తొలి విజయం..

- శాంతిశ్రీ

మహిళాలోకం లేచింది
సాధనకై పిడికిలి బిగించింది
సుదీర్ఘ సాచివేతకు తెరదించింది
ప్రతిపక్షం అండగా నిలిచింది
వామపక్షం మాట నిలబెట్టుకుంది
ప్రభుత్వం పరువు కాపాడుకుంది
గుప్పెడు ఎంపీల వాదన వీగింది
మమత పిల్లిమొగ్గలేసింది
మెజారిటీ మహిళాపక్షమైంది
శకునిపక్షం మట్టి కరిచింది
33ను రాజ్యసభ ఆమోదించింది
సమాజం హర్షించింది
నేటి మహిళ చేయెత్తి జైకొట్టింది
ఫలితం అందుకోనుంది
తొలి విజయం సాధించింది

శ్రామిక(వి)త్వం

- శాంతిశ్రీ

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. మేడే కార్మికవర్గ పోరాటపటిమకు, సమరశీలతకు తార్కాణంగా నిలిచినరోజు. తమ జేబులు నింపుకునేందుకు రోజుకు 15, 20 గంటలపాటు చాకిరీ చేయిస్తున్న పెట్టుబడిదారుల దౌష్ట్యాన్ని శ్రామికవర్గం నిగ్గదీసినరోజు. ఎనిమిది గంటల పనిదినానికై కార్మికవర్గం సమ్మె పోరాటానికి శంఖారావం పూరించిన రోజు.
కార్మికవర్గ ఐక్యతను సహించలేని దోపిడీవర్గం కాల్పులు జరిపింది. కాల్పుల్లో అనేకమంది కార్మికులు నేలకొరిగారు. కార్మికవీరుల రక్తంతో తడిసిన ఎర్రజెండా నింగికెగసింది. 1886 మేలో అమెరికాలోని చికాగో పట్టణాన జరిగిన సంఘటన ఇది. కార్మికవీరుల రక్తంతో ఎరుపెక్కిన ఆ జెండా ప్రపంచ పీడిత జాతి అంతర్జాతీయతకు సంకేతమైంది.
నాటి నుండి నేటివరకు తమ మూల్గులు పీల్చే దోపిడీదారులపై ఎర్రజెండా చేతబట్టి కష్టజీవులు అనేకవిధాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటాలకు ఇతరేతర వర్గాలతోపాటు మేధావి వర్గమైన కవులూ తమ వంతుగా కలంతో సిరా చిందించారు. వీరిలో కష్టజీవుల పోరాటాలకు అండగా నిలుస్తూ వారి కడగండ్లను ప్రతిబింబించే గీతాలతో స్ఫూర్తినిచ్చిన వారు కొందరైతే, కష్టజీవులతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా వారి జీవన విధానాన్ని, దోపిడీకి గురవుతున్న తీరును అవలోకనం చేసుకొని తద్విషయాలను కవిత్వీకరించిన వారు ఇంకొందరు.
గత శతాబ్దంలోనే ఇలాంటి కవులు కొందరు కార్మిక పోరాటాలకు తమ వంతు సహకారమిచ్చారు. 1871లో పారిస్‌ కమ్యూన్‌ స్థాపనకు కార్మికవర్గమే కారణమైనా మేధావులు, కవులు కూడా తమ వంతు పాలుపంచుకున్నారు. పారిస్‌ కమ్యూన్‌ పతనానంతరం లండన్‌లో తలదాచుకున్న యాజీవ్‌ పొట్టియార్‌ (ఈయన పేరును యాజినీ పాటిల్‌గా కూడా రాస్తున్నారు) నాడు రాసిన ఓ గీతం తరువాత కాలంలో అంతర్జాతీయ గీతంగా ఖ్యాతిగాంచింది. ఈ గీతాన్ని బాలాంత్రపు నళినీ కాంతారావు తెలుగులోకి అనువదించారు.
”ఆకలి మంటలు మలమలలాడే
అనాథలందరూ లేవండోరు
హింసారతిని సహించలేక
ఈసడించినది యెల్ల ధర్మము
మంచి దినాలు రానున్నారు
మనకందరకు లేవండోరు”
అని ప్రారంభమయ్యే ఈ గీతాన్ని నేటికీ వామపక్ష పార్టీలు ప్రత్యేకంగా సిపిఎం తమ సభల ముగింపులో నేతల నుండి కార్యకర్తల వరకూ ఈ పాట పాడి కర్తవ్యోన్ముఖులై కదులుతారు.
దోపిడీవర్గం, కష్టజీవుల శ్రమ ఫలితం చేజిక్కించుకుంటున్న తీరుని కవి ఎత్తిచూపుతారు. ‘ఈ రక్తపిపాసుల పీడ వదిలితే జగతి సమస్తం శాంతి తేజమూ.. దిక్కు దిక్కులా ఆనందమే’ అంటారు.
కార్మికులు-కర్షకులు దోపిడీకి గురవుతున్న తీరుపై మహాకవి శ్రీశ్రీ పలు గీతాలు రాశారు. ఆయన రాసిన ”ప్రతిజ్ఞ” కవితను ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొనాల్సిందే.
గనిలో, పనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనిక స్వామికి దాస్యం చేసే
యంత్ర భూతముల కోరలు తోమే
కార్మికవీరుల కన్నులనిండా
కణకణ మంటే
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోరు”
అంటారాయన. శరీరం కష్టం స్ఫురింపజేసే సమస్త చిహ్నాలూ తాను రచించే గీతాలకు భావం – భాగ్యమన్న ఈ కవి లోకంలో కష్టజీవులకు ఎదురవుతున్న అన్యాయాలు, ఆకలి, వేదన పరిష్కరించే దిశగా పాటలు రాస్తున్నానని చెబుతారు.
వస్తు సంపదను సృష్టించేది కార్మికవర్గం. లాభాలు గడించేది మాత్రం యజమాని ఒక్కడే. ఇది అన్యాయమంటే ‘అనుభవించాలి మీ కర్మం’ అంటూ కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తాడు యజమాని. ఈ భావాన్ని ‘వాడు’ అనే కవితలో ఇలా ప్రతిబింబించారు శ్రీశ్రీ-
”అందరం కలిసి చేసిన ఈ
అందమైన వస్తు సముదాయం అంతా
ఎక్కడో ఒక్కడే వచ్చి
ఎత్తుకుపోతూ వుంటే చూచి
”అన్యాయం, అన్యాయం!” అని మేమంటే
”అనుభవించాలి మీ కర్మం” అంటాడు.
సామాజిక సంపదపై అందరికీ హక్కుంది. సంపదపై ఒక్కడు గుత్తాధికారం కలిగి ఉండటానికి వీల్లేదంటారు ఈ కవి.
ఇదియే సూత్రం ఒక్కడు మాత్రం
భూమిని గుత్తకు కొనరాదు – కడు
సోమరిపోతై మనరాదు
నేలా నీరు గాలీ వెలుగూ
కొందరి సొత్తని అనరాదు – అవి
అందరి హక్కై అలరారు
శ్రీశ్రీ కవిత్వంలో ఇలాంటి భావాలు అనేకచోట్ల దర్శనమిస్తాయి. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం జరపాలనే సందేశం అనేక గీతాల్లో వ్యక్తమవుతుంది.
”పోయేవి, తెగిరాలిపోయేవి, తెగటారిపోయేవి మన దాస్య బంధాలే’
అన్న చరణం ”ప్రపంచ కార్మికులారా! ఏకంకండు. పోయేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప” అన్న కారల్‌మార్క్స్‌ పిలుపును తలపింపజేస్తుంది.
శ్రమించే వారొకరు, అనుభవించే వారు వేరొకరా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తాడు జాతీయోద్యమ కవి గరిమెళ్ళ సత్యనారాయణ తను రాసిన గీతంలో -
అన్యాయ కాలంబు దాపురించిందిపుడు
అందరము మేలుకోవాలండి
మాన్యాలు భోగాలు మనుజులందరి కబ్బు
మార్గాలు వెతకాలి రండి
ఏటి పొడుగున దున్ని యెరువేసి నీరెట్టి నూర్పి
పండించేది మనమంతా
గోటు చేయుచు బూతు కూతలను కూసి
కలకొట్టి కొనుపోవుటింకొకరంతా
సామాజిక సంపదను ప్రజలందరూ అనుభవించాలి తప్ప ఏ ఒక్క వర్గమో హస్తగతం చేసుకోవడం కూడదంటున్న గరిమెళ్ళ సోషలిస్టు భావాలు, కార్మిక-కర్షక ఉద్యమాలకు ప్రభావితులయ్యారనిపిస్తుంది.
అధికార భూతములడుగు లంచములిచ్చి
పరిపరి విధముల పన్నులిచ్చి
మునసబు కరణాల ముడుపులన్నియునిచ్చి
కోసినూడ్పిన వరికూలికిచ్చి
కచ్చేరి బంట్రోతు గాముల కీనామిచ్చి
పాలేళ్ళకు కొంత పంటనిచ్చి
యజమానులకు పంట నర్ధభాగమునిచ్చి
పైకమిచ్చిన వాని వడ్డికిచ్చి
గడ్డిమాత్రమే మిగిలించుకాపువాడు
సేద్యమున తాను పశువుల రక్షించుకొరకు
కటకటా యెట్టులున్నదో కాపులదశ
సుగుణధనులారా జనులార చూడరయ్యా
చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన పై కవిత దాదాపు వందేళ్ళ క్రితం రైతాంగం ప్రత్యేకంగా కౌలురైతు కష్టఫలం ఏవిధంగా దోపిడీదార్ల హస్తగతమయ్యేదో స్పష్టం చేస్తోంది. చెమటోచ్చి పండించినా గింజలే కరువైన రైతాంగ దుస్థితిని..
”ఏటికేతం బెట్టి యెయిపుట్లు పండిస్తె
ఎన్నడూ మెతుకెరుగనన్నా
నేను గంజిలో మెతుకెరగనన్నా”
అంటూ జానపదులు పాడుకొనే గీతం కూడా దీన్నే ప్రతిబింబిస్తుంది.
సి. నారాయణరెడ్డి ఒక గీతంలో
అధికారం ఒక వర్గం ఆటబొమ్మ కాదు
ఐశ్వర్యం ఒక వర్గం అబ్బసొమ్ము కాదు
రెక్కలు విరిగిన పీడితులొక్కటై ఉప్పెనలా లేస్తున్నారు
దోపిడి రుచులను మరిగిన దొరలను తుడుచుకుపోతున్నారు
అనడంలో వర్గ దోపిడీ అంతమవ్వాలనే భావం ధ్వనించడంతోపాటు కష్టజీవులు ఉద్యమిస్తూ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ దొరలను అంతమొందియ్యటం కనిపిస్తుంది.
”మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు” అంటూ కరుణశ్రీ రచించిన గీతం ప్రజలను బాగా ఆకట్టుకుంది.
మా నోట్లో ఆకలి భగభగ
మీ నోట్లో సిగార్సు భుగభుగ
మా కీ పడిపోయిన మేడలు
మీ కేడంతస్తుల గోడలు
సమాజంలో కొందరికి కట్టు గుడ్డే కరువైతే ఇంకొందరికి ఒంటినిండా బంగారం. కొందరు మండుటెండల్లో చెమటోడ్చి చాకిరి చేస్తుంటే ఇంకొందరు పండు వెన్నెల్లో ఆడుకొంటున్నారు. పేదవారి పూరిపాకలో కారుచీకటి కమ్ముకొంటే వున్నవాడి మరుగుదొడ్లో పట్టపగలే లైట్లు వెలుగుతుంటాయి. ఇలా ధనిక-పేద వర్గాల జీవన విధానంలో తలెత్తిన వ్యత్యాసాన్ని తేలిగ్గా అర్థమయ్యే పదాలతో తనదైన శైలిలో రచించారు కరుణశ్రీ.
దేశం స్వాతంత్య్రం సాధించి దశాబ్దాలు గడిచినా భూస్వాముల పట్టు సమసిపోలేదు. పాలకవర్గం భూసంస్కరణల గురించి చట్టాలు చేసింది తప్ప ఆచరణలో కష్టజీవులకు భూములివ్వబూనుకోలేదు. పైగా బూర్జువా, భూస్వామ్య వర్గ ప్రయోజనాలను కాపాడేందుకే కంకణం కట్టుకుంది. భూస్వామ్య వర్గం పద ఘట్టనల కింద శ్రామికులు నలిగిపోతున్న దుస్థితి నేటికీ పలు రాష్ట్రాల్లో ఉంది. దేశవ్యాపితంగా వెట్టిచాకిరిలో మగ్గిపోతున్న ప్రజలు ఇప్పటికీ లక్షలాదిగా ఉన్నారు. తెలంగాణా ప్రాంతంలో శ్రామికులు ఒకప్పుడు వెట్టిచాకిరిలో ఎంతో మగ్గిపోయారు. నాడు తెలంగాణాలోని భూస్వామ్య కుటుంబాలకు ప్రతి హరిజన కుటుంబం నుండి ఒకరిని వెట్టిచాకిరి చేయించేందుకు పంపక తప్పేదికాదు.
రావుగారి ఇంటిముందు రాత్రిపగలు కాపలరా
పుట్లకొలది వడ్లుదంచి పోటు తెల్లగెయ్యాలి
గుట్టల కొలదిగ పంటకు కట్టెలు పలగ్గొట్టాలి
అడవితిర్గ విస్తరాకు లెన్నైనా తేవాలి
అంటూ సుద్దాల హనుమంతు రాసిన గీతం నాటి తెలంగాణాలోని వెట్టి చాకిరీకి అద్దంపడ్తుంది.
ఎంత చేసినా వెట్టిచాకిరీ పొట్టనిండదేలా
పండిన గింజలు పన్నుకు పోతే పస్తులు మనకేరో
ఆరుగాలము కష్టపడిన మన మావురుమని యేడ్చి
పొలమేదిక్కో తెలియని దొరలూ గాదెలు నింపెడి
చేవలేని యీ బ్రతుకు పుట్టు చలిచీమల చేసిన కూర్పు
అంటూ ఆరుద్ర ‘త్వమేవాహమ్‌’లో బుర్రకథ వరసలో శ్రమజీవులు, భూస్వాముల దోపిడీకి గురవుతున్న తీరును కవిత్వీకరించారు.
కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గునీకు వచ్చి చేరెను తెలుసుకో..


చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడకట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా?
కడుపుకాలే కష్టజీవులు వడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారూ తెలుసుకో


కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు..
… అన్నాడు మనస్సు కవి ఆత్రేయ. ఈయన శ్రామికుల శ్రమతో గొప్పవారు ఎలా సొబగులు అద్దుకుంటున్నారో ఎంతో చక్కగా వర్ణించారు పై గీతంలో..
వర్గదోపిడీకి, కష్టజీవుల వెతలకు అద్దంపట్టే అనేక గీతాలను నేడు ప్రజానాట్యమండలి కళాకారులు జనంలో పాడుతున్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించే ఈ గీతం నాడు జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.
చెట్టూ పుట్టా చదునూచేసి
మెట్టా పల్లం చదరం చేసి
కొండ కోన బారులు పేల్చి
వాగుల ఏరుల దారులు మార్చి
చెమటతో భూమిని తడిపిన వాడా
జాతికి జీవం పోసేవాడా
………..
నీవంట్లో ప్రతి రక్తం బొట్టు
దోపిడీ దొంగల సంపద పెట్టు
కష్టజీవులంతా ఐతే జట్టు
పరన్నాభుక్కుల ఆటలు కట్టు
చూపర ఐక్యత ఉడుంపట్టు
పనిదొంగల గుట్టు చెయ్యర రట్టు
ఈ నేలతో శ్రమజీవులకున్న బాంధవ్యం మరెవ్వరికీ వుండదు. తన శ్రమతో జగతిలో జిలుగులు నింపుతున్న, దోపిడీదార్లకు సంపద చేకూర్చిపెడుతున్న శ్రమజీవులు దండుగా కదలి దోపిడీవర్గం ఆటకట్టించమంటున్న ఈ గీత రచయిత దేవేంద్ర.
సమస్త వస్తుసంపద సృష్టించిన శ్రమజీవికి వాటిపై అధికారం లేదు. ఈ అధర్మాన్ని అంతంచేసి సమధర్మమున్న సమాజం కోసం పోరాడమన్నారు ప్రజాకవి వడ్లమూడి-
కష్టించే బలమున్నది
సృష్టించే శక్తున్నది
నీరెక్కల కదలికతో
ప్రతివస్తువు రూపుదాల్చె
నీ పూనిక లేనినాడు
నడువలేదు ఈ లోకం
అధర్మం అంతుతేల్చి
సమధర్మం స్థాపనకై
మోగించు నగారా
సాగించుము తుది సమరం అంటారు.
నల్లి ధర్మారావు శ్రమజీవుల కష్టంతో దోపిడీవర్గం ఆస్తులు పెంచుకొంటున్న వైనంపై ఇలా పాటగట్టారు.
”నినుదోచిన దొరలందరు – విలాసాల బతుకుతూని
నీ సెమట సెంటుజేసి – ఒళ్ళంతా పూసుకొని
కరిగిన నీ కట్టమంతా – రూపాయిల కట్టలుగా
సిందిన నీ నెత్తురంతా – సింధూరపు బొట్టులుగా
మార్చుకొని మేడలు గొట్టే కూలన్నా
మిగిలేను నీకు పిడికెడు మట్టే – కూలన్నా”
శ్రమజీవులపై సాగుతున్న దోపిడీని ప్రతిబింబిస్తూ ఇంక అనేకమంది కవులు తమవైన బాణీల్లో పలు గీతాలు రాశారు.
ఒక వర్గంపై మరో వర్గం సాగించే దోపిడీ అంతం కావడం, జాతి సంపద మొత్తం ప్రజల పరం కావడం కమ్యూనిస్టుల అభిమతం.
నేలహక్కు ప్రజలదే
నీటిహక్కు ప్రజలదే
ప్రజల దోచు దోపిడీండ్ర
బ్రతుకు లెత్తిచూపరా
భారీ యంత్రాలన్నియున్‌
ప్రభుత్వపరము గావలెన్‌
పాలనాధికారముల్‌
ప్రజల వశముగావలెన్‌
అంటూ నార్ల చిరంజీవి రాసిన కవాతు పాట పైభావాలనే ప్రతిబింబిస్తుంది. వర్గ దోపిడీని చిత్రీకరించిన ఇలాంటి గీతాలు ఇంకా ఎన్నో వున్నాయి. పలు గీతాలు ప్రజలను వల్లె వేయిస్తూనే ఉన్నాయి. సదా ఉత్తేజపరుస్తూ ఉత్సాహాన్ని నింపుతూనే వున్నాయి. సమాజంలో వర్గదోపిడీ అంతమయ్యే వరకు ఇలాంటి గీతాలు సజీవమై, స్ఫూర్తినిస్తూ అలరారుతూనే ఉంటాయి.

శ్మశానం కుంగిపోయింది..

నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉండే
శ్మశానం కంపించిపోయింది
గుడ్లగూబల అరుపులు, నక్కల ఊళలు వినిపించే
శ్మశానం స్థంభించిపోయింది
అసహజ మరణాల శవాలని చూసి
శ్మశానం వణికిపోయింది
ఆకలిచావులతో చనిపోయిన పేదల శవాలను చూసి
శ్మశానం చలించిపోయింది
ఖరీదైన మందులు కొనలేక చనిపోయిన రోగులను చూసి
శ్మశానం కదిలిపోయింది
ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నల శవాలని చూసి
శ్మశానం తల్లడిల్లిపోయింది
కడుపునింపలేని మగ్గాలకు ఉరివేసుకున్న నేతన్నల శవాలని చూసి
శ్మశానం నెర్రలిచ్చిపోయింది
వరకట్నానికి ఆహుతైన అబలల శవాలని చూసి
శ్మశానం ఒణికిపోయింది
ఆకలిచావులకీ, ఆత్మహత్యలకీ
బాధ్యతలేని ఈ సమాజాన్ని చూసి
శ్మశానం కుంగిపోయింది…

- శాంతిశ్రీ

సమయమేదీ..?

సంతోషించడానికి మార్గం ఉంది
చిరునవ్వుకీ సమయమేదీ?
పగలూరాత్రీ పరిగెడుతూ
జీవించడానికీ సమయమేదీ?

అమ్మ లాలిపాట గుర్తుంది
‘అమ్మా’ అనేందుకు సమయమేదీ?
అనుబంధాలన్నీ చంపేశాం
వాటిని పూడ్చటానికి సమయమేదీ?

మొబైల్లో నెంబర్లున్నాయి
స్నేహానికీ సమయమేదీ?
బయటవాళ్ల గురించే మాట్లాడతాం
మనవాళ్లతో గడపడానికి సమయం లేనప్పుడు

కళ్ళల్లో నిద్ర ముంచుకొస్తోంది
నిద్రపోవడానికి సమయమేదీ?
బాధలతో హృదయం నిండిపోయింది
ఏడ్వడానికి సమయమేదీ?

డబ్బుల్ని పోగేసుకొంటున్నాం
అలసట తీర్చుకోడానికి సమయమేదీ?
ఇతరుల అనుభూతులు మనకెందుకు
మన కలలకు సమయం లేనప్పుడు

ఓ జీవితమా నీవే చెప్పు
ఈ జీవితం ఏమైపోతుందో?
ప్రతి క్షణం చనిపోయేవారికి
జీవించడానికి సమయమేదీ?

- శాంతిశ్రీ

ఉగాది

- శాంతిశ్రీ

పిందెలతో
మామిడమ్మ
కొమ్మారెమ్మా కాసింది

తాపంతో
వేపమ్మ
పూలెన్నో పూసింది

విరహంతో
కోయిలమ్మ
కొత్తపాట పాడింది

కొత్త ఆశతో
ఉగాదమ్మ
తాయిలాలు తెచ్చింది

విజయంతో
భారతమ్మ
ఉషస్సులు నింపింది

ఆనందంతో
పుడమమ్మ
ఒళ్లు పులకరించింది

మూడోవంతుతో
ముదితమ్మ
భాగస్వామి అయ్యింది

వికృతినామంతో
వసంతమ్మ
స్వాగతం పలికింది

స్వాగతం…
- శాంతిశ్రీ

కోయిలమ్మ పాడింది
వసంతాన్ని తెచ్చింది
మల్లెమనస్సు విరిసింది
మనస్సు తీరా నవ్వింది
ఉగాది ఉషస్సులు తెచ్చింది
కొత్త ఆశలు రేపింది
మగువకు ఊపిరూదింది
చట్టసభకు పిలిచింది
చేయిచేయి కలిపింది
మగువ వైపే మొగ్గింది
భాగస్వామ్యం ఇచ్చింది
మూడోవంతు నీకంది
భారతావని నిలిచింది
అద్భుతాన్ని సృష్టించింది
అపూర్వమని చాటింది
పుడమి పులకరించింది
తీపికబురుతో విరోధినామమెళ్లింది
వికృతినామానికి స్వాగతం పలికింది

లక్ష్యంవైపే…

బిగిసిన పిడికిళ్లు విప్పవద్దు
ఆశయాలు సిద్ధించేదాకా!
నినదించే గొంతులు మూగపోవద్దు
మూసుకున్న వ్యవస్థ చెవులు విచ్చేదాకా!!
రగిలే ఉద్యమాలు చల్లారిపోవద్దు
గమ్యం చేరేదాకా!!!
ప్ర్రజా పథం సాగాల్సిందే
లక్ష్యం సిద్ధించేదాకా!!!!

- శాంతిశ్రీ

ముందే కూసింది..

