మంచు బాగా కురుస్తుంది.. ఒకరికొకరు కనపడటం లేదు. బాగా దగ్గరకు వస్తే గానీ ఒకరి ముఖాలు ఒకరికి కనబడవు. అందులో ఈ చలికి దుప్పట్లు తలమీద నుంచి కప్పేసుకోవడంతో దగ్గరగా వచ్చినా గుర్తుపట్టలేని పరిస్థితి. ఆకాశంలో మబ్బులు నేలమీద ఉన్నాయా అన్నట్లు ఉంది వాతావరణం.
కోడి కూయక ముందే లేచాడు సుబ్బయ్య. గడియారం రెండు కొట్టింది. ఆ మబ్బులో వెళితేగానీ బంతి పూలు కోసి మార్కెట్‌కు వేయడానికి కుదరదు మరి. గట్టిగా ఎత్తి పడేస్తే పార్టులన్నీ ఊడిపోయేలా ఉన్న సైకిల్‌ను తీసుకొని పై పంచను చెవుల మీదుగా తలంతా చుట్టి, చూరులోని వేప పుల్లను తీసుకొని నోట్లో పెట్టుకొని బయల్దేరాడు సుబ్బయ్య. సైకిల్ నడుపుతూ ఉంటే కిర్రు కిర్రుమని చప్పుడు వినిపిస్తోంది. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఈ మంచువల్ల రోడ్డు అస్సలు కనపడటంలేదు. ఎంతో కష్టంగా వెళుతున్నాడు సుబ్బయ్య. ఎట్టకేలకు పొలం చేరాడు.
పూలు కోయడానికి అప్పటికే అక్కడకు వచ్చి ఉన్న రంగడితో..
‘ఏరా రంగడూ ఎంతసేపైంది వచ్చీ…’ అన్నాడు సుబ్బయ్య
‘ఇప్పుడే వచ్చా పెదనాన్నా!…’ అన్నాడు రంగడు.
ఇద్దరూ కలిసి బంతిపూలను కోయడంలో మునిగిపోయారు. పూలన్నీ తెంపడానికి రెండు గంటలు పట్టింది. నోట్లో వేపపుల్లను ఒకసారి పళ్లన్నింటిమీద రుద్దేసి తుపుక్కున ఊసాడు సుబ్బయ్య. దాన్ని నిలువుగా చీల్చి నాలుక గీసుకొని కాలువ దగ్గరకు వెళ్లి దోసిట్లో నీళ్లు తీసుకొని నోట్లో పోసుకొని పుక్కిలించి ఊసాడు. మరో దోసలితో నీళ్లు తీసుకొని ముఖం కడుక్కొన్నాడు. ఆ తర్వాత తెంపిన పూలన్నీ తడిపి ఉంచిన పల్చటి గోనె సంచిలో వేసి సైకిల్ వెనకాల పెట్టుకొని పూలమార్కెట్‌కు బయల్దేరాడు సుబ్బయ్య. అక్కడకు వెళ్లాక పూలన్నీ టోకుగా కొనే మస్తాన్‌కు ఇచ్చాడు సుబ్బయ్య. మస్తాన్ ఇచ్చిన డబ్బులు లెక్కేసుకుంటే రంగడు ఇవ్వగా తనకు మిగిలేది చాలా తక్కువ అనిపించింది సుబ్బయ్యకు. ‘ఎంత కష్టపడినా ఫలితం ఇంతే’ అని గొణుక్కుంటూ..
‘కేజీకి ఒక రెండు రూపాయలు పెచ్చివ్వరాదూ’ మస్తాన్‌ని అడిగాడు సుబ్బయ్య. ‘అసలే మంచు కురుస్తుంది. ఆ తడికి పూలు బరువు ఎక్కువవుతుంది. నాకే లాసు సుబ్బయ్యా!.. ఇంకా పెచ్చెక్కడివ్వను..’ ‘మీకస్సలు లాభమే లేదన్నట్టు చెబుతావేంటి సేటు.. ‘అన్నాడు సుబ్బయ్య.
‘లాభం లేకపోతే ఇంక వ్యాపారం ఏం చేస్తాం సుబ్బయ్యా? కాకపోతే ఈసారి చూద్దాంలే.. ఇవ్వాల్టికి ఇంతే ఇచ్చేది’ ఖచ్చితంగా చెప్పాడు మస్తాన్. ‘ఈ సారైనా ఇస్తావో.. ఇంకేం కతలు చెప్తావో.. ఏమైనా నా రాత బాగోలేదులే…. మేం ఎంత కట్టపడ్డా ఆఖరుకు ఏమీ మిగల్టంలేదు. సరే వస్తా మరి…!’ అన్నాడు సుబ్బయ్య.. ‘మంచిది సుబ్బయ్యా…!’ అని ఎక్కడ ఎక్కువ ఇమ్మని పట్టుపడతాడో అనుకున్నా’ అని ఊపిరి పీల్చుకున్నాడు మస్తాన్.
సుబ్బయ్య ఇంటికి చేరేటప్పటికి టైము ఐదున్నర దాటింది. అప్పటికే పార్వతమ్మ లేచి పాచి ఊడ్చి, పేడకళ్లాపి చల్లి, ముగ్గులు పెట్టేసింది. గేదె దగ్గర బాగు చేసి పాలు తీసేసింది. సుబ్బయ్య వచ్చేటప్పటికీ టీ రెడీగా ఉంచింది. ఇవన్నీ పార్వతమ్మ లేచిన దగ్గర నుండి రోజూ చేసే పనులే.
