గెలుపు

‘ఏమే మల్లీ….! ఏడున్నా…!’ అంటూ కేకేశాడు వెంకటయ్య. ‘తానం చేత్తన్నా మావా! వత్తన్నా… ఏదో ప్రాణం పోయినట్టే ఏంటిమావా! ఆ అరుపులు..’ కాసింత కసిరినట్టే అంటూ తడి ఒంటిమీదే చీర చుట్టుకుని వచ్చింది మల్లి. ఆమె అందమైన మోముపై నీటి బొట్లు.. జాకెట్‌ వేసుకోకుండా తడి ఒంటిమీదే చుట్టుకొచ్చిన చీర అక్కడక్కడ తడిసింది… మల్లిని అట్టా చూస్తూ నుంచుండిపోయాడు వెంకటయ్య.
వెంకటయ్య మొహంమీద చిటికెలేస్తూ.. ‘ఏంది మామా! అట్టా బిగుసుకుపోయా..?’ అంది మల్లి… ‘నిన్నే చూత్తన్నానే.. భలే అందంగున్నావే…! అంటూ మల్లిని దగ్గరకు తీసుకున్నాడు వెంకటయ్య. ‘చాల్లే సంబడం… ఏ ఏల ఏ పని సేయాలో తెల్వదు నీకు.. నీళ్లు తోడతా. తానం చేసిరా పో.. వేడి వేడిగా బువ్వ తిన్నాక అప్పుడు…’ అంటూ ఊరిస్తూ వెంకటయ్యను బయటకు నెట్టి తలుపేసుకుంది మల్లి. నవ్వుకుంటూ.. తలమీద జుట్టులోకి వేళ్లుపోనిచ్చి సవరించుకుంటూ.. కండవా దులిపి పక్కనే వేసి, మంచమీద కూర్చున్నాడు వెంకటయ్య. ఈలోపు తలుపు తీసుకొని వస్తూ.. ‘ఓ మావా! బొక్కెనలో జామచెట్టుకాడున్న తొట్టిలో నీళ్లు తోడుకురా… ఉడుకునీళ్లు తొలుపుతా… ‘ అన్న మల్లి కేకతో లేచాడు వెంకటయ్య.
వెంకటయ్య వచ్చేలోపు అన్నంగిన్ని, కూరగిన్ని, రెండు పళ్లాలు, మంచినీళ్లు, ఉప్పుడబ్బా సిద్ధంగా ఉంచింది మల్లి. వెంకటయ్య తువ్వాలుతో మొహం తుడుచుకుని భోజనానికి కూర్చున్నాడు.. ‘నీది చాలా ఇసాలం మావా…!’ వెంకటయ్య ఛాతీ వంక చూస్తూ అంది మల్లి… ‘భోజనం చేసినాకన్నావుగా.. మరి తొందరపడతన్నావేంటే..! ‘ అంటూ సరసమాడాడు వెంకటయ్య.. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ కింది పెదాన్ని లోపలికి కొద్దిగా పంటికింద నొక్కిపెట్టి.. పైటకొంగు కొసను వేలికి చుడుతూ.. మెలికలు తిరుగుతూ.. వెంకటయ్యవైపు చిలిపిగా చూసింది మల్లి. తనూ నవ్వుతూ..’ఇంతకీ ఏం కూరొండావే…? వాసన గుమాయిత్తోంది..’ అన్నాడు వెంకటయ్య ‘వంకాయలో ఎండిచేపలేసి పులిసెట్టా మావా…!’ చెప్పింది మల్లి. నోట్లో నీళ్లూరిపోయాయి వెంకటయ్యకు.
‘ఏమైనా వంకాయ రుచే ఏరే…! నువ్వొండితే మరీనూ….’ పొగుడుతూ అన్నాడు వెంకటయ్య. ‘నీ పొకడ్తలతో నన్ను మునగసెట్టెకిత్తిన్నావే.. అదిసరేలేగానీ మావా..! ఏ కూరగాయతో చేయనన్ని రుచులు ఈ వంకాయతో చేయొచ్చు మావా! లేత వంకాయల్లో ఉల్లికారమేసి వండినా, మసాలేసి వండినా, పచ్చిమిరగాయలూ అల్లం నూరేసి వండినా… దోసకాయ, టమాటా ఏసి పచ్చడి నూరినా.. పులిసెట్టినా, ఏపుడు చేసినా.. ఏం చేసినా బాగుంటాది కద మావా!’ గలగలా చెప్పింది మల్లి. ‘చెప్పడం మొదలెట్టావంటే ఒకపట్టాన ఆపవుగందా.. ఎదటమనిసి మాట్లాడనీకు చోటియ్యవు కదే మల్లి…!’ అన్నాడు వెంకటయ్య, ‘నాకు తెలిసిన విసయాలే నేను సెప్పింది.. నేనమ్మా కతలు ఏమైనా చెప్పినానా ఏంది?’ మూతి తిప్పుకుంటూ అంది మల్లి. ‘అబ్బ… అంతలోనే ఎంత కోపమే నీకు…’ మురిపెంగా మల్లి వంక చూత్తూ.. అన్నాడు వెంకటయ్య. భోజనలయ్యాక గిన్నెలన్నీ సర్దుతోంది మల్లి. ఈలోపు సన్నజాజి పందిర కింద మంచమేసి పక్కేశాడు వెంకటయ్య. మావ తొందర చూసి నవ్వుకుంటూ. అన్నీ సర్ది, ఇంటి తలుపు గడియపెట్టి తాళం వేసి, తాళం చెవి గూట్లో ముగ్గుబుట్టలో పెట్టొచ్చింది మల్లి. దొడ్డి గుమ్మం తలుపేసి వచ్చాడు వెంకటయ్య.
