హర్షిత

గులాబీ రంగు చీరలో ముగ్ధమనోహరంగా ఆ గులాబీ పువ్వే నడిచొస్తుందా అన్నట్లు బస్సు దిగి వస్తోంది హర్షిత. రావడం రావడమే రోజూలాగానే పూలమ్మే సుగుణమ్మ దగ్గరకు వచ్చి ఆగింది. ఆమె కోసం ఎదురుచూస్తున్న సుగుణమ్మ ‘వచ్చావమ్మా..! ఏంటీ.. ఈరోజు ఆలస్యమైందేంటి? బస్సు అందలేదా? లేటుగా బయల్దేరారా?’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఆమె కోసం ఉంచిన గులాబీ తీసి హర్షితకు అందించింది.
హర్షిత దాన్ని అందుకుంటూ..’ వాసన చూస్తూ.. ఈ గులాబీ భలే మంచి వాసన వస్తుంది కదా..?’ అడిగింది హర్షిత. ‘అవునమ్మా. నీకెప్పుడూ నేను మంచి పూలే ఇస్తానమ్మా…ఈ పువ్వు నీ చీరకు కరెక్టుగా మ్యాచింగ్‌ అయ్యిందమ్మా’ అంది సుగణమ్మ. ‘రంగులు నాకు కనిపించవుగా.. అందుకే మంచివాసన వచ్చే పూలంటే నాకు మరీ మరీ ఇష్టం.. అందులో గులాబీ, మల్లెపూలంటే నాకు మరీ మరీ ఇష్టం.. చాలా థ్యాంక్సు సుగణమ్మ’ అంటూ యూనివర్శిటీలోకి దారితీసింది హర్షిత. ‘అయ్యో హర్షితమ్మకు కళ్లుకనపడవన్న విషయం తెలిసినా? ఇలా అనేశానే.. అయ్యో బిడ్డ ఎంత బాధపడిందో ఏంటో..నాకస్సలు బుద్ధిలేదు’ అంటూ తనను తాను తిట్టుకుంటూ.. హర్షిత వెళ్లేవైపే చూస్తుండిపోయింది సుగుణమ్మ.
హర్షిత యూనివర్శిటీలో ప్రొఫెసర్‌. హర్షిత క్లాసంటే విద్యార్థులు ఫుల్‌ హాజరు. అస్సలు డుమ్మా కొట్టరు. ఆమె పాఠం చెప్పే తీరు అలా ఉంటుంది మరి. హర్షిత ఆ విధంగా పాఠం చెప్పడం తోటి ప్రొఫెసర్లకు కూడా ఆశ్చర్యం కలిగించిన సందర్భాలు ఎన్నో. హర్షిత మాట్లాడుతుంటే అందరూ కళ్లప్పగించి వినాల్సిందే. హర్షిత మాట అంత మధురంగా, సరళంగా ఉంటుంది. ఆమె చెప్పిన పాఠం ఏదైనా మర్చిపోలేమంటారు అనేకమంది విద్యార్థులు. అలా అభిప్రాయపడుతున్నారంటే అది హర్షిత గొప్పతనమే కదా!
కాలేజీ ముగించుకుని ఇంటికి చేరింది హర్షిత.
ఇంట్లోకి అడుగుపెట్టగానే చేతిలో బ్యాగ్‌ను గోడకు తగిలించి, వాష్‌ బేసిన్‌ దగ్గరకు వచ్చి చల్లని నీటితో ముఖం కడుక్కుంది. సోఫాలో కూర్చొని సిడి ప్లేయర్‌ ఆన్‌ చేసి, సంగీతం వింటూ కాసేపు రిలాక్స్‌ అయ్యింది. అలా పాటలు విని కాసేపు సేదతీరాక కొద్దిగా సౌండ్‌ పెంచి స్నానానికి వెళ్లింది. స్నానం చేసి వచ్చాక పాటలు ఆపేసి తాను పాడటం మొదలుపెట్టింది. ఆ మధురగాత్రం వింటూ వాళ్లమ్మ మైమరచిపోయింది. కాసేపు అలా సాధన చేశాకగానీ వాళ్లమ్మ వచ్చిన విషయాన్ని గ్రహించలేదు.
