మానస

తెలి మంచు కరగలేదు.. మసక మసకగా ఉంది.. తోటలో మల్లెలు.. విరజాజులు.. విరగబూశాయి.. ఆ వాతావరణం చాలా ఆహ్లాదంగా.. సువాసన భరితంగా ఉంది. ఆ తోటలో పూలను కోస్తున్న వారంతా పదిహేనేళ్ల నుంచి పదిహేడేళ్ల వయస్సున్న అమ్మాయిలే.. వారు కోసిన పూలన్నీ మార్కెట్‌కు పంపేందుకు బుట్టల్లో సర్దుతూ చాలా బిజీగా ఉంది మానస. ఈ పనంతా ఉదయం ఐదుగంటలకల్లా అయిపోవాలి. వాటిని అక్కడ నుంచి మార్కెట్‌కు చేర్చి తిరిగి ఇంటికి చేరేసరికి మానసకు పదకొండు అవుతుంది. ఇంటికి వచ్చాక వంట చేసుకుని కాసేపు నడుం వాల్చేసరికి ఒంటిగంట దాటుతుంది. మూడు గంటలకు ఉదయం పూలకోయడానికి వచ్చిన పిల్లలకి పాఠలు చెపుతుంది మానస. వారందరితో పదవ తరగతి పాసు చేయించాలన్నది ఆమె ఆశయం. రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ తోటలోనే ఒక పక్కగా ఇల్లు కట్టుకుంది మానస. సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు అది. తిండి తినకపోయినా మంచినీళ్లు తాగి ఆ వాతావరణంలో హాయిగా నిద్రపోయి బతికేయొచ్చు అనిపిస్తుంది బిజీ లైఫ్‌కు అలవాటుపడిన ఎవరికైనా. ప్రస్తుతం అక్కడకు వచ్చిన మానస స్నేహితురాలు అపరాజితకు అలాగే అనిపించింది. ఎఫ్‌ఎంలోంచి.. అప్పుడే…

‘మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో.. పూచింది పూలకొమ్మ…
ఊగింది కోయిలమ్మ…’ అంటూ పాట వినిపిస్తోంది.. అపరాజితకు మనస్సు మరింత ఉల్లాసంగా అనిపించింది. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ.. మానస ఇంటి ముందుకు వచ్చింది అపరాజిత. అపరాజితను చూడగానే మానస ఆనందానికి పట్టపగ్గాలు లేవు.. ఏంటి అపరాజిత ఇలా… ఇదంతా నిజమే.. అంది. ‘ఎప్పుడొచ్చావు హైదరాబాద్‌ నుంచి? ఏంటి సంగతులు? అశోక్‌ ఎలా ఉన్నాడు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మానస. ‘ఆగవే తల్లీ.. అన్నీ ఒకేసారి అడిగితే నేనెలా సమాధానం చెప్పను’ అంది అపరాజిత. ‘నేనన్నీ ఒకేసారి అడగలా.. అలాగే చెప్పు…’ అంది మరింత చమత్కారంగా మానస.’నిన్ననే వచ్చా.. అత్తయ్యవాళ్లింట్లో దిగాను… అశోక్‌ బాగానే ఉన్నారు. అంతా బాగానే ఉంది.. నీ సంగతలేంటి చెప్పు’ అంది అపరాజిత అక్కడే చెట్టుకింద ఉన్న అరుగుమీద కూర్చుంటూ.. ‘ఇదిగో ఇలా హాయిగా జీవిస్తున్నా..’ ఎంతో మనోనిబ్బరంగా చెప్పింది మానస. ‘బిందూ ఏది? ఏం చదువుతుంది?’ అడిగింది అపరాజిత.
‘బిందూ ఇప్పుడు 4వ తరగతి. అమ్మ దగ్గరే ఉంది. నేనూ పిల్లలకి పాఠాలు చెప్పాక ఇంటికే వెళ్లిపోతా. రాత్రిళ్లు ఇక్కడ ఉండను. ఇదంతా నిర్మానుష్యంగా ఉంటుందిగా.. మళ్లీ తెల్లవారగానే వచ్చేస్తా..’ చెప్పింది మానస. ‘మనోహర్‌లో ఏమన్నా మార్పు వచ్చిందా ఇప్పటికైనా’ అడిగింది అపరాజిత. ‘తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయాలు.. పూలు వేరే వాళ్లతో మార్కెట్‌ పంపించి, ఈరోజు పిల్లల్ని చదువుకోవడానికి రావద్దని చెపుతా.. మనమిద్దరం కలిసి ఇంటికి వెళదాం.. ఇలా కూర్చో’ అంటూ అక్కడే ఉన్న ఫేమ్‌ కుర్చీ చూపించింది! మానస చూస్తుంటే దాని ధైర్యానికి ఒకపక్క సంతోషంగా.. దాని జీవితం ఇలా అయ్యిందేమిటా అని మరోపక్క బాధగా అనిపించింది అపరాజితకు. ఒకప్పుడు ఎలాంటి మానస ఇప్పుడిలా.. అని గతం ఒక్కసారి కళ్లముందు కదలాడింది అపరాజితకి…