‘ఎన్నెల బాగా కురుత్తుందే..’ అన్నాడు వెంకటయ్య.. ‘ఎంటి మావో..సంగతి….! చాలా ఏడిమీదున్నావే.. వంకాయ మాయా ఏంది?’ అంటూ చతుర్లాడింది మల్లి. ‘ఏం ఊరిత్తావే… రాయ్యే….’ అంటూ… చేయిపట్టుకుని లాగేసరికి వెంకటయ్య గుండెలమీద వచ్చి పడింది మల్లి. ‘ఏంది మావా! ఆ దూకుడు’ అంటూ వెంకటయ్యను అల్లుకుపోతూనే ముద్దుగా విసుక్కుంది మల్లి. ‘మన సరసాలకి సెంద్రుడు మబ్బులెనక్కి ఎట్టా పోతున్నాడో సూశావా…?’ అంటూ మల్లి భుజం చుట్టూ చెయ్యేసి ఆకాశమెంక చూపించాడు వెంకటయ్య. సిగ్గుల మొగ్గయ్యి రెండు చేతుల్లో ముఖం దాచుకుంది మల్లి. ‘ఓయబ్బో సిగ్గే…’ అంటూ మల్లిని దగ్గరకు తీసుకున్నాడు వెంకటయ్య.
000
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అంతా హడావిడిగా ఉంది. ఆటో దిగి స్టేషన్‌లోకి అడుగుపెడుతున్న ఆదిత్యవర్థన్‌కు ’10వ నెంబరు ఫ్లాట్‌ఫారంపై గుంటూరు వెళ్లు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరుటకు సిద్ధముగా ఉన్నదీ..’ అన్న ఎనౌన్సర్‌ మాటలతో… ఒక చేతిలో ల్యాప్‌టాప్‌, మరో చేతిలో చిన్న బ్రీఫ్‌కేస్‌తో వడివడిగా అడుగులు వేస్తున్న ఆదిత్యవర్థన్‌ నడకలో మరింత వేగం పెంచాడు. మెట్లు దిగి ఫ్లాట్‌ఫారం మీదకు వచ్చి ట్రైన్‌ దగ్గర నుంచొని తన కోచ్‌ నెంబర్‌ ఎక్కడ ఉందా? అని ఒకసారి తన ఎదురుగా ఉన్న బోగీపై చూశాడు. అదృష్టం కలిసి వచ్చినట్లు అది తనెక్కే కోచే కావడంతో ఒక్కసారి గుండెల నిండా ఊపరి పీల్చుకొని లోపలికి దారి తీశాడు. తన సీట్‌ నెంబరు చూసుకొని బ్రీఫ్‌కేస్‌ సీటుకింద పెట్టి, ల్యాప్‌టాప్‌ మాత్రం తన పక్కనే పెట్టుకొని కూర్చొన్నాడు.
చలికాలం కావడాన.. స్వెటర్‌ వేసుకొన్నాడు ఆదిత్యవర్థన్‌. అయితే కంగారుగా రావడం… జనం కూడా బాగా కిక్కిరిసేటప్పటికీ కొంచెం ఉక్కపోతగా అనిపించింది. స్వెటర్‌ తీసి ల్యాప్‌టాప్‌పై ఉంచాడు. ఆదిత్యవర్థన్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌. ప్రస్తుతం రిటైర్‌ అయ్యాడు. వయస్సు డెబ్బై పైబడినా యువకుడిలా ఎప్పుడూ చలాకీగా ఉండటం ఆయన నైజం. వయస్సు శరీరానికి గానీ మనస్సుకు కాదన్న నానుడి ఉన్నా.. ఆయన శరీరం కూడా మనస్సుతో ట్యూన్‌ అయినట్లు నిటారుగానే ఉంటుంది. ఆదిత్యవర్థన్‌కు సామాజిక దృష్టి కాస్తంత ఎక్కువ. ఆయన ఆలోచనలు ఎప్పుడూ రైతుల మనుగడ చుట్టూతానే తిరుగాడుతూ ఉంటాయి. పిల్లలిద్దరూ మంచి పొజిషన్‌లో ఉన్నారు. జీవితంలో సెటిల్‌ అయిపోయారు. హాయిగా కాలుమీద కాలువేసుకొని జీవితాన్ని గడిపే ఆర్థిక, భౌతిక పరిస్థితులు ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన ఇంకా చేయాల్సింది చాలా ఉందనే అనుకుంటాడు ఎప్పుడూ. బిటి వంగ మీద రైతుసంఘం వారు గుంటూరులో ఏర్పాటు చేసిన చర్చావేదికలో ముఖ్యవక్తగా మాట్లాడేందుకే ఇప్పుడు ఆయన పయనం.
ఏదో స్టేషన్‌లో రైలు ఆగినట్లైంది. చూద్దామంటే సీట్లమధ్యలో కూడా జనం నుంచోవటాన ఊరిపేరున్న బోర్డు కనపడడంలేదు. అంత రద్దీలోనూ.. బతుకు మెతుకుల కోసం ఆడవాళ్లు కొందరు..16-17 మధ్య వయస్సున్న కుర్రోళ్ల ‘పల్లీలు.. పల్లీలు… వేడి వేడి పల్లీలు..’ ‘ఆ… బఠానీ.. బఠానీ… కారం బఠానీ…’ ‘ఆ.. వేడి వేడి ఛారు… ఆ… ఛారు…’ ‘యే.. కాఫీ…. యే… కాఫీ… ‘ ‘జామకాయలు.. జామకాయలు..’ అంటూ బిలబిలా ఎక్కి కోలాహాలం చేస్తున్నారు.