– శాంతిశ్రీ

ఉగాదికి ముందే కోయిల కూసింది
ఉషస్సులను మగువలకు తెచ్చింది
లోకానికి కొత్త సొబగులు అద్దింది
సరికొత్త యుగారంభాన్నిచ్చింది

వసంతంలో మల్లె విరిసింది
చట్టసభల్లో స్థానమిస్తానంది
మగువ మనస్సు వికసించింది
అతివకు అధికారం చేరువైంది

చేయి చేయి కలపమంది
కల్మషాన్ని తొలగమంది
స్త్రీ వివక్షకు చోటులేదంది
పదవుల్లో మూడొంతులంది

స్త్రీశక్తికి చోటిచ్చి లోకానికి చాటమంది
ఎందరి కలలనో సాకారం చేసింది
భారతావనిలో సాధ్యమని ఋజువు చేసింది
స్త్రీ భాగస్వామ్యంతోనే సమసమాజం సాధ్యమంది

విరోధినామానికి వీడ్కోలు పలికింది
వికృతినామానికి స్వాగతం చెప్పింది
నవయుగానికి ఆహ్వానం పలికింది
ఉగాదికి ఉషస్సులు అందరికంది
0000

గెలిచింది

– శాంతిశ్రీ

అందరి ఆమోదం లభించింది
చట్టసభల్లో గెలిచింది
విజయం సాధించింది
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది
చరిత్ర సృష్టించింది
సువర్ణాక్షరాలతో లిఖించింది
మహాద్భుతాన్ని ఆవిష్కరించింది
అడ్డంకులను కాలదన్నింది
మూడోవంతు చేజిక్కించుకొంది
అపూర్వంగా నిలిచింది
అద్వితీయంగా గెలిచింది
చట్టసభలకు మార్గం సుగమమైంది
అతివకు అందలం చేరువైంది
జయకేతనం ఎగరేసింది
సాధికారతకు నడుం బిగించింది
నేటి మహిళ ముందడుగు వేసింది
నాటి తరానికి నివాళలర్పించింది
నేటి తరానికి బాటలు వేసింది
శతవసంతాల పోరాటం ఫలించింది
నేటి మహిళ రచ్చ గెలిచింది
000

గెలుపు

‘ఏమే మల్లీ….! ఏడున్నా…!’ అంటూ కేకేశాడు వెంకటయ్య. ‘తానం చేత్తన్నా మావా! వత్తన్నా… ఏదో ప్రాణం పోయినట్టే ఏంటిమావా! ఆ అరుపులు..’ కాసింత కసిరినట్టే అంటూ తడి ఒంటిమీదే చీర చుట్టుకుని వచ్చింది మల్లి. ఆమె అందమైన మోముపై నీటి బొట్లు.. జాకెట్‌ వేసుకోకుండా తడి ఒంటిమీదే చుట్టుకొచ్చిన చీర అక్కడక్కడ తడిసింది… మల్లిని అట్టా చూస్తూ నుంచుండిపోయాడు వెంకటయ్య.
వెంకటయ్య మొహంమీద చిటికెలేస్తూ.. ‘ఏంది మామా! అట్టా బిగుసుకుపోయా..?’ అంది మల్లి… ‘నిన్నే చూత్తన్నానే.. భలే అందంగున్నావే…! అంటూ మల్లిని దగ్గరకు తీసుకున్నాడు వెంకటయ్య. ‘చాల్లే సంబడం… ఏ ఏల ఏ పని సేయాలో తెల్వదు నీకు.. నీళ్లు తోడతా. తానం చేసిరా పో.. వేడి వేడిగా బువ్వ తిన్నాక అప్పుడు…’ అంటూ ఊరిస్తూ వెంకటయ్యను బయటకు నెట్టి తలుపేసుకుంది మల్లి. నవ్వుకుంటూ.. తలమీద జుట్టులోకి వేళ్లుపోనిచ్చి సవరించుకుంటూ.. కండవా దులిపి పక్కనే వేసి, మంచమీద కూర్చున్నాడు వెంకటయ్య. ఈలోపు తలుపు తీసుకొని వస్తూ.. ‘ఓ మావా! బొక్కెనలో జామచెట్టుకాడున్న తొట్టిలో నీళ్లు తోడుకురా… ఉడుకునీళ్లు తొలుపుతా… ‘ అన్న మల్లి కేకతో లేచాడు వెంకటయ్య.
వెంకటయ్య వచ్చేలోపు అన్నంగిన్ని, కూరగిన్ని, రెండు పళ్లాలు, మంచినీళ్లు, ఉప్పుడబ్బా సిద్ధంగా ఉంచింది మల్లి. వెంకటయ్య తువ్వాలుతో మొహం తుడుచుకుని భోజనానికి కూర్చున్నాడు.. ‘నీది చాలా ఇసాలం మావా…!’ వెంకటయ్య ఛాతీ వంక చూస్తూ అంది మల్లి… ‘భోజనం చేసినాకన్నావుగా.. మరి తొందరపడతన్నావేంటే..! ‘ అంటూ సరసమాడాడు వెంకటయ్య.. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ కింది పెదాన్ని లోపలికి కొద్దిగా పంటికింద నొక్కిపెట్టి.. పైటకొంగు కొసను వేలికి చుడుతూ.. మెలికలు తిరుగుతూ.. వెంకటయ్యవైపు చిలిపిగా చూసింది మల్లి. తనూ నవ్వుతూ..’ఇంతకీ ఏం కూరొండావే…? వాసన గుమాయిత్తోంది..’ అన్నాడు వెంకటయ్య ‘వంకాయలో ఎండిచేపలేసి పులిసెట్టా మావా…!’ చెప్పింది మల్లి. నోట్లో నీళ్లూరిపోయాయి వెంకటయ్యకు.
‘ఏమైనా వంకాయ రుచే ఏరే…! నువ్వొండితే మరీనూ….’ పొగుడుతూ అన్నాడు వెంకటయ్య. ‘నీ పొకడ్తలతో నన్ను మునగసెట్టెకిత్తిన్నావే.. అదిసరేలేగానీ మావా..! ఏ కూరగాయతో చేయనన్ని రుచులు ఈ వంకాయతో చేయొచ్చు మావా! లేత వంకాయల్లో ఉల్లికారమేసి వండినా, మసాలేసి వండినా, పచ్చిమిరగాయలూ అల్లం నూరేసి వండినా… దోసకాయ, టమాటా ఏసి పచ్చడి నూరినా.. పులిసెట్టినా, ఏపుడు చేసినా.. ఏం చేసినా బాగుంటాది కద మావా!’ గలగలా చెప్పింది మల్లి. ‘చెప్పడం మొదలెట్టావంటే ఒకపట్టాన ఆపవుగందా.. ఎదటమనిసి మాట్లాడనీకు చోటియ్యవు కదే మల్లి…!’ అన్నాడు వెంకటయ్య, ‘నాకు తెలిసిన విసయాలే నేను సెప్పింది.. నేనమ్మా కతలు ఏమైనా చెప్పినానా ఏంది?’ మూతి తిప్పుకుంటూ అంది మల్లి. ‘అబ్బ… అంతలోనే ఎంత కోపమే నీకు…’ మురిపెంగా మల్లి వంక చూత్తూ.. అన్నాడు వెంకటయ్య. భోజనలయ్యాక గిన్నెలన్నీ సర్దుతోంది మల్లి. ఈలోపు సన్నజాజి పందిర కింద మంచమేసి పక్కేశాడు వెంకటయ్య. మావ తొందర చూసి నవ్వుకుంటూ. అన్నీ సర్ది, ఇంటి తలుపు గడియపెట్టి తాళం వేసి, తాళం చెవి గూట్లో ముగ్గుబుట్టలో పెట్టొచ్చింది మల్లి. దొడ్డి గుమ్మం తలుపేసి వచ్చాడు వెంకటయ్య.
‘ఎన్నెల బాగా కురుత్తుందే..’ అన్నాడు వెంకటయ్య.. ‘ఎంటి మావో..సంగతి….! చాలా ఏడిమీదున్నావే.. వంకాయ మాయా ఏంది?’ అంటూ చతుర్లాడింది మల్లి. ‘ఏం ఊరిత్తావే… రాయ్యే….’ అంటూ… చేయిపట్టుకుని లాగేసరికి వెంకటయ్య గుండెలమీద వచ్చి పడింది మల్లి. ‘ఏంది మావా! ఆ దూకుడు’ అంటూ వెంకటయ్యను అల్లుకుపోతూనే ముద్దుగా విసుక్కుంది మల్లి. ‘మన సరసాలకి సెంద్రుడు మబ్బులెనక్కి ఎట్టా పోతున్నాడో సూశావా…?’ అంటూ మల్లి భుజం చుట్టూ చెయ్యేసి ఆకాశమెంక చూపించాడు వెంకటయ్య. సిగ్గుల మొగ్గయ్యి రెండు చేతుల్లో ముఖం దాచుకుంది మల్లి. ‘ఓయబ్బో సిగ్గే…’ అంటూ మల్లిని దగ్గరకు తీసుకున్నాడు వెంకటయ్య.
000
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అంతా హడావిడిగా ఉంది. ఆటో దిగి స్టేషన్‌లోకి అడుగుపెడుతున్న ఆదిత్యవర్థన్‌కు ’10వ నెంబరు ఫ్లాట్‌ఫారంపై గుంటూరు వెళ్లు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరుటకు సిద్ధముగా ఉన్నదీ..’ అన్న ఎనౌన్సర్‌ మాటలతో… ఒక చేతిలో ల్యాప్‌టాప్‌, మరో చేతిలో చిన్న బ్రీఫ్‌కేస్‌తో వడివడిగా అడుగులు వేస్తున్న ఆదిత్యవర్థన్‌ నడకలో మరింత వేగం పెంచాడు. మెట్లు దిగి ఫ్లాట్‌ఫారం మీదకు వచ్చి ట్రైన్‌ దగ్గర నుంచొని తన కోచ్‌ నెంబర్‌ ఎక్కడ ఉందా? అని ఒకసారి తన ఎదురుగా ఉన్న బోగీపై చూశాడు. అదృష్టం కలిసి వచ్చినట్లు అది తనెక్కే కోచే కావడంతో ఒక్కసారి గుండెల నిండా ఊపరి పీల్చుకొని లోపలికి దారి తీశాడు. తన సీట్‌ నెంబరు చూసుకొని బ్రీఫ్‌కేస్‌ సీటుకింద పెట్టి, ల్యాప్‌టాప్‌ మాత్రం తన పక్కనే పెట్టుకొని కూర్చొన్నాడు.
చలికాలం కావడాన.. స్వెటర్‌ వేసుకొన్నాడు ఆదిత్యవర్థన్‌. అయితే కంగారుగా రావడం… జనం కూడా బాగా కిక్కిరిసేటప్పటికీ కొంచెం ఉక్కపోతగా అనిపించింది. స్వెటర్‌ తీసి ల్యాప్‌టాప్‌పై ఉంచాడు. ఆదిత్యవర్థన్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌. ప్రస్తుతం రిటైర్‌ అయ్యాడు. వయస్సు డెబ్బై పైబడినా యువకుడిలా ఎప్పుడూ చలాకీగా ఉండటం ఆయన నైజం. వయస్సు శరీరానికి గానీ మనస్సుకు కాదన్న నానుడి ఉన్నా.. ఆయన శరీరం కూడా మనస్సుతో ట్యూన్‌ అయినట్లు నిటారుగానే ఉంటుంది. ఆదిత్యవర్థన్‌కు సామాజిక దృష్టి కాస్తంత ఎక్కువ. ఆయన ఆలోచనలు ఎప్పుడూ రైతుల మనుగడ చుట్టూతానే తిరుగాడుతూ ఉంటాయి. పిల్లలిద్దరూ మంచి పొజిషన్‌లో ఉన్నారు. జీవితంలో సెటిల్‌ అయిపోయారు. హాయిగా కాలుమీద కాలువేసుకొని జీవితాన్ని గడిపే ఆర్థిక, భౌతిక పరిస్థితులు ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన ఇంకా చేయాల్సింది చాలా ఉందనే అనుకుంటాడు ఎప్పుడూ. బిటి వంగ మీద రైతుసంఘం వారు గుంటూరులో ఏర్పాటు చేసిన చర్చావేదికలో ముఖ్యవక్తగా మాట్లాడేందుకే ఇప్పుడు ఆయన పయనం.
ఏదో స్టేషన్‌లో రైలు ఆగినట్లైంది. చూద్దామంటే సీట్లమధ్యలో కూడా జనం నుంచోవటాన ఊరిపేరున్న బోర్డు కనపడడంలేదు. అంత రద్దీలోనూ.. బతుకు మెతుకుల కోసం ఆడవాళ్లు కొందరు..16-17 మధ్య వయస్సున్న కుర్రోళ్ల ‘పల్లీలు.. పల్లీలు… వేడి వేడి పల్లీలు..’ ‘ఆ… బఠానీ.. బఠానీ… కారం బఠానీ…’ ‘ఆ.. వేడి వేడి ఛారు… ఆ… ఛారు…’ ‘యే.. కాఫీ…. యే… కాఫీ… ‘ ‘జామకాయలు.. జామకాయలు..’ అంటూ బిలబిలా ఎక్కి కోలాహాలం చేస్తున్నారు.
ఉదయం గ్రీన్‌ టీ తాగి, రెండు ఇడ్లీలు తిని వచ్చాడేమో వాళ్ల కేకలు వినేసరికి కడుపులో ఆకలి పేచీ పెట్టడం ఆరంభించింది. ఇక లాభం లేదని పర్సు తీసి, ఒక వేడి వేడి ఛారు తాగాలనుకున్నాడు. ‘ఓ బాబూ.. ఒక ఛారు ఇవ్వు… సుగర్‌లెస్‌ ఉందా?’ అడిగాడు ఆదిత్యవర్థన్‌. ‘లేదు సార్‌…’ బదులిచ్చాడు కుర్రాడు. ‘సరేలే ఒక ఛారు ఇవ్వు…’ అని పదిరూపాయల నోటు ఇచ్చాడు. ఎడమ చేతితో ఛారుగ్లాస్‌ అందుకొని, మిగతా చిల్లర కోసం కుడిచేయి చాపాడు ఆదిత్యవర్థన్‌. కుర్రోడు షర్టుజేబు, ఫ్యాంట్‌ జేబు వెదికి చిల్లర ఇచ్చాడు. చిల్లర ఇవ్వడం ఆలస్యం.. ‘ఆ…ఛారు.. వేడి వేడి ఛారు…’ అంటూ ఆ కుర్రోడు వెళ్లిపోయాడు.
ఛారు తాగాక బ్రీఫ్‌కేస్‌ తీసి ఒళ్లో పెట్టుకొని తెరిచి, దాన్లో ఉన్న తన ప్రసంగానికి సంబంధించిన కాగితాలు తీసి ముఖ్యమైన పాయింట్లు నోట్‌ చేసుకున్నాడు ఆదిత్యవర్థన్‌. వాటిని బ్రీఫ్‌కేసులో పెట్టుకుని టైమ్‌ చూస్తే.. ఒంటిగంట దాటింది. అరే.. అనుకునేలోపు.. గుంటూరు స్టేషన్‌లో ట్రైన్‌ ఆగింది. అందరూ దిగుతున్నారు. ట్రైన్‌లో రద్దీ కూడా తగ్గింది. కిందకు దిగిన ఆదిత్యవర్థన్‌ను తీసికెళ్లడానికి ఒకాయన రెడీగా ఉన్నాడు. ఆయన ఆదిత్యవర్థన్‌ను గుర్తించి, నమస్కారం చేశాడు.ఆదిత్యవర్థన్‌ కూడా ప్రతినమస్కారం చేశాడు. తన పేరు సుబ్బారెడ్డి అనీ, కోటేశ్వరరావుగారు పంపారని, రైతుసంఘంలో పనిచేస్తాననీ, తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆఫీసుకు ఆటోలో బయల్దేరారు.
భోజనమయ్యాక కొద్దిసేపు రిలాక్స్‌ అయిన ఆదిత్యవర్థన్‌ నాలుగు గంటలకు ప్రారంభమైన చర్చావేదికకు హాజరయ్యాడు.
చర్చావేదిక హాజరైన ఆదిత్యవర్థన్‌కు ఒక విషయం ఆశ్చర్యమనిపించింది. విషయమేంటంటే ‘ఈ చర్చావేదికకు ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరవడం’. ఆదిత్యవర్థన్‌ మాట్లాడటం ప్రారంభించాడు…’ముందుగా ఈ చర్చావేదికకు హాజరైన నా సోదర, ప్రత్యేకంగా నా సోదరీమణులకు నా నమస్సుమాంజులులు!’
‘మీకందరికీ ఈ బిటి వంగ గురించి చెప్పే ముందు మన పాలకుల గురించి తెలుసుకోవాలంటే మీకో చిన్న కథ చెప్పాల్సిందే… రాయలవారు అదేనండీ.. మన శ్రీకృష్ణదేవరాయలు ఎంతోమంది కవులను, పండితులను పోషించాడు. ఆయన ఆస్థాన కవి, మనందరికీ ఎప్పటికీ గుర్తిండిపోయే కవి ‘రామలింగడు’. ఆయన కథ ఒకటి చెప్పుకున్నాక బిటి వంగ గురించి చెప్పుకుందాం.. ఆ కథేంటంటే….
”రాయలవారి తల్లికి మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. ఆమెకి వానాకాలంలో బాగా జబ్బు చేసింది. చావబోయే ముందు మామిడి పండు తినాలని ఆవిడ కోరిక. రాజు భటులని దేశమంతా తిప్పాడు. ఎక్కడా ఒక్క మామిడిపండు కూడా దొరకలేదు. దాన్నే కలవరిస్తూ ఆమె ప్రాణాలు వదిలింది. చనిపోయేముందు తల్లికి మామిడిపండు తినిపించలేకపోయానే అని రాజు బాధపడ్డాడు. ఈ సంగతి తాతాచారి అనే కంసాలికి తెలిసింది. ఈ వంకతో వీలైనంత డబ్బు గుంజుకోవాలని ఎత్తువేశాడు. వెంటనే రాయలవారి వద్దకి పోయాడు. ‘మహారాజా! బాధపడకండి! బంగారు పళ్ళు చేయించి బ్రాహ్మలకు దానం ఇవ్వండి. ఏటా ఆమె తద్దినంనాడు ఈ పని చేయండి. స్వర్గంలో మీ తల్లిగారి ఆత్మకి శాంతి కలుగుతుంది’ అని చెప్పాడు. రాయలవారు ఏటా బంగారు మామిడి పళ్ళు దానం చేయడం మొదలుపెట్టాడు. లక్షల మంది బ్రాహ్మలు దానం తీసుకుపోతున్నారు. రెండేళ్ళకే రాజుగారి ఖజానా ఖాళీ అయిపోవచ్చింది. తాతాచారి మోసంతో రాజుగారు చిక్కుల్లోపడ్డాడు. ఏదో ఎత్తువేయాలి అని రామలింగడు ఆలోచించాడు. తర్వాత సంవత్సరం కూడా లక్షలాది మంది బ్రాహ్మలు దానం పుచ్చుకోవడానికి వచ్చారు. ముందురోజే పట్నంలో దిగారు. రామలింగడు ఆ రాత్రి అందరినీ కలుసుకున్నాడు. ఈ ఏడు ఎన్ని కావాలంటే అన్ని మామిడి పళ్ళు ఇస్తారు. అయితే ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని వాతలు వేయించుకోవాలి’ అని అందరికీ చెప్పాడు. బ్రాహ్మలంతా ఆశపడ్డారు. మర్నాడు పొద్దుటే రామలింగడు కొలువు బయట కొలిమి పెట్టించాడు. బ్రాహ్మలకు వాతలు వేయించసాగాడు. కొందరు పది వాతలు కూడా వేయించుకున్నారు. కొలువు లోపలికి వెళ్ళి రాయలవారికి వాతలు చూపించారు. బంగారు మామిడిపళ్ళు ఇమ్మని అడిగారు. రాయలవారు తెల్లబోయారు. రామలింగడే ఈ వాతలు వేయిస్తున్నాడని తెలిసింది. విపరీతమైన కోపం వచ్చింది. రామలింగడిని పిలిచి ఇలా ఎందుకు చేస్తున్నావ్‌ అని అడిగాడు. ‘మహారాజా! మా అమ్మ వాత రోగంతో చనిపోయింది. పోయే ముందు వాతలు వేయించమని అడిగింది. నేను వేయించే లోపలే కన్ను మూసింది. మరి ఆమె ఆత్మ కూడా శాంతించాలి గదా! అందుకు బ్రాహ్మలకు వాతలు వెయ్యమని చెప్పారు. ఇంతమంది బ్రాహ్మలు నాకు ఎప్పుడు దొరుకుతారు? పైగా వాతలు వేయిస్తానంటే ఎవరు వస్తారు? అందుకే పనిలో పనిగా ఇప్పుడే వేయిస్తాన్నా’ అన్నాడు. రాజుకి వెంటనే సంగతి అర్థమైంది. తాతాచారి మోసం తెలిసిపోయింది. తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడ్డాడు. ఆశపోతులు కాకపోతే ఒక్కొక్కరు అన్ని వాతలు వేయించుకుంటారా అనుకున్నాడు. వెంటనే బంగారు మామిడిపళ్ళ దానం ఆపేశాడు.”
‘ఇదండీ కథ! ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం..!
బిటి వంగ విత్తనాలు వంకాయల్లో పుచ్చులు లేకుండా చేయడానికి కనిపెట్టిన కొత్త వంగడం. అయితే పురుగు పట్టకుండా విత్తనంలోనే విషం కలిపి తయారుచేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ విషం వంగ మొక్క మొత్తానికి వ్యాప్తిస్తుంది. ఆకులకూ… కాయల్లోకీ వెళ్లిపోతుంది. అంతేకాదు. భూమి లోపలికి వెళ్లి భూమి కూడా విషతుల్యం అయిపోతుంది… అలాగే గాల్లోకి వ్యాపించి అదీ కలుషితం అయిపోతుంది. ఈ కాయల్ని తిన్న మనుషులు, పశువులు వెంటనే చచ్చిపోరుగానీ.. రోగాలపాలవుతారు. ఆఖరుకు ఈ కాయలు తిన్న వారిలో సంతానోత్పత్తి కూడా ఆగిపోతుంది. మరి మన ప్రభుత్వం ఆ బహుళజాతి కంపెనీకి రెడ్‌కార్పెట్‌ పరుస్తుంది. మాలాంటి శాస్త్రవేత్తలు ఎందరో నేడు బయటకు వచ్చి గళం విప్పారు. మీలాంటి వారికి అందులోని వాస్తవా.. వాస్తవాలు చెప్పనారంభించారు. దీంతో కథ అడ్డం తిరిగింది.
ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న రామలింగడి కథకీ బిటి వంగకు సంబంధమేమిటా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా…! కథలో రాయలంతటి వారే తాతాచారి తంత్రానికి పడిపోయాడని అనిపించడంలేదు. మన ప్రభుత్వానికీ ఒక తాతాచారి తారసపడ్డాడు. ఇక్కడ తాతాచారి అంటే బహుళజాతి కంపెనీ. వారి ఎత్తుగడలకు మన ప్రభుత్వం చిత్తయిపోయింది. ఎటొచ్చీ రామలింగడులాంటి తెలివిగల కవులు మన ప్రభుత్వంలో ఉంటేగానీ ఈ బిటి వంగ సమస్యకు పరిష్కారాలు ఉండవు. విషం వంకాయలు తింటే ప్రజలు బాధ పడతారన్న కనీస మానవత్వాన్ని మన ప్రభువులు మర్చిపోయారని చెపుతూ.. రామలింగడంత కాకపోయినా మన ఆస్థానంలోనూ ఒక ‘రాం’లింగడు ఉన్నాడు. గుడ్డిలో మెల్ల ప్రస్తుతానికి బిటి వంగ తాత్కాలికంగా ఆగింది. కానీ ఇది ఎన్నాళ్లో చెప్పలేం.. మనమంతా అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిందే..’ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు ఆదిత్యవర్థన్‌.