సుబ్బయ్య సైకిల్‌కి స్టాండు వేసి, తలకు చుట్టిన పైపంచ తీసి బాగా దులిపి, భుజం మీద వేసుకొన్నాడు. పంచ చివరి అంచును చేత్తో అందుకొని బొడ్లో దోపుకొని కాళ్లూచేతులు కడుక్కొని కాళ్లు జాపుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని కూర్చున్నాడు.
‘ఏందయ్యా.. ఇవ్వాళ ఆలస్యమైంది’ అంటూ సుబయ్యకు టీ గ్లాసు అందిస్తూ అడిగింది పార్వతమ్మ.
వేకువజాము నుంచి చలిలో తడిసి ఉన్నాడేమో.. వేడి వేడిగా టీ తాగుతుంటే చాలా హాయిగా అనిపించింది సుబ్బయ్యకు. దాన్ని ఆస్వాదిస్తున్న సుబ్బయ్యకు పార్వతమ్మ మాట చెవిన పడలేదు.
‘ఏవయ్యోవ్.. నిన్నే అడిగేది.. ఏంటి ఆలస్యమైందని అడుగుతున్నా’ కాస్త గట్టిగా అరిచినట్లే అడిగింది పార్వతమ్మ.
‘ఏంటే.. ఓ అంతలా అరుస్తున్నావ్.. నాకేమన్నా చెముడనుకున్నావా..?’ అన్నాడు సుబ్బయ్య.
‘ఆ…నెమ్మదిగా చెపితే వినిపించుకోవుగానీ.. గట్టిగా చెపితే మాలావు కోపం వచ్చేస్తందే నీకు… నీతో నాకు చావుగా ఉందనుకో…’ అంది పార్వతమ్మ కాస్తంత విసుగ్గా.
‘ఆ అక్కడ ఆడుకొని వస్తున్నానే…!’ ఇంకాస్త రెచ్చగొట్టినట్లు మాట్లాడు సుబ్బయ్య..
‘ఆ.. ఆడుకో.. నాకేంటి?…’ అంటూ కొంగు దులుపుకుంటూ నడుంచుట్టూ తిప్పి బొడ్లో దోపుకుని వంటింట్లోకి వెళ్లి ఒక చట్టి (గిన్నె) తీసుకొని బయటకు వచ్చింది పార్వతమ్మ. ‘పొలం నుండి గోంగూర కొంచెం దొరికితే తెచ్చాను. కొంచెం ఎండ్రొయ్యలేసి వండు’ అన్నాడు సుబ్బయ్య. ‘చూశాములే.. ఈటికి మాత్రం లోటురానీవు…’ అనుకుంటూ ఆ గోంగూరలో కాడలు ఏరుతూ అక్కడే గోడకానుకుని కూర్చింది పార్వతమ్మ.
‘ఏమయినా వయస్సు ముదిరినా కోపం తగ్గటం లేదే నీకూ…’ అన్నాడు సుబ్బయ్య.. ‘నీకు తక్కువైందేంటీ నాకు తక్కువవడానికీ…’ అంటూ బదులిచ్చింది పార్వతమ్మ. ‘మాట మిగుల్చుకోవుగందా..? నాటి నుండి నీ వరసంతే..’ అన్నాడు సుబ్బయ్య. ‘ఒట్టి పుణ్ణానికి నేనెందుకు మాటపడాల….’ అంది పార్వతమ్మ.. ‘ఓసోసి… ఇక ఆపోసే…’ అన్నాడు సుబ్బయ్య.
‘సరేలే సంబడం గానీ… ఆ వీరన్న నీకోసం వచ్చెళ్లాడు…’ చెప్పింది పార్వతమ్మ. ‘ఏంటంటా సంగతి?’ అడిగాడు సుబ్బయ్య. ‘ఆనిక్కి పెద్దబావి కాడున్న మర్రిచెట్టు దగ్గరకు రమ్మన్నాడు.. అందరికీ.. ఏదో మీటింగంట…చెప్పాడు..’ అంది పార్వతమ్మ.
‘మీటింగ్ దేనికో..చెప్పలేదా వీరిగాడు…’ అన్నాడు సుబ్బయ్య. ‘పొలాల విషయమనుకుంటా….’ అంది పార్వతమ్మ
‘ఏం పొలాలో.. ఏం వ్యవసాయమో… ఏమోనే.. లాభం సంగతి దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి వస్తదో రాదో అన్న దిగులు కొన్నాళ్లయితే.. ఏసిన పంట మొలుత్తదో… మునుగుద్దో.. తెలియకుండా ఉంది ఈ వాన రాకడ.. పోకడ..’ నిట్టూరుస్తూ నులక మంచం వాల్చుకున్నాడు సుబ్బయ్య.
కండవానే మడిచి తలకింద పెట్టుకొని ఒడ్డిగిల్లాడు సుబ్బయ్య. అలా నిట్టూరుస్తూ పడుకున్న సుబ్బయ్యను చూస్తే ఉస్సూరుమనిపించింది పార్వతమ్మకు.