000
‘మానసా…! టైము ఏడయ్యింది.. లే… ఆఫీసుకు మళ్లీ టైముకు అందుకోలేవు.’ అంటూ తల్లి పిలుపుతో చాలా బద్ధకంగా లేచింది మానస. గబా గబా బ్రెష్‌ చేసి, స్నానం ముగించుకొని తల్లి చేతికి దువ్వెన ఇచ్చింది జడ వేయమని.. తల దువ్వుతూ ‘బాక్స్‌ సర్ది టేబుల్‌ మీద పెట్టాను.. మర్చిపోకుండా బ్యాగ్‌లో పెట్టుకో..’ అని చెప్పింది తల్లి మీనాక్షమ్మ. ‘అది సరేలే..! ఏమిటి ఇవ్వాళ టిఫిన్‌..?’ ‘టిఫిన్‌ ఏం చేయలేదమ్మారు.. ఇవ్వాళ నాకు మీటింగు ఉంది వెళ్లాలి.. కొంచెం అన్నమే తిని వెళ్లు’ అంది మీనాక్షమ్మ. ‘సరే.. ఏంటి కూరా?’ అడిగింది మానస. ‘నీకిష్టమైన బెండకాయ’ జడ వేయడం పూర్తి చేసి చెప్పింది తల్లి. ‘పళ్లెం తెచ్చి ఇస్తూ.. అన్నీ ఆ టేబుల్‌మీదే ఉన్నాయి పెట్టుకో’ అంది మీనాక్షమ్మ. ‘నువ్వే పెట్టి… కలిపి ఇవ్వమ్మా… అసలే టైం లేదు..’ అంటూ గారాలు పోయింది మానస. వెంటనే అన్నం కలిపి స్పూన్‌ వేసి మానసకు అందించింది మీనాక్షమ్మ. అన్నం తింటూ పేపరు చదువుతుంది మానస.. అందులోని విశేషాలు మీనాక్షమ్మకు చెపుతోంది. ‘ఈ వరకట్న హత్యలు రోజూ రెండో మూడో పేపర్లో ఉండాల్సిందే..’ అంది మానస. ‘పేపరుకు ఎక్కేవి రోజుకి రెండో మూడో అయితే.. ఎక్కనవి ఎన్నో ఉంటున్నాయి. జనంలో మేం తిరుగుతున్నాం కాబట్టి తెలుస్తుంది.. మీలాంటి వాళ్లకి పేపర్లోవే కనిపిస్తాయి..’ అంది మీనాక్షమ్మ. గబా గబా తినడం ముగించి.. పేపరు అక్కడ పడేసి బ్యాగ్‌ తీసుకొని ఆఫీసుకు బయల్దేరింది మానస.
క్రింద ప్రెస్‌లో కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్లి ‘నే వచ్చేటప్పుడు ఏమైనా తేవాలా నాన్నా?’ అడిగింది మానస. ‘ఎ4 తెల్లపేపర్లు బాక్స్‌ ఒకటి తేమ్మా’ అంటూ.. ‘ఈ శుభలేఖ మ్యాటర్‌ రామచంద్రయ్యగారు ఇచ్చారు. ఎలా వేస్తే బాగుంటుందమ్మా.. మళ్లీ నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి లేటవుతుందిగా..’ అన్నాడు తండ్రి.. మ్యాటర్‌ తీసుకొని ఒకసారి చూసి పావుగంటలో డిజైన్‌, కలర్‌ సెలక్ట్‌ చేసి తండ్రికి చెప్పేసింది మానస. అందుకే మానసంటే ఎంతో ఇష్టం రాజిరెడ్డి గార్కి. ‘నా తల్లి ఎటువంటి సమస్యనైనా ఇట్టే తేల్చి చెప్పేస్తుంది. రామచంద్రయ్యగారు నిన్న ఇచ్చి వెళ్లిన దగ్గర్నుంచి ఆలోచిస్తున్నా నా బుర్రకు ఒక్క ఐడియా అయినా వస్తేగా?’ అనుకున్నాడు మనస్సులో రాజిరెడ్డి. ‘వెళ్లొస్తా నాన్నా…!’ అంటూ అడుగులు వడివడిగా వేసుకుంటూ బయటకు వచ్చింది మానస. ‘జాగ్రత్తమ్మా!’ అంటూ గేటు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు రాజిరెడ్డి.
‘ఆయనకు తన కూతుర్ని ఎప్పుడూ ఆడపిల్లగా చూడలేదు. ఇంటి విషయాల్లో మానస ప్రమేయం లేకుండా ఏ నిర్ణయం తీసుకోడు. తన వ్యాపారలావాదేవీల్లోనూ కూతురి భాగస్వామ్యం లేనిదే ఏ నిర్ణయం తీసుకోరాయన. అందుకే కూతుర్ని ఒక నిర్ణయాత్మక శక్తిగా చూస్తారాయన.