ఉదయం గ్రీన్‌ టీ తాగి, రెండు ఇడ్లీలు తిని వచ్చాడేమో వాళ్ల కేకలు వినేసరికి కడుపులో ఆకలి పేచీ పెట్టడం ఆరంభించింది. ఇక లాభం లేదని పర్సు తీసి, ఒక వేడి వేడి ఛారు తాగాలనుకున్నాడు. ‘ఓ బాబూ.. ఒక ఛారు ఇవ్వు… సుగర్‌లెస్‌ ఉందా?’ అడిగాడు ఆదిత్యవర్థన్‌. ‘లేదు సార్‌…’ బదులిచ్చాడు కుర్రాడు. ‘సరేలే ఒక ఛారు ఇవ్వు…’ అని పదిరూపాయల నోటు ఇచ్చాడు. ఎడమ చేతితో ఛారుగ్లాస్‌ అందుకొని, మిగతా చిల్లర కోసం కుడిచేయి చాపాడు ఆదిత్యవర్థన్‌. కుర్రోడు షర్టుజేబు, ఫ్యాంట్‌ జేబు వెదికి చిల్లర ఇచ్చాడు. చిల్లర ఇవ్వడం ఆలస్యం.. ‘ఆ…ఛారు.. వేడి వేడి ఛారు…’ అంటూ ఆ కుర్రోడు వెళ్లిపోయాడు.
ఛారు తాగాక బ్రీఫ్‌కేస్‌ తీసి ఒళ్లో పెట్టుకొని తెరిచి, దాన్లో ఉన్న తన ప్రసంగానికి సంబంధించిన కాగితాలు తీసి ముఖ్యమైన పాయింట్లు నోట్‌ చేసుకున్నాడు ఆదిత్యవర్థన్‌. వాటిని బ్రీఫ్‌కేసులో పెట్టుకుని టైమ్‌ చూస్తే.. ఒంటిగంట దాటింది. అరే.. అనుకునేలోపు.. గుంటూరు స్టేషన్‌లో ట్రైన్‌ ఆగింది. అందరూ దిగుతున్నారు. ట్రైన్‌లో రద్దీ కూడా తగ్గింది. కిందకు దిగిన ఆదిత్యవర్థన్‌ను తీసికెళ్లడానికి ఒకాయన రెడీగా ఉన్నాడు. ఆయన ఆదిత్యవర్థన్‌ను గుర్తించి, నమస్కారం చేశాడు.ఆదిత్యవర్థన్‌ కూడా ప్రతినమస్కారం చేశాడు. తన పేరు సుబ్బారెడ్డి అనీ, కోటేశ్వరరావుగారు పంపారని, రైతుసంఘంలో పనిచేస్తాననీ, తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆఫీసుకు ఆటోలో బయల్దేరారు.
భోజనమయ్యాక కొద్దిసేపు రిలాక్స్‌ అయిన ఆదిత్యవర్థన్‌ నాలుగు గంటలకు ప్రారంభమైన చర్చావేదికకు హాజరయ్యాడు.
చర్చావేదిక హాజరైన ఆదిత్యవర్థన్‌కు ఒక విషయం ఆశ్చర్యమనిపించింది. విషయమేంటంటే ‘ఈ చర్చావేదికకు ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరవడం’. ఆదిత్యవర్థన్‌ మాట్లాడటం ప్రారంభించాడు…’ముందుగా ఈ చర్చావేదికకు హాజరైన నా సోదర, ప్రత్యేకంగా నా సోదరీమణులకు నా నమస్సుమాంజులులు!’
‘మీకందరికీ ఈ బిటి వంగ గురించి చెప్పే ముందు మన పాలకుల గురించి తెలుసుకోవాలంటే మీకో చిన్న కథ చెప్పాల్సిందే… రాయలవారు అదేనండీ.. మన శ్రీకృష్ణదేవరాయలు ఎంతోమంది కవులను, పండితులను పోషించాడు. ఆయన ఆస్థాన కవి, మనందరికీ ఎప్పటికీ గుర్తిండిపోయే కవి ‘రామలింగడు’. ఆయన కథ ఒకటి చెప్పుకున్నాక బిటి వంగ గురించి చెప్పుకుందాం.. ఆ కథేంటంటే….
”రాయలవారి తల్లికి మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. ఆమెకి వానాకాలంలో బాగా జబ్బు చేసింది. చావబోయే ముందు మామిడి పండు తినాలని ఆవిడ కోరిక. రాజు భటులని దేశమంతా తిప్పాడు. ఎక్కడా ఒక్క మామిడిపండు కూడా దొరకలేదు. దాన్నే కలవరిస్తూ ఆమె ప్రాణాలు వదిలింది. చనిపోయేముందు తల్లికి మామిడిపండు తినిపించలేకపోయానే అని రాజు బాధపడ్డాడు. ఈ సంగతి తాతాచారి అనే కంసాలికి తెలిసింది. ఈ వంకతో వీలైనంత డబ్బు గుంజుకోవాలని ఎత్తువేశాడు. వెంటనే రాయలవారి వద్దకి పోయాడు. ‘మహారాజా! బాధపడకండి! బంగారు పళ్ళు చేయించి బ్రాహ్మలకు దానం ఇవ్వండి. ఏటా ఆమె తద్దినంనాడు ఈ పని చేయండి. స్వర్గంలో మీ తల్లిగారి ఆత్మకి శాంతి కలుగుతుంది’ అని చెప్పాడు. రాయలవారు ఏటా బంగారు మామిడి పళ్ళు దానం చేయడం మొదలుపెట్టాడు. లక్షల మంది బ్రాహ్మలు దానం తీసుకుపోతున్నారు. రెండేళ్ళకే రాజుగారి ఖజానా ఖాళీ అయిపోవచ్చింది. తాతాచారి మోసంతో రాజుగారు చిక్కుల్లోపడ్డాడు. ఏదో ఎత్తువేయాలి అని రామలింగడు ఆలోచించాడు. తర్వాత సంవత్సరం కూడా లక్షలాది మంది బ్రాహ్మలు దానం పుచ్చుకోవడానికి వచ్చారు. ముందురోజే పట్నంలో దిగారు. రామలింగడు ఆ రాత్రి అందరినీ కలుసుకున్నాడు. ఈ ఏడు ఎన్ని కావాలంటే అన్ని మామిడి పళ్ళు ఇస్తారు. అయితే ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని వాతలు వేయించుకోవాలి’ అని అందరికీ చెప్పాడు. బ్రాహ్మలంతా ఆశపడ్డారు. మర్నాడు పొద్దుటే రామలింగడు కొలువు బయట కొలిమి పెట్టించాడు. బ్రాహ్మలకు వాతలు వేయించసాగాడు. కొందరు పది వాతలు కూడా వేయించుకున్నారు. కొలువు లోపలికి వెళ్ళి రాయలవారికి వాతలు చూపించారు. బంగారు మామిడిపళ్ళు ఇమ్మని అడిగారు. రాయలవారు తెల్లబోయారు. రామలింగడే ఈ వాతలు వేయిస్తున్నాడని తెలిసింది. విపరీతమైన కోపం వచ్చింది. రామలింగడిని పిలిచి ఇలా ఎందుకు చేస్తున్నావ్‌ అని అడిగాడు. ‘మహారాజా! మా అమ్మ వాత రోగంతో చనిపోయింది. పోయే ముందు వాతలు వేయించమని అడిగింది. నేను వేయించే లోపలే కన్ను మూసింది. మరి ఆమె ఆత్మ కూడా శాంతించాలి గదా! అందుకు బ్రాహ్మలకు వాతలు వెయ్యమని చెప్పారు. ఇంతమంది బ్రాహ్మలు నాకు ఎప్పుడు దొరుకుతారు? పైగా వాతలు వేయిస్తానంటే ఎవరు వస్తారు? అందుకే పనిలో పనిగా ఇప్పుడే వేయిస్తాన్నా’ అన్నాడు. రాజుకి వెంటనే సంగతి అర్థమైంది. తాతాచారి మోసం తెలిసిపోయింది. తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడ్డాడు. ఆశపోతులు కాకపోతే ఒక్కొక్కరు అన్ని వాతలు వేయించుకుంటారా అనుకున్నాడు. వెంటనే బంగారు మామిడిపళ్ళ దానం ఆపేశాడు.”
