దేవరాజు మహారాజుగారి అనువాదాల్లోంచి జాలువారిని ‘మంచి ముత్యం’ ఒక ‘ఆణిముత్యం’. ఆయన చేసిన అనువాదం ఆద్యంతం పాఠకులను ఆకట్టుకుంటుంది. నవల మూల రచయిత ఈయనేనా అన్నట్లుంది. ఎక్కడా ఎటువంటి తొట్రుపాటూ లేదు. లేశమంతైనా అతిశయోక్తి లేదు. మొదట్లో రచయిత గురించి చెపుతూ దేవరాజుగారు చెప్పుకున్నట్లు తన స్వీయరచనలా అనువాదం చేశారు. వారి జీవనశైలిని, వారు ఎదుర్కొంటున్న వివక్షను కళ్లకు కట్టింది. పేద, ధనికవర్గాల అంతరాలను తెలియజెప్పింది. రచయిత సృష్టించిన వర్ణనలను యథాతథంగా మనముందుంచేలా అనువాదకులు చేసిన కృషి అభినందనీయం. ఆయా ప్రదేశాల్లో మనమూ అక్కడే ఉన్నట్లు అనుభూతి పొందుతాం. అంతబాగా ఉంది రచన. ఆ వాతావరణాన్ని, వారి హావభావాల్ని, బాధల్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. వారి కష్టాల్లో.. సంతోషంలో.. పాడుకొనే సంగీతం వారి సాంప్రదాయాన్ని తెలియజెప్పినట్లైంది. సంగీతంలో వారు తమ భావాలను వ్యక్తీకరించుకోవడం బాగుంది.
ఇక కథలోకి వెళితే…కీనో, జు ఆనా దంపతులు. వారికి కియొటిటో అనే ముద్దులొలికే చిన్నారి కొడుకు. పేదరికం ప్రేమానురాగాలకు ఏమాత్రం అడ్డుకాదన్నంత విశ్వాసం వారిది. కీనో చాలా మొరటువాడు. జు ఆనా చాలా తెలివైనది. కియొటిటోకు తేలుకుట్టడంతో కథ మొదలవుతుంది. తేలుకుట్టినప్పుడు పిల్లవాడిని రక్షించుకోవాలనే ఆ మాతృమూర్తి తాపత్రయం మనకి కన్నీరు తెప్పిస్తుంది. ఆ సందర్భంగా పిల్లవాడికి వైద్యం చేయించాలని మొట్టమొదటిసారి అడుగు ముందుకేసిన జు ఆనా వెనకే నడుస్తుంది గూడెమంతా. ఈ క్రమంలో తరతరాల వారి దారిద్య్రం, ధనవంతులకూ వారికీ మధ్య ఉన్న అంతరం ఒక్కసారి ఆ చరిత్రను మన కళ్ల ముందుంచినట్లైంది. ధనవంతుడైన వైద్యుని పొగరబోతుతనం, డబ్బు ఆశ.. పేదవాడైనా ఉద్రేకంగా, కసిగా ఉన్న కీనోల వర్ణన వారి స్వత్ణసిద్ధతను చెప్పకనే చెప్పినట్లైంది. డబ్బులేదన్న వైద్యుని హేళన కీనోలో కసిని మరింత పెంచుతుంది. వెనుదిరిగినా చెట్ల ఆకుల పసరుతో బిడ్డను రక్షించేందుకు తల్లిపడే ఆతృత జు ఆనాలో రచయిత మనకు చూపించారు. ఎంతో కసితో కీనో సముద్రంలో వేటాడతాడు. కీనోకు అతి విలువైన ‘మంచి ముత్యం’ దొరుకుతుంది. ఇక అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. అతని వద్ద ముత్యాన్ని చేజిక్కించుకోవాలని ధనవంతులు, దళారులు ఎంతగా ఆరాటపడతారో… ఎన్ని కుట్రలు పన్నుతారో.. అన్నది నేడు మనమూ ఎదుర్కొంటున్న దోపిడీ సమాజాన్ని గుర్తుచేసినట్లైంది. అంతేకాకుండా ‘మానవసారంతో కలిసి ఏర్పడిన ‘ఉత్సుకత’ అనే నల్లటి మడ్డి, పట్టణమంతా వ్యాపించి గడ్డకట్టింది..’ ‘నలుపును, చెడును అనంతాల వరకు కలియబెట్టినట్లుంది’ పట్టణపు విషగ్రంథుల్లో విషం తయారవుతూ ఉంది…’ అన్న వాక్యాలు దోపిడీ పట్ల రచయిత కచ్చితమైన మనోభావాల్ని తెలుపుతోంది. ఆ ముత్యాన్ని చేతబట్టి కీనో తన కష్టాలన్నీ ఎలా గట్టెక్కి తన బిడ్డ బాగా చదువుకున్నట్లు, తామెంతో ధనవంతులమైనట్లు కలలు కంటాడు. సమాజంలోని దోపిడీ మృగాలు చివరకు అతని కుటుంబాన్ని వేటాడటంతో జు ఆనా ఆ ముత్యం వద్దు, మనకు నష్టమని బ్రతిమాలుతుంది, ఎదురుతిరుగుతుంది. అయినా పట్టుదలతో కీనో దాడిని ఎదుర్కోవడానికే సిద్ధపడతాడు. జు ఆనా అతని వెన్నంటి ఉంటుంది. చివరకు వారి కలలు కల్లలైనట్లు ముగించడం గుండెను పిండేసినట్లైంది. నేటి దోపిడీ సమాజంలో వాస్తవం కఠినంగానే ఉంటుంది మరి. కీనో, జు ఆనా ఆ ముత్యాన్ని సముద్రంలోకే విసిరేసి యథా ప్రకారం తమ జీవితాన్ని కొనసాగించడంతో కథ ముగుస్తుంది. వారి జీవితాల్లో ముత్యం ‘మంచి’ చేయకపోయినా..పేదలు ఎలా దోపిడీకి గురవుతున్నారో మన కళ్ల ముందుంచిందీ ‘మంచి ముత్యం’. దోపిడీపై పేదవాని తిరుగుబాటును అర్థం చేసుకోవాలనేవారు ‘మంచిముత్యం’ చదవాల్సిందే.. ఇలాంటివి వెలుగులోకి తెచ్చిన రచయిత, అనువాదకులు ధన్యులు. అనువాదకులు దీన్ని అనువదించి 15 ఏళ్లపాటు అలాగే ఉండిపోయిందని పేర్కొన్నారు. నిజంగా సముద్రంలోని ‘మంచి ముత్యం’లా ఇప్పటికైనా వెలికితీసి, వెలుగు చూపిన దేవరాజుగారు మనకో ‘ఆణి ముత్యం’ అందించినట్లే.
- శాంతిశ్రీ
0 Response to "‘మంచి ముత్యం’ ఒక ‘ఆణిముత్యం’"
కామెంట్‌ను పోస్ట్ చేయండి