వారి మధ్య ఇటువంటి గొండాటలు మామూలే. ఇంత గొడవపడ్డా ఎంతో ఆప్యాయంగా ఉంటారు వాళ్లిద్దరూ. అర ఎకరం సొంతదైతే. రెండకరాలు కౌలుకు చేస్తుంటాడు సుబ్బయ్య. అరెకరంలో వరి పండిస్తూ, కౌలుకు తీసుకున్న రెండెకరాల్లో లిల్లీలు, బంతిపూలు, ఒక్కొక్కసారి అరటి వేస్తుంటాడు. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. వారికి పెళ్ళిళ్లు అయినా ఒకరి మీద ఆధారపడకుండా ఓపికున్నన్నాళ్లూ కష్టపడాలన్నది సుబ్బయ్య సిద్ధాంతం. అందుకే డెబ్భై ఏళ్లు మీదపడినా కష్టపడుతున్నాడు సుబ్బయ్య. చివరి పిల్ల పెళ్లి అప్పు, పొలం పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చటానికి భార్యాభర్తలిద్దరూ కష్టపడుతున్నారు. పార్వతమ్మ కూడా పొలం పనికెళ్లడమే కాకుండా ఒక గేదె పాడి చేస్తూ నాలుగైదు కుటుంబాలకు పాలమ్ముతోంది.
000
వంటపని ముగించుకొని, తల దువ్వుకొని, సుబ్బయ్యకు, తనకూ క్యారేజీ కట్టుకొని ‘లేవయ్యా.. ఎండెక్కుతుందీ…’ అంది పార్వతమ్మ.
దిగ్గున లేచి.. తొట్టి దగ్గరకెళ్లి చెంబుతో నీళ్లు తీసుకొని చేతులోకి వంచుకొని మొహం మీద పోసుకున్నాడు సుబ్బయ్య. దబా దబా ముఖం రుద్దుకొని, పై పంచతో ముఖం తుడుచుకొని పార్వతమ్మ చేతిలోని క్యారేజీ అందుకుని ‘ఎండ్రొయ్యలు మరిన్ని వేశావా?’ అన్నాడు సుబ్బయ్య.
‘ధరలు మండిపోతుంటే నీకు రుచెక్కువవుతోంది.. ఉన్నమట్టుకు ఏసి వండా.. పద.. పద.. కొండమీద శివ, జానకమ్మ నాకోసం రోడ్డుమీదకొచ్చి చూత్తా వుంటారు.. ‘ అంటూ తొందరపెట్టింది పార్వతమ్మ.
సుబ్బయ్య, పార్వతమ్మ వీళ్ళ పొలాల్లో చేసుకోవడమే కాకుండా వేరేవాళ్ల పొలాలకు కూలికి వెళతుంటారు.
కొద్ది దూరం నడిచారో లేదో పార్వతమ్మ కోసం బుల్లమ్మాయి ఎదురొస్తూ.. ‘ఏంది చిన్నమ్మా…! ఆలస్యమైంది.. రోజూ నువ్వే ముందొచ్చి మమ్మల్ని పిల్చేదానివి.. లెగలేదా ఏంటి అని కనుక్కుందామని వస్తున్నా…’ అంది.
‘మీ చిన్నమ్మకేమయింది.. పడుచుపిల్లలా ఉంటే.. ‘ అంటూ పరాచకాలు ఆడాడు సుబ్బయ్య. ‘మా బాబాయి ఏంటి జోరుమీదున్నాడు…’ అంది బుల్లమ్మాయి… ‘మీ బాబాయికి వయస్సు మీదపడ్తున్న కొద్దీ.. నాజూకుపోతున్నాడు…’ అంది పార్వతమ్మ. నవ్వుకుంటూ సైకిల్ ఎక్కి వెళ్లిపోయాడు సుబ్బయ్య.
ఆడవాళ్లందరూ పొలంపనులకు బయల్దేరారు. ఒక చేతిలో కొడవలి, మరో చేతిలో క్యారేజీ, భుజాన ఒక పాత కండవా వేసుకొని, తలలకు నూనె పెట్టి నున్నగా దువ్వుకొని, ఎర్ర ముద్దమందారాలు సిగల్లో తురిమారు… పల్లె అందమంతా వాళ్లల్లోనే తొణిసికలాడుతోందా అన్నట్లు ఉన్నారు. తమ తమ ఇళ్లల్లో జరిగిన విషయాల దగ్గర్నుంచి మొదలుపెట్టి.. ఊళ్లో విషయాలు.. కరువు, వరదలు వరకూ చెప్పుకుంటూ… నడుస్తున్నారు.. ఈలోపు పొలం వచ్చింది.. దొండకాయలు కోసే పని.. ఇక అందరూ ఆ పనిలో పడిపోయారు.
000
మధ్యాహ్నం భోజనం కోసం అందరూ పనిని ఆపేసి ఏటి వద్దకు వెళ్లారు. అందరూ కాళ్లూ చేతులు కడుక్కొని, దోసిలితో నీళ్లు తీసుకొని ముఖాలు కడుక్కున్నారు. చెట్టు నీడన అందరూ కూర్చున్నారు. తెచ్చుకున్నవి అందరూ పంచుకుని భోజనాలు ముగించారు.
‘నీ గోంగూర ఎండ్రొయలు కూర బాగుంది అత్తమ్మ…మరింత పట్టుకురాకపోయావా?’ అడిగింది లక్ష్మి.
‘నీకూ నీ మామకూ ఎంతతిన్నా కుతి తీరదులేవే…’ అంది పార్వతమ్మ.