ఆఫీసుకి వెళ్లగానే అపరాజిత ఎదురు వచ్చి ‘నీకో విషయం చెప్పాలి’ అంటూ మానసను చుట్టేసింది. ‘ఏమిటో ఎప్పుడూ సీరియస్‌గా అందరితో పనిచేయించేదానివి… ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు ఏంటి సంగతి’ అడిగింది మానస. ‘నా ముందుకు ఒక పెళ్లి ప్రపోజల్‌ వచ్చింది..’ చెప్పింది అపరాజిత. ఆశ్చర్యంగా చూసింది మానస. వెంటనే అపరాజిత చేయి పట్టుకొని లాక్కెళ్లినట్లే వెనకవైపుగా ఉన్న బాల్కనీలోకి తీసుకెళ్లింది. ‘ఎవరే అతగాడూ…?’ అంటూ పాట పాడుతూ.. ఆప్యాయంగా స్నేహితురాల్ని దగ్గరకు తీసుకుంటూ అడిగింది మానస. ‘ఆగవే తల్లి చెపుతాను. నీకు చెప్పకుండా ఇంకెవరికి చెపుతాను’.. ‘అశోక్‌’ చెప్పింది అపరాజిత. ‘అశోకా?’ ఒక్కసారిగా ఆగిపోయింది మానస. ‘ఏమిటే అలా అయిపోయావు?’ మానసని భుజాలపై తన రెండు చేతులూ వేసి కుదిపేసి అడుగుతుంది అపరాజిత. ‘ఓకే అనేశావా?’ అడిగింది మానస. ‘ఇంకా లేదు.. ఓకే అందామనుకుంటున్నా.. ఎందుకు అలా అడుగుతున్నావ్‌?’ అడిగింది అపరాజిత కొంత అనుమానంగా.. ‘యూ ఆర్‌ వెరీ లక్కీ…! అయితే బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా?’ స్నేహితురాల్ని అడిగింది మానస. ‘బాగా ఆలోచించే తీసుకున్నా నిర్ణయం. ఇంతకీ నీ మనస్సులో ఏదో ఉంది.. అది ముందు చెప్పు…’ నిలదీసింది మానసను అపరాజిత. ‘ఏమీలేదు.. కులాలు వేరు కదా…? భవిష్యత్తులో సమస్య కాదా? పిల్లల పెళ్లిళ్ల విషయంలో…. అలా… ‘ అంటూ అనుమానంగా తన మనస్సులోని విషయం బయటపెట్టేసింది మానస. ‘ఎందుకు సమస్యవుతుంది. సమాజం మారుతుంది. మనమూ మారాలి. ఇప్పటికే చాలా మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు. హాయిగా జీవితం వెళ్లదీస్తున్నారు. వాళ్లకు లేని సమస్య మనకెందుకు వస్తుంది?’ ఎంతో మనో ధైర్యంతో చెప్పింది అపరాజిత.
‘ఏమైనా నీకున్నంత ధైర్యం నాకు లేదు’ అంది మానస. ‘నీకు ధైర్యం లేకపోవడమేమిటే.. మీ నాన్న నిన్ను కొడుకనుకుంటుంటేను..’ ‘కొడుకునైనా… కూతుర్నైనా ధైర్యం ఉండాలి కదా!.. నాకు నిజంగా ఆ ధైర్యం లేదు అపరాజిత’ అంటూ చాలా స్థిరంగా పలికింది మానస గొంతు.. ఎప్పుడూ లేనంత ఆశ్చర్యం వేసింది అపరాజితకు. అంతేకాకుండా మానస ఏదో దాస్తుందని కూడా అర్థమైంది. అదే అడిగేసింది మానసను.. ‘ఇంతకీ నీకు అంత ధైర్యం లేదనడానికి నిదర్శనం ఏమిటి?’ అంది అపరాజిత. ‘నువ్వు ధైర్యం చేశావు. నేను ధైర్యం చేయలేకపోయాను..’ అంది మానస. ‘ఏమిటే బాబు.. అసలు విషయమేమిటో చెప్పవే తల్లీ.. నన్ను చంపకు..’ అంది అపరాజిత. ‘అశోక్‌ను నేను ప్రేమించాను. కానీ ఆ విషయం చెప్పలేకపోయాను. పెద్దలు ప్రపోజ్‌ చేసినందుకే నువ్వు ఓకే అనాలనుకుంటున్నావు.. అదే నీకూ నాకూ తేడా..’ అంది కళ్ల వెంట కన్నీళ్లు కారుతుండగా మానస. ఎప్పుడూ స్నేహితురాలి కంట కన్నీరు చూడని అపరాజిత కదిలిపోయింది. ‘ఇప్పటికీ మించిపోయింది లేదు.. అశోక్‌ విషయం పెద్దవాళ్లు కదా నాకు ప్రపోజ్‌ చేశారు. నేనేమీ అతన్ని ప్రేమించలేదు. నీ మనస్సులో అభిప్రాయం అశోక్‌కు చెప్పవే’ అంది అపరాజిత. ‘దాని గురించి ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నా… అంత ధైర్యం నాకు లేదు… నీకంతా మంచి జరగాలి’ అంటూ స్నేహితురాల్ని హృదయానికి హత్తుకుంది మానస. అపరాజితకు అర్థమైంది మానస స్వగతం ఏమిటో.. కులాంతర వివాహానికి స్నేహితురాలు వెనకడుగు వేస్తుందని.. ‘సరేలే… ఇంతకీ అశోక్‌ ఓకే అన్నారా?’ అడిగింది మానస వాతావరణాన్ని చల్లబర్చటానికి. ‘నేను ఇంకా ఓకే అనలేదుగా… టైము తీసుకుంటా…’ అంది అపరాజిత. కొన్ని నెలలు గడిచాయి.