000
మీటింగ్‌ దగ్గర నుండి మల్లి ఇంటికి వచ్చి వసారాలో దిగాలుగా కూర్చొంది..
‘ఏంటే మల్లీ,…! అలా దిగాలుగా కూకున్నావ్‌….!’ అడిగాడు వెంకటయ్య. ‘ఏం లేదు మావా! మనం మా ఇట్టంగా తినే వంకాయ ఇక తినలేం…’ అంది మల్లి. ‘అదేంటే అలా అని ఎవరన్నారే…ఎర్రిమొగమా…? నవ్వుతూ అన్నాడు వెంకటయ్య’ ‘ఇదే నవ్వులాటకనడంలేదు మావా..! ఒట్టు..! నీ మీదొట్టు..!’ అమాయకంగా చెప్పింది మల్లి. ‘అసలు విసయమేంటే…?’ వెంకటయ్య అడిగాడు.
‘ఆ ఆదిత్య సార్‌ ఏం చెప్పాడనుకున్నావ్‌..? ఆశ్చర్యంగా కళ్లింత చేసి చేయి గెడ్డానికి తిప్పి పెట్టుకుంటూ అంది మల్లి. ‘ఏం సెప్పాడో నువ్వు సెపితే కదా తెలిసేది? సెప్పకుండా ఎట్టా తెలుసుద్ది?’ కొంచెం కసిరినట్లు అన్నాడు వెంకటయ్య. ‘మాటవరసకు అన్నానే అనుకో అంత కసరాలా? హుహూ… ‘ అంటూ మూతి తిప్పింది మల్లి. ‘ఓసోసి మాబాగున్నావే.. ముద్దొస్తున్నావుగానీ… ఇసయం చెప్పెహే…’ అన్నాడు వెంకటయ్య. ‘అట్టారా దారికి… ‘ అంటూ మల్లి చెప్పడం ప్రారంభించింది. మావా! ఆ బిటి వంగ ఇత్తనాలు ఏత్తే.. వంకాయలోపటికి కూడా ఇసం ఎక్కుంతుందంటయ్యా..! పురుగు సావడానికి ఇయ్యాలగానీ.. కాయలోపలికి ఇసం ఎలితే తినేదెట్టాగూ…? ఒకేళ పండించినా అమ్ముకునేదెట్టాగు..? ‘చెత్‌..! అట్టాంటి ఇసం కాయలు పండిత్తమేంటి? ఎవసాయమన్నా మానుకోవాలిగానీ.. ఇట్టాంటి చెండాలం పనులు చేయకూడదు…’ అన్నాడు వెంకటయ్య.
‘నువ్వు సెప్పేది మంచిగానే ఉంది మావా..! ఆ అయ్య కూడా అన్నాడు. ‘కాయల్లో ఇసముందని తెలిశాక తలకాయలో మెదడున్నోడు ఎవ్వరూ కొనరుగందా..!’ అని చేతులు తిప్పుకుంటూ చెప్పింది మలి. ఇది సీమ దేశం వాళ్లు పన్నిన పన్నాగమంట మావా!. అయినా మన పెబుత్వానికి కాసింతైనా ఆలోచన ఉండక్కర్లా…’ అంటూ.. ‘మళ్లీ రాయలోరి పాలన వస్తే బాగుండు మావా! మాతాతకి ఆళ్ల నాన్న చెప్పేవాడంట.. రాయలోరి పాలనలో వజ్రాలు, వైడుర్యాలు రోడ్లమీదే గుట్టలుగా పోసి అమ్మేవారంట మావా!. ప్రజల్ని చానా పేమగా చూసుకునేవాడంట..! ఎంచక్కా మల్లీ అట్టాంటి రాజుల పాలన వస్తే ఎంత బాగుండో…’ రెండు మోకాళ్లకు చేతుల్ని దండలా వేసి ఊగుతూ ఉషారుగా అంది మల్లి.
‘ఓసి ఎర్రిమొగమా..! రాయలోరి పాలన ఇప్పుడెట్టా వస్తదే..? అన్నేళ్ల ఎనక్కీ మనం పోవాలి.. మరో మార్గం లేదే..’ అంటూ ఏమైనా ఆ రాజుల కాలమే నయమే.. మరో వంద జన్మలెత్తినా రాయల్లాంటి రారాజు రాడే….’ అన్నాడు వెంకటయ్య. ‘సర్లే సంబడం.. అన్నేళ్ల ఎనక్కి మనమెల్లే పనికాదుగానీ..! ఆ అయ్య చెప్పింది కాస్తంత చెవిలో ఏసుకో….’ ‘అట్లాగేలేవే.. మరి తెలివిమాలి లేనులే… రైతంటే ఈ పెబుత్వానికి మా బాగా చులకనైపోనాదే…’ ‘అదేంటి మామా అట్టా అంటావు..?’
‘మరి ఎట్టా అనాలే… రైతుకు పెయజనం కలగాలా? జనాన్ని ఆదుకోవాలా..? అయన్నీ కాదని…. జనానికి ఇసం పెట్టమంటే ఎట్టా? జనానికి విసం పెట్టి, మనమేం బాముకుంటాం..? మనం తినమా?, నోరులేని పశువులు తింటే….ఇంకేమన్నా ఉందా? ఏ రైతన్నా చూత్తూ చూత్తూ ఆ పని చేస్తాడేమే…? ఏమనుకుంటోంది ఈ పెబుత్వం? ఈ పెబుత్వానికి ఆమాత్రం ఘానం ఉండక్కర్లా…?’ కండవాని విసురుగా దులుపుకుని భుజం మీదేసుకొని.. ‘నేనట్టా పొలందాకా పోయొస్తా… మొక్కలకు నీరు పెట్టి.. వస్తా..’ అంటూ డుగు డుగుమంటున్న లూనా తీశాడు వెంకటయ్య.
‘అట్టాగేలే.. చేలో కాసింత గోంగూర దొరుక్కుందన్నావు నిన్న రేత్రి. వత్తావత్తా పట్రా..! కాసిన్ని ఎండిచేపలున్నాయి. ఏసి వండుతా.. రేపు పొద్దుగాల క్యారేజీలోకి కూడా సరిపోద్ది.. పెందలకాడే రా మావో…!’ అంటూ వెళ్లిపోతున్న వెంకటయ్యకు వినపడేలా అరిసింది మల్లి. ‘ఆ… సరేలే…. సరేలే…’ అంటూ వెళ్లిపోయాడు వెంకటయ్య.
000
ఏడాది గడిచింది.. ప్రభుత్వం బిటి వంగడానికి ఆమోదం తెలిపింది.
పొలానికి నీరు పెడుతూ వెంకటయ్య ‘ఓ రత్తాలూ…! ఈ పాలి మీ చేలో బెండలు బాగా కాసినట్టున్నాయే…! ఎల్లేప్పుడు కాసిన్ని బెండకాయలియ్యే.. పట్టికెలతా…!’ అన్నాడు. ఆ పర్లేదు బాబారు..! అట్టాగే ఇత్తాలే పట్టికెలుదువుగానీ.. నా మొగుడు మాట ఇని వంగనారు పోస్తే.. నట్టేట్లో మునిగేదాన్ని..’ ‘ఎందుకు మునిగేదానివే…? బాగానే కాసేయిగా వంగలు కూడా. కాసింత మందులెక్కువ జల్లుకోవాలిగానీ.. ‘ నీకు తెల్వదా బాబారు.. ఆ ‘బిటి వంగ’ ఏదో వచ్చిందంటగా.. ”అది ఏత్తే పుచ్చుల్లేని వంకాయలే వంకాయలు” అని నా పెనిమిటి ఒకటే చెవిలో రొదపెట్టాడనుకో…’ చెప్పింది రత్తాలు. ‘ఓస్సోసి ఆ వంగడమా..? అదైతే వద్దులే.. మంచిపని చేశావు.’ ‘అవును బాబారు….’ అదీ సమయానికి మల్లి చిన్నమ్మ చెప్పబట్టి. లేకపోతే ఎర్రిమొగం దాన్ని అట్టాగే ఆ కొత్త వంగడం తెచ్చి ఏసేదాన్ని.
ఏం చెప్పిందేంటి మీ చిన్నమ్మా..? ఆసక్తిగా అడిగాడు వెంకటయ్య. (మనస్సులో అబ్బో.. ఎవహారం మాబాగా చేత్తందే.. అని మల్లిని మెచ్చుకున్నాడు…) చిన్నమ్మను మీటింగులకు పంపడం బాగా అలవాటు చేశావు. ఆమాత్రం విసయాలు తెలుసుకొని మాలాటోళ్లకి చెప్పడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంది బాబారు.. ఆ వంగడం ఏత్తే కాయల్లోకీ, భూమిలోకీ.. గాల్లోకీ… అట్టాగే తిన్న మనిషి కడుపులోకీ పోతుందంట…! ‘అస్సలు ఎయ్యొద్దే రత్తాలూ!’ అని చెప్పింది…. అస్సలు వంకాయ తినాలంటే భయమేత్తంది బాబారు…’ ‘అవునే మనమంతా ఎంతో ఇట్టంగా తినే వంకాయ తిననీయకుండా చేసిందే ఈ పెబుత్వం… మీ చిన్నమ్మ సదుకోలేదుగానీ..నాకన్నా విసయాన్ని ఇనగానే ఇట్టే పసిగట్టేసిద్ది. అందుకే దాన్ని మీటింగులకు అంపుతా….’ చెప్పాడు వెంకటయ్య.
మన పెదానికి ఆ బిటి వంకాయలు వండి బాగా పెడితే పోద్దేమో బాబారు…! మాబాగా చెప్పావే.. ఎయ్యమని చెప్పినోళ్ళనందర్నీ ఆ బిటి వంకాయలు తినమని చెప్పాలి… అంటూ రత్తాలునూ తన లూనాపై ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు వెంకటయ్య. ‘ఏందేవు రత్తాలు.. దారి తప్పి ఇటొచ్చావు…’ అంటూ పలకరించింది మల్లి. ‘నీ మాటే చెప్పుకుంటూ… బాబారు నే ఎలతన్నాగా.. రా అన్నాడు.. సరేలే నిన్ను కూడా చూసి పోదామని ఇట్టా వచ్చా…’ ‘నా మాటేం చెప్పుకున్నారు అంతసేటూ నువ్వూ… నీ బాబారు…’ ఉక్రోసంగా అంది మల్లి. ‘నీ మీద చానా చెప్పాలే…’ అన్నాడు ఉడికిస్తూ వెంకటయ్య.. ‘చెప్పుకోండి నాకేటి? నాకేమన్నా బయమా?… అబ్బా, కూతురు నన్నేం చేత్తారు? నేనేమైనా తప్పుసేత్తేగందా..!’ ముక్కుపుటాల అదురుతుంటే మూతి తిప్పుకుంది మల్లి. ‘ఎంత ఉక్రోశమే నీకు.. ముక్కుమీదే ఉంటాదే కోపం…’ నవ్వుతూ అన్నాడు వెంకటయ్య.. ‘ఊరుకో చిన్నమ్మా! నిన్ను బాబారు ఉడికిత్తున్నాడుగానీ…అదే బిటి వంకాయల గురించి చిన్నమ్మా…! ‘ఏమైందేంటి బిటి వంకాయ?’ అడిగింది మల్లి.
‘ఏమీలేదు.. ఈ వంకాయ సాగుబడి సెయ్యమన్నోళ్లందరికీ ఆ వంకాయలే వండి, తినిపించాలని అనుకున్నాంలే…’ ‘ఆళ్లెందుకు తింటారే పిచ్చిమొకమా..?.. ఆళ్లు బాగానే పశువుపేడ, పచ్చిరొట్ట.. అదే చేంద్రీయ ఎరువులో ఏందో.. ఆ ఆదిత్యసార్‌ చెప్పాడు.. అవేసి పండించినవి తిని, రోగాలు రాకుండా కులాసాగా కులుకతున్నారంట.. మొన్న మీటింగ్‌లో సెప్పారు మావా! అసలు ఈ వంకాయ తినపోతే ఏం పోయింది… మన ఆడోళ్లంతా వంకాయ వండటం మానేస్తే సరి.. తిక్క తిన్నంగా కుదుర్తాది.. మన పెబుత్వానికీ…. ఆ కంపెనీ ఓడికీ….’ ఆవేశంతో అంది మల్లి.
మల్లి మాటలకు వెంకటయ్య నిశ్చేష్టుడయ్యాడు.. ఎంతబాగా చెప్పింది… ‘మా బాగా చెప్పావే.. ఈ ఆలోచన నాకు తట్టలేదెందుకే…?’ అన్నాడు వెంకటయ్య. ‘ఆ నీ బుర్రలో మట్టిపాలు కాసింత ఎక్కువుందిలే…’ వెటకారంగా అంది మల్లి. ‘అబ్బో… నీ బుర్రలో బంగారం ఉందా?’ వెటకారంగా అన్నాడు వెంకటయ్య. ‘బంగారం లేకపోయినా.. బంగారంలాంటి ఆలోచనలు చెప్తాందిగందా…! ఊరుకో బాబారు…! అంది రత్తాలు. ‘మనిషికి ఆలోచన ఉండాలిగానీ.. గర్వం ఉండకూడదే..’ అన్న వెంకటయ్య మాటలు పూర్తికాకుండానే.. ‘నాకేం గర్వంలేదులే… నువ్వంటే నేను పడాలిగానీ.. ఒక్కమాటంటే ఏం గింజుకుంటావయ్యా…! నీళ్ల కాగు పొయ్యిమీదేసి చానసేపయ్యింది.. నీళ్లుతోడతా లెగు…’ అంటూ మల్లి ఇంట్లోకి వెళ్లి ప్లేటులో కారప్పూస పెట్టి తెచ్చి ఇచ్చింది రత్తాలుకు.
‘నే ఎల్తా చిన్నమ్మ… ‘అంటూ ఆ కారప్సూస క్యారేజీలో పోసుకుని లెగిసింది.. ‘ఎలాగో భోజనం ఏల అవుతుందిగా… కాసింత బువ్వ తినిపోవే… రత్తాలు…’ అన్నాడు వెంకటయ్య. ‘ఎంతైనా మా బాబారు.. మా బాబాయే… నాగురించి ఎట్టా ఆలోచించాడో….’ ‘మా బాగా ఆలోచించాడులేగానీ…మీ బాబారు..! పచ్చిమిరగాయల్తో పచ్చడి చేశాను.. కాసింత ఎత్తుకుపో… ఇంటికాడ పిల్లలు ఆకలితో అల్లాడతా ఉంటారు….. ఇంటికెళ్లి అన్నం వండుకుంటి సరిపోద్ది.. పొద్దుపోయింది అసలే’ అంటూ… పచ్చడి పెట్టించింది మల్లి.’
‘నీ ఆలోచన ఎప్పుడూ తెలివిగానే ఉంటుంది చిన్నమ్మ…! అందుకే నువ్వంటే నాకు ఇష్టం…’ అంది రత్తాలు. ‘నువ్వు మా తెలివిగలదానివే రత్తాలు! అటూ… ఇటూ… ఇరుపక్షాన మాట్టాడతావు. అదిసరేగానీ.. వచ్చే ఆదివారం మన ఆడోళ్లందరికీ మీటింగ్‌. ఈ బిటి వంకాయ గురించే.. అందరికీ చెప్పు…’ అంటూ.. ‘ఏమయ్యో.. అట్టా సోద్యం చూడక.. ఆ సన్నీళ్లోసిన బొక్కెన ఆ జామచెట్టుకాడ ఉంది పట్రా ఉడుకునీళ్లు తొలుపుతా.. తానం చేద్దువు..’ గద్దించినట్లే చెప్పింది మల్లి. ‘ఏంటే మా కాక మీదున్నావు..’ అన్నాడు వెంకటయ్య. ‘పొద్దెంక కాసింత చూడు.. అట్టా సూత్తా కూకుంటే.. అర్దరేత్తిరవుద్ది… నానోరే నీకు ఇనపడిద్దిగానీ.. నీ సేట్టలు అగుపించవుగందా..!’ అంటూ కొంగు దులుపుకుని నడుం చుట్టూతా తిప్పి బొడ్డులో దోపుకుని ఇంట్లోకి వెళ్లింది మల్లి.
వెంకటయ్య బక్కెట్‌ తీసుకొని స్నానం చేయడానికి వెళ్లాడు.
000
ఆడోళ్లందరూ ఒకచోట సమావేశమయ్యారు.
అప్పుడే మర్రిచెట్టు దగ్గర తెల్లకారు ఆగింది. కారులో నుంచి దిగాడు ఆదిత్యవర్థన్‌. మల్లి ఆయన వద్దకు పరుగున వెళ్లి ‘దండాల బాబూ! అంటూ వంగొని రెండు చేతులు జోడించింది మల్లి. మీకోసమే ఆడోళ్లంతా కనిపెట్టుకున్నారు.. రండి బాబూ..!’ అంటూ సాదరంగా ఆహ్వానించింది మల్లి. మల్లి అంటే ఆయనకు ఎనలేని అభిమానం. చదువుకోకపోయినా విషయాన్ని జాగ్రత్తగా విని సందేహాలుంటే అడిగి తెలుసుకుని, పదిమందికి చెప్పడం చూసి చాలా ముచ్చటేస్తుంది ఆదిత్యవర్థన్‌కు. మల్లి చదువుకునే ఉంటే ఇంకెంత బాగుండేది అని చాలాసార్లు అనుకున్నాడు ఆదిత్యవర్థన్‌. ‘చానామంది ఆడోళ్లు వచ్చారు బాబూ! మీరు ఆళ్లకు అర్థమయ్యేటట్టు మనం ఏమేమి చెయ్యాల్నో వివరించాలా..! అన్న మల్లి మాటలతో… ‘ఆ…ఆ… అలాగే.. పదమ్మా…’ అంటూ సమావేశం దగ్గరకు వచ్చాడు ఆదిత్యవర్థన్‌.
‘సోదరీమణులందరికీ నా నమస్కారాలు!
నాకు ప్రభుత్వం ఈ బిటి వంగకు ఆమోదం తెలిపిన నాటి నుండి నిద్రపట్టడం లేదు. నిజం చెపుతున్నా… దానివల్ల అన్నిరకాలుగా ఇటు రైతులకూ.. అటు ప్రజలకూ.. నష్టమే తప్ప లాభం లేదు. మన ప్రభుత్వం విదేశీ కంపెనీల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది’ అంటూ ‘బిటి వంగ’ విత్తనం నాటితే కాయలోకీ విషం ఎక్కుతుందనీ, దాన్ని తినడం వల్ల వచ్చే అనర్థాలు, భూమి, వాతావరణం ఎలా కాలుష్యమవుతుందో వారికర్థమయ్యే భాషలో చక్కగా వివరించాడు ఆదిత్యవర్థన్‌. ఆఖరులో ‘ఆమోదం తెలిపి ప్రభుత్వం ఒకందుకు మంచి పనే చేసింది. ఇప్పుడు వంటింట్లోంచే పోరాటం ప్రారంభించాలి..! ఆనాడు లెనిన్‌ చెప్పినట్లు ‘ప్రతి వంటగత్తె ఒక పోరాటయోధురాలే’ మీరంతా కలిసి వంకాయను అసలు వండటం మానేయండి. మీ మగాళ్లు తెచ్చినా వండకండి…! ఇలా మొదలైన నిరసనే పెద్ద ఉద్యమం కావాలి. దీని ఫలితం ఎలా ఉంటుందో మీరే ఆచరణలో చూద్దురుగానీ. ముందు మీరంతా కలిసికట్టుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మరో ఐదుగురికి ఈ విషయం చెపుతూ మన రాష్ట్రమంతా ఈ ఉద్యమం జ్వాలలా వ్యాపింపజేయాలి..! ఆ విదేశీ కంపెనీ తోకముడుచుకొని పారిపోవాలి. దానికి కొమ్ముకాస్తున్న మన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి…’ ఆవేశంగా చెప్పి, అందర్నీ ఉత్సాహపరిచాడు ఆదిత్యవర్థన్‌..
ఆడవాళ్లు పూనుకుంటే పని పూర్తయ్యేవరకూ ఆగరనే నానుడి ఎట్లాగో ఉంది. అది ముమ్మాటికీ నిజమేనన్నట్లు చేశారు ఈ మహిళలు. అందరూ ఒకర్నించి ఒకరికి విషయం చేరవేసుకొని వంకాయను కొనకుండా, వండకుండా, తినకుండా అడ్డుకున్నారు. అంతే రాష్ట్రమంతా వంకాయ అమ్మకాలు ఆగిపోయాయి. సాగు చేయడానికీ రైతులెవ్వరూ ముందుకు రాలేదు. వేసిన రైతులకు దిగుబడి ఎక్కువరావడాన రేటు పడిపోయింది. విసం కాయలని ఎవరూ కొనడానికీ రావడం లేదు. దేశం మొత్తం ఆందోళనలు మొదలయ్యాయి. గుంపులు గుంపులుగా మహిళలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వీళ్లకు రైతుసంఘాలు, మహిళాసంఘాలు, రాజకీయపార్టీలు తోడయ్యాయి. ఉద్యమం మరింత ఉధృతమైంది. ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. ‘మాకు ఇసం కాయలు పెట్టడానికా మీకు ఓట్లేసి పదవప్పజెప్పిందంటూ’ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రధాని, విదేశీ కంపెనీ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. అసెంబ్లీనీ, పార్లమెంటునూ చుట్టుముట్టారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. అంతేకాకుండా అసెంబ్లీలో, పార్లమెంటులో ‘వంకాయ’పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ‘బిటి వంకాయ వంగడం వద్దని’ అసెంబ్లీలో, పార్లమెంటులో తీర్మానం చేసి, ప్రభుత్వం ప్రజల పోరాటానికి ప్రధానంగా మహిళాశక్తికి తలవంచింది.
మల్లి తన గ్రామంలో అభినందనసభ ఏర్పాటు చేసి, ఆదిత్యవర్థన్‌ను ఆహ్వానించింది. సభలో ఆదిత్యవర్థన్‌ మాట్లాడుతూ.. ‘పోరాడారు.. గెలుపు సాధించారు..!’ అంటూ మొదట మహిళల పోరాట పటిమను అభినందించాడు.
‘అంతేకాదు..! మహిళలు ఏ పనిచేసినా… పోరాటం చేసినా… నిజాయితీతో, పట్టుదలతో చేస్తారు. విషయాన్ని ఒకరి నుంచి ఒకరికి ఎంతో బాధ్యతతో చెప్పి తమ మాతృత్వాన్ని మరోసారి చాటుకున్న తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆదర్శం.. విదేశీ కంపెనీలను తిప్పి కొట్టడం అంటే సామ్రాజ్యవాదాన్ని తిప్పి కొట్టడమే.. ఇన్నాళ్లూ ఎందరో మహానుభావులు కన్న కలలు ఇవి. వారి కలల్ని మీరెంత సులువుగా సాకారం చేశారు? నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే మీరంతా మీ హక్కుల సాధన కోసమే కాకుండా ఇలాంటి ప్రజా సమస్యలన్నింటిపై పోరాడండి.. పోరాడితే గెలుపు మీదే.. మీదే గెలుపు..! ‘ అంటూ రెండు చేతులు పైకి పెట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేశాడు ఆదిత్యవర్థన్‌. మహిళలంతా లేచి నిలబడి తమ చేతులూ పైకెత్తి చప్పట్లు లయబద్ధంగా కొట్టడం ప్రారంభించారు.. ‘ఆదిత్యవర్థన్‌కు జై! డౌన్‌ డౌన్‌ బిటి వంగ..! మేమే గెలిచాం..! గెలుపు మాదే.. మాదే గెలుపు..!’ అంటూ నినాదాలు చేశారు.. ‘మహిళలు ఎక్కడ పోరాడతారో… అక్కడ గెలుపు తథ్యం…’ అంటూ ‘ఇక సెలవు సోదరీమణులారా! ఇదే స్ఫూర్తి కొనసాగించండీ..!’ అంటూ చేయి ఊపుతూ వేదిక దిగి కారు వద్దకు దారితీశాడు ఆదిత్యవర్థన్‌.. మహిళలంతా ఆయనతో పాటే కారు వరకూ వెళ్లి కనిపించడం ఆగిపోయే వరకూ చేతులూపారు. ఆదిత్యవర్థన్‌కు హాయిగా, తృప్తిగా ఉంది. ఇంటికెళ్లి ఆ రాత్రి గుండెలమీద చేతులేసుకొని హాయిగా నిద్రపోయాడు ఆదిత్యవర్థన్‌.
- శాంతిశ్రీ