‘సీతమ్మక్క తెచ్చిన నల్లగారం చాలా బాగుంది. శివ చిన్నమ్మ తెచ్చిన గొడ్డుకారం పచ్చడిలో నీరుల్లి నంజుకొంటే ఎంత రుచిగా ఉందో.. మల్లేశ్వరక్కారు తెచ్చిన ఎండుచేపలు, వంకాయ పులుసు తింటుంటే నోట్లో నీళ్లూరుతున్నాయనుకో…’ ఇట్లా… వాళ్లు ఒకరు తెచ్చింది మరొకరు నోరూరేట్లు చెప్పుకోళ్లు.. మెప్పుకోళ్లతో.. భోజనం ముగించారు. అందరూ ఏటికాడికి పోయి క్యారేజీలు కడుక్కొని, ఒక గిన్నెతో ఏటిలో తేటగా ఉన్నచోట నీళ్లు ముంచుకొని చెయ్యి అడ్డంగా ఆనించి మంచినీళ్లు తాగారు.
మళ్లీ పనిలోకి దిగారు. ఎవరి పనిలో వాళ్లు పడిపోయారు. వాళ్లందరికీ శివమ్మ ముఠామేస్త్రీ..
‘ఏందే శివా…! ఈ తడవతో దొండకాయలు అయిపోతాయా..? మళ్లీ ఇంకో వారానికి కోతకు వస్తాయా?’ అడిగాడు చేను యజమాని శివారెడ్డి. ‘మళ్లీవారం కొయ్యాల్సిందే బాబారు..! చెరి సగంగా ఉన్నాయి….’ బదులిచ్చింది శివ.
ఇద్దరు మనుషులు గోనెసంచి విడదీసి పట్టుకుని ఉంటే.. అందరూ తాము కోసిన కాయల్ని గంపల్లో తెచ్చి వరుసగా సంచిలో దిమ్మరిస్తున్నారు.
అందరూ దిమ్మరించాక చీరలను కండవాతో దులుపుకొన్నారు. ఉదయం నున్నగా దువ్వకుని వెళ్లిన వాళ్ల తలలు ఇప్పుడు బాగా రేగిపోయి ఉన్నాయి. ఆ దొండ పాదుల్లో కాయల్ని వెదికి వెదికి కోయడమేమో.. ఆ తీగలు పట్టుకొని జుట్టు మరీ రేగిపోయింది. చేత్తోనే తలను సరిజేసుకొని నుంచున్నారు. చేను యజమాని అందరికీ తలాకొన్ని దొండకాయలు పెడుతుంటే కండవాల్లో మూటగట్టుకున్నారు. ఎవరి సామాను వాళ్లు చేత్తో పట్టుకుని ఇంటికి దారి తీశారు.
‘ఆనిక్కి మర్రిచెట్టు కాడ మీటింగ్ అంట… పొద్దుగాల వీరన్న వచ్చి చెప్పిపోయాడు’ అంది పార్వతమ్మ. ‘అవును ఇందాక శివారెడ్డి బాబారు కూడా అంటున్నాడు…’ అంది శివ. ‘అందరికీ అంట… ఏందో విషయం’ అంది పార్వతమ్మ. ‘పొలాలన్నీ ఎకరాలెకరాలు కలిపి ప్రభుత్వమే తీసేసుకుంటుందంట! రాత్రి మామయ్య చెప్పాడు’ అంది శివ. ‘ఆళ్లు తీసేసుకుంటే ఎట్టా.. మన పరిస్థితేంటి?’ అంది పార్వతమ్మ. ‘డబ్బులు లెక్కగట్టి ఇస్తారేమో…?’ అంది శివ.
‘ఇక్కడ అమ్ముకోనీకి ఎవరున్నారు…? అమ్ముకొని ఏం తినాలి? ఎలా బతకాలి? గడ్డి తినాలా..? అమ్ముకుంటే బాగుపడేదయితే ఎప్పుడో అమ్ముకునేవాళ్లంగా…’ అంటూ ఆవేశంగా అంది పార్వతమ్మ. ‘ఏమో మనోళ్లేమంటారో.. ఆనిక్కి మీటింగులో ఏం తేలుత్తారో చూద్దాంలే పిన్నాం.. ఎందుకంత ఆవేశపడతావు.. అనంగానే అయిపోద్దా ఏంటి…?’ అంది మల్లేశ్వరి.
అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
000
ఇంటికొచ్చి క్యారేజీ వసారాలో పెట్టి. ముఖం కాళ్లూ కడుక్కొని కండవాతో ముఖం తుడుచుకొంటూ ‘మీటింగు కాడి కెల్లొత్తా..’ అంటూ ఒక కేకేసి దారితీశాడు సుబ్బయ్య.
‘టీ అన్నా తాగకుండా ఆవంతునే పోతున్నావేంటి…?’ గబ గబా బయటకు వచ్చి అంది పార్వతమ్మ.
‘ఆడ తాగుతాన్లే… ఇప్పటికే ఆలస్యమైనాదీ.. మళ్లీ మబ్బులో లెగాలి..’ అంటూ వెళ్లిపోయాడు సుబ్బయ్య.
సుబ్బయ్య వెళ్లేసరికి మీటింగ్ ప్రారంభమైంది. అందరూ చాలా ఆందోళనగా కనిపించారు సుబ్బయ్యకు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతున్నాడు.