మానస చాలా ఆనందంగా ఉంది ఇవ్వాళ…’ఏమిటి అమ్మాయిగారూ! చాలా సంతోషంగా ఉన్నారు’ అడిగింది కుర్చీలో కూర్చున్న స్నేహితురాలి భుజంపై చేయివేస్తూ అపరాజిత. ‘ఏముంటుంది పెళ్లి కావాల్సిన అమ్మాయికి పెళ్లవుతుంది’ అంది మానస. ‘నిజమే…’ ఆశ్చర్యంగా అడిగింది అపరాజిత. ‘అవును..’ అంది మానస. ‘అశోక్‌ గురించి మళ్లీ ఆలోచించదలచుకోలేదా?’ అడిగింది అపరాజిత. ‘లేదు… మంచి భార్యగా ఉండలేకపోయినా.. మంచి తల్లిగా అయినా ఉండాలన్నదే నా జీవిత లక్ష్యం’ అంది మానస. ‘నువ్వు సొంతగా ఒక నిర్ణయం తీసుకోలేవు.. ఎవరైనా చెప్పితే వినే రకానివి కాదు. నీ చేజేతులా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు.. బాగా ఆలోచించుకో… వ్యాపారాల్లో నిర్ణయాలు తక్షణం తీసుకుంటావు.. నీ జీవితంలో మాత్రం నిర్ణయాలు తీసుకోలేవు..’ అంది అపరాజిత గొంతు కొంచెం కఠినంగానే పలికింది.
‘అవునే… నువ్వు చెప్పింది అక్షర సత్యం…’ అంది మానస. ‘సరేలే.. ఇంతకీ ఎవరా ఘనుడు…’ అంది అపరాజిత. (మనస్సులో బాగా కోపంగా ఉంది స్నేహితురాలిపైన) ‘పేరు మనోహర్‌. ఎంఎస్‌సి చేశాడు. మా కజిన్‌ స్నేహితుడు.. పెళ్లి కూడా వచ్చేనెల 12నే..’ చెప్పింది మానస. ‘ఏమిటే…. ఆలోచించడానికి టైముకూడా తీసుకోవడంలేదా?’ అంది అపరాజిత. ‘ఆలోచించేదేముంది.. అవన్నీ పెద్దవాళ్లు చూసుకుంటారు’ అంది మానస. స్నేహితురాలి అమాయకత్వానికి ఏడ్వాలో… నవ్వాలో అర్థంకాలేదు అపరాజితకు. రోజులు త్వరత్వరగా గడిచిపోయాయి.
మానస పెళ్లి మార్చిలో జరిగితే.. అపరాజితది ఆగస్టులో జరిగింది. ఇద్దరూ ఉద్యోగాలు మాత్రం మానలేదు.
‘నాకు షేవింగ్‌కు అన్నీ ఏర్పాటు చేయరా!’ మానసకి మనోహర్‌ మొదటి ఆదేశం. ‘అదేంటి.. మీ షేవింగ్‌కు నేను ఏర్పాటు చేయడమేమిటి?’ అడిగింది మానస. ‘అలా చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో చేసి చూడు నీకే తెలుస్తుంది’ అన్నాడు మనోహర్‌. సరేలే అంటూ ఆ ఏర్పాటు చేసింది మానస. తనకైతే అందులో ఏమీ ఆనందం కలగలేదు. ‘ఆనందంగా ఉంది కదూ..!’ అడిగాడు మనోహర్‌.. ఏమీ లేదన్నట్లు తలూపింది మానస. ‘స్నానానికి నీళ్లు తోడి, సబ్బు, టవల్‌ అన్నీ సిద్ధం చేయి.. నీకే తెలుస్తుంది’ అన్నాడు మనోహర్‌.. అయినా తెలియలేదంది మానస.. ‘మొద్దూ’ అంటూ నెత్తిమీద మొట్టాడు మనోహర్‌.. ‘అబ్బా!’ అంది మానస. గబా గబా రెడీ అయిన మనోహర్‌కు టిఫిన్‌ ప్లేట్‌లో పట్టుకొని చెమటను పైటకొంగుతో తుడుచుకుంటూ పరుగు తీసింది మానస. వాచీ వంక చూస్తూ…’అబ్బే.. టైమ్‌ లేదురా… వెళ్లిపోవాలి’ అంటూ ‘మరి నేను తినలేదుగా.. నువ్వుకూడా తినకు… అందులో ఆనందం నీకే తెలుస్తుంది.. ఆ ఆనందం నేను సాయంత్రం వచ్చాక చెప్పాలి సుమా!’ అంటూ బై చెపుతూ వెళ్లిపోయాడు మనోహర్‌.
ఆశ్చర్యంగా అలాగే చూస్తున్న కూతురి వంక జాలిగా చూశారు రాజిరెడ్డిగారు.. ‘ఏంట్రా?’ అన్నారు కూతుర్ని తలమీద చేయివేసి నిమురుతూ… ‘ఆయన టిఫిన్‌ చేయకుండా వెళ్లిపోతూ.. నేను కూడా చేయకుండా ఉంటే ఆనందం కలుగుతుందంటారేంటి నాన్నా. టిఫిన్‌ చేయకపోతే ఆకలి వేస్తుంది గానీ.. ఆనందం ఎలా కలుగుతుంది? అదేమంటే.. అదేమరి ప్రేమంటే.. అంటున్నాడు మనోహర్‌.. ప్రేమంటే ఆకలితో ఉండాలా?’ అమాయకంగా అడిగింది మానస.
‘తనకు వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటూ.. ఎన్నో క్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపే తన కూతురు. భర్త కుశ్చితాన్ని అర్థంచేసుకోలేకపోవడంతో బాధ కలిగింది రాజిరెడ్డికి. ‘అదేం లేదులేమ్మా… నువ్వు తినేసి.. అతను వచ్చాక తినలేదని చెప్పు…’ అన్నారు రాజిరెడ్డి.. ‘అబద్ధం చెప్పనా..’ అంది మానస నొసలు చిట్లించి. ‘ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెపితేనే సంసారం సజావుగా సాగుతుందమ్మా.. లేకపోతే ఆకలితో ఆరోగ్యం పాడుచేసుకుంటావా?’ అన్నారు కూతురికి నచ్చజెపుతున్నట్లు….