‘ఇదండీ కథ! ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం..!
బిటి వంగ విత్తనాలు వంకాయల్లో పుచ్చులు లేకుండా చేయడానికి కనిపెట్టిన కొత్త వంగడం. అయితే పురుగు పట్టకుండా విత్తనంలోనే విషం కలిపి తయారుచేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ విషం వంగ మొక్క మొత్తానికి వ్యాప్తిస్తుంది. ఆకులకూ… కాయల్లోకీ వెళ్లిపోతుంది. అంతేకాదు. భూమి లోపలికి వెళ్లి భూమి కూడా విషతుల్యం అయిపోతుంది… అలాగే గాల్లోకి వ్యాపించి అదీ కలుషితం అయిపోతుంది. ఈ కాయల్ని తిన్న మనుషులు, పశువులు వెంటనే చచ్చిపోరుగానీ.. రోగాలపాలవుతారు. ఆఖరుకు ఈ కాయలు తిన్న వారిలో సంతానోత్పత్తి కూడా ఆగిపోతుంది. మరి మన ప్రభుత్వం ఆ బహుళజాతి కంపెనీకి రెడ్‌కార్పెట్‌ పరుస్తుంది. మాలాంటి శాస్త్రవేత్తలు ఎందరో నేడు బయటకు వచ్చి గళం విప్పారు. మీలాంటి వారికి అందులోని వాస్తవా.. వాస్తవాలు చెప్పనారంభించారు. దీంతో కథ అడ్డం తిరిగింది.
ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న రామలింగడి కథకీ బిటి వంగకు సంబంధమేమిటా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా…! కథలో రాయలంతటి వారే తాతాచారి తంత్రానికి పడిపోయాడని అనిపించడంలేదు. మన ప్రభుత్వానికీ ఒక తాతాచారి తారసపడ్డాడు. ఇక్కడ తాతాచారి అంటే బహుళజాతి కంపెనీ. వారి ఎత్తుగడలకు మన ప్రభుత్వం చిత్తయిపోయింది. ఎటొచ్చీ రామలింగడులాంటి తెలివిగల కవులు మన ప్రభుత్వంలో ఉంటేగానీ ఈ బిటి వంగ సమస్యకు పరిష్కారాలు ఉండవు. విషం వంకాయలు తింటే ప్రజలు బాధ పడతారన్న కనీస మానవత్వాన్ని మన ప్రభువులు మర్చిపోయారని చెపుతూ.. రామలింగడంత కాకపోయినా మన ఆస్థానంలోనూ ఒక ‘రాం’లింగడు ఉన్నాడు. గుడ్డిలో మెల్ల ప్రస్తుతానికి బిటి వంగ తాత్కాలికంగా ఆగింది. కానీ ఇది ఎన్నాళ్లో చెప్పలేం.. మనమంతా అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిందే..’ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు ఆదిత్యవర్థన్‌.
000
మీటింగ్‌ దగ్గర నుండి మల్లి ఇంటికి వచ్చి వసారాలో దిగాలుగా కూర్చొంది..
‘ఏంటే మల్లీ,…! అలా దిగాలుగా కూకున్నావ్‌….!’ అడిగాడు వెంకటయ్య. ‘ఏం లేదు మావా! మనం మా ఇట్టంగా తినే వంకాయ ఇక తినలేం…’ అంది మల్లి. ‘అదేంటే అలా అని ఎవరన్నారే…ఎర్రిమొగమా…? నవ్వుతూ అన్నాడు వెంకటయ్య’ ‘ఇదే నవ్వులాటకనడంలేదు మావా..! ఒట్టు..! నీ మీదొట్టు..!’ అమాయకంగా చెప్పింది మల్లి. ‘అసలు విసయమేంటే…?’ వెంకటయ్య అడిగాడు.