‘ఏమ్మా ఏంటి సంగతులు?’ హర్షితను అడిగింది తల్లి సౌదామినిని. ‘ఏం లేదమ్మా… ఈరోజు సుగుణమ్మ నాకు మంచి సువాసన వస్తున్న గులాబీ ఇచ్చింది. అది ఈరోజు నేను కట్టుకున్న చీరకు మ్యాచింగ్‌ అని తనే చెప్పింది. అబ్బ… ఎంత మంచివాసన వస్తుందనీ…’ ఆనందంగా చెప్పింది హర్షిత.
‘కళ్లుంటే ఇంకెంత ఆనందపడేదానివో కదా!’ అనుకుంటూ చీరకొంగుతో కళ్లద్దుకుంది సౌదామిని. తల్లి మౌనంగా ఉండిపోయిందంటే ఏడుస్తుందనే అర్థం. అది గ్రహించిన హర్షిత. ‘అలా ఏడవొద్దని నీకెన్నిసార్లు చెప్పానమ్మా! నాకు కళ్లు లేవన్న విషయాన్ని పదే పదే గుర్తుచేసి నన్ను మరింత బాధపెట్టినట్లేగానీ, నువ్వలా ఏడ్వటం నాకేమీ ఓదార్పు కాదు. నేను చాలా ఆనందంగా ఉన్నా.. ప్లీజ్‌ అమ్మా..! ఇంకెప్పుడూ అలా ఏడవొద్దు… నా చేతిలో చెయ్యి వేయి…’ అంటూ చేయి ముందుకు చాపింది హర్షిత. ఆమె చేతిలో చేయివేస్తూ ‘భోజనానికి రామ్మా…’ అంటూ పట్టుకుని లేవదీసింది సౌదామిని. ‘నాన్న వచ్చాక భోంచేద్దామమ్మా!’ అంది హర్షిత. ‘సరేలే అప్పటివరకూ వార్తలు విందాం పదా!’ అంటూ హాల్లోకి దారితీసింది సౌదామిని. వాళ్లు వార్తలు వింటుండగానే ‘ఏంటమ్మా ఈ రోజు వార్తలు?’ అంటూ రాఘవరావు లోపలికి అడుగుపెట్టారు. ‘పెద్ద విశేషాలు ఏమీ లేవు నాన్నా! ఏంటి ఈ రోజు ఇంత లేటు?’ గారంగా అడిగింది హర్షిత. ‘ఏం లేదురా! ఈ రోజు ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయి. పెద్దతలకాయగా నన్ను కూడా ఉండమన్నారు. అంతే.. స్నానం చేసి వస్తా మీరు భోజనాలకు లేవండి…’ అంటూ వెళ్లారు రాఘవరావు. ముగ్గురూ భోజనాలకు కూర్చున్నారు. భోజనాల దగ్గర కూతురు యూనివర్శిటీలో ఆరోజు జరిగిన విషయాలు చెపుతుంటే.. ఆరోజు ఇంటర్వ్యూలో జరిగిన తమాషాలు చెప్పారు రాఘవరావుగారు. ‘కబుర్లేనా తినేదేమన్నా ఉందా?’ అన్న సౌదామిని చేసిన రెండు, మూడు హెచ్చరికలతో భోజనాలు ముగించారు. అందరూ మళ్లీ హాల్లోకి వచ్చి కొద్దిసేపు మాట్లాడుకుని ఎవరి బెడ్‌రూముల్లోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు.