హర్షిత

గులాబీ రంగు చీరలో ముగ్ధమనోహరంగా ఆ గులాబీ పువ్వే నడిచొస్తుందా అన్నట్లు బస్సు దిగి వస్తోంది హర్షిత. రావడం రావడమే రోజూలాగానే పూలమ్మే సుగుణమ్మ దగ్గరకు వచ్చి ఆగింది. ఆమె కోసం ఎదురుచూస్తున్న సుగుణమ్మ ‘వచ్చావమ్మా..! ఏంటీ.. ఈరోజు ఆలస్యమైందేంటి? బస్సు అందలేదా? లేటుగా బయల్దేరారా?’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఆమె కోసం ఉంచిన గులాబీ తీసి హర్షితకు అందించింది.
హర్షిత దాన్ని అందుకుంటూ..’ వాసన చూస్తూ.. ఈ గులాబీ భలే మంచి వాసన వస్తుంది కదా..?’ అడిగింది హర్షిత. ‘అవునమ్మా. నీకెప్పుడూ నేను మంచి పూలే ఇస్తానమ్మా…ఈ పువ్వు నీ చీరకు కరెక్టుగా మ్యాచింగ్‌ అయ్యిందమ్మా’ అంది సుగణమ్మ. ‘రంగులు నాకు కనిపించవుగా.. అందుకే మంచివాసన వచ్చే పూలంటే నాకు మరీ మరీ ఇష్టం.. అందులో గులాబీ, మల్లెపూలంటే నాకు మరీ మరీ ఇష్టం.. చాలా థ్యాంక్సు సుగణమ్మ’ అంటూ యూనివర్శిటీలోకి దారితీసింది హర్షిత. ‘అయ్యో హర్షితమ్మకు కళ్లుకనపడవన్న విషయం తెలిసినా? ఇలా అనేశానే.. అయ్యో బిడ్డ ఎంత బాధపడిందో ఏంటో..నాకస్సలు బుద్ధిలేదు’ అంటూ తనను తాను తిట్టుకుంటూ.. హర్షిత వెళ్లేవైపే చూస్తుండిపోయింది సుగుణమ్మ.
హర్షిత యూనివర్శిటీలో ప్రొఫెసర్‌. హర్షిత క్లాసంటే విద్యార్థులు ఫుల్‌ హాజరు. అస్సలు డుమ్మా కొట్టరు. ఆమె పాఠం చెప్పే తీరు అలా ఉంటుంది మరి. హర్షిత ఆ విధంగా పాఠం చెప్పడం తోటి ప్రొఫెసర్లకు కూడా ఆశ్చర్యం కలిగించిన సందర్భాలు ఎన్నో. హర్షిత మాట్లాడుతుంటే అందరూ కళ్లప్పగించి వినాల్సిందే. హర్షిత మాట అంత మధురంగా, సరళంగా ఉంటుంది. ఆమె చెప్పిన పాఠం ఏదైనా మర్చిపోలేమంటారు అనేకమంది విద్యార్థులు. అలా అభిప్రాయపడుతున్నారంటే అది హర్షిత గొప్పతనమే కదా!
కాలేజీ ముగించుకుని ఇంటికి చేరింది హర్షిత.
ఇంట్లోకి అడుగుపెట్టగానే చేతిలో బ్యాగ్‌ను గోడకు తగిలించి, వాష్‌ బేసిన్‌ దగ్గరకు వచ్చి చల్లని నీటితో ముఖం కడుక్కుంది. సోఫాలో కూర్చొని సిడి ప్లేయర్‌ ఆన్‌ చేసి, సంగీతం వింటూ కాసేపు రిలాక్స్‌ అయ్యింది. అలా పాటలు విని కాసేపు సేదతీరాక కొద్దిగా సౌండ్‌ పెంచి స్నానానికి వెళ్లింది. స్నానం చేసి వచ్చాక పాటలు ఆపేసి తాను పాడటం మొదలుపెట్టింది. ఆ మధురగాత్రం వింటూ వాళ్లమ్మ మైమరచిపోయింది. కాసేపు అలా సాధన చేశాకగానీ వాళ్లమ్మ వచ్చిన విషయాన్ని గ్రహించలేదు.
‘ఏమ్మా ఏంటి సంగతులు?’ హర్షితను అడిగింది తల్లి సౌదామినిని. ‘ఏం లేదమ్మా… ఈరోజు సుగుణమ్మ నాకు మంచి సువాసన వస్తున్న గులాబీ ఇచ్చింది. అది ఈరోజు నేను కట్టుకున్న చీరకు మ్యాచింగ్‌ అని తనే చెప్పింది. అబ్బ… ఎంత మంచివాసన వస్తుందనీ…’ ఆనందంగా చెప్పింది హర్షిత.
‘కళ్లుంటే ఇంకెంత ఆనందపడేదానివో కదా!’ అనుకుంటూ చీరకొంగుతో కళ్లద్దుకుంది సౌదామిని. తల్లి మౌనంగా ఉండిపోయిందంటే ఏడుస్తుందనే అర్థం. అది గ్రహించిన హర్షిత. ‘అలా ఏడవొద్దని నీకెన్నిసార్లు చెప్పానమ్మా! నాకు కళ్లు లేవన్న విషయాన్ని పదే పదే గుర్తుచేసి నన్ను మరింత బాధపెట్టినట్లేగానీ, నువ్వలా ఏడ్వటం నాకేమీ ఓదార్పు కాదు. నేను చాలా ఆనందంగా ఉన్నా.. ప్లీజ్‌ అమ్మా..! ఇంకెప్పుడూ అలా ఏడవొద్దు… నా చేతిలో చెయ్యి వేయి…’ అంటూ చేయి ముందుకు చాపింది హర్షిత. ఆమె చేతిలో చేయివేస్తూ ‘భోజనానికి రామ్మా…’ అంటూ పట్టుకుని లేవదీసింది సౌదామిని. ‘నాన్న వచ్చాక భోంచేద్దామమ్మా!’ అంది హర్షిత. ‘సరేలే అప్పటివరకూ వార్తలు విందాం పదా!’ అంటూ హాల్లోకి దారితీసింది సౌదామిని. వాళ్లు వార్తలు వింటుండగానే ‘ఏంటమ్మా ఈ రోజు వార్తలు?’ అంటూ రాఘవరావు లోపలికి అడుగుపెట్టారు. ‘పెద్ద విశేషాలు ఏమీ లేవు నాన్నా! ఏంటి ఈ రోజు ఇంత లేటు?’ గారంగా అడిగింది హర్షిత. ‘ఏం లేదురా! ఈ రోజు ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయి. పెద్దతలకాయగా నన్ను కూడా ఉండమన్నారు. అంతే.. స్నానం చేసి వస్తా మీరు భోజనాలకు లేవండి…’ అంటూ వెళ్లారు రాఘవరావు. ముగ్గురూ భోజనాలకు కూర్చున్నారు. భోజనాల దగ్గర కూతురు యూనివర్శిటీలో ఆరోజు జరిగిన విషయాలు చెపుతుంటే.. ఆరోజు ఇంటర్వ్యూలో జరిగిన తమాషాలు చెప్పారు రాఘవరావుగారు. ‘కబుర్లేనా తినేదేమన్నా ఉందా?’ అన్న సౌదామిని చేసిన రెండు, మూడు హెచ్చరికలతో భోజనాలు ముగించారు. అందరూ మళ్లీ హాల్లోకి వచ్చి కొద్దిసేపు మాట్లాడుకుని ఎవరి బెడ్‌రూముల్లోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు.
000
భరత్‌ పేరుకు తగ్గట్టు దేశాన్ని ఉద్దరించడానికే పుట్టాడా అన్నట్లు ఉంటాడు. అతను చేసేది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. అతను చేసే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అంతే సాఫ్ట్‌గా ఉంటాయి. వికలాంగులన్నా, మానసిక వికలాంగులన్నా అతని హృదయం ద్రవించిపోతుంది. వారికోసమే తానున్నట్లు వాళ్లతో వ్యవహరిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు. కన్నూముక్కూ తీర్చిదిద్దినట్లు ఉంటాయి. పసిమిఛాయ.. కొద్దిగా వంకీ తిరిగిన నల్లని జుట్టు చూపరులను ఇట్టే ఆకర్షించే విగ్రహం అతనిది. అతను మాట్లాడుతుంటే ఎంతటివారైనా మౌనంగా ఆలకిస్తూ ఉంటారు. మనస్సు కూడా ద్రవించేలా మాట్లాడతాడు. వికలాంగుల గురించి అతను మాట్లాడుతుంటే అన్నీ ఉండి ఏమీ చేయలేకపోతున్నామనే అవమానం ఒకవైపు వేధిస్తుంటే, మరోవైపు కర్తవ్యం బోధపడినట్లు ఉంటుంది ఎవరికైనా. వీకెండ్స్‌ రెండురోజులూ సేవా కార్యక్రమాల్లోనే మునిగి తేలతాడు భరత్‌. ఈ పనులను భరత్‌ ఇంత ఇష్టంగా చేస్తున్నాడంటే ఆ గొప్పతనమంతా వాళ్ల అమ్మ శారదమ్మకే దక్కుతుంది. తండ్రి సుబ్బారావు మాత్రం పైసా పైసా లెక్కలేసుకునే టైపు. శారదమ్మ చిన్నప్పటి నుంచి భరత్‌కు సమాజం పట్ల జాలిని, ప్రేమను రంగరించి పోసింది. శారదమ్మ ప్రతి శనివారం వృద్ధాశ్రమానికి వెళ్లి ఆరోజంతా అక్కడ వృద్ధులకు సేవ చేసి, సాయంత్రం ఆరుగంటలకు ఇంటిముఖం పడుతుంది. ఇలా తల్లీకొడుకూ సమాజసేవలో తన్మయత్వం చెందుతుంటారు. ఖర్చు పెట్టకుండా కాళ్లూచేతులు, నోరు నొప్పి పుట్టేలా ఎంత కష్టపడినా ఇబ్బందిలేదంటాడు సుబ్బారావు. ఇది భరత్‌ ఇంట్లోని విచిత్ర పరిస్థితి.
000
ఒకరోజు అంధులకు సంబంధించిన కార్యక్రమం ఆడిటోరియంలో జరుగుతోంది. దానికి భరత్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. వికలాంగుల గురించి ఎంతో ఆర్ద్రతతో ఉపన్యాసం చేస్తున్నాడు భరత్‌. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. కొద్దిసేపటికి హర్షిత లేచి ‘ఉపన్యాసాలు చాలా మంది చేస్తారు. పండ్లు, ఫలహారాలు చాలా మంది పంచుతారు. ఏదో ఒక అవయవం లేనివారని మమ్మల్ని ప్రత్యేకంగా (దూరంగా) ఉంచుతారు. అయ్యో పాపం! అంటారు. ఇలా మామీద ఎవరూ జాలి, దయా చూపొద్దు. మీలో ఒక్కరిగా మమ్మల్ని చూడండి. మీకు అలాంటి అభిప్రాయం లేకుంటే.. మాపట్ల నిజంగా ప్రేమ ఉంటే.. మీలో ఒకరిగా మమ్మల్ని స్వీకరిస్తుంటే.. ఒక అంధురాల్ని పెళ్లి చేసుకోండి చూద్దాం…!’ అంటూ సవాలు విసిరింది. అందుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘మీకు వివాహం అయ్యిందా?’ అన్నాడు భరత్‌. ‘లేదు’ అంది హర్షిత. ‘అయితే నన్ను చేసుకుంటానికి మీకేమీ అభ్యంతరం లేదుగా?’ అన్నాడు భరత్‌. ‘నాకేమీ అభ్యంతరం లేదు’ బదులిచ్చింది హర్షిత. ‘ఈ కార్యక్రమం అవగానే మీ ఇంటికి వస్తాను మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను’ అన్నాడు భరత్‌. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా హర్షాతిరేకాలు చేశారు. కొద్దిసేపటికి కార్యక్రమం ముగిసింది.
హర్షితను తన కారులోనే ఎక్కించుకొని ఆమె చెప్పిన అడ్రస్‌ ప్రకారం వాళ్లింటికి తీసికెళ్లాడు భరత్‌. దారిలోనే ఆమె యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ అని తెలుసుకున్నాడు. పుట్టుకతోనే అంధత్వం ఉందనీ, తన తల్లిదండ్రులు తననెంతో స్థయిర్యంతో పెంచారని చెప్పింది. భరత్‌ కూడా తన తల్లిదండ్రుల గురించి చెప్పాడు. ఈలోగా హర్షిత ఇల్లు వచ్చేసింది. కారాపాడు భరత్‌.
ఆమె ఇంట్లోకి దారితీస్తుంటే ఆమె వెనకే వస్తున్న భరత్‌కి.. అడుగుపెట్టగానే సువాసనలు వెదజల్లుతున్న పూలు స్వాగతం చెప్పాయి. తలుపు పట్టుకోగానే సంగీతం వినిపించింది. కర్టెన్‌ పక్కకు జరపగానే మరో వినసొంపైన ధ్వని వినపడింది. ఇవన్నీ హర్షిత కోసం ఆమె తల్లిదండ్రులు చేసిన ఏర్పాట్లని భరత్‌ గ్రహించాడు. చాలా ఆశ్చర్యపోయాడు కూడా. అంత మనోధైర్యంగా మాట్లాడిదంటేనే హర్షిత చాలా విషయ పరిజ్ఞానంతో పాటు మనోస్థయిర్యం కలిగిన వ్యక్తని అర్థమైంది. హల్లోకి వచ్చేలోపు అనేకరకాల ధ్వనులు అతని ఎదను మీటాయి. సోఫాలో కూర్చోమంది హర్షిత. కూర్చున్నాడు భరత్‌. ఈలోపు సౌదామిని చీర కొంగు కప్పుకుని వచ్చింది. ఆమెను చూడగానే లేచి నమస్కరించాడు భరత్‌. ‘కూర్చో బాబూ! హర్షిత ఇప్పుడే చెపుతుంది మీ గురించి. హర్షిత ఫోను చేసింది వాళ్ల నాన్నగారికి. ఆయన తను రావడానికి కొద్దిగా టైము పడుతుందన్నారు. ‘ఆయన వచ్చేవరకూ కాసేపు అలా కూర్చుందాం రండి’ అంటూ డైనింగ్‌ టేబుల్‌వైపు దారితీసింది సౌదామిని. అక్కడే వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కొన్నారు ఇద్దరూ. ముగ్గురూ కూర్చొని వెజిటబుల్‌ సలాడ్‌ తింటూ భరత్‌ వాళ్ల కుటుంబం గురించిన విశేషాలు చెపుతుంటే వింటున్నారు. ‘ఎంత మంచి అబ్బాయి’ మనస్సులోనే అభినందించకుండా ఉండలేకపోయింది సౌదామిని. ఈలోగా రాఘవరావు జాయినయ్యారు వాళ్లతో. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకున్నారు.
‘ఈ రోజు శుక్రవారం కదా భరత్‌!’ అడిగాడు రాఘవరావు. ‘అవునంకుల్‌’ అంటూ ఏంటి చెప్పండి అన్నట్లు ప్రశ్నార్థకంగా మొహంపెట్టాడు భరత్‌. ‘ఆదివారం హర్షితను తీసుకొని మీ ఇంటికి వస్తాము’ అన్నారు రాఘవరావు. ‘అలాగే’ అంటూ వారి వద్ద సెలవు తీసుకుంటూ సంతోషంగా బయటకొచ్చాడు భరత్‌. ఆ ఇంటి వాతావరణం బాగా నచ్చింది భరత్‌కు. ఇంటికి వెళ్లేలోపు పదిసార్లుకన్నా ఎక్కువే అనుకుని ఉంటాడు ఆ మాట. ఇంటికెళ్లగానే వాళ్లమ్మ చుట్టూ చేతులు వేసి కొద్దిగా పైకి లేపి చుట్టూతా తిప్పేశాడు భరత్‌. ‘కళ్లు తిరుగుతున్నాయిరా! ఆపరా! ఏమిటీ ఈ రోజు ఇంత ఆనందం’ అంటూ ఇబ్బంది పడిపోయింది శారదమ్మ.
కంగారుపడిపోయి ఆపేసి వాళ్లమ్మ భుజం చుట్టూ చేతులు వేసి సోఫాలో కూర్చొబెడుతూ ‘ఏంటమ్మా! ఏమన్నా ఇబ్బందిగా ఉందా?’ అంటూ నుదిటిపై చేయిపెట్టాడు. చిరుచెమటలు పట్టాయి. ‘సారీ అమ్మా’ అని గబగబా లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. ‘మరేం ఫర్వాలేదులే! ఏమిటీ ఇంతకీ ఈ పట్టలేని ఆనందానికి కారణం?’ మళ్లీ అడిగింది శారదమ్మ. హర్షిత గురించిన విషయం చెప్పాడు భరత్‌. ‘చాలా మంచి పని చేశావు నాన్నా!’ వెంటనే భరత్‌ తలను రెండుచేతులతో దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టింది శారదమ్మ. అమ్మ వెంటనే ఒప్పేసుకుంటుందని భరత్‌కు ముందే తెలుసు. తండ్రి గురించే పితలాటకం. అయినా ఆయన్ని ఇద్దరూ కలిసి ఎలాగైనా మేనేజ్‌ చేస్తారు. ఆ ధైర్యం ఇద్దరికీ ఉంది. ‘అమ్మా! వాళ్లు ఆదివారం వస్తానన్నారు. నాన్నని వేరే పనులేవీ పెట్టుకోకుండా ఇంట్లో ఉంచే బాధ్యత నీదే’ అన్నాడు భరత్‌.
‘ఓకే నాన్నా! అవన్నీ నాకు వదిలిపెట్టేరు..’ కొడుకు వీపు తడుతూ అంది శారదమ్మ.
కొడుకు సాయంతో శారదమ్మ హర్షితకు అనువుగా ఇంట్లో దేన్ని తాకినా సుమధుర సంగీతం వినిపించేలా ఏర్పాట్లు చేసేసింది.
ఆదివారం వచ్చేసింది.
హర్షితను తీసుకొని వాళ్ల అమ్మానాన్నా ఇంట్లోకి అడుగుపెట్టారు. అక్కడి వాతావరణం చూశాక వాళ్లు ముగ్ధులైపోయారు. రెండురోజుల్లోనే హర్షిత రావడానికి ఇబ్బంది లేకుండా ఇంట్లో చేసిన ఏర్పాట్లకు రాఘవరావు హృదయం ద్రవించిపోయింది. ఎదురుగా వచ్చిన భరత్‌ను హృదయానికి హత్తుకున్నారు. ఆయన స్పర్శలోని భావాన్ని భరత్‌ గ్రహించాడు. పరిచయ కార్యక్రమాలు అయిపోయాయి. హర్షితను తీసుకొని శారదమ్మ, సౌదామిని లోపలికి వెళ్లిపోయారు.
ఇంట్లో ఎన్ని గదులో, ఎటువైపు తలుపులూ కిటికీలూ అలమరాలూ ఉన్నాయో.. అన్ని వివరంగా హర్షితకు అర్థమయ్యేలా శారదమ్మ చెపుతుంటే సౌదామినికి సంతోషంతో గుండె ద్రవించిపోయింది. ‘చాలా సంతోషం వదినగారూ! మీలాంటి మంచి సంబంధం మాకు దొరకడం. అందాలరాశి, అనుభవశీలి అయిన కోడల్ని మాకిస్తున్నందుకు’ అంటూ సౌదామిని చేతిని ఆప్యాయంగా చేతిలోకి తీసుకొని నిమిరింది శారదమ్మ. వారి ఆప్యాయతానురాగాలకు హర్షిత కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. రాఘవరావుకు హర్షిత ఒక్కతే కూతురు, కళ్లులేకపోతే ఏంటి? ఆస్తంతా తమదేనన్న భరోసాతో నిబ్బరంగా ఉన్నాడు సుబ్బారావు. అందరూ సంబంధం ఓకే అనుకున్నారు. పురోహితుడిని సంప్రదించారు. రెండువారాల్లో దివ్యమైన ముహూర్తం ఉందన్నాడు పురోహితుడు. ఆ ముహూర్తానికే పెళ్లిచేయాలని పెద్దలంతా నిశ్చయించుకున్నారు. పెళ్లిని చాలా నిరాడంబరంగా జరుపుకోవాలని షరతు పెట్టింది హర్షిత. భరత్‌ కుటుంబం అందుకు సమ్మతించారు.
000
భరత్‌-హర్షితల పెళ్లి రిజిస్ట్రర్‌ ఆఫీసులో సింపుల్‌గా అయిపోయింది. అదేరోజు రాత్రి వారికి ఇంటికి పైన ఉన్న బెడ్‌రూమ్‌లో ఏర్పాట్లు చేసింది శారదమ్మ. భోజనాలు అయ్యాక కింద ఉన్న బెడ్‌రూముల్లో పెద్దవాళ్లు ఉండిపోయారు. హర్షితను తీసుకొని భరత్‌ పైకి వెళ్లాడు. అక్కడ గదిలోకి అడుగుపెట్టగానే హర్షిత మనస్సుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది. సువాసన భరితమైన మల్లెల పరిమళాలు, సంపెంగల సౌరభాలు, చల్లటి పిల్లగాలి, మధురమైన సంగీతం… వాటన్నింటినీ ఆస్వాదిస్తూ మైమరిచిపోయింది హర్షిత. ఆమె పరవశాన్ని తదేకంగా చూస్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కాడు భరత్‌. మరింత మధురంగా అనిపించింది హర్షితకు. వెంటనే ఆమె మోమును తన చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు భరత్‌. హర్షిత శరీరమంతా ఒక్కసారిగా పులకించిపోయింది. ఆమె పులకరింతకు భరత్‌ చెవిలో చెప్పిన పలకరింతలతో సిగ్గుల మొగ్గయ్యింది హర్షిత.
‘హర్షితా! గోముగా పిలిచాడు భరత్‌! ‘ఊ’ మత్తుగా పలికింది హర్షిత. ‘ఎలా ఉంది?’ అడిగాడు భరత్‌. ‘మత్తుగా..గమ్మత్తుగా…’ అంది హర్షిత. ‘అవునా.. నీకింకో గమ్మత్తు తెలియజేయనా?’ అడిగాడు భరత్‌. ‘ఊ…….’ అంది హర్షిత. ఆమె కనురెప్పలపై ముద్దాడాడు భరత్‌. మొట్టమొదటిసారిగా ఆమె తన కన్నులతో పొందిన అనుభూతి అది. ఆమె ఇన్నాళ్లూ తన కన్నులు తనకేమీ ఉపయోగపడలేదని బాధపడింది. అందుకే అది ఆమెకు మధురానిభూతిగా అనిపించింది. వెంటనే ‘భరత్‌ నీ పెదాలతో స్పర్శించి.. నా కన్నులు కూడా నా శరీరాన్ని స్పందించేలా చేశావు. ‘థ్యాంక్యూ భరత్‌…! ఐ లవ్‌ యూ…’ అంటూ భరత్‌ను అల్లుకుపోయింది హర్షిత.
హర్షితను యూనివర్శిటీ వద్ద దింపేసి తన కంపెనీకి వెళ్లడం భరత్‌ దినచర్యలో ఒక భాగమైంది. అలాగే వీకెండ్స్‌లో ఇద్దరూ వికలాంగులను కలవడం కూడా మానుకోలేదు. శారదమ్మ శనివారాలు వృద్ధాశ్రమానికి వెళ్లడమూ ఆపలేదు. అలా వారి సంసారం మూడు ఆశయాలు.. ఆరు సంతోషాలుగా సాగిపోయింది వారి సంసారం.
ఇప్పుడు భరత్‌కు హర్షిత చేసే గైడెన్సుకు ఆశ్చర్యపోవాల్సిందే అంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు ఇద్దరూ సామాజికసేవలో కొత్తవరవడితో మరింత బాగా కృషి చేస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు. హర్షితకు కళ్లు లేవన్న విషయాన్ని ఆ ఇంట్లో అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అందరికీ హర్షితే కళ్లు.. అందరూ హర్షితకు కళ్లు..
- శాంతిశ్రీ

