మల్లీశ్వరి

ఎన్నో ఏళ్లుగా ఆమె జీవితం పగలూ రాత్రికీ తేడా లేకుండా గడిచిపోతోంది..
అయినా అసంతృప్తి.. దొరకని మనశ్శాంతి..
ఆ క్రమంలో ఆమె తన మనస్సును మరల్చుకోడానికి అనేక పనులు చేపట్టింది..
ఇళ్లల్లో పనిచేసే వారి పిల్లలకు చదువు చెప్పింది.
భర్త ఆదరణ లేని ఆడపడచులను అక్కున చేర్చుకుంది. వారికి ఏదో ఒక ఉపాధి లభించేలా వారి ఇష్టాన్ని, నేర్పరితనాన్ని గమనించింది.. అందుకనుగుణంగా కుట్లు, అల్లికలు..పెయింటింగ్‌.. నేర్పించింది.
చదువుకోవాలనుకునేవారికి చదువు అందించింది..
ఇలా ఏవేవో వ్యాపాకాలతో తన మనస్సును మళ్లించటానికి ప్రయత్నించింది.
ఆమెకు తెలియకుండానే రోజులు వేగంగా గడిచిపోయినట్లనిపించింది.
తను ఇన్ని పనులు చేస్తున్నా మనస్సులో వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది…
దాని నుంచి మనస్సు మళ్లించుకునేందుకు అనేక పుస్తకాలు చదివేది.
ఆమె పేరు మల్లీశ్వరి..
పేరులో ఎంత పవిత్రత ఉందో.. ఆమె మనస్సూ అంతే పవిత్రత.. అంతకంత పరిమళించినది..
ఎంతో ఠీవీగా.. అంతకన్నా ఎత్తయిన భవనం ముందు నిలబడి ఉంది..
ఆమెకు ఒక తమ్ముడు పేరు రవిచంద్ర.
తల్లిదండ్రుల ప్రేమకు చిన్నతనంలోనే దూరమయ్యారు వారు.
తాతగారి ఆలనాపాలన అనేకన్నా.. ఆయన అత్యంత క్రమశిక్షణలో పెరిగారనుకోవాలి.
ఆయనకు తెలియకుండా ఆ భవంతిలో.. ఏమీ జరగదు.. జరగకూడదు..
ఆయన సంప్రదాయాలకు విలువ ఇచ్చే మనిషి..
ఒక్కసారిగా మల్లీశ్వరికి గతం కళ్లముందు మెదిలేసరికి.. చిన్న కన్నీటి పొర కళ్లల్లో కనిపించింది.
అయినా తమాయించుకుని తోటలోకి వెళ్లింది మల్లీశ్వరి..
తోటలో మొక్కలన్నింటినీ పర్యవేక్షిస్తూ.. ఆ పూల సువాసనలు ఆఘ్రాణిస్తూ.. కొంచెం సేపు ఊరట పొందింది.
ఈ లోపు వాచ్‌మెన్‌ పరుగున వచ్చి.. అమ్మా మనీషమ్మ వచ్చిందమ్మా… అంటూ ఎంతో సంతోషంగా చెప్పాడు.
మల్లీశ్వరికి ఆ మాట ఎంతో ఆనందం కలిగించింది.
మనీషా ఈ రోజు వస్తుందన్న విషయం ముందే తెలిసినా..
ఎందుకో తను వచ్చేసిందనేది పట్టరాని ఆనందంగా ఉంది మల్లీశ్వరికి..
ఆమె వెళ్లేలోపే పరుగున వచ్చి అత్తను కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసింది మనీషా.
మనీషా తన తమ్ముడు కూతురు. అన్నీ తానై పెంచింది.
అమెరికాలో ఉద్యోగంలో చేరాక రావడం ఇదే మొదటిసారి.
తల్లిదండ్రుల వద్దకన్నా మనీషాకి అత్తదగ్గరే చనువు ఎక్కువ.
ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు.
మనీషా వస్తుందని తెలిసి ముందుగానే ఆమెకు గదిని సిద్ధం చేసి ఉంచింది.
ఇద్దరూ కలిసి మనీషా గదిలోకి దారితీశారు.
ఆ రూముకు మల్లీశ్వరి వెళ్లి కొన్నేళ్లు గడిచిందంటే నమ్మలేము.. కానీ అది నిజం.
అది ఇంతకుముందు మల్లీశ్వరిది.