అయినా టిఫిన్‌ తినకుండా బాక్స్‌ తీసుకొని ఆఫీసుకు బయల్దేరించి మానస. బస్సులో కూర్చుందన్న మాటేగానీ.. రాత్రి అతను చెప్పిన మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి.. అందరికీ ఇలాగే ఉంటుందా.. నాకే ఇలాగా…? అనుకుంది మానస. ‘మానసా! నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి.. అవన్నీ నెరవేరేలంటే రెండేళ్లు పట్టవచ్చు. అప్పటి వరకూ మనం దూరంగా ఉందాం.. కానీ మీ అమ్మావాళ్లకి అనుమానం రాకుండా నేను నవ్వమన్నప్పుడల్లా నవ్వాలి.. మనం కాపురం చేస్తున్నట్లు వాళ్లకు నమ్మకం కలగాలి’ అన్నాడు మనోహర్‌. ‘అదేంటి?..లక్ష్యాలు నెరవేరాకే పెళ్లి చేసుకోలేకపోయారా?’ అంది మానస కొద్దిగా చిరాగ్గా..’ ‘వాటికి డబ్బు కావాలి డియర్‌.. అవి కావాలంటే పెళ్లి చేసుకోక తప్పలేదు మరి…’ అన్నాడు మనోహర్‌.. అంటే డబ్బుకోసం నన్ను చేసుకున్నాడా? లక్ష్యాలు నెరవేరేవరకూ దూరంగా ఉండాలా?.. మంచి భార్యగా పేరుతెచ్చుకోగలనో లేదోగాని.. మంచి తల్లిగా ఉండాలన్న తన కోరిక ఇప్పట్లో నెరవేరదన్నమాట.. బాధపడుతుండగానే బస్టాప్‌ వచ్చేసింది. బస్సు దిగింది మానస.
‘మానస నువ్వు ఉద్యోగం మానేరు.. నువ్వు తెచ్చే మూడువేలతో పెద్ద ఒరిగేదేమీ లేదుగానీ.. నాకు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు నువ్వు వడ్డించకపోవడం చాలా బాధగా ఉంది. అది కూడా ప్రేమేనోరు.. నీకేమీ అనిపించట్లేదూ…’ అంటూ చెప్పుకుంటూ పోతున్న మనోహర్‌ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది మానస. ‘దగ్గరలో ఉన్న థియేటర్‌లో ఏదో హర్రర్‌ చిత్రం ఆడుతుందంట. తొందరగా రెడీ అవ్వు. వెళ్దాం’ అన్నాడు మనోహర్‌. ‘నాకలాంటి సినిమాలు ఇష్టముండవండీ!’ చెప్పింది మానస. ‘నాకోసం చూడాలోరు.. భర్త సినిమాకి తీసికెళితే నీకు నచ్చినా… నచ్చకపోయినా చూడటమే ప్రేమోరు…’ అన్నాడు మనోహర్‌.. ఈ ప్రేమేంటో అర్థంగావడంలేదు.. నేను ఏదో చక్రబంధంలో చిక్కుకపోయానా…? అన్న అనుమానం కలిగింది మానసకు.. రోజురోజుకూ మనోహర్‌ విశ్వరూపం తేటతెల్లమవుతోంది..
మానస ఎందుకో ఈ మధ్య చాలా డల్‌గా ఉంటోంది. ‘ఏంటి అలా ఉన్నావ్‌’ ప్రశ్నించింది స్నేహితురాల్ని అపరాజిత. అంతే అపరాజిత పట్టుకొని ఏడ్చేసింది మానస. కొంచెం తేరుకున్నాక విషయం మొత్తం చెప్పింది. మానస అలా ఏడ్చేటప్పటికి తల్లడిల్లిపోయింది అపరాజిత. వెంటనే మానస తల్లిదండ్రులతో మాట్లాడింది. వాళ్లు వెంటనే మనోహర్‌ను, మానసను కూర్చోబెట్టి మాట్లాడారు. ‘నీ లక్ష్యం నెరవేరే వరకూ దూరంగా ఉండటమేమిటని?’ నిలదీశారు. చాలా సేపు వాదప్రతివాదనలయ్యాక ఆఖరకు మనోహర్‌ మానసతో దాంపత్యానికి ఒప్పుకున్నాడు. చాలా రోజుల తర్వాత మానస ఆనందంగా కనిపించింది అపరాజితకు. చాలా సంతోషపడింది స్నేహితురాలు మునపటిలా ఉన్నందుకు. మానసకు పాప పుట్టేలోపు మనోహర్‌ మూడుసార్లు నెలేసి రోజులు గుర్రపు రేసులంటూ వెళ్లిపోయి డబ్బంతా తగలేశాడు.
