కొత్త ‘మలుపే’ (పుస్తక సమీక్ష)

బడబాగ్ని శంకరరాజు ఉత్తమ ఉపాధ్యాయుడే కాదు.. సామాజిక దృష్టి, శాస్త్రీయ దృక్పథం కలిగినవాడు. ఈ ఉత్తమ లక్షణాలన్నీ ఆయన రాసిన ప్రతి కథలోనూ వెల్లివిరిశాయి. ఆయా ప్రాంతాల మాండలికాలను ఉపయోగించడమే కాకుండా సమాజంలో అన్యాయానికి గురయ్యే వారందరినీ ఒక్కొక్క కథలో ప్రస్తావించారు. ఆయన పుట్టింది నెల్లూరులో, ఉద్యోగం చేసేది విజయనగరంలో.. కానీ ఆయన కథలు సీమకు కళింగకు ముడిపెడుతూ ‘అదుపులేని పొదుపు’ కథ రాయడం ఆయన హృదయ విస్తృతికి అద్దం పడుతుంది. అయితే ఈ కథలో మరో ముఖ్య విషయాన్ని ‘మతం మత్తు మందులాంటిదని’ మార్క్సును తల్చుకున్న తీరు ప్రశంసనీయం. తాగుబోతువాడు, మతం మత్తులో ఉన్నోడూ ఒక్కటే అన్న పోలిక హేతుబద్దంగా ఉంది. పెత్తందారులకూ, దళితులకూ మధ్య అంతరాన్ని ఆయన ‘మృత్యుజలం’ కథలో ఎంతో హృద్యంగా వర్ణించారు. ఆస్తులు పంచుకున్న తర్వాత అన్నదమ్ములు కట్టుకున్న ఇళ్లలా పెత్తందార్ల, దళితుల పల్లెలు ఎడంఎడంగా ఉండడాన్ని వర్ణించడం సందర్భోచితంగా ఉంది. పెత్తందారి కొడుకు మోటుబావిలో పడిపోతే పండితుడు దేవుణ్ణి రక్షించమని వేడుకోవటం, దళితుడైన లోకేశు రక్షించేందుకు దూకబోతుంటే ‘అంటరానివాడివి’ అనటం మూఢత్వాన్ని తెలియజేసింది. మనుషుల మస్తిష్కాల్లోని కుళ్లు ఆలోచనలతో నిమిత్తం లేకుండా లోకేశు కుక్క బావిలో దూకడం కర్తవ్యాన్ని బోధించింది. పిల్లవాడి ప్రాణాల్ని కాపాడమని లోకేశును స్త్రీలు వేడుకున్న తీరు వారిలోని మాతృత్వాన్ని తెలియజెప్పింది. లోకేశు బావిలో దూకి పిల్లవాడ్ని రక్షిస్తాడు. ఇంతచేసినా.. దళితులకు తాగునీటిని ఇవ్వాల్సి వచ్చేప్పటికి పొలాల దగ్గర పగలు పెంచుకున్న పెత్తందారులు ఒక్కటై వాళ్లకు నీళ్లివ్వకుండా అడ్డుకోవడం వారిలోని అగ్రవర్ణ అహంకారాన్ని, దళితుల పట్ల వివక్షను, తమ అభివృద్ధి ముఖ్యమన్న పెత్తందార్ల స్వార్థం కథనంలో చెప్పిన తీరు రచయితను అభినందించే విధంగా ఉన్నాయి. ఈ కథలోని ఆనందనాయుడు, లోకేశ్‌లు పల్లెల్లో జీవించే వారికి, పల్లెలకు వెళ్లేవారికీ తారసపడే పాత్రలే. ఇలాంటి కథలు రాసిన శంకరరాజు తన వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చిన వారయ్యారు.

‘కొత్త మలుపు’లో నేటి సమాజంలో ఉద్యోగం చేసే ఆడవాళ్లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను కథనంగా తీసుకోవడం రచయితకు ఆడవారి సమస్యల పట్ల ఉన్న సమగ్ర అహగాహనను తెలియజేసింది. ఈ కథనంలో స్త్రీని కామంతో చూసే మృగాలకే ప్రమాదం జరిగినప్పుడు ఆ స్త్రీ మాతృమూర్తిలా ఎలా స్పందిస్తుందో వివరించిన తీరు హృదయాన్ని ద్రవింపజేసింది. నేటి సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాల పట్ల మృగాల్లా మారకుండా మగవాళ్ల కళ్లు తెరిపించిన కథ ‘కొత్త మలుపు’ నిజంగా కొత్త మలుపే.

‘ఆఖరి తడి’ కథలో రాయలసీమలో కరువు పరిస్థితుల్లో రైతు సేద్యం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో శంకరరాజు కళ్ల ముందుంచారు. గుడ్డిలో మెల్లలా వచ్చిన కాసింత చెరువునీరు కూడా చిట్టచివర్న ఉండే సాగుమడి చేసే రైతులకు అందడంలో జరిగే అన్యాయాన్ని చెప్పిన తీరు వాస్తవాన్ని అద్దినట్లుంది. ఆఖరితడిలో అన్యాయమే కాకుండా పెత్తందార్లచేతిలో మరింత అన్యాయమవుతున్న దళిత రైతుల దుస్థితి ‘ఈ దబాయింపులు ఈనాటివా! రాజులు, జెమిందార్ల కాలం నుంచి ఇదే వరస…’ అంటూ నాటి నుంచి కొనసాగుతుందని రచయిత చెప్పిన తీరు కులవివక్ష చరిత్రను చెప్పినట్లయ్యింది. పెద్దలు చేసే వెధవపనుల్ని ప్రశ్నించినా, న్యాయం కోసం ఎదురుతిరిగినా పెత్తందార్లు ప్రాణాలు తీయడానికీ వెనుకాడరని రచయిత కథనం నడిపిన తీరు కంటతడి పెట్టించింది.

- శాంతిశ్రీ

0 Response to "కొత్త ‘మలుపే’ (పుస్తక సమీక్ష)"

కామెంట్‌ను పోస్ట్ చేయండి