000
భరత్‌ పేరుకు తగ్గట్టు దేశాన్ని ఉద్దరించడానికే పుట్టాడా అన్నట్లు ఉంటాడు. అతను చేసేది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. అతను చేసే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అంతే సాఫ్ట్‌గా ఉంటాయి. వికలాంగులన్నా, మానసిక వికలాంగులన్నా అతని హృదయం ద్రవించిపోతుంది. వారికోసమే తానున్నట్లు వాళ్లతో వ్యవహరిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు. కన్నూముక్కూ తీర్చిదిద్దినట్లు ఉంటాయి. పసిమిఛాయ.. కొద్దిగా వంకీ తిరిగిన నల్లని జుట్టు చూపరులను ఇట్టే ఆకర్షించే విగ్రహం అతనిది. అతను మాట్లాడుతుంటే ఎంతటివారైనా మౌనంగా ఆలకిస్తూ ఉంటారు. మనస్సు కూడా ద్రవించేలా మాట్లాడతాడు. వికలాంగుల గురించి అతను మాట్లాడుతుంటే అన్నీ ఉండి ఏమీ చేయలేకపోతున్నామనే అవమానం ఒకవైపు వేధిస్తుంటే, మరోవైపు కర్తవ్యం బోధపడినట్లు ఉంటుంది ఎవరికైనా. వీకెండ్స్‌ రెండురోజులూ సేవా కార్యక్రమాల్లోనే మునిగి తేలతాడు భరత్‌. ఈ పనులను భరత్‌ ఇంత ఇష్టంగా చేస్తున్నాడంటే ఆ గొప్పతనమంతా వాళ్ల అమ్మ శారదమ్మకే దక్కుతుంది. తండ్రి సుబ్బారావు మాత్రం పైసా పైసా లెక్కలేసుకునే టైపు. శారదమ్మ చిన్నప్పటి నుంచి భరత్‌కు సమాజం పట్ల జాలిని, ప్రేమను రంగరించి పోసింది. శారదమ్మ ప్రతి శనివారం వృద్ధాశ్రమానికి వెళ్లి ఆరోజంతా అక్కడ వృద్ధులకు సేవ చేసి, సాయంత్రం ఆరుగంటలకు ఇంటిముఖం పడుతుంది. ఇలా తల్లీకొడుకూ సమాజసేవలో తన్మయత్వం చెందుతుంటారు. ఖర్చు పెట్టకుండా కాళ్లూచేతులు, నోరు నొప్పి పుట్టేలా ఎంత కష్టపడినా ఇబ్బందిలేదంటాడు సుబ్బారావు. ఇది భరత్‌ ఇంట్లోని విచిత్ర పరిస్థితి.
000
ఒకరోజు అంధులకు సంబంధించిన కార్యక్రమం ఆడిటోరియంలో జరుగుతోంది. దానికి భరత్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. వికలాంగుల గురించి ఎంతో ఆర్ద్రతతో ఉపన్యాసం చేస్తున్నాడు భరత్‌. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. కొద్దిసేపటికి హర్షిత లేచి ‘ఉపన్యాసాలు చాలా మంది చేస్తారు. పండ్లు, ఫలహారాలు చాలా మంది పంచుతారు. ఏదో ఒక అవయవం లేనివారని మమ్మల్ని ప్రత్యేకంగా (దూరంగా) ఉంచుతారు. అయ్యో పాపం! అంటారు. ఇలా మామీద ఎవరూ జాలి, దయా చూపొద్దు. మీలో ఒక్కరిగా మమ్మల్ని చూడండి. మీకు అలాంటి అభిప్రాయం లేకుంటే.. మాపట్ల నిజంగా ప్రేమ ఉంటే.. మీలో ఒకరిగా మమ్మల్ని స్వీకరిస్తుంటే.. ఒక అంధురాల్ని పెళ్లి చేసుకోండి చూద్దాం…!’ అంటూ సవాలు విసిరింది. అందుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘మీకు వివాహం అయ్యిందా?’ అన్నాడు భరత్‌. ‘లేదు’ అంది హర్షిత. ‘అయితే నన్ను చేసుకుంటానికి మీకేమీ అభ్యంతరం లేదుగా?’ అన్నాడు భరత్‌. ‘నాకేమీ అభ్యంతరం లేదు’ బదులిచ్చింది హర్షిత. ‘ఈ కార్యక్రమం అవగానే మీ ఇంటికి వస్తాను మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను’ అన్నాడు భరత్‌. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా హర్షాతిరేకాలు చేశారు. కొద్దిసేపటికి కార్యక్రమం ముగిసింది.
హర్షితను తన కారులోనే ఎక్కించుకొని ఆమె చెప్పిన అడ్రస్‌ ప్రకారం వాళ్లింటికి తీసికెళ్లాడు భరత్‌. దారిలోనే ఆమె యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ అని తెలుసుకున్నాడు. పుట్టుకతోనే అంధత్వం ఉందనీ, తన తల్లిదండ్రులు తననెంతో స్థయిర్యంతో పెంచారని చెప్పింది. భరత్‌ కూడా తన తల్లిదండ్రుల గురించి చెప్పాడు. ఈలోగా హర్షిత ఇల్లు వచ్చేసింది. కారాపాడు భరత్‌.