‘ఆ ఆదిత్య సార్‌ ఏం చెప్పాడనుకున్నావ్‌..? ఆశ్చర్యంగా కళ్లింత చేసి చేయి గెడ్డానికి తిప్పి పెట్టుకుంటూ అంది మల్లి. ‘ఏం సెప్పాడో నువ్వు సెపితే కదా తెలిసేది? సెప్పకుండా ఎట్టా తెలుసుద్ది?’ కొంచెం కసిరినట్లు అన్నాడు వెంకటయ్య. ‘మాటవరసకు అన్నానే అనుకో అంత కసరాలా? హుహూ… ‘ అంటూ మూతి తిప్పింది మల్లి. ‘ఓసోసి మాబాగున్నావే.. ముద్దొస్తున్నావుగానీ… ఇసయం చెప్పెహే…’ అన్నాడు వెంకటయ్య. ‘అట్టారా దారికి… ‘ అంటూ మల్లి చెప్పడం ప్రారంభించింది. మావా! ఆ బిటి వంగ ఇత్తనాలు ఏత్తే.. వంకాయలోపటికి కూడా ఇసం ఎక్కుంతుందంటయ్యా..! పురుగు సావడానికి ఇయ్యాలగానీ.. కాయలోపలికి ఇసం ఎలితే తినేదెట్టాగూ…? ఒకేళ పండించినా అమ్ముకునేదెట్టాగు..? ‘చెత్‌..! అట్టాంటి ఇసం కాయలు పండిత్తమేంటి? ఎవసాయమన్నా మానుకోవాలిగానీ.. ఇట్టాంటి చెండాలం పనులు చేయకూడదు…’ అన్నాడు వెంకటయ్య.
‘నువ్వు సెప్పేది మంచిగానే ఉంది మావా..! ఆ అయ్య కూడా అన్నాడు. ‘కాయల్లో ఇసముందని తెలిశాక తలకాయలో మెదడున్నోడు ఎవ్వరూ కొనరుగందా..!’ అని చేతులు తిప్పుకుంటూ చెప్పింది మలి. ఇది సీమ దేశం వాళ్లు పన్నిన పన్నాగమంట మావా!. అయినా మన పెబుత్వానికి కాసింతైనా ఆలోచన ఉండక్కర్లా…’ అంటూ.. ‘మళ్లీ రాయలోరి పాలన వస్తే బాగుండు మావా! మాతాతకి ఆళ్ల నాన్న చెప్పేవాడంట.. రాయలోరి పాలనలో వజ్రాలు, వైడుర్యాలు రోడ్లమీదే గుట్టలుగా పోసి అమ్మేవారంట మావా!. ప్రజల్ని చానా పేమగా చూసుకునేవాడంట..! ఎంచక్కా మల్లీ అట్టాంటి రాజుల పాలన వస్తే ఎంత బాగుండో…’ రెండు మోకాళ్లకు చేతుల్ని దండలా వేసి ఊగుతూ ఉషారుగా అంది మల్లి.
‘ఓసి ఎర్రిమొగమా..! రాయలోరి పాలన ఇప్పుడెట్టా వస్తదే..? అన్నేళ్ల ఎనక్కీ మనం పోవాలి.. మరో మార్గం లేదే..’ అంటూ ఏమైనా ఆ రాజుల కాలమే నయమే.. మరో వంద జన్మలెత్తినా రాయల్లాంటి రారాజు రాడే….’ అన్నాడు వెంకటయ్య. ‘సర్లే సంబడం.. అన్నేళ్ల ఎనక్కి మనమెల్లే పనికాదుగానీ..! ఆ అయ్య చెప్పింది కాస్తంత చెవిలో ఏసుకో….’ ‘అట్లాగేలేవే.. మరి తెలివిమాలి లేనులే… రైతంటే ఈ పెబుత్వానికి మా బాగా చులకనైపోనాదే…’ ‘అదేంటి మామా అట్టా అంటావు..?’
‘మరి ఎట్టా అనాలే… రైతుకు పెయజనం కలగాలా? జనాన్ని ఆదుకోవాలా..? అయన్నీ కాదని…. జనానికి ఇసం పెట్టమంటే ఎట్టా? జనానికి విసం పెట్టి, మనమేం బాముకుంటాం..? మనం తినమా?, నోరులేని పశువులు తింటే….ఇంకేమన్నా ఉందా? ఏ రైతన్నా చూత్తూ చూత్తూ ఆ పని చేస్తాడేమే…? ఏమనుకుంటోంది ఈ పెబుత్వం? ఈ పెబుత్వానికి ఆమాత్రం ఘానం ఉండక్కర్లా…?’ కండవాని విసురుగా దులుపుకుని భుజం మీదేసుకొని.. ‘నేనట్టా పొలందాకా పోయొస్తా… మొక్కలకు నీరు పెట్టి.. వస్తా..’ అంటూ డుగు డుగుమంటున్న లూనా తీశాడు వెంకటయ్య.
‘అట్టాగేలే.. చేలో కాసింత గోంగూర దొరుక్కుందన్నావు నిన్న రేత్రి. వత్తావత్తా పట్రా..! కాసిన్ని ఎండిచేపలున్నాయి. ఏసి వండుతా.. రేపు పొద్దుగాల క్యారేజీలోకి కూడా సరిపోద్ది.. పెందలకాడే రా మావో…!’ అంటూ వెళ్లిపోతున్న వెంకటయ్యకు వినపడేలా అరిసింది మల్లి. ‘ఆ… సరేలే…. సరేలే…’ అంటూ వెళ్లిపోయాడు వెంకటయ్య.
000
ఏడాది గడిచింది.. ప్రభుత్వం బిటి వంగడానికి ఆమోదం తెలిపింది.