మల్లీశ్వరి వెళ్లగానే గదిని ఒక్కసారి పరికించింది. ఆ గదిలో మంచానికి ఎదురుగా ఉన్న పెయింటింగ్‌పై దృష్టి ఆగిపోయింది.
వెంటనే ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి..
మనీషా ఆశ్చర్యపోయి అత్తను పట్టుకుని ‘ఏమైందంటూ..’ కుదిపేసింది..
ఏమీలేదు.. నువ్వు వచ్చావన్న ఆనందంతో అలా కళ్లు చెమర్చాయి అంతే అంటూ.. మాట (మనస్సు) మార్చి చెప్పింది.
తొందరగా స్నానం చేసి రా మనీషా.. భోజనం చేద్దువుగాని.. అంటూ ఆ గది నుండి బయటకు వచ్చేసింది మల్లీశ్వరి..
ఆ పెయింటింగ్‌ అర్జున్‌ తనకిచ్చిన ఏకైక బహుమతి.
తన గదికి వచ్చి నేరుగా మంచంపై పడుకుని తనివితీరా ఏడ్చేసింది.. అప్పటికిగాని మనస్సు కొంచెం తేలికపడలేదు.
వెంటనే లేచి స్నానం చేసి భోజనాల గదికి వెళ్లింది. అప్పటికే మనీషా రడీగా ఉంది.
ఇద్దరు ఆ మాట.. ఈ మాట.. మాట్లాడుకుంటూ భోజనం చేసేశారు..
మనీషా ఎంతో చలాకీ అయిన అమ్మాయి.. అదే సందర్భంలో పెద్దలపట్ల గౌరవ మర్యాదలు కలది.
ఇప్పటికీ ఏమీ మార్పు లేదు.. అనుకుంది మనస్సులో మల్లీశ్వరి..
ఎంతైనా నా పెంపకం కదా.. అని ఒక నిమిషం గర్వంగా అన్పించింది మల్లీశ్వరికి.
×××
మనీషాకు ఎప్పుడెప్పుడు తన మనస్సులో విషయం అత్తకు చెపుదామా అని ఆతృతగా ఉంది..
తను ప్రేమించిన మహేష్‌ను నాలుగురోజుల్లో ఇక్కడికి రమ్మని అడ్రస్సు ఇచ్చి వచ్చింది..
ఈలోపు అత్తకు విషయం చెప్పి.. ప్రిపేర్‌ చేయాలనుకుంటోంది..
అందుకు అత్త గదికి వెళ్లింది మనీషా..
మల్లీశ్వరి పుస్తకం చదువుకుంటూ కూర్చుని వుంది. మనీషా వచ్చిన అలికిడితో తలెత్తి ఏంటన్నట్లు చూసింది..
ఏంలేదత్తా.. అలా తోటలోకి వెళదామా.. అంది మనీషా..
సరేనని లేచింది మల్లీశ్వరి.. ఇద్దరూ కలిసి తోటలోకి దారితీశారు..
అక్కడ వున్న లాన్‌లో ఇద్దరూ కూర్చున్నారు.
మనీషా ఇదే సరైన సమయమని తనూ మహేష్‌ ప్రేమించుకున్న విషయం, మహేష్‌ గురించిన పూర్తివివరాలన్నీ చెప్పేసింది.
ఒక్కసారిగా మల్లీశ్వరికి ఆశ్చర్యం వేసింది మనీషా ధైర్యానికి.. ఆపాటి ధైర్యం ఆనాడు తాను చేసి ఉంటే ఈరోజు ఈ అశాంతి తనకుండేది కాదుకదా అని అనుకుంది. మనస్సులోనే మనీషాను అభినందించింది..
ఏమైనా మనీషా ప్రేమ ఫలించేలా చేయాలని నిశ్చయించుకుంది..
నాలుగురోజుల్లో మహేష్‌ వస్తాడన్నావుగా.. రానీ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అంటూ లేచింది మల్లీశ్వరి.
అప్పటికి చీకటి పడుతోంది.. భోజనాల తర్వాత ఎవరిగదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు.
మల్లీశ్వరికి మాత్రం ఆరాత్రి నిద్రలేదు.
ఆరోజు తాతగారి ముందు పెదవి విప్పలేకపోయానే అని ఒకటే మదనపడిపోయింది.
గతం ఒక్కసారి కళ్లముందు మెదిలింది.
×××
అనుకోకుండా తమ్ముడు స్నేహితుడు మనోజ్‌ ఒకరోజు వాళ్లింటికి వచ్చాడు.
వాళ్లింట్లో అన్నయ్య కొడుకు సిద్ధూది పుట్టినరోజని అందరూ రావాలని కోరాడు.