‘అందిరికీ నమస్కారం! ప్రభుత్వం మన భూముల్ని తీసుకొని, ఆ పొలాలన్నీ కలిపి పెద్దగా చేసి, ఒక సాలు కింద సాగు చేస్తారు. మిషన్లన్నీ తెచ్చి మీకన్నా ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేలా సేద్యం చేస్తారు. లాభాలే లాభాలు… అందులో మీకందరికీ వాటా ఇస్తారు. మీరిక మబ్బుల్లో లేచి, రెక్కలు ముక్కలు చేసుకోనక్కరలేదు. వాలుకుర్చీలో కూర్చుని నోట్లో చుట్ట పెట్టుకుని, దమ్ములాగుతూ హాయిగా కాలుమీద కాలేసుకుని దర్జాగా బతకొచ్చు…! మీ పొలాలన్నీ తీసుకొని కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటారు. ఒక్క వేలిముద్రేశారంటే చాలు… మీరంతా గుండెల మీద చేయేసి హాయిగా నిద్రపోవచ్చు. మీ వాటాగా ఏడాదికి 50వేల రూపాయలు మీకూ అందుతూ ఉంటాయి. అంతేకాదు ఐదేళ్లు పోయాక మీ భూములు మీకు కావాలంటే ఇచ్చేస్తారు’ అంటూ ముగించాడు.
‘అదేంటి భూములిస్తామని చెపుతున్నారు’ అంటూ లక్ష్మారెడ్డి చెవిలో పక్కనే ఉన్న సర్పంచ్ బామ్మర్ది వెంకట్రావు అడిగాడు.
‘నువ్వు నోర్మూస్తావా? భూములు తిరిగి రావని చెపితే ఒక్క నాకొడుకు కూడా సంతకం పెట్టిచావడు. అసలు మన రైతులకు భూమంటే ప్రాణంతో సమానం.. అందుకే అట్టా అబద్ధమాడా…! నువ్వు అరవకుండా కూర్చో’ కోపంగా అన్నాడు లక్ష్మారెడ్డి.
రైతుల్లో చాలా మందికి ఎమ్మెల్యే మాటలు ఉషారు పుట్టించాయి. చిన్న చిన్న రైతులైన సుబ్బయ్యల్లాంటి వారికి మాత్రం అయోమయంగా ఉంది.
ఈలోపు వెంకట్రావు (అందరూ ‘సర్పంచ్ బామ్మర్ది’ అనే పిలుస్తారు) మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘మీకు మన లక్ష్మారెడ్డిగారే భరోసా! మీరేమాత్రం కంగారుపడొద్దు.. మన ముఖ్యమంత్రిగారు రైతుల పక్షపాతి. మీరు ఆలోచించకుండా కళ్లు మూసుకుని సంతకాలు పెట్టెయ్యొచ్చు. ఇన్నాళ్లూ కష్టపడ్డ మీరంతా ఇక సుఖంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రిగారిది, మన వ్యవసాయమంత్రిగారి కోరిక. మీ అందరికీ తలో సీమ మందు సీసా పంపిణీ చేస్తున్నాం. అందరూ శుభ్రంగా తాగి ఇళ్లకు వెళ్లండి. రేపు సాయంత్రం ఇక్కడే కలుసుకుందాం. అందరికీ కాగితాలు ఇస్తాం మీరంతా వేలుముద్రలేస్తే చాలు. అదృష్టం మీ ఇంట్లో నాట్యం చేస్తుంది. రంగుల టీవీ చూడొచ్చు. చిన్న రైతులు ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు. ఇక మీ మొగుడూ పెళ్లాలూ పనికి పోనక్కర్లేదు. హాయిగా, సంతోషంగా, విలాసంగా మీ జీవితాలు గడపొచ్చు.’ అని ముగించాడు.
సీమ మందు సీసాలను తలకొకటి ఇచ్చారు. అందరూ సొంగలు కార్చుకుంటూ ఎగబడ్డారు. సీసాలు పట్టుకొని అక్కడకక్కడే తాగేసి కొందరు రైతులు ‘ఎమ్మేల్యేగారూ..! ఇప్పుడే ఏసేత్తాం.. ఏలుముద్రలు..కాయితాలు పట్రండి…!’ అంటూ అదుపు తప్పిపోయారు. సర్పంచ్‌బామ్మర్ది యమ ఉషారుగా పాతికమంది చేత వేలుముద్రలేసే వాళ్లతో వేలుముద్రలు, సంతకాలు పెట్టేవాళ్లతో సంతకాలు పెట్టించుకున్నాడు.
ఏదో పండగలకూ పబ్బాలకూ ఒక చుక్క వేసుకొనే అలవాటున్న సుబ్బయ్యకు ఈ సీమ మందు రుచి చూడాలనిపించి సీసా తీసుకొని ఇంటి దారి పట్టాడు.
000
‘ఏమైంది మీటింగు….?’ గడపలోకి కాలుపెట్టడమే అడిగింది ఆత్రంగా పార్వతమ్మ.
‘కొంచెం ఆగుతావా.. ఎందుకంత తొందర’ చికాగ్గా అంటూ వాల్చి ఉన్న నులక మంచంలో కూలబడ్డాడు సుబ్బయ్య.
‘చేతిలో ఆ సీసా ఏంటి?.. ఈ మీటింగేనా…?’ అంటూ సమాధానం చెప్పని సుబ్బయ్యను నిలదీసింది పార్వతమ్మ.
ఇంతలో ఆడోళ్లందరూ గుంపుగా లోపలికి వచ్చారు.
వాళ్ల వెనకే రాఘవయ్య కూడా వచ్చాడు.
అందరూ ఇలా వచ్చేసారేంటా అని ఆశ్చర్యపోతూనే అందరూ కూర్చోడానికి చాపలు తెచ్చి పరిచింది పార్వతమ్మ.