జాబిల్లి

ప్రకాశం బ్యారేజీ మీదకి కారు రాగానే.. ప్రియాంక ఒక్కసారిగా నిటారు అయ్యింది…
ప్రమోద్‌…! ప్రమూ..! కారు స్లోగా పోనీరు…
‘కృష్ణమ్మ చూడు ఎన్ని వయ్యారాలు పోతూ.. పడుచుపిల్ల గుండెలా ఎలా తుళ్లిపడుతుందో…’ అంటూ విండో గ్లాస్‌ దించేసి రెండుచేతులతో అద్దాన్ని పట్టుకుని పరవళ్లు తొక్కుతున్న కృష్ణానదిని చూస్తూ చిన్నపిల్లలా పరవశించిపోతోంది ప్రియాంక.
ఆ స్థితిలో ప్రియాంకను చూసి మురిసిపోయాడు ప్రమోద్‌.
బ్యారేజీ దాటేవరకూ ప్రియాంక భంగిమలోగానీ.. ఆమె మోములోని పరవశంలోకానీ లేశమైనా మార్పు లేదు.
బ్యారేజీ దాటగానే… సర్దుకుని కూర్చుంటూ.. నేనెప్పుడు ఇటువైపుగా వెళ్లినా.. ఈ దృశ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వను ప్రమూ…! ఆర్ద్రంగా కళ్లు రెపరెపలాడిస్తూ చెప్పింది ప్రియాంక.
వెంటనే కుడిచేత్తో స్టీరింగ్‌ నడుపుతూ ఎడమచేత్తో ప్రియాంక నడుం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకొని కనురెప్పలపై ముద్దాడాడు ప్రమోద్‌…
‘థాంక్యూ…ప్రమూ…’ కళ్లు బరువుగా మూస్తూ చెప్పింది ప్రియాంక.
‘అంతేనా…?’ అన్నాడు ప్రమోద్‌..
అతనికి మరింత హత్తుకుపోతూ… అతని చేతిని తన చేతిలో తీసుకొని ముద్దాడింది ప్రియాంక.
బ్యారేజీ దాటాక సెంటర్‌లో కారాపాడు ప్రమోద్‌…
అప్పుడు కళ్లు తెరిచి చూసింది ప్రియాంక. అక్కడ చాలామంది మల్లెపూలు రాసులు పోసి వరుసగా కూర్చున్నారు.
ప్రమోద్‌ ఎందుకు కారాపాడో అప్పుడర్థమైంది ప్రియాంకకు.
తామరాకులో చుట్టిన మల్లె దండల్ని తెచ్చి ప్రియాంక చేతిలో పెట్టాడు ప్రమోద్‌. ఎంతో మురిపెంగా వాటినందుకుంది ప్రియాంక. తనొచ్చి డ్రైవింగ్‌ సీట్లో కూర్చొని కారు స్టార్ట్‌ చేశాడు ప్రమోద్‌.
రోడ్డుకిరువైపులా అరటితోటలు.. పసుపు తోటలు.. ములగ తోటలు.. కర్వేపాకు, గులాబీ, లిల్లీ తోటలు.. ఒక పక్క పచ్చగా.. మరోపక్క పరిమళాలు వెదజల్లుతూ మనస్సును మైమరిపిస్తోంది ఆ వాతావరణం…
‘అబ్బా..! ఎంత బాగుంది ఈ వాతావరణం…’ అని పైకే అనేసింది ప్రియాంక..
‘అవునా..!’ అని.. ‘ఏమనిపిస్తోంది…’ అంటూ చిలిపిగా అడిగాడు ప్రమోద్‌..
‘ఛీ.. పో…’ అంటూ అతని భుజానికి తలను ఆనించి తన రెండు చేతులను అతని ఎడమచేతికి పెనవేసింది.
ముసిముసిగా నవ్వుకుంటూ కారు డ్రైవ్‌ చేస్తున్నాడు ప్రమోద్‌…
000
ప్రమోద్‌ మొదటి నుంచి వాళ్లింట్లో అందరికన్నా ప్రత్యేకంగా ఉండేవాడు. ఆలోచనలు కూడా వేరుగా ఉండేవి. తల్లితండ్రులిద్దరూ కూలీలు. ‘తామిలా కూలీలుగా ఉండడమేమిటి? కొందరికే ఎక్కువ భూములుండటమేమిటి? తమకు జానెడు జాగ లేకపోవడమేమిటని?’ ఇలాంటివెన్నో ప్రశ్నలు అతని మస్తిష్కాన్ని తొలుస్తుండేవి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం శోధిస్తూనే ఉండేవాడు. ప్రమోద్‌ ఇంటర్‌కు వచ్చాక ఆ ఊరిలో పేద ప్రజలకోసం పనిచేసే వెంకట్రామయ్యతో పరిచయం ఏర్పడింది. ఆయనిచ్చే పుస్తకాలు చదవడం ప్రమోద్‌కు నిత్యకృత్యమైంది. అలా పుస్తకాలు చదివాక తన ప్రశ్నల్లో చాలావాటికి సమాధానాలు తెలుసుకోగలిగాడు ప్రమోద్‌. అలా తెలుసుకున్న విజ్ఞానంతో ప్రమోద్‌ మరింత రాణించాడు. ఆ తర్వాత తన అభిరుచులకు అనుగుణమైన ప్రియాంకను వివాహం చేసుకున్నాడు. ప్రియాంక ఉన్నత కుటుంబంలో పుట్టినా ఆమె అభిప్రాయాలు అవే కావడంతో.. పేదింటివాడైన, కులాలు వేరైనా ప్రమోద్‌ చేసుకోవడానికి ఏమాత్రం సందేహించలేదు. ప్రమోద్‌ ఇంట్లో ఆమెకు కొత్తగా ఏమీ అనిపించలేదు. చాలా సౌకర్యవంతంగా అనిపించింది. మనస్సులు కలిస్తే మనుగడ సుఖంగానే ఉంటుంది. ప్రియాంక విషయంలో అదే జరిగింది.
000
‘ఏమమ్మా…పాపక్కారు..! మీ కోడల్ని మాకు చూపించవా?’ అంటూ అమ్మలక్కలు వచ్చారు. ‘ఎందుకు చూపించనూ..? అమ్మా! ప్రియాంక ఒకసారి ఇటురామ్మా!’ అని పిలిచింది పాపమ్మ. ‘ఆ…. వస్తున్నా అత్తయ్యా..!’ అంటూ వచ్చింది ప్రియాంక.
గులాబిరంగు చీర కట్టుకుంది. విత్‌ బ్లౌజ్‌ వేసుకుంది. పెద్ద జడ. అందులో మల్లెదండలు నాలుగైదు వరసలు పెట్టింది. వచ్చి అత్తగారి పక్కనే కూర్చుంది.
‘ఏమమ్మా.. మీ అత్త చాటుగా కూర్చుంటున్నావు.. ఇటురా..! మా దగ్గరకు అంటూ’ గడుసుగా అడిగింది పార్వతమ్మ. ‘వెళ్లమ్మా… వాళ్లు గట్టిగా మాట్లాడినట్లు ఉంటుందికానీ.. కల్మషం లేని మనుషులు..’ అంటూ కోడలితో అంది పాపమ్మ. ప్రియాంక లేచి వాళ్ల దగ్గరగా కూర్చుంది. ‘చూడచక్కని ముఖం. ఆపై తీర్చిద్దినట్లున్న కనుబొమ్మలు. దోసగింజ ఆకారంలో బొట్టు. కళ్లకు చక్కగా కాటుక పెట్టుకుంది. కాళ్లకు మెట్టెలు పెట్టుకుంది… ఎంత బాగున్నావమ్మా…! నా దిష్టే తగిలేటట్లుంది’ అంటూ అందరిలోకీ పెద్దావిడ శంకరమ్మ రెండు చేతుల్తో మొటికలు విరిచింది.
‘ఈ చీర నీకు బాగా నప్పిందమ్మాయి… నువ్వే కొనుక్కుంటావా..? మీ అమ్మ కొంటుందా?’ అడిగింది మణి ఆసక్తిగా… ‘నేనే కొనుక్కుంటా’ అంటూ బదులు చెప్పింది ప్రియాంక. ‘అబ్బ నీ గొంతు కూడా చాలా బాగుందమ్మారు… బాగా చదువుకున్నావు కూడా.. నీలో ఇన్ని మంచి సుగుణాలుండబట్టే మా అబ్బాయి నిన్ను చేసుకున్నాడు’ అంటూ చేత్తో ప్రియాంక బుగ్గలు సవరదీసి ముద్దుపెట్టుకుంది వెంకటరమణమ్మ.
వాళ్లవి కల్మషం లేని మాటలు అని తెలుస్తున్నా.. మరీ అంతా ఎదురుగ్గా పొగుడుతుంటే కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది ప్రియాంకకు.
‘ఉండండి..! అందరికీ టీ పెట్టుకొస్తాను…!’ అంటూ అక్కడ నుంచి లేచింది. ‘నువ్వు చాలా అదృష్టవంతురాలివే పాపమ్మా! పట్నం కోడలు వచ్చినా కాలుమీద కాలేసుకుని కూర్చోక మీలో కలిసిపోయింది. ఒకళ్లకు పెట్టేబుద్ధి బాగా వుంది.’ అంది పార్వతమ్మ. ‘ఎన్నిమాట్లొచ్చినా ఒక్కనాడైనా పాపమ్మ చిన్నమ్మ టీ తాగమన్న పాపాన బోదుగందా!’ అంది మణి. ‘చాల్లేవే… సంబడం.. పెట్టినియ్యన్నీ పోయినాయా..? నీ దుంపతెగ.. ఈసారి నీకేమీ పెట్టను చూడూ..’ అంటూ మణి వీపుమీద ఒక్కటేసింది పాపమ్మ. ‘అబ్బా! ఏంటి చిన్నమ్మా!’ అంటూ దెబ్బ పడినచోట వీపు సవరదీసుకుంది మణి. ఈలోపు అందరికీ టీ పెట్టుకొచ్చింది ప్రియాంక. అందరూ టీలు తాగారు.
‘అమ్మాయి నీకు వంట వచ్చా?’ అడిగింది శంకరమ్మ. ‘వచ్చు అమ్మమ్మా!’ అంది ప్రియాంక. ‘నా తల్లే.. ఎంత చక్కగా పిలిచావమ్మా! నూరేళ్లు చల్లగా ఉండమ్మా!’ అంటూ బుగ్గలు నిమిరింది. ‘ఆ వస్తాం పాపమ్మా…!’ అంటూ అందరూ బయల్దేరారు. అత్తాకోడళ్లిదరూ గేటుదాకా వార్ని సాగనంపారు..
000
ఒకరోజు ఉదయం… కోయిలమ్మ కమ్మని కంఠం కిటికీ పక్కనున్న బాదం చెట్టు మీద నుంచి వినిపిస్తోంది. నెమ్మదిగా లేచింది ప్రియాంక. తనమీద వేసి ఉన్న ప్రమోద్‌ చేతిని మెల్లగా తీసి పక్కకు పెట్టింది. కిటికీలోంచి చూస్తే ఎదురుగా ఎత్తుమీద ఒక పెంకుటిల్లు ఉంది.
అక్కడ ఓచిన్ని పాప తన చిట్టి చేతులతో బకెట్లో నీళ్లను టపాటపా కొడుతుంది. అందులో నీళ్లు చింది, నీటి తుంపర్లు మొహంపై పడుతుంటే తెలినవ్వులు చిందిస్తూ పరవశిస్తోంది ఆ చిన్నారి. ఆ దృశ్యం ప్రియాంకు చాలా నచ్చింది. అలాగే చాలా సేపు చూస్తూ కూర్చుండి పోయింది. ఈలోపు ఎవరో ఒక బక్కపల్చని శరీరంతో ఎండిపోయిన ఆకులా ఉన్న ఆవిడ పాప వీపుమీద చటుక్కున ఒక దెబ్బ వేసింది. అంతే అప్పటిదాకా నవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారి భళ్లున ఏడ్చింది. ప్రియాంక మనస్సు చివుక్కుమంది. వెంటనే గబగబా బయటకు వచ్చి గేటువరకూ వచ్చి ఆగిపోయింది.
నిదానంగా ఇంట్లోకి వెనుదిరిగింది. ప్రమోద్‌ నిద్ర లేచాడు. డల్‌గా వస్తున్న ప్రియాంకను చూసి దిగ్గున లేచి.. ఏమైందిరా..! అలా ఉన్నావు అన్నాడు దగ్గరగా వచ్చి దగ్గరకు తీసుకుంటూ… విషయం చెప్పింది ప్రియాంక.. అంతే ఒక్కసారి ప్రమోద్‌ మౌనంగా మంచంపై కూర్చుండిపోయాడు. ఆ పాప గురించిన వివరాలు నీకు తర్వాత చెప్తాలే.. లే ముఖం కడుక్కో… అంటూ ప్రియాంకను లేవదీశాడు. ఇద్దరూ టిఫిన్‌ చేస్తున్నారు. ప్రియాంక మెదడును మాత్రం ఆ పాప గురించిన ఆలోచనలు ఒకటే తొలిచేస్తున్నాయి. ఇక ఉండబట్టలేక. ‘ప్రమూ! చెప్పవా ఆ పాప గురించి’ అని గారాలు పోయింది. ఆ పాప గురించి ప్రియాంక ఆరాటాన్ని అర్థంచేసుకుని చెప్పడం ప్రారంభించాడు.
‘మనింటి ఎదురుగా ఉన్న ఇల్లు వాళ్లది. వాళ్ల పెద్దబ్బాయి చెప్పాపెట్టాకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. రెండో అబ్బాయి కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. వాడు నా వయస్సువాడే. కానీ వాడికి నాలుగేళ్ల క్రితమే పెళ్లైంది. ఇందాక నువ్వు పాపను కొట్టిందని చెప్పావే. ఆవిడే అతని భార్య. పెళ్లప్పుడు చాలా బాగుండేది’ అని ప్రమోద్‌ చెప్తుండగా..
‘ఎవరి గురించిరా చాలా బాగుండేదని చెప్తున్నావు? అడిగింది అప్పుడే అక్కడకు వచ్చిన పాపమ్మ. అదే మన పార్వతక్క వాళ్ల కోడలి సంగతి అన్నాడు ప్రమోద్‌. అవునమ్మా! ఆ అమ్మాయి చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్లు ఉండేదమ్మా! మంచిపిల్ల. చక్కటి పనిమంతురాలు, గుణవంతురాలు. ఈరోజుల్లో అలాంటివాళ్లు అరుదు. ఆ దేవుడికి ఏం కన్నుకుట్టిందో.. ఆ పిల్ల నుదుట అలాంటి రాత రాశాడు’ అంటూ తనదైన వేదాంతంగా మాట్లాడింది పాపమ్మ.
‘ఏమైంది అత్తయ్యా?’ ఆందోళనగా అడిగింది ప్రియాంక. ‘ఆ అబ్బాయి చెడు తిరుగుళ్లు తిరిగి ప్రాణంమీదకు తెచ్చుకోవడం గాక. ఆ పిల్ల ప్రాణంమీదకు తెచ్చాడు’ అంది పాపమ్మ. ‘ఏంటో నాకు సరిగ్గా అర్థమయ్యేట్లు చెప్పు ప్రమోద్‌… ఏమైంది అతనికి?’ అడిగింది ప్రియాంక. ‘వాడు రెండేళ్లక్రితం ఎయిడ్స్‌తో చనిపోయాడు. అప్పటికే పాపకు ఎనిమిది నెలలు. తల్లీ, బిడ్డలకు టెస్టులు చేయించారు. భార్యకు కూడా ఎయిడ్స్‌ సోకిందని చెప్పాడు డాక్టర్లు. పాపకు మాత్రం సోకలేదని చెప్పారు.’ అంటూ ప్రియాంక కళ్ల వెంట కన్నీళ్లు చూసి చెప్పడం ఆపాడు ప్రమోద్‌. ‘ఏంట్రా ప్రియా! అంత బేలపోతే ఎలా?’ అంటూ ఎడమచేతిలో ప్లేట్‌ను కింద పెట్టి ప్రియాంకను దగ్గరకు తీసుకున్నాడు.’ కళ్లు తుడుచుకుంటూ ‘ఇప్పుడు ఆవిడకు, ఆ పాపకు వయస్సు ఎంత? వారిని ఎవరు చూస్తున్నారు?’ అని అడిగింది. ‘ఆ అమ్మాయికి పాతికేళ్లుంటాయనుకుంటా! పాపకు రెండెల్లి మూడో ఏడు వచ్చింది’ అంది కళ్లుతుడుచుకుంటూ పాపమ్మ. ‘ఆ అమ్మాయిని పుట్టింటోళ్లు రావద్దన్నారు. ఆ అబ్బాయి చనిపోవడంతో ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడన్న బాధతో తండ్రి గుండె ఆగి చనిపోయాడు. తల్లి మంచాన పట్టి ఇవాళో.. రేపో అన్నట్లుంది. ఆ అమ్మాయి చూస్తే.. రోజులు లెక్కబెడుతూ ఎండుటాకులా రెపరెపలాడుతోంది.’ అంది పాపమ్మ.
‘మరి వాళ్లనెవరు చూస్తారు?’ ఆందోళనగా కళ్లింత చేసి అడిగింది ప్రియాంక. ‘ఎవరం మాత్రం ఏం చేస్తామమ్మారు. ఎవరికి దేవుడు ఎలా రాసిపెట్టాడో.. ఆ అమ్మాయికి ఆ జబ్బుంటే ఎవరుమాత్రం వెళ్తారు.’ అంది పాపమ్మ. ‘అదేమీ అంటువ్యాధి కాదత్తయ్యా!’ అంది ప్రియాంక. ‘నీకెందుకులేమ్మా ఈ పాడు ఆలోచనలు.. కొత్తగా పెళ్లయ్యిందానివి…’ అంది పాపమ్మ. ‘అది కాదత్తయ్యా’ అంటున్న ప్రియాంక ప్రమోద్‌ చేసిన సైగతో ఆగిపోయింది. అప్పటికే ప్రియాంక మెదడులో ఆలోచనలు చాలా వేగంగా అనేక నిర్ణయాలు చేసేస్తున్నాయి. సాయంత్రం ప్రమోద్‌తో కలిసి అలా బయటకు వెళ్ళడానికి బయల్దేరింది ప్రియాంక.
ఇద్దరూ ఉండవల్లి గుహలకు వెళ్లారు. గుహలపక్కనే పార్కులాగా చాలా బాగా డెవలప్‌ చేసి ఉంది. అక్కడ కూర్చుంటే చుట్టూ అరటి, బంతి, జామ, సపోట తోటలు… వాటి మధ్యలోంచి కొండవీటి వాగు వయ్యారాలు పోతూ ప్రవహిస్తోంది. ఆ వాతావరణం భారంగా ఉన్న ప్రియాంక మనస్సును కాస్త తేలికపర్చింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్ధం తర్వాత… ముందుగా ప్రియాంకే మొదలు పెట్టింది.
‘ప్రమూ! నేనొక నిర్ణయానికి వచ్చాను’ అంది. ‘ఏమిటి?’ అన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు ప్రమోద్‌. ‘అదే మన ఊళ్లో ఎయిడ్స్‌ గురించి చాలా అపోహలున్నట్లు అనిపిస్తోంది. ఎయిడ్స్‌ గురించి అవగాహన కలగజేసే వాళ్ల గురించి నాకు తెలుసు. వాళ్లను ఒకసారి పిలిపించి మన ఊళ్లో రెండు, మూడు మీటింగ్‌లు వేద్దామా!’ అంది ప్రియాంక. ‘ఉపయోగం ఉంటుందా?’ సందేహంగా అడిగాడు ప్రమోద్‌. ‘తప్పకుండా… నువ్వేమీ సందేహించొద్దు.. చాలామంది యువకులు సన్మార్గంలో ఉండడానికి, ఎయిడ్స్‌ వచ్చిన వారిపట్ల ఎలా ఉండాలో కూడా అందరికీ అర్థమవుతుంది.’ అంది ప్రియాంక. ‘సరే అలాగే చేద్దాం..’ అంటూ ప్రియాంక లేవడానికి చేయి అందిస్తూ పైకి లేచాడు ప్రమోద్‌.
‘ఎప్పుడో కాదు రేపు సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం’ అంది ప్రియాంక తన స్నేహితురాలికి ఫోన్‌ చేస్తూ.. ‘ఓకే అంటోంది నిర్మల’ చెప్పింది ఆనందంగా ప్రియాంక. ప్రియాంకలోని ‘బాధ్యత’ ను చూసి గర్వంగా ఫీలయ్యాడు ప్రమోద్‌.
000
మొదటి సమావేశం అయ్యింది.
అత్తగారిని ఒప్పించమని ప్రమోద్‌ను బతిమిలాడి ఆ తర్వాత రోజు ఆ పాప వాళ్ల ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో సంఘటన జరిగాక వెళ్లిన మొదటి మనిషి ప్రియాంక. ప్రియాంకను చూడగానే.. ఆ ఎండుటాకులాంటి శరీరం ఒక్కసారి తేటబడినట్లు అయ్యింది.
‘నిన్ను చూడాలని ఉన్నా! రాలేని దౌర్భాగ్యురాలిని’ అంటూ ‘చాలా మంచి పని చేశారమ్మా!’ అంటూ చేతులెత్తి నమస్కరించింది ఆమె. ‘అలాంటివేమీ మనస్సులో పెట్టుకోకమ్మా! మనమంతా మనుషులం.. అందరం ఒక్కటే.. నీ పేరేంటి?’ అంది. లక్ష్మి. ‘ఎవరే …? ఎవరితో మాట్లాడుతున్నా?’ వణుకుతున్న గొంతుతో లోపలి నుండి అడుగుతుంది పార్వతమ్మ. ‘మన పాపమ్మ అమ్మమ్మ వాళ్ల కోడలు’ అంది లక్ష్మి. ‘అవునా! ఎంత దయమ్మా నీకు మామీద! నీగురించి లక్ష్మి రాత్రి చెప్పింది. చల్లగా ఉండమ్మా అంటూ చేతులు జోడించింది.’ అంది మంచం దగ్గరకు వచ్చిన ప్రియాంకతో. ‘పెద్దవాళ్లు మీరు నాకు నమస్కారం చేయకూడదు’ అంటూ తన రెండుచేతులతో ఆమె చేతులు పట్టుకుంది ప్రియాంక.
‘నిన్ను అక్కా! అని పిలవచ్చా! అడిగింది లక్ష్మి.’ ‘తప్పకుండా…!’ అంది ప్రియాంక. ‘అదేంటి అలా అడుగుతా ఎర్రిమొఖమా! ప్రమోద్‌ మామయ్య భార్యను అక్క అని పిలవపోతే ఏమని పిలుస్తా..?’ అంది పార్వతమ్మ.
అప్పటి వరకూ ఎక్కడ ఆడుకుంటుందో గోడవారగా నిలబడి ప్రియాంకను అలాగే చూస్తోంది పాప. పాపను చూడగానే ప్రియాంకకు ఎక్కడలేని సంతోషం ముంచుకొచ్చింది. ‘దా…దా…’ అంటూ లలితంగా పిలిచింది ప్రియాంక. ‘వెళ్లమ్మా! మన వాళ్లే…నీకు ఆమ్మ (పెద్దమ్మ) అవుద్ది!’ అంది పార్వతమ్మ. దగ్గరకు వచ్చింది.. ‘నీ పేరేంటి?’ అడిగింది ప్రియాంక. ‘జాబిల్లి’ అంది. దగ్గరకు తీసుకొని వళ్లో కూర్చోబెట్టుకుని పర్సులోంచి చాక్లెట్లు తీసి ఇచ్చింది.
‘ఆ పేరు వాళ్ల నానే పెట్టాడమ్మా!’ అంది ఏడుస్తూ పార్వతమ్మ. ‘నాన్న ఆచ్‌ పోయాడు… నేను బాగా చదువుకున్నాక వస్తాడంట… నాకప్పుడు బోలెడు చాక్లెట్లు, బొమ్మలు తెస్తాడు…’ అంటూ చక్రల్లాంటి కళ్లు తిప్పుతూ బుల్లినోరు ముద్దుగా ముందుకూ వెనక్కు సాగదీస్తూ చెప్తోంది జాబిల్లి. ప్రియాంకకు చాలా ముచ్చటేసింది జాబిల్లి మాటలకు.. ‘మహా మాటకారి అక్కా!’ అంది లక్ష్మి.
‘వాళ్ల నాన్న ఇట్టాంటి పాపిష్టి పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదమ్మా!’ అంది పార్వతమ్మ మూల్గుతూ.. ‘సర్లే.. సర్లే.. పడుకో… ఇప్పుడవన్నీ ఎందుకు తవ్వుతావు…! నా కర్మ ఇట్లా కాలాలని ఉంది. ఏం చేస్తాం..?’ అంటూ బాధపడింది లక్ష్మి. ‘ఊరుకోమ్మా…!’ అంది లక్ష్మి భుజం మీద చేయివేసి ప్రియాంక.
‘నాన్నను అమ్మే పోయి తీసుకొస్తుందంట…!’ నోరంతా తెరిచి చెప్తోంది జాబిల్లి. గుండెనెవరో మెలిపెట్టినట్లయింది ప్రియాంకకు.
మళ్లీ వస్తానంటూ… చెప్పి వచ్చేసింది ప్రియాంక.
ప్రియాంక, ప్రమోద్‌ హైదరాబాద్‌ వెళ్లేలోపు మరో రెండు సమావేశాలయ్యాయి. ఆ ఊర్లో చాలా మార్పు వచ్చింది. ఊళ్లో అందరూ ప్రియాంక, ప్రమోద్‌ను మెచ్చుకున్నోళ్లే ఎక్కువ. తిట్టినోళ్లు చాలా తక్కువ.
జాబిల్లి కూడా ప్రియాంకకు బాగా మచ్చిక అయ్యింది. ఎక్కడో మారుమూలున్న వారి పొలానికి ఇప్పుడు రేటొచ్చింది. దాన్ని అమ్మి వచ్చిన ఐదు లక్షల రూపాయల్లో రెండులక్షలు జాబిల్లి పేరున వేసి, మిగిలిన మూడులక్షలు వారి కుటుంబం గడిచేలా, లక్ష్మి, పార్వతమ్మ మందులకు ఖర్చుచేసుకునేలా ఏర్పాటు చేశాడు ప్రమోద్‌. పాపను స్కూల్లో జాయిన్‌చేసి, చదివించమని, అన్ని జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్‌ బయల్దేరారు ప్రియాంక, ప్రమోద్‌.
000
హైదరాబాద్‌ వచ్చిన కొద్దిరోజులకే పార్వతమ్మ కాలం చేసింది.
ఆరునెలలు గడిచింది…
ఒకరోజు ఉదయమే ఫోన్‌ వచ్చింది లక్ష్మి చనిపోయిందని.. ఒక్కసారే ప్రియాంకకు కళ్లల్లో జాబిల్లి కదలాడింది. కళ్లు ఏకధాటిగా వర్షిస్తున్నాయి. ప్రమోద్‌ ఎంత ఓదార్చినా.. వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది ప్రియాంక. కొద్దిసేపయ్యాక.. ‘రాత్రికి బయల్దేరదామా!’ అడిగింది ప్రియాంక.. ‘మనం వెళ్లేటప్పటికి తెల్లవారుతుందిగా.. ఉంచరంట..అర్ధరాత్రి దాటగానే చనిపోయిందంట!’ అన్నాడు ప్రమోద్‌. ‘జాబిల్లి గురించి ప్రమూ…! ఆ చిన్న మనస్సు ఎలా అల్లాడిపోతుందో…’ అంది ప్రియాంక.. ‘అలాగే ప్రియా…! వెళ్దాము. నా మట్టి బుర్రకు ఆ ఆలోచన రాలేదు.. అలాగే వెళ్దాం’ అన్నాడు ప్రమోద్‌.
000
కారులోంచి దిగుతూనే ప్రియాంక జాబిల్లి ఇంటివైపు అడుగులు వేసింది. జాబిల్లి అమ్మమ్మవాళ్లు అనుకుంటా…
‘ఈ పాపం మాకొద్దమ్మా! మేం ఎవరం తీసుకుపోం.. ఏ అనాథాశ్రమంలోనైనా చేర్పించేయండి.. పొలం అమ్మకుండా ఉంటే అదన్నా అట్లా ఉండేది. ఆరిపోయే దీపాలు ఎట్లాగో ఆరిపోతాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ పిల్ల పేరున డబ్బులూ కరిగిపోయాయి. ఎవరికి మాత్రం పట్టింది? అయినా చూసి చూసి ఈ శనినెవరు నెత్తిన పెట్టుకుంటారు?’ అంటూ చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ల మాటలకు ఒళ్లు గగుర్పొడిచింది ప్రియాంకకు. వాళ్లను అడగడం అనవసరమనుకుని.. జాబిల్లి కోసం చుట్టూ చూసింది ప్రియాంక.
బిక్కు బిక్కు మంటూ గోడకు ఆనుకుని నిలబడి ఉంది… బుగ్గలపై కన్నీటి చారికలు ఎండిపోయి ఉన్నాయి. ఎవరూ స్నానం కూడా చేయించినట్లు లేరు.. వాళ్ల నోటికి దడిచి ఊళ్లో వాళ్లు కూడా ఎవరూ అటువైపు వచ్చినట్లు లేరు. ప్రియాంకను అప్పుడే కళ్లెత్తి చూసింది.. వెంటనే.. ‘ఆమ్మా! అంటూ వచ్చి ప్రియాంకను చుట్టుకుపోయింది.’ ప్రియాంక మొకాళ్లపై కూర్చుని జాబిల్లిని గుండెలకు హత్తుకుంది. పెద్దగా ఏడ్చేసింది జాబిల్లి. కొద్దిసేపు ప్రియాంక కూడా కంట్రోల్‌ కాలేకపోయింది.
కొద్దిసేపయ్యాక ప్రియాంక తేరుకుంది..
ఏంట్రా! నేనొచ్చాశాగా..! అంటూ జాబిల్లి వీపు నిమిరింది ప్రియాంక. ‘అమ్మ నాన్న దగ్గరకు వెళ్లిందంట’ అమ్మమ్మ అంటోంది. నేను బాగా చదువుకున్నాకే నాన్న వస్తాడు. మరిప్పుడు నాన్న వస్తాడో? రాడో.. అమ్మ ఎప్పుడొస్తుందో..?’ అంటున్న జాబిల్లి అమాయకత్వానికి ప్రియాంకకు గుండెను పిండేసినట్లయ్యింది. జాబిల్లిని తీసుకొని ఇంట్లోకి వెళ్లింది..
అప్పటికే అక్కడొకామె ప్రియాంక గురించిన విషయాలు జాబిల్లి అమ్మమ్మవాళ్లకు చెప్పింది.
బట్టలు, టవల్‌ తీసుకొచ్చి జాబిల్లికి స్నానం చేయించింది ప్రియాంక. పాపను తీసుకువెళ్తాను అంది ప్రియాంక. అన్నీ మమ్మల్ని అడక్కుండానే చేస్తున్నావుగా.. తీసుకెళ్లు.. ఆ పాపిష్టి దానికోసం ఎవరూ ఇక్కడ ఆరాటపడటం లేదు’ అన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన జాబిల్లి మేనమామ. మరో మాట మాట్లాడకుండా జాబిల్లిని ఎత్తుకుని ఇంటికి వచ్చేసింది ప్రియాంక. అప్పటికే ప్రియాంక నిర్ణయాన్ని తల్లిదండ్రికి చెప్పేసినట్లున్నాడు ప్రమోద్‌.
అందరూ మౌనంగా ఉన్నారు.
కొద్దిసేపటి తర్వాత ప్రియాంకే ఆ నిశ్శబ్ధాన్ని బద్దలు చేస్తూ… ‘నేను తీసుకున్న నిర్ణయం తప్పా మామయ్యా?’ అడిగింది ప్రియాంక. ‘తప్పేం లేదమ్మా! నీ నిర్ణయాన్ని జీర్ణించుకోవడానికి కొంత కాలం పడ్తుంది. ఎంతైనా ఈ ఊరి వాతావరణం వేరు. నీ మనస్సంత విశాలంగా ఇక్కడ మనస్తత్వాలు లేవమ్మా…! నువ్వొచ్చాక ఊరిలో కూడా కొంత మార్పు తీసుకొచ్చావు.. మాలోనూ మార్పు తెచ్చావు.. ఇంతకుముందైతే.. మేం అంగీకరించినా చుట్టూ ఉన్నోళ్లు కాకుల్లా పొడిచేవాళ్లు.. వాళ్లల్లో మనమనుకున్నంత మార్పు వచ్చిందో లేదో రేపు ఈ విషయం బయటకు తెలిస్తేగానీ ఏ సంగతీ తెలియదు..’ అన్నాడు వెంకటయ్య.
చాలా మితంగా మాట్లాడే మామగారు.. అలా అనేసరికి ఆయన పట్ల ప్రియాంకకు మరింత గౌరవం కలిగింది.
అక్కడే ఉంటే ఎక్కడ జాబిల్లిని తీసుకెళ్లమంటారోనని వాళ్ల అమ్మమ్మ వాళ్లు ఆ రోజు తెల్లారే సర్దుకొని వెళ్లిపోయారు.
తెల్లవారితే జాబిల్లితో ప్రియాంక, ప్రమోద్‌ ప్రయాణం.
ఊరంతా తెలిసింది ఈ విషయం..
అందరూ వారి నిర్ణయాన్ని అభినందించారు.. ఇలాంటి పని ఊరికే గర్వకారణం అన్నారు.
000
ఒకరోజు….
‘… మనకింక పిల్లలు వద్దు ప్రమూ…!’ గోముగా అడిగింది ప్రియాంక! ‘అదేంటి?’ అన్నాడు ప్రమోద్‌. ‘మనకు జాబిల్లి ఉంటే.. ఇంకెందుకు మన జీవితమంతా వెన్నెలే కదా!’ అంది ప్రియాంక.. ప్రియాంక మానవత్వానికి కదిలిపోయాడు ప్రమోద్‌. వెంటనే ఆమె ముందు మోకరిల్లాడు. చప్పున లేచిపోయింది ప్రియాంక.. ‘నో…. ప్రమూ… ఏంటిది…’ అంటూ తనూ మోకాళ్లపై కూర్చుని ప్రమోద్‌ను గుండెలకు హత్తుకుంది…
‘అమ్మా… నాన్న ఏడుస్తున్నారా…?’ అంటూ జాబిల్లి రావడంతో వాళ్లు సర్దుకుని.. ‘ఏం లేదురా..?’ అంటూ జాబిల్లిని తీసుకొని టెర్రెస్‌మీదకు వెళ్లారు ఇద్దరూ.. జాబిల్లిని ఎత్తుకుని ముద్దాడింది ప్రియాంక. ప్రియాంకను ముద్దు పెట్టుకుంది జాబిల్లి. వారి పారవశ్యాన్ని చూసి పరవశించిన జాబిలమ్మ వెన్నెలను కురిపించింది..
ఆ ఆపురూప దృశ్యాన్ని తన కెమేరాలో బంధించాడు ప్రమోద్‌.
- శాంతిశ్రీ