ఆమె ఇంట్లోకి దారితీస్తుంటే ఆమె వెనకే వస్తున్న భరత్‌కి.. అడుగుపెట్టగానే సువాసనలు వెదజల్లుతున్న పూలు స్వాగతం చెప్పాయి. తలుపు పట్టుకోగానే సంగీతం వినిపించింది. కర్టెన్‌ పక్కకు జరపగానే మరో వినసొంపైన ధ్వని వినపడింది. ఇవన్నీ హర్షిత కోసం ఆమె తల్లిదండ్రులు చేసిన ఏర్పాట్లని భరత్‌ గ్రహించాడు. చాలా ఆశ్చర్యపోయాడు కూడా. అంత మనోధైర్యంగా మాట్లాడిదంటేనే హర్షిత చాలా విషయ పరిజ్ఞానంతో పాటు మనోస్థయిర్యం కలిగిన వ్యక్తని అర్థమైంది. హల్లోకి వచ్చేలోపు అనేకరకాల ధ్వనులు అతని ఎదను మీటాయి. సోఫాలో కూర్చోమంది హర్షిత. కూర్చున్నాడు భరత్‌. ఈలోపు సౌదామిని చీర కొంగు కప్పుకుని వచ్చింది. ఆమెను చూడగానే లేచి నమస్కరించాడు భరత్‌. ‘కూర్చో బాబూ! హర్షిత ఇప్పుడే చెపుతుంది మీ గురించి. హర్షిత ఫోను చేసింది వాళ్ల నాన్నగారికి. ఆయన తను రావడానికి కొద్దిగా టైము పడుతుందన్నారు. ‘ఆయన వచ్చేవరకూ కాసేపు అలా కూర్చుందాం రండి’ అంటూ డైనింగ్‌ టేబుల్‌వైపు దారితీసింది సౌదామిని. అక్కడే వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కొన్నారు ఇద్దరూ. ముగ్గురూ కూర్చొని వెజిటబుల్‌ సలాడ్‌ తింటూ భరత్‌ వాళ్ల కుటుంబం గురించిన విశేషాలు చెపుతుంటే వింటున్నారు. ‘ఎంత మంచి అబ్బాయి’ మనస్సులోనే అభినందించకుండా ఉండలేకపోయింది సౌదామిని. ఈలోగా రాఘవరావు జాయినయ్యారు వాళ్లతో. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకున్నారు.
‘ఈ రోజు శుక్రవారం కదా భరత్‌!’ అడిగాడు రాఘవరావు. ‘అవునంకుల్‌’ అంటూ ఏంటి చెప్పండి అన్నట్లు ప్రశ్నార్థకంగా మొహంపెట్టాడు భరత్‌. ‘ఆదివారం హర్షితను తీసుకొని మీ ఇంటికి వస్తాము’ అన్నారు రాఘవరావు. ‘అలాగే’ అంటూ వారి వద్ద సెలవు తీసుకుంటూ సంతోషంగా బయటకొచ్చాడు భరత్‌. ఆ ఇంటి వాతావరణం బాగా నచ్చింది భరత్‌కు. ఇంటికి వెళ్లేలోపు పదిసార్లుకన్నా ఎక్కువే అనుకుని ఉంటాడు ఆ మాట. ఇంటికెళ్లగానే వాళ్లమ్మ చుట్టూ చేతులు వేసి కొద్దిగా పైకి లేపి చుట్టూతా తిప్పేశాడు భరత్‌. ‘కళ్లు తిరుగుతున్నాయిరా! ఆపరా! ఏమిటీ ఈ రోజు ఇంత ఆనందం’ అంటూ ఇబ్బంది పడిపోయింది శారదమ్మ.