ఇక ఈయనతో చాలా కష్టం అనుకుంది మానస. అదే విషయం తల్లిదండ్రులతోనూ అత్తింటివారితోనూ చెప్పింది. వారంతా ఆమెకు అండగా నిలిచారు. మనోహర్‌ను గట్టిగా నిలదీసింది మానస. ‘నీకు మావాళ్లూ, నీవాళ్లూ బ్రెయిన్‌ వాష్‌’ చేస్తున్నారు అన్నాడు. ‘అవును ఇప్పుడే జ్ఞానోదయం అయింది. ఇన్నాళ్లూ నువ్వేం చేసినా భరించాను. ఇప్పుడు పాప కూడా పుట్టింది. దాని భవిష్యత్‌ గురించి మనం ఆలోచించాలి కదా!’ అంది. ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది మనోహర్‌కి ‘నేను హైదరాబాద్‌ వెళ్లి ఉందామనుకుంటున్నా.. నువ్వు కూడా రా..’ అన్నాడు మనోహర్‌. ‘నువ్వు వెళ్లు. నేను రాను’ అని గట్టిగా చెప్పేసింది మానస. ఇంట్లో ఉన్న డబ్బంతా సర్దుకుని మానసకు చెప్పకుండా ఒక రాత్రిపూట వెళ్లిపోయాడు మనోహర్‌.
కొన్ని సంవత్సరాలు గడిచింది… మానస మొబైల్‌ రింగయ్యింది.. ఎవరా అని లిఫ్ట్‌ చేసింది. ‘మానస అంటే మీరేనండీ?’ అవతల ఎవరో మగగొంతు అడుగుతుంది. ‘అవును.. మీరెవరు?’ అని అడిగింది మానస. ‘నేను తిరుపతి నుంచి ఫోన్‌ చేస్తున్నా మేడమ్‌! ఎస్‌ఐని. మీకు మనోహర్‌ తెలుసా?’ అడిగారు. ‘ఆ.. ఏమిటి సంగతి?’ అడిగింది మానస. ‘మనోహర్‌కి యాక్సిడెంట్‌ అయ్యిందమ్మా. వాళ్ల అమ్మానాన్నకు ఫోన్‌ చేస్తే రామని చెప్పారు. మీరు వస్తే మీకు అప్పగిద్దామని..’ అన్నారు అవతల ఎస్‌ఐ. ఒక్కసారే నవనాడులు కుంగిపోయినట్లు అయిపోయింది. వెళ్లాలా? వద్దా? చాలాసేపు తర్జనభర్జన పడి .. ‘సరే వస్తాను’ అని అడ్రస్‌ తీసుకుని ఫోన్‌ పెట్టేసింది.
తల్లిదండ్రులతో చాలాసేపు వాదించింది. తెలిసినవాళ్లంతా వద్దని సలహా ఇచ్చారు. మనోహర్‌కి తగిన శాస్తి జరిగిందన్నారు. అయినా మాట్లాడకుండా వెళ్లడానికే నిర్ణయం తీసుకుంది. ‘మనం ఎంతమందికి సాయం చేయలేదు. మానవత్వంతో స్పందించాలి’ అంది. వాళ్లు కూడా ఆమెను అనుసరించారు. అందరూ కలిసి మనోహర్‌ దగ్గరకు వెళ్లారు. ఒక కాలు పూర్తిగా చిధ్రమవ్వగా మరొకటి విరిగింది. అక్కడి డాక్టర్లు కష్టమని చెప్పేశారు. ‘కాలు పోతే నన్ను బతికివ్వవద్దు మానసా! చనిపోనీ.. చనిపోయినా బాగుండేది’ అంటూ బాధపడ్డాడు మనోహర్‌. మానసలోని మానవత్వం వెల్లివిరిసింది. తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా వినకుండా అతన్ని తీసుకుని రాయవేలూరు వెళ్లింది. అక్కడి డాక్టర్లతో చాలాసేపు మాట్లాడింది. వాళ్లు కూడా వైద్యశాస్త్రంలో ఒక కొత్త ప్రయోగానికి సహాయపడుతున్నందుకు అభినందిస్తూ ఆమె కోరికను మన్నించారు. అతని కాలును బాగుచేయడానికి అన్నివిధాలా ప్రయత్నించారు. అప్పటివరకూ మానస సంపాదించినదంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. సామాజికంగా చేసిన సేవలే ఆమెకు అనేకమంది ఆప్తుల్ని తెచ్చిపెట్టాయి. వారంతా ఆమెకు సాయపడ్డారు. ఆర్థికంగా, భౌతికంగా సాయపడ్డారు. ముందు మానసను వద్దని వారించినా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి, అపరాజిత, అశోక్‌ కూడా అన్నిరకాలుగా సాయపడ్డారు. మొదటి నుండి చివరి వరకూ ఆమెకు అండగా నిలిచారు. యాక్సిడెంట్‌ కేసు కోర్టులో నడుస్తుంది కానీ ఏళ్లు గడిచినా పరిహారం అందడం లేదు. వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇక లాభం లేదనుకుంది.. మనోహర్‌ తన పనులు కొన్ని చేసుకోగలుగుతున్నాడు.
000
‘ఏంటే ఆలోచిస్తున్నావ్‌..’ అలాగే కూర్చుండిపోయిన అపరాజితను చేత్తో తట్టింది మానస. ప్రస్తుతంలోకి వచ్చింది అపరాజిత. ఇంటికి తాళం వేసి స్కూటీ తీసింది మానస. ఇద్దరూ కలిసి మానస ఇంటికి బయల్దేరారు. ‘ఏమిటీ ప్రస్తుతం మనోహర్‌ పరిస్థితి’ దారిలో అడిగింది అపరాజిత. ‘యథా…’ అని ముక్తసరిగా సమాధానం చెప్పింది మానస. మౌనంగా ఉండిపోయింది అపరాజిత.