ప్రకృతి

అబ్బ పొద్దున పొద్దున్నే చెమటలు ఎట్టా దిగకారుతున్నాయో….. ఒకటే ఉబ్బరించేస్తోంది…
పొద్దున్నే ఎక్కడే.. పది కొట్టింది టైము… అన్నాడు రత్తయ్య.
ఇప్పుడే ఇట్టా ఉంటే ముందు ముందు ఇంకెట్టా ఉంటుందో.. పైటకొంగు తీసుకొని మెడ, ముఖమూ తుడుచుకుంటూ అంటోంది లక్ష్మమ్మ.
భూమి ఎడెక్కిపోతోందంటే…. మరి ఇక ముందు ముందు ఎండలు ఇట్టాగే మండిపోతాయి.. అన్నాడు రత్తయ్య.
అట్టాగా మామా..! భూమి ఎడెక్కి పేలిపోద్దా..? నోరంతా తెరిచి ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మమ్మ.
ఓసీ ఎర్రిమొఖమా..! పేలిపోద్దో లేదో గానీ.. పెద్ద పెళయం వస్తదేమో.. అన్నాడు రత్తయ్య.
అమ్మో ఎట్టా..? మనమంతా చచ్చిపోతామా మామా? భయంగా కళ్లింత చేసి అడిగింది లక్ష్మమ్మ!
ఓసి పిచ్చి లచ్చిమీ! పాణమంటే ఎంత తీపే నీకు.. అన్నాడు రత్తయ్య
అబ్బో.. నీకు లేదేంటి పాణమీద తీపి..? మూతి తిప్పింది లక్ష్మమ్మ.
ఈ అగ్గికి పాణం ఎట్టాగో అయిపోతోంది… ఏం తినాతి కావడంలేదు… అయినా తప్పుద్దా..? అంటూ చేను దగ్గర నుండి తెచ్చిన ములక్కాయలను, కత్తిపీట, ఉల్లిపాయలు అన్నీ ముందేసుకుని కూర్చుంది లక్ష్మమ్మ.
ఏం కూరే..? అడిగాడు రత్తయ్య.
కనపడట్లా.. అంత పొడుగ్గా.. ములక్కాయకూర.. అంది విసుగ్గా లక్ష్మమ్మ…
ఓసోసి ఎందుకే అంత ఇసుగు… ములక్కాయలు కనపడతున్నాయిలే.. ఆటితో ఏం కూర చేత్తన్నావని…? ఎండి చేపలుగానీ, ఎండిరొయ్యల గానీ ఉంటే నాలుగు తగిలించు కొంచెం వాసనన్నా తగులుద్ది అన్నాడు రత్తయ్య.
అబ్బో.. ఈ రుచులకేం తక్కువలేదు.. హుహూ.. హుహూ.. అంది లక్ష్మమ్మ….
అబ్బ ఎంత నిగ్గే నీకు.. రేపు ఆదివారం పచ్చిరొయ్యలు తెస్తాగానీ.. దొడ్డేపు చింతచెట్టుకి చిగురు బాగా ఏసింది.. కాసింత చింతచిగురేసి వండవే చాలా బాగుంటుంది అన్నాడు రత్తయ్య.
అబ్బో… ఏంటో మా రుచులు పోతున్నావు.. ఏంటీ మామా… కతా..?
కతా లేదు కాకరకాయా లేదే.. తినాలనిపించింది అడిగా.. నీకోపికుంటే చేసిపెట్టు.. నీ ఇట్టం.. అన్నాడు రత్తయ్య..
అబ్బో మాలోవు పువరుసమండీ… నేనేమ్మా చేయనన్నానా..ఏంది?.. కోపంగా అంది లక్ష్మమ్మ…
ఓసోసి ఏంటే ఆ ముక్కుపుటాలలా ఎగరేస్తూ .. అబ్బో బుగ్గలు చూడు మందారాలు పూసినట్లున్నారు… చతురాడాడు రత్తయ్య.
మూతి మూడు తిప్పులు తిప్పి… చెంగు ఒక్క దులుపు దులిపి నడుంచుట్టాతా తిప్పి బొడ్లో దోపుకుని కూరగాయ ముక్కలు తీసుకొని వంటింట్లోకి దారి తీసింది లక్ష్మమ్మ…
వెనకే వెళ్లాడు రత్తయ్య..
అవ్వ.. వదులు మామా… ఏంటి? పట్టపగలూ.. పగలు రేత్రికి తేడాలేకుండా..అయినా ఈ వయస్సులో.. అంటూ గింజుకుంటుంది లక్ష్మమ్మ….
నిన్నట్టుకోవడానికి పగలు.. రేత్రి చూడాలేంటే..? అన్నాడు మురిపెంగా రత్తయ్య.
అబ్బ వదులు మామా..! అన్నం తిని నువ్వు మళ్లీ పొలం ఎల్లాలి.. గుర్తు చేసింది లక్ష్మమ్మ…
లక్ష్మి మాటలకు పనులు గుర్తుకొచ్చి.. ఆ.. ఆ… తొందరగా కానీ… నేను కాళ్లూ చేతులు కడుక్కొస్తా.. అంటూ చింతచెట్టుకింద తొట్టికాడకి వెళ్లాడు.
అన్నం పళ్లెంలో పెట్టి, చిన్న గిన్నెలో కూరేసి పళ్లెంలోనే పెట్టి దోసకాయ చెంబుతో నీళ్లు తీసుకొని… ‘మామా…! మామా…! ఏడున్నా..?’ అంటూ పిలిచింది లక్ష్మమ్మ…
‘ఈడే ఉన్నానే.. ఈ చింతచెట్టు కిందే చల్లగా ఉంది ఇక్కడే తింటా’ అని బదులిచ్చాడు రత్తయ్య.
పళ్లెం తీసుకొని అటువైపు వెళ్లింది లక్ష్మమ్మ. నులకమంచం వాల్చుకుని కండవ తలకింద చుట్టి పెట్టుకొని పడుకొని ఉన్నాడు రత్తయ్య.
లే మామా..! అన్నం తిను.. వేళవుతోంది.. అని పళ్లెం రత్తయ్యకు అందించి.. తనూ పళ్లెంలో అన్నం పెట్టుకొని తెచ్చుకొంది.
మంచం దగ్గరే కిందే కూర్చొని అన్నం తింటూ..’బాగుందా మామా కూర?’ అడిగింది లక్ష్మమ్మ.
ఆ ఎండిచేపలు ఏసావు కాబట్టి కాసింత ముద్ద దిగుతుంది అన్నాడు రత్తయ్య.
ఎండిచేపలవల్లేగానీ.. కూర బాగోలేదన్నమాట..? గునిసింది లక్ష్మమ్మ.
ఓయబ్బా ఏం కోపమే… నువ్వు ఏదొండినా బాగుంటదే… మురిపెంగా అన్నాడు రత్తయ్య.
పళ్లెం తొట్టికాడ పెట్టి, చేయి కడుక్కొని, చెంబుడు నీళ్లూ తాగి, కండవా దులుపుకుని తలకు చుట్టుకున్నాడు. లక్ష్మమ్మ ఇచ్చిన ప్లాస్టిక్‌ బాటిల్‌ అందుకుని, ‘ఈ సీసాకు ఆ తడిగుడ్డ చుట్టబట్టి నీళ్లు ఏడెక్కకుండా ఉంటున్నాయో.. అంటూ ఏమైనా నీ బుర్ర బాగా పదును’ అంటూ మెచ్చుకున్నాడు రత్తయ్య.
మామెంక మురిపెంగా చూస్తూ… ‘పెందరాళే రా మామా..!’ అంటూ సాగనంపింది.
000
ఓ మామా! ఈ ఇడ్డూరం ఇన్నావా?
మొన్న నువ్వు చెప్పినట్లు భూమి బాగా ఏడెక్కి పోతుందంట మామా? ఇంకా రెండు పాయెంటీలు పెరిగితే అంతేనంట…
అంతే అంటే ఏంటే.. పెళయం వచ్చేస్తదా..? అయినా ఇదవరకటిలా లేదే పరిస్థితి..అంతా మారిపోయినాదే.. మనుషుల్లో స్వార్థం పెచ్చుమీరిపోనాది.. చానా మార్పు వచ్చేసినాదే.. అదే ఈ విపరీతానికి దారితీసింది.. అన్నాడు రత్తయ్య..
ఏంటి మామా.. ఏదాంతం మాటాడుతున్నా..? అడిగింది లక్ష్మమ్మ.
ఏదాంతం కాదే.. ఎదార్థం.. అన్నాడు రత్తయ్య.
ఏంది మామా..? నువ్వేమంటున్నావో.. నాకొక్కటి తలకెక్కడంలా.. కాసింత అర్థమయ్యేలా చెప్పు మామా.. అంది లక్ష్మమ్మ.
ఏం లేదే.. మన మనుసులు చాలా ఇరుకైపోయినాయే.. ఇదివరకటిలా లేదే జీవనం.. అన్నాడు రత్తయ్య.
అవును మామా నువ్వు చెప్పేది నూటికి నూరు శాతం కరెట్టు మామా..! అంది లక్ష్మమ్మ.
ఇదివరకు ఎవరికేమన్నా అయినా పదిమందీ ఆదుకొనేవారు..
అదిగాదే.. పిచ్చిమొఖమా.. అయ్యెట్టాగో మారిపోయినాయిలే.. జీవనంలో మార్పు రాబట్టే మన సంబంధాల్లోనూ మార్పులొచ్చాయి..
మరి నేనూ అదేగదా చెప్పేది కాసింత కోపంగా అంది లక్ష్మమ్మ.
ఇద్దరూ నాది కరెక్టు అంటే నాది కరెక్టు అనుకుంటుండగా..
హైదరాబాద్‌లో ఉన్న కొడుకు కూతురు మమత వచ్చింది. మొన్ననే పదోతరగతి పరీక్షలు రాసింది. వస్తూనే ‘ఏంటి నానమ్మా? ఏంటి విషయం?..’ అంది మనవరాలు మమత.
అది కాదమ్మారు..! నువ్వు చెప్పు మీ తాతేమో మన జీవనం మారిపోనాది అందుకే భూమి ఎడేక్కిపోతుందంటున్నాడు.
నేనేమో మనషుల మధ్య పేమలు తగ్గిపోయినాయి.. ఇదివరకటిల్లా లేరు అంటున్నా.. ఎవరిది కరెక్టో చదువుకున్నదానివి నువ్వు చెప్పమ్మారు.. అంటూ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. లక్ష్మమ్మ.
చేతిలో బ్యాగు అందుకుని అరుగుమీద పెడుతూ కాసింత పిల్లను కూర్చోనియ్యవే.. అంతదూరం నుండి పెయానం చేసి వస్తే..ఆనక్కి అన్నీ చెప్తుందిలే.. అంటూ ‘అలా పొలం ఎల్లి వత్తానమ్మా..!’ అంటూ మనమరాలి బుగ్గలు సవరదీస్తూ.. కండవా తలకు చుట్టుకుని బయల్దేరాడు రత్తయ్య.
000
భోజనాలయ్యాక లక్ష్మమ్మ గిన్నెలన్నీ సర్దుకుని వచ్చేలోపు…
అందరికీ ఆరుబయట మంచాలేశాడు రత్తయ్య.
తాతా, మనమరాలు కబుర్లు మొదలుపెట్టారు..
అమ్మారు.. నేనొచ్చే వరకూ విషయాలేమీ తాతకు చెప్పబోకు.. అంది లక్ష్మమ్మ.
అలాగే నానమ్మా.. ఏమీ చెప్పటం లేదు.. ఊరికే మాట్లాడుకుంటున్నాం అంది మమత.
మనిషి అక్కడ ఉంది గానీ.. దాని పాణమంతా ఈడే ఉందమ్మా.. అన్నాడు రత్తయ్య..
వూరుకో తాతయ్య.. పాపం నానమ్మ! అన్నీ సర్దుకుని రావాలిగా.. తనకూ విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది గదా?’ అంది మమత.
నానమ్మను బాగానే ఎనకేసుకొస్తున్నావుగా..? అంటూ మనమరాల్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు రత్తయ్య.
నేను చెప్పింది నిజమా? కాదా? చెప్పు తాతయ్యా? అంటూ నిలేసింది మనమరాలు.
నువ్వు చెప్పిందే నిజమమ్మా! అంటూ వచ్చి మంచం మీద కూర్చొంది లక్ష్మమ్మ.
ఇక మనం మాట్లాడేదేమీ లేదు.. అంటూ ఉడికించాడు రత్తయ్య
అబ్బో…. ఇప్పుడుదాకా వసపిట్టలా మాట్లాడింది ఎవరో.. అంటూ.. అదిసరేగానమ్మారు.. భూమి ఏడెక్కడం ఏమిటి? ఏంటో ఇంకా రెండు పాయింటీలు దాటితే మనమంతా అంతేనంటగా..? ఆదుర్దాగా అడిగింది లక్ష్మమ్మ.
నానమ్మ ఆందోళనకు ఒకింత ఆశ్చర్యపోతూనే అమాయకంగా అడుగుతున్న తీరు నవ్వుకూడా తెప్పించింది మమతకు.
అదేంకాదుగానీ నానమ్మా! నువ్వు ఉదయం చెప్పావే.. మనసులు మారిపోయారనీ.. తాతయ్య మన జీవనం మారిపోయిందనీ.. ఇద్దరూ చెప్పిందీ కరెక్టే..
నా తల్లే.. ఇద్దరికీ పేచీలేకుండా ఎంచక్కా చెప్పావమ్మా.. అంటూ మనమరాల్ని ముద్దాడింది లక్ష్మమ్మ.
అసలు సంగతేంటంటే… అంది మమత..
ఆ ఏంటమ్మా.. అసలు సంగతి..? ఆత్రుతగా అడిగింది లక్ష్మమ్మ.
అమ్మాయిని చెప్పినివ్వవే.. మధ్యలో ఎదురు ప్రశ్నలు ఎయ్యబోకా..? అన్నాడు రత్తయ్య..
అదేంలేదులే తాతయ్య మధ్యలో సందేహాలుంటే తీర్చుకోవాలి కదా! అడగనీ.. మా భారతి టీచర్‌ అలాగే చెప్తారు. అంది మమత.
అద్గదీ అలా చెప్పమ్మారు.. మీ తాతకు పెశ్నేస్తే మా ఇసుగు.. అంటూ లక్ష్మమ్మ ముసిముసిగా నవ్వుకుంది.
చాల్లే సంబడం.. సరే నువ్వు చెప్పమ్మారు.. అన్నాడు రత్తయ్య.
తాతయ్య చెప్పినట్లు మన జీవనంలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు మనం వంట చేసుకోడానికి కట్టెల పొయ్యలు వాడేవాళ్లం. ఇప్పుడు గ్యాస్‌, ఎలక్ట్రికల్‌ స్టౌవ్‌లు వచ్చాయి. మనం వండుకునే పాత్రల్లోనూ తేడా వచ్చేసింది. మనం తాగే మంచినీళ్ల సీసాల నుండి స్నానం చేసే బకెట్‌ల వరకూ ప్లాస్టిక్‌వే వాడుతున్నాం కదా! అలాగే ఇదివరకు మన విషయాలు వేరే ఊళ్లో వారికి తెలియాలంటే ఉత్తరాలు రాసేవాళ్లం. ఇప్పుడా ప్రతి ఒక్కరికీ సెల్‌ ఫోన్‌. అలాగే పల్లెల్లో ఇంటికి కనీసం ఒక చెట్టయినా ఉండేది ఇదివరకు. ఇప్పుడు పల్లెల్లో కూడా అందరూ నాపరాయి వేయించేసుకుని, మేడలు కట్టేస్తున్నారు. ఒక్క చెట్టన్నా ఉన్న ఇల్లు వేళ్లమీద లెక్కపెట్టాలి.
నిజమే..ఆహా.. ఏం చెప్పావమ్మా… అన్నాడు రత్తయ్య..
ఇవేమీ అర్థంకాని లక్ష్మమ్మ… అవన్నీ వాడుకోవడానికి, చెట్లు లేకపోవడానికి భూమి ఏడెక్కడానికి ఏమిటీ సంబంధం? అంటూ అడిగింది.
అందుకే నిన్ను ఎర్రిమొగమనేది అన్నాడు రత్తయ్య..
అదిగో చూడమ్మా మీతాతయ్య ఇసయం తనకు అర్థమైతే చాలా? నాకర్థం కానక్కర్లేదా? అంటూ మూతి ముడుచుకుంది.
ఆగు నానమ్మా.. నేను చెప్తాకదా?
ఈ ప్లాస్టిక్‌వి విరిగిపోయావనుకో నువ్వేం చేస్తావ్‌? చెత్తలో పడేస్తావ్‌. ఇదివరకు చిన్న చిన్న జాడిలు ఉండేవి అవి పగిలిపోతే…
అవీ చెత్తలోనే వేసేదాన్ని అంది లక్ష్మమ్మ.
ఓకే.. అయితే జాడి కొన్నిరోజులకు మట్టిలో కలిసిపోతుంది. ఈ ప్లాస్టిక్‌ ఎన్నాళ్లయినా మట్టిలో కలవదు. దానివల్ల వాతావరణంలో విషవాయువులు వస్తాయి. అంతెందుకు ప్లాస్టిక్‌ కవర్ల వాడకం ఇటీవల బాగా పెరిగిపోయింది కదా? అవి కూడా అంతే మట్టిలో కలవు. అలాగే చెట్లు లేకపోతే మనం పీల్చే గాలిలో ఆక్సిజన్‌ తగ్గిపోతుంది. ఆక్సిజన్‌ మనకు ప్రాణవాయువు. అది తక్కువైతే మనకు రోగాలు వస్తాయి. ఈ భూమి వేడెక్కడానికి అవీ కారణమే.
అవునా..! ఆశ్చర్యంగా అడింది లక్ష్మమ్మ.
అంతేకాదు నానమ్మా! పట్టణాల్లో అయితే చాలావరకూ ఇళ్లల్లో ఫ్రిజ్‌లు, కొంచెం ఉన్నవాళ్ల ఇళ్లల్లో అయితే ఏసీలు తప్పనిసరి. వాటివల్ల వాతావరణంలో వేడి బాగా పెరుగుతుంది. అలాగే ఉత్తరాలు మనం చదివాక కొన్నాళ్లకు పారేసినా అది మట్టిలో కలిసిపోతుంది. అదే సెల్‌ఫోన్‌ పాడైతే… అది భూమిలో కలవదు. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటిలోని లెడ్‌ అనే పదార్థం మన శరీరంలోకి మనకు తెలియకుండానే వెళ్లిపోతుంది. సెల్‌ఫోన్లు ఎక్కువ వాడే చోట్ల ఈ విషయాన్ని ఇటీవలే కనిపెట్టారు.
అబ్బో.. నీకు చాలా విషయాలు తెలుసమ్మా.. అంటూ రెండు చేతులతో ఈ చెంపా, ఆ చెంపా సవరదీసి మొటికలు విరిచింది లక్ష్మమ్మ.
అవును నానమ్మా! అలాగే మన తాతయ్య బియ్యం ఇదివరకు గోతాముల్లో పోసేవాడు. ఇప్పుడు వాటికీ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు వచ్చాయి. గోతాములైతే మట్టిలో కలిసిపోతాయి. అదే ప్లాస్టిక్‌ బ్యాగులు మట్టిలో కలిసిపోవు.
ఈ వస్తువుల వాడకం మన జీవనంలో చాలా మార్పు తెచ్చింది. అలాగే నువ్వన్నట్లు మనుషుల్లోనూ చాలా మార్పు వచ్చింది. ఇది వరకటి మనుషులు మన ముందు తరాలు బాగుండాలని కోరుకునే వారు. ఇప్పటి మనుషుల్లో బాగా స్వార్థం పెరిగిపోయింది. ఎవరి ఇంటి సంగతి వారు.. చివరకు ఎవరి సంగతి వారు చూసుకుంటున్నారు.
అవునమ్మా! ఇంటి ఎనకాల చింతచెట్టు, మామిడి చెట్టు మీతాత నాన్న నాటాడు. ఇప్పుడు బాగా ఏపుగా పెరిగి కాయలు కాస్తుంటే మేము తిన్నాం, మీరు తింటున్నారు. నిజమే వెనకటోళ్లు ముందుతరాల గురించి ఆలోచించేవాళ్లు.
నీకివన్నీ ఎట్టా తెలిసాయే అమ్మారు.. ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మమ్మ..
పేపర్లో వస్తాయి.. మా భారతీ టీచర్‌ ఇలాంటివన్నీ బాగా చెప్తారు.
అసలు దేశాల్లో కూడా మార్పు వచ్చింది నానమ్మా.. అసలు ఇలా వాతావరణం వేడెక్కడానికి మన దేశమే కారణం కాదు. పెద్ద పెద్ద దేశాలున్నాయే.. అమెరికాలాంటి దేశాలు ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాయి..
అవును అక్కడ పెతొక్కళ్లకీ, కారు, పిజ్‌, చల్లగా ఉండే మిషన్‌ అన్నీ ఉంటాయంటాగా..? అంది లక్ష్మమ్మ.
అబ్బో.. మీ నానమ్మకు చాలా తెలిసమ్మారు.. అమెరికా ఎల్లొచ్చినట్లే ఎట్లా చెపుతుందో.. చతురగా అన్నాడు రత్తయ్య.
అబ్బో నీకే తెలుసు అన్నీ.. అట్లా వెటకారమాడితేనే కోపమొచ్చేది.. అంటూ మూతి తిప్పింది లక్ష్మమ్మ.
అబ్బో మీ నానమ్మకు కోపమొచ్చిందమ్మారు.. అన్నాడు రత్తయ్య..
‘మరి నానమ్మను నువ్వు అలా అనడం తప్పే తాతయ్య’ అంది మమత.
అద్గది అట్టా బుద్ధిచెప్పు అమ్మారు! మీ తాతకి… సరే విషయం చెప్పు చానా పొద్దుపోయింది.. అంది లక్ష్మమ్మ.
అమెరికాలాంటి వాళ్లు కార్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇలా అనేక మిషన్లు వాడటం వల్ల అక్కడ వాతావరణంలో విషపదార్థాలు మనకన్నా మూడురెట్లు ఎక్కువ విడుదలవుతాయి. అవి అలా అలా గాలిలో కలిసి మొత్తం భూగోళం వేడెక్కడానికి కారణమవుతాయి. మన మనుషుల మనస్తత్వాల్లో ఎంత మార్పు వచ్చిందో ఆ అమెరికాలాంటి దేశాలు అంతే.. ఎక్కువ నష్టం చేసేది వాళ్లయినప్పుడు దాన్ని పూడ్చడానికి ఎక్కువ ఖర్చూ వాళ్లే పెట్టాలి కదా? అంది మమత.
అవును అది నాయం కూడా.. అన్నాడు రత్తయ్య.
అవునవును అంది లక్ష్మమ్మ.
చదువుకోకపోయినా మీకు ఇంత బాగా అర్థమవుతుంది. ఆ అమెరికాలాంటి దేశాలు మాత్రం అలా కుదరదూ అందరం సమానంగా ఖర్చుపెడదాం అంటోంది.
అర్థంకాక కాదమ్మా.. ఎదటోళ్ల మీద నెట్టేసి కాలుమీద కాలేసి కూకుంటానికీ.. అన్నాడు రత్తయ్య.
కరెక్ట్‌ తాతయ్య.. మా టీచర్‌ కూడా ఇదే విషయం చెప్పింది. అందుకే మనుషులైనా, దేశాలైనా.. ఆలోచనల్లో మార్పు రావాలి. ఎదుట మనిషిబాగు కోరాలి.. అందరం ఒకటి అనుకోవాలి. అప్పుడే ఇది బాగుపడుతుంది అని చెప్పటం ముగించింది మమత.
ఆ అలా జరుగుద్దంటావా? ఆందోళన అడిగింది లక్ష్మమ్మ.
ఎందుకు జరగదు నానమ్మా.. మొన్న బొలీవియా అనే దేశంలో మళ్లీ సదస్సు పెట్టి ఈ భూమాతను మనమందరం కాపాడుకోవాలని అందరూ అందుకు కట్టుబడాలని నిర్ణయించుకున్నారు. అలా జరగకపోతే ప్రకృతి వికృతిగా మారుతుంది. ఆ వైపరీత్యాలే ఇంత ఎండల్లో అకాల వర్షాలు.
అవునా.. నిజమే ఈ భూమాతను నమ్ముకున్నోడు ఎన్నడూ నష్టపోడమ్మా.. మరి అలాంటి భూమాతకే కష్టాలొచ్చినప్పుడు.. మనమంతా కలిసి దాన్ని కాపాడుకోవల్సిందే.. అలా జరిగితే నువ్వు చెప్పినట్లు అంతా మంచే జరుగుతుంది.. అన్నాడు రత్తయ్య..
‘ప్రకృతిని కాపాడుకోకపోతే దాని కోపానికి మనమంతా మట్టిలో కలిసిపోవాల్సిందే.. అమ్మాయి ఎంతబాగా చెప్పిందో..’ అంటూ మనమరాల్ని మెచ్చుకుంటూ..’పొద్దుననంగా వచ్చావు. రాత్రి పయానంలో నిద్రపట్టిందో లేదో.. పొడుకోమ్మా… చాలా మంచి విషయాలు చెప్పావు.. రేపు మనోళ్లందిరికీ ఈ విషయాలు చెప్పాలి.. పొడుకో తల్లీ..!’ అంటూ తనూ మంచం మీద నడుం వాల్చింది లక్ష్మమ్మ.
- శాంతిశ్రీ