‘అందరూ కూకోండి..! ఏంటీ ఇలా పోటెత్తారు?’ అంది పార్వతమ్మ.
‘మీటింగ్ గురించే.. మన రైతుసంఘం రాఘవయ్య బాబారు వచ్చేటప్పటికీ మనోళ్లు మర్రి చెట్టుకాడ తాగి పడిపోయినారంట చిన్నమ్మా!’ చెప్పింది బుల్లమ్మాయి.
సుబ్బయ్య కూడా లేచి రాఘవయ్యకు కుర్చీ వేశాడు.
‘అందరూ కూర్చోండమ్మా! మన రైతులందరికీ విషయం చెబుదామని వచ్చేలోపే జరగాల్సింది జరిగిపోయింది. మీకన్నా విషయం చెప్పకపోతే చాలా నష్టపోతారు’ అంటూ రాఘవయ్య మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘ఈ ప్రభుత్వం మన వాళ్ల భూములను అమ్మమంటుంది. వచ్చే డబ్బులకు బదులుగా ఏదో కంపెనీలో షేర్ (వాటా) లు ఇస్తారట! అంతా కంపెనీవారే చూస్తారు. ఈ కంపెనీలో సర్పంచ్, ఆయన బామ్మర్దికే పెత్తనం ఉంటుంది. మీ భూములు లాక్కొని మీ నోట్లో మన్ను కొట్టాలని చూస్తోంది. ఆ ఎమ్మేల్యే లక్ష్మారెడ్డి, సర్పంచ్ బామ్మర్ది వెంకట్రావు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మకండి. ఒకసారి కాగితాలు మీద సంతకాలు చేసి ఇచ్చాక భూమి మీద ఆశ వదులుకోవల్సిందే. వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. ఎప్పుడు కరువొస్తదో, ఎప్పుడు వరదొస్తదో తెలియదు. నష్టాలొస్తాయి. అంతెందుకు నాడు చిత్తూరుజిల్లాలోని కుప్పంలో చేసిన ఇలాంటి వ్యవసాయమే ఎగసాయం అయ్యింది. ఎగ్గొట్టి దిగ్గొట్టడమంటే ఇదే.. నష్టమొస్తే మన వాటా ఏమిస్తారు? పనీపాటా లేకుండా ఇళ్లల్లో హాయిగా ఉండాలా? హాయిగా ఉండటం కాదు మనవాళ్లుభూమిలేని పేదోళ్లయిపోతారు. సోమరులైపోతారు. భూమి లేక, డబ్బుల్లేక.. రోగమొచ్చినా, రొష్టొచ్చినా చూసే దిక్కులేక తల్లడిల్లిపోవాలి. పిల్లల పెళ్లిళ్లు ఏం పెట్టి చేస్తారు? ఇప్పటి వ్యవసాయ సంక్షోభంలో మన పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. మీలాంటోళ్లందరూ మీ మగోళ్లకు వేణ్ణీళ్లకు చన్నీళ్లులాగా కూలికి పోతున్నారు కాబట్టి మీ బతుకులు ఎలాగోలాగా నెట్టుకొస్తున్నారు. ఆళ్లు చెప్పేది ‘సహకార సేద్యమూ’ కాదు మన్నూ కాదు.. అంతా కంపెనీ సేద్యం… కాంట్రాక్టు సేద్యం.. కానీ, ఈ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీకు తప్పుడు సమాచారం ఇచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి, మోసపుచ్చుతున్నాడు. మీ భూములు అమ్మినాక మళ్లీ మీకెట్లా వస్తాయి? సేద్యమంతా యంత్రాలమీదే నడిపిస్తారు. మహా వుంటే ఊరంతాలో పాతికమందికి కూడా పనుండదు. మీకస్సలు పనులుండవు. అందరూ ఇంట్లో కూర్చోవాలా? నష్టమొస్తే ఏడ్చి మొత్తుకున్నా మన భూమి మనకిమ్మన్నా ఇవ్వరు… తర్వాత మీ భూముల సరిహద్దులు కూడా మీరు గుర్తుపట్టలేరు. అన్నీ ఒక కమతం కిందకు తెస్తారు. తాగుబోతు సన్నాసులు కొందరు వాళ్ల మాటలు నమ్మి సీమ మందుకు ఎగబడి తాగి సంతకాలు పెట్టేశారు.. ‘ ఆవేశంగా అన్నాడు రాఘవయ్య.
‘ఏంటి ఆళ్లు సంతకాలెట్టింది ఇందుకా? ఇందాక మా మగోళ్లు మరోలా చెప్పారు. ఏడాదికి 50వేల ఆదాయం వత్తదనీ..ఐదేళ్ల తర్వాత భూములు తిరిగిత్తారని చెప్పారే…. ఇంటిరానీ… నా……..ల సంగతి చెపుతాం..! ఈ రోజే తేలుత్తాం… నువ్వు మాకు అండగా నిలబడు బాబారు..! మేమంతా కలిసి ఆ కాగితాలు లాక్కొత్తాం. మందు పోస్తే సరిపోయినాదా? పెళ్లాం, బిడ్డలు ఏమయిపోతారో పట్టదా? మంచి, చెడ్డా ఆలోచించే పనిలేదా? అంతా వీళ్లిట్టమేనా? పీకల్దాకా తాగి ‘నా…… లు’ ఆ లెక్కన సంతకాలు ఎట్టేత్తే మా బతుకులే ఏంగావాలా…?’ కళ్లమ్మట నీళ్లు తుడుచుకుంటూనే ఆవేశంగా మాట్లాడింది రత్తాలు.