పొలానికి నీరు పెడుతూ వెంకటయ్య ‘ఓ రత్తాలూ…! ఈ పాలి మీ చేలో బెండలు బాగా కాసినట్టున్నాయే…! ఎల్లేప్పుడు కాసిన్ని బెండకాయలియ్యే.. పట్టికెలతా…!’ అన్నాడు. ఆ పర్లేదు బాబారు..! అట్టాగే ఇత్తాలే పట్టికెలుదువుగానీ.. నా మొగుడు మాట ఇని వంగనారు పోస్తే.. నట్టేట్లో మునిగేదాన్ని..’ ‘ఎందుకు మునిగేదానివే…? బాగానే కాసేయిగా వంగలు కూడా. కాసింత మందులెక్కువ జల్లుకోవాలిగానీ.. ‘ నీకు తెల్వదా బాబారు.. ఆ ‘బిటి వంగ’ ఏదో వచ్చిందంటగా.. ”అది ఏత్తే పుచ్చుల్లేని వంకాయలే వంకాయలు” అని నా పెనిమిటి ఒకటే చెవిలో రొదపెట్టాడనుకో…’ చెప్పింది రత్తాలు. ‘ఓస్సోసి ఆ వంగడమా..? అదైతే వద్దులే.. మంచిపని చేశావు.’ ‘అవును బాబారు….’ అదీ సమయానికి మల్లి చిన్నమ్మ చెప్పబట్టి. లేకపోతే ఎర్రిమొగం దాన్ని అట్టాగే ఆ కొత్త వంగడం తెచ్చి ఏసేదాన్ని.
ఏం చెప్పిందేంటి మీ చిన్నమ్మా..? ఆసక్తిగా అడిగాడు వెంకటయ్య. (మనస్సులో అబ్బో.. ఎవహారం మాబాగా చేత్తందే.. అని మల్లిని మెచ్చుకున్నాడు…) చిన్నమ్మను మీటింగులకు పంపడం బాగా అలవాటు చేశావు. ఆమాత్రం విసయాలు తెలుసుకొని మాలాటోళ్లకి చెప్పడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంది బాబారు.. ఆ వంగడం ఏత్తే కాయల్లోకీ, భూమిలోకీ.. గాల్లోకీ… అట్టాగే తిన్న మనిషి కడుపులోకీ పోతుందంట…! ‘అస్సలు ఎయ్యొద్దే రత్తాలూ!’ అని చెప్పింది…. అస్సలు వంకాయ తినాలంటే భయమేత్తంది బాబారు…’ ‘అవునే మనమంతా ఎంతో ఇట్టంగా తినే వంకాయ తిననీయకుండా చేసిందే ఈ పెబుత్వం… మీ చిన్నమ్మ సదుకోలేదుగానీ..నాకన్నా విసయాన్ని ఇనగానే ఇట్టే పసిగట్టేసిద్ది. అందుకే దాన్ని మీటింగులకు అంపుతా….’ చెప్పాడు వెంకటయ్య.
మన పెదానికి ఆ బిటి వంకాయలు వండి బాగా పెడితే పోద్దేమో బాబారు…! మాబాగా చెప్పావే.. ఎయ్యమని చెప్పినోళ్ళనందర్నీ ఆ బిటి వంకాయలు తినమని చెప్పాలి… అంటూ రత్తాలునూ తన లూనాపై ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు వెంకటయ్య. ‘ఏందేవు రత్తాలు.. దారి తప్పి ఇటొచ్చావు…’ అంటూ పలకరించింది మల్లి. ‘నీ మాటే చెప్పుకుంటూ… బాబారు నే ఎలతన్నాగా.. రా అన్నాడు.. సరేలే నిన్ను కూడా చూసి పోదామని ఇట్టా వచ్చా…’ ‘నా మాటేం చెప్పుకున్నారు అంతసేటూ నువ్వూ… నీ బాబారు…’ ఉక్రోసంగా అంది మల్లి. ‘నీ మీద చానా చెప్పాలే…’ అన్నాడు ఉడికిస్తూ వెంకటయ్య.. ‘చెప్పుకోండి నాకేటి? నాకేమన్నా బయమా?… అబ్బా, కూతురు నన్నేం చేత్తారు? నేనేమైనా తప్పుసేత్తేగందా..!’ ముక్కుపుటాల అదురుతుంటే మూతి తిప్పుకుంది మల్లి. ‘ఎంత ఉక్రోశమే నీకు.. ముక్కుమీదే ఉంటాదే కోపం…’ నవ్వుతూ అన్నాడు వెంకటయ్య.. ‘ఊరుకో చిన్నమ్మా! నిన్ను బాబారు ఉడికిత్తున్నాడుగానీ…అదే బిటి వంకాయల గురించి చిన్నమ్మా…! ‘ఏమైందేంటి బిటి వంకాయ?’ అడిగింది మల్లి.
‘ఏమీలేదు.. ఈ వంకాయ సాగుబడి సెయ్యమన్నోళ్లందరికీ ఆ వంకాయలే వండి, తినిపించాలని అనుకున్నాంలే…’ ‘ఆళ్లెందుకు తింటారే పిచ్చిమొకమా..?.. ఆళ్లు బాగానే పశువుపేడ, పచ్చిరొట్ట.. అదే చేంద్రీయ ఎరువులో ఏందో.. ఆ ఆదిత్యసార్‌ చెప్పాడు.. అవేసి పండించినవి తిని, రోగాలు రాకుండా కులాసాగా కులుకతున్నారంట.. మొన్న మీటింగ్‌లో సెప్పారు మావా! అసలు ఈ వంకాయ తినపోతే ఏం పోయింది… మన ఆడోళ్లంతా వంకాయ వండటం మానేస్తే సరి.. తిక్క తిన్నంగా కుదుర్తాది.. మన పెబుత్వానికీ…. ఆ కంపెనీ ఓడికీ….’ ఆవేశంతో అంది మల్లి.
మల్లి మాటలకు వెంకటయ్య నిశ్చేష్టుడయ్యాడు.. ఎంతబాగా చెప్పింది… ‘మా బాగా చెప్పావే.. ఈ ఆలోచన నాకు తట్టలేదెందుకే…?’ అన్నాడు వెంకటయ్య. ‘ఆ నీ బుర్రలో మట్టిపాలు కాసింత ఎక్కువుందిలే…’ వెటకారంగా అంది మల్లి. ‘అబ్బో… నీ బుర్రలో బంగారం ఉందా?’ వెటకారంగా అన్నాడు వెంకటయ్య. ‘బంగారం లేకపోయినా.. బంగారంలాంటి ఆలోచనలు చెప్తాందిగందా…! ఊరుకో బాబారు…! అంది రత్తాలు. ‘మనిషికి ఆలోచన ఉండాలిగానీ.. గర్వం ఉండకూడదే..’ అన్న వెంకటయ్య మాటలు పూర్తికాకుండానే.. ‘నాకేం గర్వంలేదులే… నువ్వంటే నేను పడాలిగానీ.. ఒక్కమాటంటే ఏం గింజుకుంటావయ్యా…! నీళ్ల కాగు పొయ్యిమీదేసి చానసేపయ్యింది.. నీళ్లుతోడతా లెగు…’ అంటూ మల్లి ఇంట్లోకి వెళ్లి ప్లేటులో కారప్పూస పెట్టి తెచ్చి ఇచ్చింది రత్తాలుకు.