తమ్ముడు గొడవచేస్తే తానూ వెళ్లింది మల్లీశ్వరి.
అక్కడ మనోజ్‌ తన అన్న అంటూ పరిచయం చేశాడు.
తలెత్తి చూసింది మల్లీశ్వరి.. అంతే ఒక్కసారి ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.
ఒక్కసారిగా ఇద్దరికీ ఏదో తెలియని అనుభూతి..
ఆమెకు షేక్యాండ్‌ ఇవ్వటానికి చేయి చాపాడు. ఆమె చేయి ఇవ్వకుండా ప్రతి నమస్కారం చేసింది.
ఆమె మనస్సు పరిపరివిధాలా ఆలోచించింది. ఇంతకీ పుట్టినరోజు పండగ ఈయన కొడుకుదేనా అని ఒకటే మధనపడిపోయింది.. కొద్దిసేపటికి కాదని తేలిపోయింది. సిద్ధూని ఎత్తుకుని మనోజ్‌ పెద్దన్న, వదినా కేక్‌ కట్‌ చేశారు.
మనస్సు చాలా తేలికయినట్లనిపించింది మల్లీశ్వరికి.
ఇంటికి తిరిగి వచ్చిందన్నమాటే కానీ.. ఆమె కళ్లముందు అర్జున్‌ రూపమే..
ఇలా వారి మధ్య కొన్నిసార్ల కలయికే తప్ప.. ఎటువంటి ఒప్పందాలూ జరగలేదు..
కలిసినప్పుడల్లా.. అర్జున్‌ ఏవిషయం చెప్పమన్నట్లు చూసేవాడు.
తాను ధైర్యం చేయలేక మౌనంగా ఉండిపోయేది.
అనుకోకుండా ఒకరోజు అర్జున్‌ అమెరికాకు వెళ్లిపోతున్నాడని తెలిసింది..
ఏమీ చేయలేని నిస్సహాయత ఆమెను ఆవరించింది..
రవిచంద్రకి, తాతగారికి చెప్పి వెళ్లేందుకు అర్జున్‌ చివరిసారిగా ఇంటికి వచ్చాడు..
తమ ఇంటి కట్టుబాట్లతో కిటికీలోంచి తప్ప అర్జున్‌ను నేరుగా కలవలేకపోయింది మల్లీశ్వరి..
కళ్లతోనే ఎన్నో విషయాలు చెప్పటానికి ప్రయత్నించింది..
ఇద్దరి మూగమనస్సులు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే దూరమయ్యాయి.
ఎప్పటికైనా కలుస్తాయన్న చిన్న ఆశ తప్ప.
అలా గడిచిపోతుండగానే..
రవిచంద్ర తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకుని ఇంటికి నేరుగా వచ్చేశాడు.
అంతే ఆరోజు భవంతిలో ప్రకంపనలు చెలరేగాయి.
తాతగారిని అంత కోపంలో ఏనాడూ చూడలేదు.
తమ్ముడును ఇంటి నుండి వెళ్లిపొమ్మన్నారు.. తాను చనిపోయినా రావద్దంటూ..
ఆయన ఆవేశపడి ఆఖరికి గుండెపోటు వచ్చి చనిపోయాడు.
ఆరోజు నిజంగా భవంతిలో అల్లకల్లోలం చెలరేగింది.
దేదీప్యమానంగా వెలిగే ఆ భవంతిలో చిమ్మచీకటి.. నిశ్శబ్దం ఆవరించింది.
కొన్నాళ్లు బాధపడిన రవిచంద్ర తన కూతురు మనీషా పుట్టాక.. ఒంటరిగా ఉండిపోయిన మల్లీశ్వరికి మనీషాని అప్పగించి అమెరికాకు వెళ్లిపోయాడు. అప్పటి నుండి మనీషాకు అన్నీ తానై పెంచింది. ఆమెను చదివించి, పెద్దదాన్ని చేసింది.
సాఫ్ట్‌వేర్‌లో నిష్ణాతురాలైన మనీషా.. మంచి ఆఫర్స్‌ వున్నాయంటూ అమెరికాకు వెళ్లింది.
ఇన్నాళ్లకు మనీషా రాకతో ఆ భవంతిలో మళ్లీ వెలుగు వచ్చింది..
ఏమైనా తాను చేయలేని పని తన కోడలు చేసిందని మురిసిపోయింది మల్లీశ్వరి..
మహేష్‌ గురించి మనీషా చెప్పిన వివరాలను విన్నాక..
