లు లేరు. ప్రియాంకను అప్పుడే కళ్లెత్తి చూసింది.. వెంటనే.. ‘ఆమ్మా! అంటూ వచ్చి ప్రియాంకను చుట్టుకుపోయింది.’ ప్రియాంక మొకాళ్లపై కూర్చుని జాబిల్లిని గుండెలకు హత్తుకుంది. పెద్దగా ఏడ్చేసింది జాబిల్లి. కొద్దిసేపు ప్రియాంక కూడా కంట్రోల్‌ కాలేకపోయింది.
కొద్దిసేపయ్యాక ప్రియాంక తేరుకుంది..
ఏంట్రా! నేనొచ్చాశాగా..! అంటూ జాబిల్లి వీపు నిమిరింది ప్రియాంక. ‘అమ్మ నాన్న దగ్గరకు వెళ్లిందంట’ అమ్మమ్మ అంటోంది. నేను బాగా చదువుకున్నాకే నాన్న వస్తాడు. మరిప్పుడు నాన్న వస్తాడో? రాడో.. అమ్మ ఎప్పుడొస్తుందో..?’ అంటున్న జాబిల్లి అమాయకత్వానికి ప్రియాంకకు గుండెను పిండేసినట్లయ్యింది. జాబిల్లిని తీసుకొని ఇంట్లోకి వెళ్లింది..
అప్పటికే అక్కడొకామె ప్రియాంక గురించిన విషయాలు జాబిల్లి అమ్మమ్మవాళ్లకు చెప్పింది.
బట్టలు, టవల్‌ తీసుకొచ్చి జాబిల్లికి స్నానం చేయించింది ప్రియాంక. పాపను తీసుకువెళ్తాను అంది ప్రియాంక. అన్నీ మమ్మల్ని అడక్కుండానే చేస్తున్నావుగా.. తీసుకెళ్లు.. ఆ పాపిష్టి దానికోసం ఎవరూ ఇక్కడ ఆరాటపడటం లేదు’ అన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన జాబిల్లి మేనమామ. మరో మాట మాట్లాడకుండా జాబిల్లిని ఎత్తుకుని ఇంటికి వచ్చేసింది ప్రియాంక. అప్పటికే ప్రియాంక నిర్ణయాన్ని తల్లిదండ్రికి చెప్పేసినట్లున్నాడు ప్రమోద్‌.
అందరూ మౌనంగా ఉన్నారు.
కొద్దిసేపటి తర్వాత ప్రియాంకే ఆ నిశ్శబ్ధాన్ని బద్దలు చేస్తూ… ‘నేను తీసుకున్న నిర్ణయం తప్పా మామయ్యా?’ అడిగింది ప్రియాంక. ‘తప్పేం లేదమ్మా! నీ నిర్ణయాన్ని జీర్ణించుకోవడానికి కొంత కాలం పడ్తుంది. ఎంతైనా ఈ ఊరి వాతావరణం వేరు. నీ మనస్సంత విశాలంగా ఇక్కడ మనస్తత్వాలు లేవమ్మా…! నువ్వొచ్చాక ఊరిలో కూడా కొంత మార్పు తీసుకొచ్చావు.. మాలోనూ మార్పు తెచ్చావు.. ఇంతకుముందైతే.. మేం అంగీకరించినా చుట్టూ ఉన్నోళ్లు కాకుల్లా పొడిచేవాళ్లు.. వాళ్లల్లో మనమనుకున్నంత మార్పు వచ్చిందో లేదో రేపు ఈ విషయం బయటకు తెలిస్తేగానీ ఏ సంగతీ తెలియదు..’ అన్నాడు వెంకటయ్య.
చాలా మితంగా మాట్లాడే మామగారు.. అలా అనేసరికి ఆయన పట్ల ప్రియాంకకు మరింత గౌరవం కలిగింది.
అక్కడే ఉంటే ఎక్కడ జాబిల్లిని తీసుకెళ్లమంటారోనని వాళ్ల అమ్మమ్మ వాళ్లు ఆ రోజు తెల్లారే సర్దుకొని వెళ్లిపోయారు.
తెల్లవారితే జాబిల్లితో ప్రియాంక, ప్రమోద్‌ ప్రయాణం.
ఊరంతా తెలిసింది ఈ విషయం..
అందరూ వారి నిర్ణయాన్ని అభినందించారు.. ఇలాంటి పని ఊరికే గర్వకారణం అన్నారు.
000
ఒకరోజు….
‘… మనకింక పిల్లలు వద్దు ప్రమూ…!’ గోముగా అడిగింది ప్రియాంక! ‘అదేంటి?’ అన్నాడు ప్రమోద్‌. ‘మనకు జాబిల్లి ఉంటే.. ఇంకెందుకు మన జీవితమంతా వెన్నెలే కదా!’ అంది ప్రియాంక.. ప్రియాంక మానవత్వానికి కదిలిపోయాడు ప్రమోద్‌. వెంటనే ఆమె ముందు మోకరిల్లాడు. చప్పున లేచిపోయింది ప్రియాంక.. ‘నో…. ప్రమూ… ఏంటిది…’ అంటూ తనూ మోకాళ్లపై కూర్చుని ప్రమోద్‌ను గుండెలకు హత్తుకుంది…
‘అమ్మా… నాన్న ఏడుస్తున్నారా…?’ అంటూ జాబిల్లి రావడంతో వాళ్లు సర్దుకుని.. ‘ఏం లేదురా..?’ అంటూ జాబిల్లిని తీసుకొని టెర్రెస్‌మీదకు వెళ్లారు ఇద్దరూ.. జాబిల్లిని ఎత్తుకుని ముద్దాడింది ప్రియాంక. ప్రియాంకను ముద్దు పెట్టుకుంది జాబిల్లి. వారి పారవశ్యాన్ని చూసి పరవశించిన జాబిలమ్మ వెన్నెలను కురిపించింది..
ఆ ఆపురూప దృశ్యాన్ని తన కెమేరాలో బంధించాడు ప్రమోద్‌.
- శాంతిశ్రీ

0 Response to "జాబిల్లి"

కామెంట్‌ను పోస్ట్ చేయండి