‘నే ఎల్తా చిన్నమ్మ… ‘అంటూ ఆ కారప్సూస క్యారేజీలో పోసుకుని లెగిసింది.. ‘ఎలాగో భోజనం ఏల అవుతుందిగా… కాసింత బువ్వ తినిపోవే… రత్తాలు…’ అన్నాడు వెంకటయ్య. ‘ఎంతైనా మా బాబారు.. మా బాబాయే… నాగురించి ఎట్టా ఆలోచించాడో….’ ‘మా బాగా ఆలోచించాడులేగానీ…మీ బాబారు..! పచ్చిమిరగాయల్తో పచ్చడి చేశాను.. కాసింత ఎత్తుకుపో… ఇంటికాడ పిల్లలు ఆకలితో అల్లాడతా ఉంటారు….. ఇంటికెళ్లి అన్నం వండుకుంటి సరిపోద్ది.. పొద్దుపోయింది అసలే’ అంటూ… పచ్చడి పెట్టించింది మల్లి.’
‘నీ ఆలోచన ఎప్పుడూ తెలివిగానే ఉంటుంది చిన్నమ్మ…! అందుకే నువ్వంటే నాకు ఇష్టం…’ అంది రత్తాలు. ‘నువ్వు మా తెలివిగలదానివే రత్తాలు! అటూ… ఇటూ… ఇరుపక్షాన మాట్టాడతావు. అదిసరేగానీ.. వచ్చే ఆదివారం మన ఆడోళ్లందరికీ మీటింగ్‌. ఈ బిటి వంకాయ గురించే.. అందరికీ చెప్పు…’ అంటూ.. ‘ఏమయ్యో.. అట్టా సోద్యం చూడక.. ఆ సన్నీళ్లోసిన బొక్కెన ఆ జామచెట్టుకాడ ఉంది పట్రా ఉడుకునీళ్లు తొలుపుతా.. తానం చేద్దువు..’ గద్దించినట్లే చెప్పింది మల్లి. ‘ఏంటే మా కాక మీదున్నావు..’ అన్నాడు వెంకటయ్య. ‘పొద్దెంక కాసింత చూడు.. అట్టా సూత్తా కూకుంటే.. అర్దరేత్తిరవుద్ది… నానోరే నీకు ఇనపడిద్దిగానీ.. నీ సేట్టలు అగుపించవుగందా..!’ అంటూ కొంగు దులుపుకుని నడుం చుట్టూతా తిప్పి బొడ్డులో దోపుకుని ఇంట్లోకి వెళ్లింది మల్లి.
వెంకటయ్య బక్కెట్‌ తీసుకొని స్నానం చేయడానికి వెళ్లాడు.
000
ఆడోళ్లందరూ ఒకచోట సమావేశమయ్యారు.
అప్పుడే మర్రిచెట్టు దగ్గర తెల్లకారు ఆగింది. కారులో నుంచి దిగాడు ఆదిత్యవర్థన్‌. మల్లి ఆయన వద్దకు పరుగున వెళ్లి ‘దండాల బాబూ! అంటూ వంగొని రెండు చేతులు జోడించింది మల్లి. మీకోసమే ఆడోళ్లంతా కనిపెట్టుకున్నారు.. రండి బాబూ..!’ అంటూ సాదరంగా ఆహ్వానించింది మల్లి. మల్లి అంటే ఆయనకు ఎనలేని అభిమానం. చదువుకోకపోయినా విషయాన్ని జాగ్రత్తగా విని సందేహాలుంటే అడిగి తెలుసుకుని, పదిమందికి చెప్పడం చూసి చాలా ముచ్చటేస్తుంది ఆదిత్యవర్థన్‌కు. మల్లి చదువుకునే ఉంటే ఇంకెంత బాగుండేది అని చాలాసార్లు అనుకున్నాడు ఆదిత్యవర్థన్‌. ‘చానామంది ఆడోళ్లు వచ్చారు బాబూ! మీరు ఆళ్లకు అర్థమయ్యేటట్టు మనం ఏమేమి చెయ్యాల్నో వివరించాలా..! అన్న మల్లి మాటలతో… ‘ఆ…ఆ… అలాగే.. పదమ్మా…’ అంటూ సమావేశం దగ్గరకు వచ్చాడు ఆదిత్యవర్థన్‌.
‘సోదరీమణులందరికీ నా నమస్కారాలు!