తమ్ముడు కూడా ఎలాగూ ఒప్పుకుంటాడనిపించింది…
×××
ఒక పొడగాటి మనిషి దగ్గర దగ్గర నలభైఐదు అలా ఉంటాయనుకుంటా.. గేటు తీసుకుని లోపలికి వస్తున్నాడు.
ఆయన వెనుక ఒక నవ యువకుడు..
మల్లీశ్వరి వచ్చిన వారిని పోల్చుకుంటూ చూస్తుంది. ఆ పెద్దమనిషిని చూడగానే ఒక్కసారిగా మల్లీశ్వరికి మనస్సులో ఏదో తెలియని అనుభూతి..
వాళ్లు హల్లోకి వచ్చేశారు..
మనీషా ఆనందంగా వారిని కూర్చోమంటూనే.. వారికి మర్యాదలు చేయాలంటూ నౌకర్లను పురమాయించి..
అత్తను లాక్కుపోతున్నట్లే తీసుకొని వెళ్లింది..
మల్లీశ్వరిని చూడగానే వచ్చిన పెద్దమనిషి ఒక్కసారి దిగ్గున లేచాడు..
కళ్లతో ఏంటిలా..? అంటూ ప్రశ్నించాడు.
నీ కోసమే ఇలా.. అన్నట్లు చూసింది మల్లీశ్వరి..
అంకుల్‌.. మా అత్తయ్య మల్లీశ్వరిగారు..
అత్తయ్యా.. మహేష్‌ నాన్నగారు అర్జున్‌ అంకుల్‌.. అంటూ మనీషా ఒకరికొకరిని పరిచయం చేసింది..
మల్లీశ్వరికి ఒక్కసారిగా ఆనందం తన్నుకు వచ్చింది.. అర్జున్‌ కొడుకు మనీషా ప్రేమించిన వ్యక్తని తెలిసి ఉబ్బితబ్బియ్యింది.
అర్జున్‌ మాత్రం మల్లీశ్వరి అలా ఒంటరిగా ఉండిపోయిందని తెలిసి చాలా గిల్టీగా ఫీలయ్యాడు.
ఆరోజు తన కోసమే వచ్చానని.. ఒక్కమాట చెప్పలేకపోయానే.. అని తన్నితాను మనస్సులోనే నిందించుకున్నాడు..
తర్వాత జీవనగమనంలో రోజులు గడిచిపోయాయి.. జీవితంలో స్థిరపడిపోయాడు…
మళ్లీ ఇన్నేళ్లకు.. ఇలా.. అని ఆమెను చూస్తుండిపోయాడు..
ఆమె సాధారణ స్త్రీ కాదు.. మహాదేవత అని అనుకున్నాడు..
ఆమె నిజంగా దేవతామూర్తిలాగా కనిపించింది.
ఇన్నాళ్లకు కలుసుకున్నామనే ఆర్ద్రత ఇద్దరిలోనూ కనిపించింది.
చెరువులో నీరు ఎండిపోయినా దాహం తీర్చుకోవడానికి మరోచోటికి వెళ్లకుండా
తన చెలికాడి కోసం ఎన్నేళ్లయినా ఎదురుచూసే శ్వేతహంసలాగా అనిపించింది అర్జున్‌కు.
మీ భార్యను తీసుకురాలేదా? అని అడగబోయి మనీషా ఆమె చనిపోయిందని చెప్పిన విషయం గుర్తుకువచ్చి ఆపేసింది..
సారీ.. అంది.. మల్లీశ్వరి…
×××
విషయం తెలుసుకున్నారు మహేష్‌, మనీషా..
మన పెళ్లికాదు ముందు.. నాన్నను.. మీ అత్తను ఇప్పటికైనా ఒక్కటి చేద్దామన్నాడు మహేష్‌..
ఇద్దరూ పెళ్లిపెద్దలయిపోయారు.
‘ఇప్పుడే అసలు మనుషులకు ఒకరికొకరు తోడుకావాలని’ అని పెద్ద ఆరిందాల్లా చెప్పారు.
వెంటనే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి.. వారి వివాహం జరిపించారు.
ఎన్నో ఏళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్న మల్లీశ్వరికి..
అర్జున్‌ చెంతకు చేరడంతో ఆమె అసంతృప్తి మాయమైపోయింది.
మల్లీశ్వరి నిజంగా పరిమళించింది.
- శాంతిశ్రీ

0 Response to "మల్లీశ్వరి"

కామెంట్‌ను పోస్ట్ చేయండి