స్ఫూర్తి

మంచు బాగా కురుస్తుంది.. ఒకరికొకరు కనపడటం లేదు. బాగా దగ్గరకు వస్తే గానీ ఒకరి ముఖాలు ఒకరికి కనబడవు. అందులో ఈ చలికి దుప్పట్లు తలమీద నుంచి కప్పేసుకోవడంతో దగ్గరగా వచ్చినా గుర్తుపట్టలేని పరిస్థితి. ఆకాశంలో మబ్బులు నేలమీద ఉన్నాయా అన్నట్లు ఉంది వాతావరణం.
కోడి కూయక ముందే లేచాడు సుబ్బయ్య. గడియారం రెండు కొట్టింది. ఆ మబ్బులో వెళితేగానీ బంతి పూలు కోసి మార్కెట్‌కు వేయడానికి కుదరదు మరి. గట్టిగా ఎత్తి పడేస్తే పార్టులన్నీ ఊడిపోయేలా ఉన్న సైకిల్‌ను తీసుకొని పై పంచను చెవుల మీదుగా తలంతా చుట్టి, చూరులోని వేప పుల్లను తీసుకొని నోట్లో పెట్టుకొని బయల్దేరాడు సుబ్బయ్య. సైకిల్‌ నడుపుతూ ఉంటే కిర్రు కిర్రుమని చప్పుడు వినిపిస్తోంది. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఈ మంచువల్ల రోడ్డు అస్సలు కనపడటంలేదు. ఎంతో కష్టంగా వెళుతున్నాడు సుబ్బయ్య. ఎట్టకేలకు పొలం చేరాడు.
పూలు కోయడానికి అప్పటికే అక్కడకు వచ్చి ఉన్న రంగడితో..
‘ఏరా రంగడూ ఎంతసేపైంది వచ్చీ…’ అన్నాడు సుబ్బయ్య
‘ఇప్పుడే వచ్చా పెదనాన్నా!…’ అన్నాడు రంగడు.
ఇద్దరూ కలిసి బంతిపూలను కోయడంలో మునిగిపోయారు. పూలన్నీ తెంపడానికి రెండు గంటలు పట్టింది. నోట్లో వేపపుల్లను ఒకసారి పళ్లన్నింటిమీద రుద్దేసి తుపుక్కున ఊసాడు సుబ్బయ్య. దాన్ని నిలువుగా చీల్చి నాలుక గీసుకొని కాలువ దగ్గరకు వెళ్లి దోసిట్లో నీళ్లు తీసుకొని నోట్లో పోసుకొని పుక్కిలించి ఊసాడు. మరో దోసలితో నీళ్లు తీసుకొని ముఖం కడుక్కొన్నాడు. ఆ తర్వాత తెంపిన పూలన్నీ తడిపి ఉంచిన పల్చటి గోనె సంచిలో వేసి సైకిల్‌ వెనకాల పెట్టుకొని పూలమార్కెట్‌కు బయల్దేరాడు సుబ్బయ్య. అక్కడకు వెళ్లాక పూలన్నీ టోకుగా కొనే మస్తాన్‌కు ఇచ్చాడు సుబ్బయ్య. మస్తాన్‌ ఇచ్చిన డబ్బులు లెక్కేసుకుంటే రంగడు ఇవ్వగా తనకు మిగిలేది చాలా తక్కువ అనిపించింది సుబ్బయ్యకు. ‘ఎంత కష్టపడినా ఫలితం ఇంతే’ అని గొణుక్కుంటూ..
‘కేజీకి ఒక రెండు రూపాయలు పెచ్చివ్వరాదూ’ మస్తాన్‌ని అడిగాడు సుబ్బయ్య. ‘అసలే మంచు కురుస్తుంది. ఆ తడికి పూలు బరువు ఎక్కువవుతుంది. నాకే లాసు సుబ్బయ్యా!.. ఇంకా పెచ్చెక్కడివ్వను..’ ‘మీకస్సలు లాభమే లేదన్నట్టు చెబుతావేంటి సేటు.. ‘అన్నాడు సుబ్బయ్య.
‘లాభం లేకపోతే ఇంక వ్యాపారం ఏం చేస్తాం సుబ్బయ్యా? కాకపోతే ఈసారి చూద్దాంలే.. ఇవ్వాల్టికి ఇంతే ఇచ్చేది’ ఖచ్చితంగా చెప్పాడు మస్తాన్‌. ‘ఈ సారైనా ఇస్తావో.. ఇంకేం కతలు చెప్తావో.. ఏమైనా నా రాత బాగోలేదులే…. మేం ఎంత కట్టపడ్డా ఆఖరుకు ఏమీ మిగల్టంలేదు. సరే వస్తా మరి…!’ అన్నాడు సుబ్బయ్య.. ‘మంచిది సుబ్బయ్యా…!’ అని ఎక్కడ ఎక్కువ ఇమ్మని పట్టుపడతాడో అనుకున్నా’ అని ఊపిరి పీల్చుకున్నాడు మస్తాన్‌.
సుబ్బయ్య ఇంటికి చేరేటప్పటికి టైము ఐదున్నర దాటింది. అప్పటికే పార్వతమ్మ లేచి పాచి ఊడ్చి, పేడకళ్లాపి చల్లి, ముగ్గులు పెట్టేసింది. గేదె దగ్గర బాగు చేసి పాలు తీసేసింది. సుబ్బయ్య వచ్చేటప్పటికీ టీ రెడీగా ఉంచింది. ఇవన్నీ పార్వతమ్మ లేచిన దగ్గర నుండి రోజూ చేసే పనులే.
సుబ్బయ్య సైకిల్‌కి స్టాండు వేసి, తలకు చుట్టిన పైపంచ తీసి బాగా దులిపి, భుజం మీద వేసుకొన్నాడు. పంచ చివరి అంచును చేత్తో అందుకొని బొడ్లో దోపుకొని కాళ్లూచేతులు కడుక్కొని కాళ్లు జాపుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని కూర్చున్నాడు.
‘ఏందయ్యా.. ఇవ్వాళ ఆలస్యమైంది’ అంటూ సుబయ్యకు టీ గ్లాసు అందిస్తూ అడిగింది పార్వతమ్మ.
వేకువజాము నుంచి చలిలో తడిసి ఉన్నాడేమో.. వేడి వేడిగా టీ తాగుతుంటే చాలా హాయిగా అనిపించింది సుబ్బయ్యకు. దాన్ని ఆస్వాదిస్తున్న సుబ్బయ్యకు పార్వతమ్మ మాట చెవిన పడలేదు.
‘ఏవయ్యోవ్‌.. నిన్నే అడిగేది.. ఏంటి ఆలస్యమైందని అడుగుతున్నా’ కాస్త గట్టిగా అరిచినట్లే అడిగింది పార్వతమ్మ.
‘ఏంటే.. ఓ అంతలా అరుస్తున్నావ్‌.. నాకేమన్నా చెముడనుకున్నావా..?’ అన్నాడు సుబ్బయ్య.
‘ఆ…నెమ్మదిగా చెపితే వినిపించుకోవుగానీ.. గట్టిగా చెపితే మాలావు కోపం వచ్చేస్తందే నీకు… నీతో నాకు చావుగా ఉందనుకో…’ అంది పార్వతమ్మ కాస్తంత విసుగ్గా.
‘ఆ అక్కడ ఆడుకొని వస్తున్నానే…!’ ఇంకాస్త రెచ్చగొట్టినట్లు మాట్లాడు సుబ్బయ్య..
‘ఆ.. ఆడుకో.. నాకేంటి?…’ అంటూ కొంగు దులుపుకుంటూ నడుంచుట్టూ తిప్పి బొడ్లో దోపుకుని వంటింట్లోకి వెళ్లి ఒక చట్టి (గిన్నె) తీసుకొని బయటకు వచ్చింది పార్వతమ్మ. ‘పొలం నుండి గోంగూర కొంచెం దొరికితే తెచ్చాను. కొంచెం ఎండ్రొయ్యలేసి వండు’ అన్నాడు సుబ్బయ్య. ‘చూశాములే.. ఈటికి మాత్రం లోటురానీవు…’ అనుకుంటూ ఆ గోంగూరలో కాడలు ఏరుతూ అక్కడే గోడకానుకుని కూర్చింది పార్వతమ్మ.
‘ఏమయినా వయస్సు ముదిరినా కోపం తగ్గటం లేదే నీకూ…’ అన్నాడు సుబ్బయ్య.. ‘నీకు తక్కువైందేంటీ నాకు తక్కువవడానికీ…’ అంటూ బదులిచ్చింది పార్వతమ్మ. ‘మాట మిగుల్చుకోవుగందా..? నాటి నుండి నీ వరసంతే..’ అన్నాడు సుబ్బయ్య. ‘ఒట్టి పుణ్ణానికి నేనెందుకు మాటపడాల….’ అంది పార్వతమ్మ.. ‘ఓసోసి… ఇక ఆపోసే…’ అన్నాడు సుబ్బయ్య.
‘సరేలే సంబడం గానీ… ఆ వీరన్న నీకోసం వచ్చెళ్లాడు…’ చెప్పింది పార్వతమ్మ. ‘ఏంటంటా సంగతి?’ అడిగాడు సుబ్బయ్య. ‘ఆనిక్కి పెద్దబావి కాడున్న మర్రిచెట్టు దగ్గరకు రమ్మన్నాడు.. అందరికీ.. ఏదో మీటింగంట…చెప్పాడు..’ అంది పార్వతమ్మ.
‘మీటింగ్‌ దేనికో..చెప్పలేదా వీరిగాడు…’ అన్నాడు సుబ్బయ్య. ‘పొలాల విషయమనుకుంటా….’ అంది పార్వతమ్మ
‘ఏం పొలాలో.. ఏం వ్యవసాయమో… ఏమోనే.. లాభం సంగతి దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి వస్తదో రాదో అన్న దిగులు కొన్నాళ్లయితే.. ఏసిన పంట మొలుత్తదో… మునుగుద్దో.. తెలియకుండా ఉంది ఈ వాన రాకడ.. పోకడ..’ నిట్టూరుస్తూ నులక మంచం వాల్చుకున్నాడు సుబ్బయ్య.
కండవానే మడిచి తలకింద పెట్టుకొని ఒడ్డిగిల్లాడు సుబ్బయ్య. అలా నిట్టూరుస్తూ పడుకున్న సుబ్బయ్యను చూస్తే ఉస్సూరుమనిపించింది పార్వతమ్మకు.
వారి మధ్య ఇటువంటి గొండాటలు మామూలే. ఇంత గొడవపడ్డా ఎంతో ఆప్యాయంగా ఉంటారు వాళ్లిద్దరూ. అర ఎకరం సొంతదైతే. రెండకరాలు కౌలుకు చేస్తుంటాడు సుబ్బయ్య. అరెకరంలో వరి పండిస్తూ, కౌలుకు తీసుకున్న రెండెకరాల్లో లిల్లీలు, బంతిపూలు, ఒక్కొక్కసారి అరటి వేస్తుంటాడు. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. వారికి పెళ్ళిళ్లు అయినా ఒకరి మీద ఆధారపడకుండా ఓపికున్నన్నాళ్లూ కష్టపడాలన్నది సుబ్బయ్య సిద్ధాంతం. అందుకే డెబ్భై ఏళ్లు మీదపడినా కష్టపడుతున్నాడు సుబ్బయ్య. చివరి పిల్ల పెళ్లి అప్పు, పొలం పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చటానికి భార్యాభర్తలిద్దరూ కష్టపడుతున్నారు. పార్వతమ్మ కూడా పొలం పనికెళ్లడమే కాకుండా ఒక గేదె పాడి చేస్తూ నాలుగైదు కుటుంబాలకు పాలమ్ముతోంది.
000
వంటపని ముగించుకొని, తల దువ్వుకొని, సుబ్బయ్యకు, తనకూ క్యారేజీ కట్టుకొని ‘లేవయ్యా.. ఎండెక్కుతుందీ…’ అంది పార్వతమ్మ.
దిగ్గున లేచి.. తొట్టి దగ్గరకెళ్లి చెంబుతో నీళ్లు తీసుకొని చేతులోకి వంచుకొని మొహం మీద పోసుకున్నాడు సుబ్బయ్య. దబా దబా ముఖం రుద్దుకొని, పై పంచతో ముఖం తుడుచుకొని పార్వతమ్మ చేతిలోని క్యారేజీ అందుకుని ‘ఎండ్రొయ్యలు మరిన్ని వేశావా?’ అన్నాడు సుబ్బయ్య.
‘ధరలు మండిపోతుంటే నీకు రుచెక్కువవుతోంది.. ఉన్నమట్టుకు ఏసి వండా.. పద.. పద.. కొండమీద శివ, జానకమ్మ నాకోసం రోడ్డుమీదకొచ్చి చూత్తా వుంటారు.. ‘ అంటూ తొందరపెట్టింది పార్వతమ్మ.
సుబ్బయ్య, పార్వతమ్మ వీళ్ళ పొలాల్లో చేసుకోవడమే కాకుండా వేరేవాళ్ల పొలాలకు కూలికి వెళతుంటారు.
కొద్ది దూరం నడిచారో లేదో పార్వతమ్మ కోసం బుల్లమ్మాయి ఎదురొస్తూ.. ‘ఏంది చిన్నమ్మా…! ఆలస్యమైంది.. రోజూ నువ్వే ముందొచ్చి మమ్మల్ని పిల్చేదానివి.. లెగలేదా ఏంటి అని కనుక్కుందామని వస్తున్నా…’ అంది.
‘మీ చిన్నమ్మకేమయింది.. పడుచుపిల్లలా ఉంటే.. ‘ అంటూ పరాచకాలు ఆడాడు సుబ్బయ్య. ‘మా బాబాయి ఏంటి జోరుమీదున్నాడు…’ అంది బుల్లమ్మాయి… ‘మీ బాబాయికి వయస్సు మీదపడ్తున్న కొద్దీ.. నాజూకుపోతున్నాడు…’ అంది పార్వతమ్మ. నవ్వుకుంటూ సైకిల్‌ ఎక్కి వెళ్లిపోయాడు సుబ్బయ్య.
ఆడవాళ్లందరూ పొలంపనులకు బయల్దేరారు. ఒక చేతిలో కొడవలి, మరో చేతిలో క్యారేజీ, భుజాన ఒక పాత కండవా వేసుకొని, తలలకు నూనె పెట్టి నున్నగా దువ్వుకొని, ఎర్ర ముద్దమందారాలు సిగల్లో తురిమారు… పల్లె అందమంతా వాళ్లల్లోనే తొణిసికలాడుతోందా అన్నట్లు ఉన్నారు. తమ తమ ఇళ్లల్లో జరిగిన విషయాల దగ్గర్నుంచి మొదలుపెట్టి.. ఊళ్లో విషయాలు.. కరువు, వరదలు వరకూ చెప్పుకుంటూ… నడుస్తున్నారు.. ఈలోపు పొలం వచ్చింది.. దొండకాయలు కోసే పని.. ఇక అందరూ ఆ పనిలో పడిపోయారు.
000
మధ్యాహ్నం భోజనం కోసం అందరూ పనిని ఆపేసి ఏటి వద్దకు వెళ్లారు. అందరూ కాళ్లూ చేతులు కడుక్కొని, దోసిలితో నీళ్లు తీసుకొని ముఖాలు కడుక్కున్నారు. చెట్టు నీడన అందరూ కూర్చున్నారు. తెచ్చుకున్నవి అందరూ పంచుకుని భోజనాలు ముగించారు.
‘నీ గోంగూర ఎండ్రొయలు కూర బాగుంది అత్తమ్మ…మరింత పట్టుకురాకపోయావా?’ అడిగింది లక్ష్మి.
‘నీకూ నీ మామకూ ఎంతతిన్నా కుతి తీరదులేవే…’ అంది పార్వతమ్మ.
‘సీతమ్మక్క తెచ్చిన నల్లగారం చాలా బాగుంది. శివ చిన్నమ్మ తెచ్చిన గొడ్డుకారం పచ్చడిలో నీరుల్లి నంజుకొంటే ఎంత రుచిగా ఉందో.. మల్లేశ్వరక్కారు తెచ్చిన ఎండుచేపలు, వంకాయ పులుసు తింటుంటే నోట్లో నీళ్లూరుతున్నాయనుకో…’ ఇట్లా… వాళ్లు ఒకరు తెచ్చింది మరొకరు నోరూరేట్లు చెప్పుకోళ్లు.. మెప్పుకోళ్లతో.. భోజనం ముగించారు. అందరూ ఏటికాడికి పోయి క్యారేజీలు కడుక్కొని, ఒక గిన్నెతో ఏటిలో తేటగా ఉన్నచోట నీళ్లు ముంచుకొని చెయ్యి అడ్డంగా ఆనించి మంచినీళ్లు తాగారు.
మళ్లీ పనిలోకి దిగారు. ఎవరి పనిలో వాళ్లు పడిపోయారు. వాళ్లందరికీ శివమ్మ ముఠామేస్త్రీ..
‘ఏందే శివా…! ఈ తడవతో దొండకాయలు అయిపోతాయా..? మళ్లీ ఇంకో వారానికి కోతకు వస్తాయా?’ అడిగాడు చేను యజమాని శివారెడ్డి. ‘మళ్లీవారం కొయ్యాల్సిందే బాబారు..! చెరి సగంగా ఉన్నాయి….’ బదులిచ్చింది శివ.
ఇద్దరు మనుషులు గోనెసంచి విడదీసి పట్టుకుని ఉంటే.. అందరూ తాము కోసిన కాయల్ని గంపల్లో తెచ్చి వరుసగా సంచిలో దిమ్మరిస్తున్నారు.
అందరూ దిమ్మరించాక చీరలను కండవాతో దులుపుకొన్నారు. ఉదయం నున్నగా దువ్వకుని వెళ్లిన వాళ్ల తలలు ఇప్పుడు బాగా రేగిపోయి ఉన్నాయి. ఆ దొండ పాదుల్లో కాయల్ని వెదికి వెదికి కోయడమేమో.. ఆ తీగలు పట్టుకొని జుట్టు మరీ రేగిపోయింది. చేత్తోనే తలను సరిజేసుకొని నుంచున్నారు. చేను యజమాని అందరికీ తలాకొన్ని దొండకాయలు పెడుతుంటే కండవాల్లో మూటగట్టుకున్నారు. ఎవరి సామాను వాళ్లు చేత్తో పట్టుకుని ఇంటికి దారి తీశారు.
‘ఆనిక్కి మర్రిచెట్టు కాడ మీటింగ్‌ అంట… పొద్దుగాల వీరన్న వచ్చి చెప్పిపోయాడు’ అంది పార్వతమ్మ. ‘అవును ఇందాక శివారెడ్డి బాబారు కూడా అంటున్నాడు…’ అంది శివ. ‘అందరికీ అంట… ఏందో విషయం’ అంది పార్వతమ్మ. ‘పొలాలన్నీ ఎకరాలెకరాలు కలిపి ప్రభుత్వమే తీసేసుకుంటుందంట! రాత్రి మామయ్య చెప్పాడు’ అంది శివ. ‘ఆళ్లు తీసేసుకుంటే ఎట్టా.. మన పరిస్థితేంటి?’ అంది పార్వతమ్మ. ‘డబ్బులు లెక్కగట్టి ఇస్తారేమో…?’ అంది శివ.
‘ఇక్కడ అమ్ముకోనీకి ఎవరున్నారు…? అమ్ముకొని ఏం తినాలి? ఎలా బతకాలి? గడ్డి తినాలా..? అమ్ముకుంటే బాగుపడేదయితే ఎప్పుడో అమ్ముకునేవాళ్లంగా…’ అంటూ ఆవేశంగా అంది పార్వతమ్మ. ‘ఏమో మనోళ్లేమంటారో.. ఆనిక్కి మీటింగులో ఏం తేలుత్తారో చూద్దాంలే పిన్నాం.. ఎందుకంత ఆవేశపడతావు.. అనంగానే అయిపోద్దా ఏంటి…?’ అంది మల్లేశ్వరి.
అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
000
ఇంటికొచ్చి క్యారేజీ వసారాలో పెట్టి. ముఖం కాళ్లూ కడుక్కొని కండవాతో ముఖం తుడుచుకొంటూ ‘మీటింగు కాడి కెల్లొత్తా..’ అంటూ ఒక కేకేసి దారితీశాడు సుబ్బయ్య.
‘టీ అన్నా తాగకుండా ఆవంతునే పోతున్నావేంటి…?’ గబ గబా బయటకు వచ్చి అంది పార్వతమ్మ.
‘ఆడ తాగుతాన్లే… ఇప్పటికే ఆలస్యమైనాదీ.. మళ్లీ మబ్బులో లెగాలి..’ అంటూ వెళ్లిపోయాడు సుబ్బయ్య.
సుబ్బయ్య వెళ్లేసరికి మీటింగ్‌ ప్రారంభమైంది. అందరూ చాలా ఆందోళనగా కనిపించారు సుబ్బయ్యకు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతున్నాడు.
‘అందిరికీ నమస్కారం! ప్రభుత్వం మన భూముల్ని తీసుకొని, ఆ పొలాలన్నీ కలిపి పెద్దగా చేసి, ఒక సాలు కింద సాగు చేస్తారు. మిషన్లన్నీ తెచ్చి మీకన్నా ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేలా సేద్యం చేస్తారు. లాభాలే లాభాలు… అందులో మీకందరికీ వాటా ఇస్తారు. మీరిక మబ్బుల్లో లేచి, రెక్కలు ముక్కలు చేసుకోనక్కరలేదు. వాలుకుర్చీలో కూర్చుని నోట్లో చుట్ట పెట్టుకుని, దమ్ములాగుతూ హాయిగా కాలుమీద కాలేసుకుని దర్జాగా బతకొచ్చు…! మీ పొలాలన్నీ తీసుకొని కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటారు. ఒక్క వేలిముద్రేశారంటే చాలు… మీరంతా గుండెల మీద చేయేసి హాయిగా నిద్రపోవచ్చు. మీ వాటాగా ఏడాదికి 50వేల రూపాయలు మీకూ అందుతూ ఉంటాయి. అంతేకాదు ఐదేళ్లు పోయాక మీ భూములు మీకు కావాలంటే ఇచ్చేస్తారు’ అంటూ ముగించాడు.