ఇంట్లోకి అలా అడుగుపెట్టారో లేదో…
‘అసలు ఇంట్లో ఒక మొగుడనేవాడున్నాడు.. వాడు ఒంటరిగా నాలుగ్గోడల మధ్య పడిఉన్నాడని లేదు. దేశాన్ని ఉద్ధరించడంలో మాత్రం ఫస్ట్‌’ కోపాన్నంత వెళ్లగక్కాడు మనోహర్‌. ‘అదేంటి మనోహర్‌ అలా మాట్లాడతావ్‌.. అపరాజిత వచ్చింది.. ప్లీజ్‌ నీకు దండంపెడతా ఆగు…’ సముదాయించబోయింది మానస. ‘అయితే ఏంటంటా.. నీ బండారం అంతా ఆమెకి కూడా తెలియనీ.. నీ డబ్బు నీ మొహాన కొట్టేస్తా… నన్నేమీ నువ్వు ఉద్ధరించినట్లు ఫోజు పెట్టాల్సిన అవసరం లేదు…కొంచెం కాళ్లు సరిగా రానీ.. మళ్లీ రేసులకు వెళ్లి మొత్తం అప్పులు తీర్చేస్తా…’ దర్పంగా అన్నాడు మనోహర్‌. ‘మళ్లీ రేసులా.. నువ్వు మరో జన్మ ఎత్తావు.. ఇప్పుడైనా సరిగ్గా ఆలోచించు’ అంది మానస. ‘ఆ పెద్ద చెప్పొచ్చావులేమ్మా! నీమీద ఆధారపడి బతుకుతున్నాననేగా నేనంత లోకువా?’ కోపంగా అన్నాడు మనోహర్‌. ‘అదికాదండీ.. నేను మిమ్మల్ని ఇంతగా చూసుకోవడంలో నాకూ కొద్దిగా స్వార్థం ఉంది. నా బిడ్డకు తండ్రిగా ఉండండి చాలు. అంతా నేను చూసుకుంటా.. ప్లీజ్‌…’ అర్థించింది మానస. ‘అంటే నేను చేతకాని వెధవననేగా నీ అభిప్రాయం… అందుకే కాళ్లు రానీ.. నేను రేసులకెళ్లి బోలెడంత డబ్బు సంపాదిస్తా…!’ ఉద్రేకపడిపోయాడు మనోహర్‌. ‘మీరు మరోలా సంపాదించండి గానీ… రేసులకు వెళితే ఒప్పుకునేది లేదు’ కరాఖండీగా చెప్పేసింది మానస. ‘ఏంటి శాసిస్తున్నావా? నోరు బాగా లెగుస్తుందే…’ అంటూ తన విశ్వరూపం చూపించాడు మనోహర్‌.. అప్పటివరకూ మౌనంగా వింటున్న అపరాజితకు ఓపిక నశించింది. ‘మిమ్మల్ని అది ఇంతగా కంటికి రెప్పలా చూసుకుంటే మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు మనోహర్‌. మీరు దానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేరు. అది మీకు మరో జన్మనిచ్చింది.’ అంటూ ఆవేశంతో అనేసి .. ఇంకా ఎన్ని చూడాలో అని ‘నే వెళుతున్నా మానస. నా మనసేమీ బాగోలేదు.. రేపు తోట దగ్గరకు వస్తా..’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అపరాజిత. అపరాజిత అలా వెళ్లిపోవడం మానసకు చాలా బాధ కలిగింది. అయినా రేపు వస్తానందగా అని కొంచెం కుదుటపడింది.
మనోహర్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఇలా పదిరోజులకోసారి గొడవపడటం.. మానస సర్దిచెప్పడం నిత్యకృత్యమైపోయాయి. మానస కూతురికి పదేళ్లు వచ్చాయి. ఆ చిన్ని మనస్సుకు ఇవన్నీ నచ్చలేదు.. ఒకరోజు ‘అమ్మా! ఈ నాన్న మనకొద్దమ్మా! మనం కొత్త నాన్నను తెచ్చుకుందాం.. ఈయనకు ఇన్ని సేవలు చేసి ఇన్ని బాధలు పడాలా?’ అని అడిగింది. కూతురు ఆలోచనలకు ఒకపక్క సంతోషం. మరోపక్క బాధ కలిగాయి మానసకు. ‘నిజమే అదన్నట్లు ఇతన్ని పట్టుకుని వేలాడాలా?’ అని అన్పించింది. కానీ అదే సందర్భంలో మనోహర్‌ గతంలో వెళ్లినప్పుడు ఇరుగుపొరుగు వారు అన్న మాటలు చెవిలో మారుమోగాయి. ‘నువ్వు పాపిడే సరిగా తీసుకోవు మానసా! అందుకే నీ కాపురం అలా అయ్యింది?, నువ్వే నయం.. ఎవరికి భయపడాలి? మొగుడా ఏమన్నానా?, మొగుడు లేకపోయినా కాటన్‌ చీరలు పెళపెళలాడుతూ భలే కడతావు. మేమే కట్టడంలేదు..’ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తన తమ్ముడు, మరదలూ వాళ్ల పిల్లల్ని తీసుకొని బయటకు వెళుతుంటే దీనంగా చూసే కూతురు మొహం గుర్తుకొచ్చింది. ‘స్కూల్లో అందరికీ నాన్న ఉన్నారు. నాకేడీ’ అన్న కూతురు మాటలూ గుర్తుకొచ్చాయి. అందుకే.. మనోహర్‌తో జీవచ్ఛవంలా బతుకుతుంది.