కంగారుపడిపోయి ఆపేసి వాళ్లమ్మ భుజం చుట్టూ చేతులు వేసి సోఫాలో కూర్చొబెడుతూ ‘ఏంటమ్మా! ఏమన్నా ఇబ్బందిగా ఉందా?’ అంటూ నుదిటిపై చేయిపెట్టాడు. చిరుచెమటలు పట్టాయి. ‘సారీ అమ్మా’ అని గబగబా లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. ‘మరేం ఫర్వాలేదులే! ఏమిటీ ఇంతకీ ఈ పట్టలేని ఆనందానికి కారణం?’ మళ్లీ అడిగింది శారదమ్మ. హర్షిత గురించిన విషయం చెప్పాడు భరత్‌. ‘చాలా మంచి పని చేశావు నాన్నా!’ వెంటనే భరత్‌ తలను రెండుచేతులతో దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టింది శారదమ్మ. అమ్మ వెంటనే ఒప్పేసుకుంటుందని భరత్‌కు ముందే తెలుసు. తండ్రి గురించే పితలాటకం. అయినా ఆయన్ని ఇద్దరూ కలిసి ఎలాగైనా మేనేజ్‌ చేస్తారు. ఆ ధైర్యం ఇద్దరికీ ఉంది. ‘అమ్మా! వాళ్లు ఆదివారం వస్తానన్నారు. నాన్నని వేరే పనులేవీ పెట్టుకోకుండా ఇంట్లో ఉంచే బాధ్యత నీదే’ అన్నాడు భరత్‌.
‘ఓకే నాన్నా! అవన్నీ నాకు వదిలిపెట్టేరు..’ కొడుకు వీపు తడుతూ అంది శారదమ్మ.
కొడుకు సాయంతో శారదమ్మ హర్షితకు అనువుగా ఇంట్లో దేన్ని తాకినా సుమధుర సంగీతం వినిపించేలా ఏర్పాట్లు చేసేసింది.
ఆదివారం వచ్చేసింది.
హర్షితను తీసుకొని వాళ్ల అమ్మానాన్నా ఇంట్లోకి అడుగుపెట్టారు. అక్కడి వాతావరణం చూశాక వాళ్లు ముగ్ధులైపోయారు. రెండురోజుల్లోనే హర్షిత రావడానికి ఇబ్బంది లేకుండా ఇంట్లో చేసిన ఏర్పాట్లకు రాఘవరావు హృదయం ద్రవించిపోయింది. ఎదురుగా వచ్చిన భరత్‌ను హృదయానికి హత్తుకున్నారు. ఆయన స్పర్శలోని భావాన్ని భరత్‌ గ్రహించాడు. పరిచయ కార్యక్రమాలు అయిపోయాయి. హర్షితను తీసుకొని శారదమ్మ, సౌదామిని లోపలికి వెళ్లిపోయారు.
ఇంట్లో ఎన్ని గదులో, ఎటువైపు తలుపులూ కిటికీలూ అలమరాలూ ఉన్నాయో.. అన్ని వివరంగా హర్షితకు అర్థమయ్యేలా శారదమ్మ చెపుతుంటే సౌదామినికి సంతోషంతో గుండె ద్రవించిపోయింది. ‘చాలా సంతోషం వదినగారూ! మీలాంటి మంచి సంబంధం మాకు దొరకడం. అందాలరాశి, అనుభవశీలి అయిన కోడల్ని మాకిస్తున్నందుకు’ అంటూ సౌదామిని చేతిని ఆప్యాయంగా చేతిలోకి తీసుకొని నిమిరింది శారదమ్మ. వారి ఆప్యాయతానురాగాలకు హర్షిత కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. రాఘవరావుకు హర్షిత ఒక్కతే కూతురు, కళ్లులేకపోతే ఏంటి? ఆస్తంతా తమదేనన్న భరోసాతో నిబ్బరంగా ఉన్నాడు సుబ్బారావు. అందరూ సంబంధం ఓకే అనుకున్నారు. పురోహితుడిని సంప్రదించారు. రెండువారాల్లో దివ్యమైన ముహూర్తం ఉందన్నాడు పురోహితుడు. ఆ ముహూర్తానికే పెళ్లిచేయాలని పెద్దలంతా నిశ్చయించుకున్నారు. పెళ్లిని చాలా నిరాడంబరంగా జరుపుకోవాలని షరతు పెట్టింది హర్షిత. భరత్‌ కుటుంబం అందుకు సమ్మతించారు.