‘అదేంటి భూములిస్తామని చెపుతున్నారు’ అంటూ లక్ష్మారెడ్డి చెవిలో పక్కనే ఉన్న సర్పంచ్‌ బామ్మర్ది వెంకట్రావు అడిగాడు.
‘నువ్వు నోర్మూస్తావా? భూములు తిరిగి రావని చెపితే ఒక్క నాకొడుకు కూడా సంతకం పెట్టిచావడు. అసలు మన రైతులకు భూమంటే ప్రాణంతో సమానం.. అందుకే అట్టా అబద్ధమాడా…! నువ్వు అరవకుండా కూర్చో’ కోపంగా అన్నాడు లక్ష్మారెడ్డి.
రైతుల్లో చాలా మందికి ఎమ్మెల్యే మాటలు ఉషారు పుట్టించాయి. చిన్న చిన్న రైతులైన సుబ్బయ్యల్లాంటి వారికి మాత్రం అయోమయంగా ఉంది.
ఈలోపు వెంకట్రావు (అందరూ ‘సర్పంచ్‌ బామ్మర్ది’ అనే పిలుస్తారు) మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘మీకు మన లక్ష్మారెడ్డిగారే భరోసా! మీరేమాత్రం కంగారుపడొద్దు.. మన ముఖ్యమంత్రిగారు రైతుల పక్షపాతి. మీరు ఆలోచించకుండా కళ్లు మూసుకుని సంతకాలు పెట్టెయ్యొచ్చు. ఇన్నాళ్లూ కష్టపడ్డ మీరంతా ఇక సుఖంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రిగారిది, మన వ్యవసాయమంత్రిగారి కోరిక. మీ అందరికీ తలో సీమ మందు సీసా పంపిణీ చేస్తున్నాం. అందరూ శుభ్రంగా తాగి ఇళ్లకు వెళ్లండి. రేపు సాయంత్రం ఇక్కడే కలుసుకుందాం. అందరికీ కాగితాలు ఇస్తాం మీరంతా వేలుముద్రలేస్తే చాలు. అదృష్టం మీ ఇంట్లో నాట్యం చేస్తుంది. రంగుల టీవీ చూడొచ్చు. చిన్న రైతులు ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు. ఇక మీ మొగుడూ పెళ్లాలూ పనికి పోనక్కర్లేదు. హాయిగా, సంతోషంగా, విలాసంగా మీ జీవితాలు గడపొచ్చు.’ అని ముగించాడు.
సీమ మందు సీసాలను తలకొకటి ఇచ్చారు. అందరూ సొంగలు కార్చుకుంటూ ఎగబడ్డారు. సీసాలు పట్టుకొని అక్కడకక్కడే తాగేసి కొందరు రైతులు ‘ఎమ్మేల్యేగారూ..! ఇప్పుడే ఏసేత్తాం.. ఏలుముద్రలు..కాయితాలు పట్రండి…!’ అంటూ అదుపు తప్పిపోయారు. సర్పంచ్‌బామ్మర్ది యమ ఉషారుగా పాతికమంది చేత వేలుముద్రలేసే వాళ్లతో వేలుముద్రలు, సంతకాలు పెట్టేవాళ్లతో సంతకాలు పెట్టించుకున్నాడు.
ఏదో పండగలకూ పబ్బాలకూ ఒక చుక్క వేసుకొనే అలవాటున్న సుబ్బయ్యకు ఈ సీమ మందు రుచి చూడాలనిపించి సీసా తీసుకొని ఇంటి దారి పట్టాడు.
000
‘ఏమైంది మీటింగు….?’ గడపలోకి కాలుపెట్టడమే అడిగింది ఆత్రంగా పార్వతమ్మ.
‘కొంచెం ఆగుతావా.. ఎందుకంత తొందర’ చికాగ్గా అంటూ వాల్చి ఉన్న నులక మంచంలో కూలబడ్డాడు సుబ్బయ్య.
‘చేతిలో ఆ సీసా ఏంటి?.. ఈ మీటింగేనా…?’ అంటూ సమాధానం చెప్పని సుబ్బయ్యను నిలదీసింది పార్వతమ్మ.
ఇంతలో ఆడోళ్లందరూ గుంపుగా లోపలికి వచ్చారు.
వాళ్ల వెనకే రాఘవయ్య కూడా వచ్చాడు.
అందరూ ఇలా వచ్చేసారేంటా అని ఆశ్చర్యపోతూనే అందరూ కూర్చోడానికి చాపలు తెచ్చి పరిచింది పార్వతమ్మ.
‘అందరూ కూకోండి..! ఏంటీ ఇలా పోటెత్తారు?’ అంది పార్వతమ్మ.
‘మీటింగ్‌ గురించే.. మన రైతుసంఘం రాఘవయ్య బాబారు వచ్చేటప్పటికీ మనోళ్లు మర్రి చెట్టుకాడ తాగి పడిపోయినారంట చిన్నమ్మా!’ చెప్పింది బుల్లమ్మాయి.
సుబ్బయ్య కూడా లేచి రాఘవయ్యకు కుర్చీ వేశాడు.
‘అందరూ కూర్చోండమ్మా! మన రైతులందరికీ విషయం చెబుదామని వచ్చేలోపే జరగాల్సింది జరిగిపోయింది. మీకన్నా విషయం చెప్పకపోతే చాలా నష్టపోతారు’ అంటూ రాఘవయ్య మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘ఈ ప్రభుత్వం మన వాళ్ల భూములను అమ్మమంటుంది. వచ్చే డబ్బులకు బదులుగా ఏదో కంపెనీలో షేర్‌ (వాటా) లు ఇస్తారట! అంతా కంపెనీవారే చూస్తారు. ఈ కంపెనీలో సర్పంచ్‌, ఆయన బామ్మర్దికే పెత్తనం ఉంటుంది. మీ భూములు లాక్కొని మీ నోట్లో మన్ను కొట్టాలని చూస్తోంది. ఆ ఎమ్మేల్యే లక్ష్మారెడ్డి, సర్పంచ్‌ బామ్మర్ది వెంకట్రావు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మకండి. ఒకసారి కాగితాలు మీద సంతకాలు చేసి ఇచ్చాక భూమి మీద ఆశ వదులుకోవల్సిందే. వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. ఎప్పుడు కరువొస్తదో, ఎప్పుడు వరదొస్తదో తెలియదు. నష్టాలొస్తాయి. అంతెందుకు నాడు చిత్తూరుజిల్లాలోని కుప్పంలో చేసిన ఇలాంటి వ్యవసాయమే ఎగసాయం అయ్యింది. ఎగ్గొట్టి దిగ్గొట్టడమంటే ఇదే.. నష్టమొస్తే మన వాటా ఏమిస్తారు? పనీపాటా లేకుండా ఇళ్లల్లో హాయిగా ఉండాలా? హాయిగా ఉండటం కాదు మనవాళ్లుభూమిలేని పేదోళ్లయిపోతారు. సోమరులైపోతారు. భూమి లేక, డబ్బుల్లేక.. రోగమొచ్చినా, రొష్టొచ్చినా చూసే దిక్కులేక తల్లడిల్లిపోవాలి. పిల్లల పెళ్లిళ్లు ఏం పెట్టి చేస్తారు? ఇప్పటి వ్యవసాయ సంక్షోభంలో మన పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. మీలాంటోళ్లందరూ మీ మగోళ్లకు వేణ్ణీళ్లకు చన్నీళ్లులాగా కూలికి పోతున్నారు కాబట్టి మీ బతుకులు ఎలాగోలాగా నెట్టుకొస్తున్నారు. ఆళ్లు చెప్పేది ‘సహకార సేద్యమూ’ కాదు మన్నూ కాదు.. అంతా కంపెనీ సేద్యం… కాంట్రాక్టు సేద్యం.. కానీ, ఈ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీకు తప్పుడు సమాచారం ఇచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి, మోసపుచ్చుతున్నాడు. మీ భూములు అమ్మినాక మళ్లీ మీకెట్లా వస్తాయి? సేద్యమంతా యంత్రాలమీదే నడిపిస్తారు. మహా వుంటే ఊరంతాలో పాతికమందికి కూడా పనుండదు. మీకస్సలు పనులుండవు. అందరూ ఇంట్లో కూర్చోవాలా? నష్టమొస్తే ఏడ్చి మొత్తుకున్నా మన భూమి మనకిమ్మన్నా ఇవ్వరు… తర్వాత మీ భూముల సరిహద్దులు కూడా మీరు గుర్తుపట్టలేరు. అన్నీ ఒక కమతం కిందకు తెస్తారు. తాగుబోతు సన్నాసులు కొందరు వాళ్ల మాటలు నమ్మి సీమ మందుకు ఎగబడి తాగి సంతకాలు పెట్టేశారు.. ‘ ఆవేశంగా అన్నాడు రాఘవయ్య.
‘ఏంటి ఆళ్లు సంతకాలెట్టింది ఇందుకా? ఇందాక మా మగోళ్లు మరోలా చెప్పారు. ఏడాదికి 50వేల ఆదాయం వత్తదనీ..ఐదేళ్ల తర్వాత భూములు తిరిగిత్తారని చెప్పారే…. ఇంటిరానీ… నా……..ల సంగతి చెపుతాం..! ఈ రోజే తేలుత్తాం… నువ్వు మాకు అండగా నిలబడు బాబారు..! మేమంతా కలిసి ఆ కాగితాలు లాక్కొత్తాం. మందు పోస్తే సరిపోయినాదా? పెళ్లాం, బిడ్డలు ఏమయిపోతారో పట్టదా? మంచి, చెడ్డా ఆలోచించే పనిలేదా? అంతా వీళ్లిట్టమేనా? పీకల్దాకా తాగి ‘నా…… లు’ ఆ లెక్కన సంతకాలు ఎట్టేత్తే మా బతుకులే ఏంగావాలా…?’ కళ్లమ్మట నీళ్లు తుడుచుకుంటూనే ఆవేశంగా మాట్లాడింది రత్తాలు.
‘ఓ రత్తమ్మత్తా! ఆందోళనపడమాక.. మనమంతా కలిసి ఆళ్ల సంగతి చూద్దాం.. ఇప్పుడేగా బాబాయి విషయం చెప్పింది. మనకిప్పటి వరకూ విషయం తెలవదు కూడా..’
‘వచ్చినకాడ్నించి ఈ మనిషిని అడుగుతున్నా ఆ సీసా పుచ్చుకుని ఊపుకుంటూ ఇంటికి వచ్చాడుగానీ విషయం చెబితేగా…’ మండిపడింది పార్వతమ్మ.
‘ఓసోసి ఆగేసే…! నేనేమీ వేలుముద్రేసి రాలా.. ఏదో ఉట్టి పుణ్యానికి వస్తోంది కదా! రుచి చూడొచ్చులే అని సీసా ఎత్తుకొచ్చాగానీ.. భూమి అమ్మేస్తే ఎట్టాగురా? అని ఆళ్ల మాటలకు నా బుర్ర తిరిగిపోతుందే.. నీ మాటలతో ఒకటే పాణం తీత్తనావు.. అయినా ఎంతసేపైంది.. ఈలోపు రాఘవయ్య బాబు వచ్చాడు. విషయం చెప్పాడు కదా! ఇప్పటివరకూ ఈ విషయం నాకూ తెలియదు. వాళ్లు సంతకాలు చేస్తే చాలు అంటున్నారు గానీ.. భూమి మీద మీకింకా హక్కులేదన్న విషయం ఈ బాబు చెబితేనే తెలిసింది’ అన్నాడు సుబ్బయ్య.
‘సరేలే.. ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచించండి…’ అంది రత్తమ్మ.
‘ఇక మనముందున్నదే ఒక్కటే మార్గం…. మీ మొగుళ్లు ఇంటికి వచ్చాక ఆ కాగితాలు తెస్తేనే.. తిండీ… పక్కా.. అని చెప్పండి’ అంది ముఠామేస్త్రీ శివ.
‘అద్గది మంచి మాట చెప్పావే శివా! ఈనా…………. లు అక్కడే లొంగుతారు. అప్పుడుగానీ మన బతుకులు బాగుపడవు…’ అంది లక్ష్మమ్మ మొటికలు విరుస్తూ…
‘ఆళ్లు లొంగేవరకూ మనం పట్టుమీదుండాలి…’ చెప్పింది అనుభవజ్ఞురాలు పార్వతమ్మ.
అందరూ అట్టాగే అని లేచారు.
000
వారం తిరక్కముందే సంతకాలు పెట్టినవాళ్లు కూడా కాగితాలు ఇచ్చేయమని సర్పంచ్‌ బామ్మర్ది వెంకట్రావు మీద ఒత్తిడి చేయడానికి బయల్దేరారు..
‘మా కాయితాలు మాకిచ్చేరు…’ అన్నారు.
‘అలా కుదరదు….ఇవ్వం’ అన్నాడు వెంకట్రావు.
‘ఏం పుట్టిందిరా మీకు.. ఆరోజు నిమషాల్లో సంతకాలు పెట్టేశారు. సీసాలు తీసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు’ కోప్పడ్డాడు లక్ష్మారెడ్డి.
అప్పుడే అక్కడకు రైతుల్నీ, ఆడవాళ్లనూ తీసుకొని రైతుసంఘం వాళ్లు రాఘవయ్య బాబాయి నాయకత్వంలో దండుగా వచ్చారు.
వాళ్లను చూచిన లక్ష్మారెడ్డికి ముచ్చెమటలు పోశాయి. ఏదో ఉపద్రవం రాబోతుందని గ్రహించాడు. అయినా మనస్సులో ధైర్యం చెప్పుకుంటూ పై కండవాతో చెమట చుక్కల్ని అద్దుకుంటూ కూర్చొన్నాడు.
రాఘవయ్య దండు అక్కడకు చేరుకుంది.
‘మా కాయితాలు మాకిచ్చేయాలి..! మా భూములు మాకే కావాలి..! మేమే సాగు చేసుకుంటాం…!’ అంటూ పెద్దఎత్తున అందరూ అరవడం మొదలుపెట్టారు.
చెవులు మూసుకుంటూ… లక్ష్మారెడ్డి.. రెండుచేతులూ పైకి చూపుతూ.. ‘అబ్బ ఆగండాగండి…! ఈ రాఘవయ్యను నమ్ముకొంటే మీ జీవితాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మీకు సుఖపడే యోగం లేకుండా చేస్తాడు. వాళ్లు సుఖపడరూ..? మిమ్మల్ని సుఖపడనివ్వరు….’ అంటూ మాట్లాడుతుండగానే…
‘ఓ ఎమ్మెల్యేగారూ…మాకు అరచేతిలో సొర్గం వద్దుకానీ.. రేపు నట్టాలొస్తే మా పరిస్థితేందయ్యా? మా భూములు మాకు తిరిగిత్తావా? మా పిల్లల పెండ్లిండ్లు కాకపోతే నువ్వు చేత్తావా? ఇవన్నీ నాదీ పూచీ అని మాకు కాగితాలు రాసిస్తావా?’ అంటూ అడిగింది శివ.
‘ఏమే శివా! నువ్వు పనులు చేయించడానికే మేస్త్రీవనుకున్నా.. వీటికి కూడానా..? బాగా పదునుమీదున్నావు.. ఈ వయస్సులో ఆవేశం పాలు కాసింత ఎక్కువే ఉంటుందిగానీ.. ఊరుకోవే… పెద్ద నాయకురాలైపోయావుగానీ….’ ఎకసెక్కంగా అన్నాడు లక్ష్మారెడ్డి.
‘నీ ఎకసెక్కాలెవరూ పడటానికి ఇక్కడెవరూ లేరుగానీ.. ఆమె అన్నదాంట్లో అబద్ధం ఏముంది?… పైపెచ్చు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావుగానీ.. నువ్వు చెప్పింది ‘సహకార సేద్యం’ కాదనీ.. ‘దిక్కుమాలిన సేద్య’మనీ.. మా భూములు కంపెనీ వాళ్లకిత్తారనీ.. మాకు రాఘవయ్య బాబాయి చెప్పాడులే.. కతలు చెప్పకుండా.. మా కాగితాలు మాకిచ్చేరు..’ అంటూ మహిళలంతా నిలదీశారు.
దీంతో అప్పటివరకూ మౌనంగా ఉన్న మొగాళ్లు కూడా వారితో వంత పలికారు.
‘మా ఆడోళ్లు అడిగేదాంట్లో నాయం ఉంది… మా కాయితాలు మాకివ్వు.. లేకపోతే మా ఆడోళ్లతోనూ, సంఘమోళ్లతోనూ కలిసి ఆ పెబుత్వాన్నే అడుగుతాం’ అన్నారు.
‘ఈ రాఘవయ్య, రైతుసంఘం వాళ్లు వీళ్లను చెడగొట్టారు. అంతా సవ్యంగా అయిపోయిందని పైకి రిపోర్టు కూడా పంపించా.. తస్సా చెక్కా..! ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.. పైపెచ్చు… కాగితాలు ఇవ్వకపోతే కొట్టేట్టుకూడా ఉన్నారు…’ అని గొణుక్కుంటూ.. ఒక నిర్ణయానికి వచ్చాడు.
‘ఏమయ్యా రాఘవయ్యా ఈ సహకార సేద్యం గురించి నీకేం తెలుసయ్యా…?’
‘నీకే తెలియదేమోగానీ.. నాకంతా తెలుసు. మీ జాతకం మొత్తం నా దగ్గరుంది.. ఈ భూమంతా కట్టపెట్టి ఏ కంపెనీకి ఇవ్వాలనుకుంటున్నారో కూడా నాకు తెల్సు’ అంతే ఘాటుగా సమాధానమిచ్చాడు రాఘవయ్య.
‘ఈ రాఘవయ్య, రైతుసంఘం వాళ్ళను నమ్ముకొన్నారు మీరు.. నట్టేట్లో మునగండి… అరే సర్పంచ్‌ బామ్మర్దీ! ఆళ్ల కాగితాలు వాళ్ల మొఖాన పడేయరా…!’ అంటూ పై పంచ విసురుగా దులుపుకుని కారెక్కి రయ్యిమంటా వెళ్లిపోయాడు లక్ష్మారెడ్డి.
కాగితాలు అందుకున్నాక అందరి ముఖాలు వెల్లివిరిసాయి..
‘రాఘవయ్య బాబారు జిందాబాద్‌..! రైతుసంఘం వర్థిల్లాలి!’ అంటూ అందరూ నినాదాలు చేశారు.
‘ఇది మీ విజయం…. మన పల్లె పడుచుల విజయం…..!’
మరింత ఉద్రేకంగా.. ‘రాఘవయ్య బాబారు జిందాబాద్‌..! రైతుసంఘం వర్థిల్లాలి!’ అంటూ అందరూ నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు జనం.
‘ఆగండాగండి…! ఆవేశపడిపోవద్దూ.. ఆనందపడిపోనూ వద్దు..! ఇల్లు అలకగానే పండగకాదు. ఒక గండం గట్టెక్కాం అంతే. ఇప్పటికే పీకల్లోతు సంక్షోభంలో ఉన్న ఈ వ్యవసాయాన్ని గాడిలో పెట్టుకోవాలి. అందుకు మీరంతా ఇదే ఉత్సాహంతో పోరాడితేనే సమస్య పరిష్కారమయ్యేది. అయితే మన పల్లెక్కొటే పోరాడితే సమస్య పరిష్కారమైపోదు. దీనిపై రైతుకూలీ సంఘాలన్నిటినీ కలుపుకుని పెద్ద ఉద్యమాలు చేయాలి. ఈ రోజు మన పల్లెపడుచులు సమస్య తేలేదాకా ఎలా పట్టుమీదున్నారో.. ఆ పట్టుదల మనందరిలో రావాలి. అదే మనకు స్ఫూర్తి. అప్పుడు మనం ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలు ఎన్నొచ్చినా పోరాడి విజయం సాధించవచ్చు. అప్పుడే మనకు నిజమైన సంక్రాంతి… మరి అందరూ ఆ పట్టుదలతో ఉంటారా మరి?’ అడిగాడు రాఘవయ్య.
‘ఓ…………………………………….. అంటూ అంతా కోరస్‌గా పలికారు.’
‘మరి ఇక ఉంటాను మిత్రులారా!’ అంటూ చేయీపి సంఘం వాళ్లతో కలిసి బస్టాండ్‌కు బయల్దేరాడు రాఘవయ్య.

- శాంతిశ్రీ