మనోహర్‌ మారడని అర్థమైపోయింది మానసకు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చింది. ఉంటే ఉంటాడు. లేకపోతే లేదు అని ‘అబాకస్‌’ నేర్చుకుని ఇనిస్టిట్యూట్‌ ప్రారంభించింది. అనూహ్యంగా రాష్ట్రంలోనే ఆమె మొదటి మూడుబహుమతులు సాధించి పెద్ద పేరు సంపాదించుకుంది. నిదానంగా అప్పులన్నీ తీర్చింది. ‘నీలో చాలా టాలెంట్‌ ఉందిరా? ఇన్నాళ్లూ నాకు తెలియలేదు..’ అన్నాడు మనోహర్‌.. ‘బయటవాళ్లు ఎప్పుడో గుర్తించారు. పోనీలే నువ్వు ఇప్పటికైనా గుర్తించావు.’ అంది మానస. ‘నా కాళ్ళు మాత్రం పూర్తిగా రావడంలేదు. ఇలా ఎన్నాళ్లో ఈ బతుకు. ఆనాడే చచ్చిపోయినా బాగుండేది’ మళ్లీ మనోహర్‌లో అహంకారం బయటకు వచ్చింది. ‘ఈ మాత్రం మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు. చాలదా?’ అంది మానస. ‘నువ్వే డాక్టర్లకు చెప్పి ఇంతకన్నా ఎక్కువ బాగుచేయించవద్దని చెప్పావా ఏమిటి?’ అన్నాడు మనోహర్‌. ఇంతచేసినా అంతలేసి మాటలు అనడంతో కన్నీళ్లతో అక్కడ నుండి తన గదిలోకి వెళ్లిపోయింది మానస. ఇదంతా చూస్తున్న మానస కూతురు మహిమకు చాలా బాధగా అనిపించింది. ‘నాన్నా! నువ్వు అలా ఉంటే చాలు. ఇంకా నడక వస్తే పారిపోతావు. నీ సంగతి తెలిసే దేవుడు నిన్ను అలా ఉంచాడు. అమ్మను అలా బాధపెడుతున్నావు. నీకేమీ అనిపించటంలేదా? నాకైతే నీమీద అసహ్యం వేస్తుంది…నువ్వు ముసలివాడివి అయిపోతున్నావు. ఇంకా అలాగే బతుకుతావా?’ అంది మహిమ.
ఒక్కసారి నవనాడులూ కుంగిపోయినట్లు అనిపించింది మనోహర్‌కు. మహిమ మాటలు ఒకటి పదిసార్లు అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. వారంరోజులు అలాగే మదనపడిపోయాడు. మహిమ తండ్రిని పలకరించకపోవడమే కాదు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉండి అక్కడ నుండే స్కూలుకు వెళుతుంది. మొదటిసారిగా మానసకు నేనేమి చేశాను అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఎంత ఆలోచించినా మచ్చుకు ఒక్కటి కూడా లేదనిపించింది. ”డబ్బు పెట్టుబడిగా పెట్టి వ్యాపారం పెట్టించింది. అదీ నిలుపుకోలేకపోయాను. ఆ తర్వాత మూడుసార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. కన్న తల్లిదండ్రులు సైతం పట్టించుకోకుండా వదిలేసినా ప్రమాదం జరిగిందని తెలియగానే అన్నీ ఒడ్డి మానస నన్ను బతికించింది. ఇప్పుడూ తన నుంచి మానస ఏమీ ఆశించడం లేదు. సంసార జీవితానికి కూడా పనికిరాకుండా అయిపోయినా మహిమతో పాటు తననూ బిడ్డలా సాకుతోంది. ఇన్ని చేస్తున్న మానసను తానెందుకు ఇన్నాళ్లూ బాధించాను. మహిమ అన్నట్లు నా వక్రబుద్ధిని దృష్టిలో పెట్టుకొనే దేవుడు నాకీ శిక్ష వేశాడా? కూతురు తనని అసహ్యించుకుంటోందంటే నేనంత దుర్మార్గంగా మారానో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పటికైనా నాలో మార్పు రావాలి. రావాలి..” అనుకుంటూ పడుకున్నాడు మనోహర్‌.
తెల్లవారగానే ఇన్నాళ్ల వాళ్ల వైవాహిక జీవితంలో మొదటిసారిగా ‘నన్ను క్షమించరా! నిన్ను ఇన్నాళ్లూ బాధపెట్టాను… మహిమ నా కళ్లు తెరిపించింది.. నేను పాపను ఇంట్లోనే ఉండి చదివిస్తాను.. నువ్వు నన్ను క్షమించానని చెప్పరా’ అంటూ మానసను వేడుకున్నాడు.’మనలో మనకు క్షమాపణలేమిటండీ! మీరు అలా ఉంటే నాకంతకన్నా కావల్సిందేముంది?’ అంటూ ఆనందంగా మనోహర్‌ తలను ఎదకు హత్తుకుంది మానస. అప్పుడే ఎఫ్‌ఎంలో.. ‘వాడిన పూలే వికసించలే.. చెలరేగిన హృదయాలు….’ అంటూ పాట సన్నగా వినిపిస్తుంది.
చాలా రోజులు తర్వాత ఆ మానస సరోవరంలో వెన్నెల విరబూసింది.

- శాంతిశ్రీ

0 Response to "మానస"

కామెంట్‌ను పోస్ట్ చేయండి