000
భరత్‌-హర్షితల పెళ్లి రిజిస్ట్రర్‌ ఆఫీసులో సింపుల్‌గా అయిపోయింది. అదేరోజు రాత్రి వారికి ఇంటికి పైన ఉన్న బెడ్‌రూమ్‌లో ఏర్పాట్లు చేసింది శారదమ్మ. భోజనాలు అయ్యాక కింద ఉన్న బెడ్‌రూముల్లో పెద్దవాళ్లు ఉండిపోయారు. హర్షితను తీసుకొని భరత్‌ పైకి వెళ్లాడు. అక్కడ గదిలోకి అడుగుపెట్టగానే హర్షిత మనస్సుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది. సువాసన భరితమైన మల్లెల పరిమళాలు, సంపెంగల సౌరభాలు, చల్లటి పిల్లగాలి, మధురమైన సంగీతం… వాటన్నింటినీ ఆస్వాదిస్తూ మైమరిచిపోయింది హర్షిత. ఆమె పరవశాన్ని తదేకంగా చూస్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కాడు భరత్‌. మరింత మధురంగా అనిపించింది హర్షితకు. వెంటనే ఆమె మోమును తన చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు భరత్‌. హర్షిత శరీరమంతా ఒక్కసారిగా పులకించిపోయింది. ఆమె పులకరింతకు భరత్‌ చెవిలో చెప్పిన పలకరింతలతో సిగ్గుల మొగ్గయ్యింది హర్షిత.
‘హర్షితా! గోముగా పిలిచాడు భరత్‌! ‘ఊ’ మత్తుగా పలికింది హర్షిత. ‘ఎలా ఉంది?’ అడిగాడు భరత్‌. ‘మత్తుగా..గమ్మత్తుగా…’ అంది హర్షిత. ‘అవునా.. నీకింకో గమ్మత్తు తెలియజేయనా?’ అడిగాడు భరత్‌. ‘ఊ…….’ అంది హర్షిత. ఆమె కనురెప్పలపై ముద్దాడాడు భరత్‌. మొట్టమొదటిసారిగా ఆమె తన కన్నులతో పొందిన అనుభూతి అది. ఆమె ఇన్నాళ్లూ తన కన్నులు తనకేమీ ఉపయోగపడలేదని బాధపడింది. అందుకే అది ఆమెకు మధురానిభూతిగా అనిపించింది. వెంటనే ‘భరత్‌ నీ పెదాలతో స్పర్శించి.. నా కన్నులు కూడా నా శరీరాన్ని స్పందించేలా చేశావు. ‘థ్యాంక్యూ భరత్‌…! ఐ లవ్‌ యూ…’ అంటూ భరత్‌ను అల్లుకుపోయింది హర్షిత.
హర్షితను యూనివర్శిటీ వద్ద దింపేసి తన కంపెనీకి వెళ్లడం భరత్‌ దినచర్యలో ఒక భాగమైంది. అలాగే వీకెండ్స్‌లో ఇద్దరూ వికలాంగులను కలవడం కూడా మానుకోలేదు. శారదమ్మ శనివారాలు వృద్ధాశ్రమానికి వెళ్లడమూ ఆపలేదు. అలా వారి సంసారం మూడు ఆశయాలు.. ఆరు సంతోషాలుగా సాగిపోయింది వారి సంసారం.
ఇప్పుడు భరత్‌కు హర్షిత చేసే గైడెన్సుకు ఆశ్చర్యపోవాల్సిందే అంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు ఇద్దరూ సామాజికసేవలో కొత్తవరవడితో మరింత బాగా కృషి చేస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు. హర్షితకు కళ్లు లేవన్న విషయాన్ని ఆ ఇంట్లో అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అందరికీ హర్షితే కళ్లు.. అందరూ హర్షితకు కళ్లు..
- శాంతిశ్రీ

1 Response to "హర్షిత"

  1. apleftists says:
    6 జులై, 2010 5:45 AMకి

    ఈ కథ చాలా బాగుంది. చాలా సున్నితంగా, హృదయానికి హత్తుకునేలా, మల్లెల సువాసనలా...

కామెంట్‌ను పోస్ట్ చేయండి