నాకు ప్రభుత్వం ఈ బిటి వంగకు ఆమోదం తెలిపిన నాటి నుండి నిద్రపట్టడం లేదు. నిజం చెపుతున్నా… దానివల్ల అన్నిరకాలుగా ఇటు రైతులకూ.. అటు ప్రజలకూ.. నష్టమే తప్ప లాభం లేదు. మన ప్రభుత్వం విదేశీ కంపెనీల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది’ అంటూ ‘బిటి వంగ’ విత్తనం నాటితే కాయలోకీ విషం ఎక్కుతుందనీ, దాన్ని తినడం వల్ల వచ్చే అనర్థాలు, భూమి, వాతావరణం ఎలా కాలుష్యమవుతుందో వారికర్థమయ్యే భాషలో చక్కగా వివరించాడు ఆదిత్యవర్థన్‌. ఆఖరులో ‘ఆమోదం తెలిపి ప్రభుత్వం ఒకందుకు మంచి పనే చేసింది. ఇప్పుడు వంటింట్లోంచే పోరాటం ప్రారంభించాలి..! ఆనాడు లెనిన్‌ చెప్పినట్లు ‘ప్రతి వంటగత్తె ఒక పోరాటయోధురాలే’ మీరంతా కలిసి వంకాయను అసలు వండటం మానేయండి. మీ మగాళ్లు తెచ్చినా వండకండి…! ఇలా మొదలైన నిరసనే పెద్ద ఉద్యమం కావాలి. దీని ఫలితం ఎలా ఉంటుందో మీరే ఆచరణలో చూద్దురుగానీ. ముందు మీరంతా కలిసికట్టుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మరో ఐదుగురికి ఈ విషయం చెపుతూ మన రాష్ట్రమంతా ఈ ఉద్యమం జ్వాలలా వ్యాపింపజేయాలి..! ఆ విదేశీ కంపెనీ తోకముడుచుకొని పారిపోవాలి. దానికి కొమ్ముకాస్తున్న మన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి…’ ఆవేశంగా చెప్పి, అందర్నీ ఉత్సాహపరిచాడు ఆదిత్యవర్థన్‌..
ఆడవాళ్లు పూనుకుంటే పని పూర్తయ్యేవరకూ ఆగరనే నానుడి ఎట్లాగో ఉంది. అది ముమ్మాటికీ నిజమేనన్నట్లు చేశారు ఈ మహిళలు. అందరూ ఒకర్నించి ఒకరికి విషయం చేరవేసుకొని వంకాయను కొనకుండా, వండకుండా, తినకుండా అడ్డుకున్నారు. అంతే రాష్ట్రమంతా వంకాయ అమ్మకాలు ఆగిపోయాయి. సాగు చేయడానికీ రైతులెవ్వరూ ముందుకు రాలేదు. వేసిన రైతులకు దిగుబడి ఎక్కువరావడాన రేటు పడిపోయింది. విసం కాయలని ఎవరూ కొనడానికీ రావడం లేదు. దేశం మొత్తం ఆందోళనలు మొదలయ్యాయి. గుంపులు గుంపులుగా మహిళలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వీళ్లకు రైతుసంఘాలు, మహిళాసంఘాలు, రాజకీయపార్టీలు తోడయ్యాయి. ఉద్యమం మరింత ఉధృతమైంది. ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. ‘మాకు ఇసం కాయలు పెట్టడానికా మీకు ఓట్లేసి పదవప్పజెప్పిందంటూ’ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రధాని, విదేశీ కంపెనీ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. అసెంబ్లీనీ, పార్లమెంటునూ చుట్టుముట్టారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. అంతేకాకుండా అసెంబ్లీలో, పార్లమెంటులో ‘వంకాయ’పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ‘బిటి వంకాయ వంగడం వద్దని’ అసెంబ్లీలో, పార్లమెంటులో తీర్మానం చేసి, ప్రభుత్వం ప్రజల పోరాటానికి ప్రధానంగా మహిళాశక్తికి తలవంచింది.
మల్లి తన గ్రామంలో అభినందనసభ ఏర్పాటు చేసి, ఆదిత్యవర్థన్‌ను ఆహ్వానించింది. సభలో ఆదిత్యవర్థన్‌ మాట్లాడుతూ.. ‘పోరాడారు.. గెలుపు సాధించారు..!’ అంటూ మొదట మహిళల పోరాట పటిమను అభినందించాడు.
‘అంతేకాదు..! మహిళలు ఏ పనిచేసినా… పోరాటం చేసినా… నిజాయితీతో, పట్టుదలతో చేస్తారు. విషయాన్ని ఒకరి నుంచి ఒకరికి ఎంతో బాధ్యతతో చెప్పి తమ మాతృత్వాన్ని మరోసారి చాటుకున్న తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆదర్శం.. విదేశీ కంపెనీలను తిప్పి కొట్టడం అంటే సామ్రాజ్యవాదాన్ని తిప్పి కొట్టడమే.. ఇన్నాళ్లూ ఎందరో మహానుభావులు కన్న కలలు ఇవి. వారి కలల్ని మీరెంత సులువుగా సాకారం చేశారు? నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే మీరంతా మీ హక్కుల సాధన కోసమే కాకుండా ఇలాంటి ప్రజా సమస్యలన్నింటిపై పోరాడండి.. పోరాడితే గెలుపు మీదే.. మీదే గెలుపు..! ‘ అంటూ రెండు చేతులు పైకి పెట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేశాడు ఆదిత్యవర్థన్‌. మహిళలంతా లేచి నిలబడి తమ చేతులూ పైకెత్తి చప్పట్లు లయబద్ధంగా కొట్టడం ప్రారంభించారు.. ‘ఆదిత్యవర్థన్‌కు జై! డౌన్‌ డౌన్‌ బిటి వంగ..! మేమే గెలిచాం..! గెలుపు మాదే.. మాదే గెలుపు..!’ అంటూ నినాదాలు చేశారు.. ‘మహిళలు ఎక్కడ పోరాడతారో… అక్కడ గెలుపు తథ్యం…’ అంటూ ‘ఇక సెలవు సోదరీమణులారా! ఇదే స్ఫూర్తి కొనసాగించండీ..!’ అంటూ చేయి ఊపుతూ వేదిక దిగి కారు వద్దకు దారితీశాడు ఆదిత్యవర్థన్‌.. మహిళలంతా ఆయనతో పాటే కారు వరకూ వెళ్లి కనిపించడం ఆగిపోయే వరకూ చేతులూపారు. ఆదిత్యవర్థన్‌కు హాయిగా, తృప్తిగా ఉంది. ఇంటికెళ్లి ఆ రాత్రి గుండెలమీద చేతులేసుకొని హాయిగా నిద్రపోయాడు ఆదిత్యవర్థన్‌.
- శాంతిశ్రీ

0 Response to "గెలుపు"

కామెంట్‌ను పోస్ట్ చేయండి