‘ఓ రత్తమ్మత్తా! ఆందోళనపడమాక.. మనమంతా కలిసి ఆళ్ల సంగతి చూద్దాం.. ఇప్పుడేగా బాబాయి విషయం చెప్పింది. మనకిప్పటి వరకూ విషయం తెలవదు కూడా..’
‘వచ్చినకాడ్నించి ఈ మనిషిని అడుగుతున్నా ఆ సీసా పుచ్చుకుని ఊపుకుంటూ ఇంటికి వచ్చాడుగానీ విషయం చెబితేగా…’ మండిపడింది పార్వతమ్మ.
‘ఓసోసి ఆగేసే…! నేనేమీ వేలుముద్రేసి రాలా.. ఏదో ఉట్టి పుణ్యానికి వస్తోంది కదా! రుచి చూడొచ్చులే అని సీసా ఎత్తుకొచ్చాగానీ.. భూమి అమ్మేస్తే ఎట్టాగురా? అని ఆళ్ల మాటలకు నా బుర్ర తిరిగిపోతుందే.. నీ మాటలతో ఒకటే పాణం తీత్తనావు.. అయినా ఎంతసేపైంది.. ఈలోపు రాఘవయ్య బాబు వచ్చాడు. విషయం చెప్పాడు కదా! ఇప్పటివరకూ ఈ విషయం నాకూ తెలియదు. వాళ్లు సంతకాలు చేస్తే చాలు అంటున్నారు గానీ.. భూమి మీద మీకింకా హక్కులేదన్న విషయం ఈ బాబు చెబితేనే తెలిసింది’ అన్నాడు సుబ్బయ్య.
‘సరేలే.. ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచించండి…’ అంది రత్తమ్మ.
‘ఇక మనముందున్నదే ఒక్కటే మార్గం…. మీ మొగుళ్లు ఇంటికి వచ్చాక ఆ కాగితాలు తెస్తేనే.. తిండీ… పక్కా.. అని చెప్పండి’ అంది ముఠామేస్త్రీ శివ.
‘అద్గది మంచి మాట చెప్పావే శివా! ఈనా…………. లు అక్కడే లొంగుతారు. అప్పుడుగానీ మన బతుకులు బాగుపడవు…’ అంది లక్ష్మమ్మ మొటికలు విరుస్తూ…
‘ఆళ్లు లొంగేవరకూ మనం పట్టుమీదుండాలి…’ చెప్పింది అనుభవజ్ఞురాలు పార్వతమ్మ.
అందరూ అట్టాగే అని లేచారు.
000
వారం తిరక్కముందే సంతకాలు పెట్టినవాళ్లు కూడా కాగితాలు ఇచ్చేయమని సర్పంచ్ బామ్మర్ది వెంకట్రావు మీద ఒత్తిడి చేయడానికి బయల్దేరారు..
‘మా కాయితాలు మాకిచ్చేరు…’ అన్నారు.
‘అలా కుదరదు….ఇవ్వం’ అన్నాడు వెంకట్రావు.
‘ఏం పుట్టిందిరా మీకు.. ఆరోజు నిమషాల్లో సంతకాలు పెట్టేశారు. సీసాలు తీసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు’ కోప్పడ్డాడు లక్ష్మారెడ్డి.
అప్పుడే అక్కడకు రైతుల్నీ, ఆడవాళ్లనూ తీసుకొని రైతుసంఘం వాళ్లు రాఘవయ్య బాబాయి నాయకత్వంలో దండుగా వచ్చారు.
వాళ్లను చూచిన లక్ష్మారెడ్డికి ముచ్చెమటలు పోశాయి. ఏదో ఉపద్రవం రాబోతుందని గ్రహించాడు. అయినా మనస్సులో ధైర్యం చెప్పుకుంటూ పై కండవాతో చెమట చుక్కల్ని అద్దుకుంటూ కూర్చొన్నాడు.
రాఘవయ్య దండు అక్కడకు చేరుకుంది.
‘మా కాయితాలు మాకిచ్చేయాలి..! మా భూములు మాకే కావాలి..! మేమే సాగు చేసుకుంటాం…!’ అంటూ పెద్దఎత్తున అందరూ అరవడం మొదలుపెట్టారు.
చెవులు మూసుకుంటూ… లక్ష్మారెడ్డి.. రెండుచేతులూ పైకి చూపుతూ.. ‘అబ్బ ఆగండాగండి…! ఈ రాఘవయ్యను నమ్ముకొంటే మీ జీవితాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మీకు సుఖపడే యోగం లేకుండా చేస్తాడు. వాళ్లు సుఖపడరూ..? మిమ్మల్ని సుఖపడనివ్వరు….’ అంటూ మాట్లాడుతుండగానే…
‘ఓ ఎమ్మెల్యేగారూ…మాకు అరచేతిలో సొర్గం వద్దుకానీ.. రేపు నట్టాలొస్తే మా పరిస్థితేందయ్యా? మా భూములు మాకు తిరిగిత్తావా? మా పిల్లల పెండ్లిండ్లు కాకపోతే నువ్వు చేత్తావా? ఇవన్నీ నాదీ పూచీ అని మాకు కాగితాలు రాసిస్తావా?’ అంటూ అడిగింది శివ.
‘ఏమే శివా! నువ్వు పనులు చేయించడానికే మేస్త్రీవనుకున్నా.. వీటికి కూడానా..? బాగా పదునుమీదున్నావు.. ఈ వయస్సులో ఆవేశం పాలు కాసింత ఎక్కువే ఉంటుందిగానీ.. ఊరుకోవే… పెద్ద నాయకురాలైపోయావుగానీ….’ ఎకసెక్కంగా అన్నాడు లక్ష్మారెడ్డి.
‘నీ ఎకసెక్కాలెవరూ పడటానికి ఇక్కడెవరూ లేరుగానీ.. ఆమె అన్నదాంట్లో అబద్ధం ఏముంది?… పైపెచ్చు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావుగానీ.. నువ్వు చెప్పింది ‘సహకార సేద్యం’ కాదనీ.. ‘దిక్కుమాలిన సేద్య’మనీ.. మా భూములు కంపెనీ వాళ్లకిత్తారనీ.. మాకు రాఘవయ్య బాబాయి చెప్పాడులే.. కతలు చెప్పకుండా.. మా కాగితాలు మాకిచ్చేరు..’ అంటూ మహిళలంతా నిలదీశారు.
దీంతో అప్పటివరకూ మౌనంగా ఉన్న మొగాళ్లు కూడా వారితో వంత పలికారు.
‘మా ఆడోళ్లు అడిగేదాంట్లో నాయం ఉంది… మా కాయితాలు మాకివ్వు.. లేకపోతే మా ఆడోళ్లతోనూ, సంఘమోళ్లతోనూ కలిసి ఆ పెబుత్వాన్నే అడుగుతాం’ అన్నారు.
‘ఈ రాఘవయ్య, రైతుసంఘం వాళ్లు వీళ్లను చెడగొట్టారు. అంతా సవ్యంగా అయిపోయిందని పైకి రిపోర్టు కూడా పంపించా.. తస్సా చెక్కా..! ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.. పైపెచ్చు… కాగితాలు ఇవ్వకపోతే కొట్టేట్టుకూడా ఉన్నారు…’ అని గొణుక్కుంటూ.. ఒక నిర్ణయానికి వచ్చాడు.
‘ఏమయ్యా రాఘవయ్యా ఈ సహకార సేద్యం గురించి నీకేం తెలుసయ్యా…?’
‘నీకే తెలియదేమోగానీ.. నాకంతా తెలుసు. మీ జాతకం మొత్తం నా దగ్గరుంది.. ఈ భూమంతా కట్టపెట్టి ఏ కంపెనీకి ఇవ్వాలనుకుంటున్నారో కూడా నాకు తెల్సు’ అంతే ఘాటుగా సమాధానమిచ్చాడు రాఘవయ్య.
‘ఈ రాఘవయ్య, రైతుసంఘం వాళ్ళను నమ్ముకొన్నారు మీరు.. నట్టేట్లో మునగండి… అరే సర్పంచ్ బామ్మర్దీ! ఆళ్ల కాగితాలు వాళ్ల మొఖాన పడేయరా…!’ అంటూ పై పంచ విసురుగా దులుపుకుని కారెక్కి రయ్యిమంటా వెళ్లిపోయాడు లక్ష్మారెడ్డి.
కాగితాలు అందుకున్నాక అందరి ముఖాలు వెల్లివిరిసాయి..
‘రాఘవయ్య బాబారు జిందాబాద్..! రైతుసంఘం వర్థిల్లాలి!’ అంటూ అందరూ నినాదాలు చేశారు.
‘ఇది మీ విజయం…. మన పల్లె పడుచుల విజయం…..!’
మరింత ఉద్రేకంగా.. ‘రాఘవయ్య బాబారు జిందాబాద్..! రైతుసంఘం వర్థిల్లాలి!’ అంటూ అందరూ నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు జనం.
‘ఆగండాగండి…! ఆవేశపడిపోవద్దూ.. ఆనందపడిపోనూ వద్దు..! ఇల్లు అలకగానే పండగకాదు. ఒక గండం గట్టెక్కాం అంతే. ఇప్పటికే పీకల్లోతు సంక్షోభంలో ఉన్న ఈ వ్యవసాయాన్ని గాడిలో పెట్టుకోవాలి. అందుకు మీరంతా ఇదే ఉత్సాహంతో పోరాడితేనే సమస్య పరిష్కారమయ్యేది. అయితే మన పల్లెక్కొటే పోరాడితే సమస్య పరిష్కారమైపోదు. దీనిపై రైతుకూలీ సంఘాలన్నిటినీ కలుపుకుని పెద్ద ఉద్యమాలు చేయాలి. ఈ రోజు మన పల్లెపడుచులు సమస్య తేలేదాకా ఎలా పట్టుమీదున్నారో.. ఆ పట్టుదల మనందరిలో రావాలి. అదే మనకు స్ఫూర్తి. అప్పుడు మనం ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలు ఎన్నొచ్చినా పోరాడి విజయం సాధించవచ్చు. అప్పుడే మనకు నిజమైన సంక్రాంతి… మరి అందరూ ఆ పట్టుదలతో ఉంటారా మరి?’ అడిగాడు రాఘవయ్య.
‘ఓ…………………………………….. అంటూ అంతా కోరస్‌గా పలికారు.’
‘మరి ఇక ఉంటాను మిత్రులారా!’ అంటూ చేయీపి సంఘం వాళ్లతో కలిసి బస్టాండ్‌కు బయల్దేరాడు రాఘవయ్య.
- శాంతిశ్రీ
0 Response to "స్ఫూర్తి"
కామెంట్‌ను పోస్ట్ చేయండి