ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. మేడే కార్మికవర్గ పోరాటపటిమకు, సమరశీలతకు తార్కాణంగా నిలిచినరోజు. తమ జేబులు నింపుకునేందుకు రోజుకు 15, 20 గంటలపాటు చాకిరీ చేయిస్తున్న పెట్టుబడిదారుల దౌష్ట్యాన్ని శ్రామికవర్గం నిగ్గదీసినరోజు. ఎనిమిది గంటల పనిదినానికై కార్మికవర్గం సమ్మె పోరాటానికి శంఖారావం పూరించిన రోజు.
కార్మికవర్గ ఐక్యతను సహించలేని దోపిడీవర్గం కాల్పులు జరిపింది. కాల్పుల్లో అనేకమంది కార్మికులు నేలకొరిగారు. కార్మికవీరుల రక్తంతో తడిసిన ఎర్రజెండా నింగికెగసింది. 1886 మేలో అమెరికాలోని చికాగో పట్టణాన జరిగిన సంఘటన ఇది. కార్మికవీరుల రక్తంతో ఎరుపెక్కిన ఆ జెండా ప్రపంచ పీడిత జాతి అంతర్జాతీయతకు సంకేతమైంది.
నాటి నుండి నేటివరకు తమ మూల్గులు పీల్చే దోపిడీదారులపై ఎర్రజెండా చేతబట్టి కష్టజీవులు అనేకవిధాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటాలకు ఇతరేతర వర్గాలతోపాటు మేధావి వర్గమైన కవులూ తమ వంతుగా కలంతో సిరా చిందించారు. వీరిలో కష్టజీవుల పోరాటాలకు అండగా నిలుస్తూ వారి కడగండ్లను ప్రతిబింబించే గీతాలతో స్ఫూర్తినిచ్చిన వారు కొందరైతే, కష్టజీవులతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా వారి జీవన విధానాన్ని, దోపిడీకి గురవుతున్న తీరును అవలోకనం చేసుకొని తద్విషయాలను కవిత్వీకరించిన వారు ఇంకొందరు.
గత శతాబ్దంలోనే ఇలాంటి కవులు కొందరు కార్మిక పోరాటాలకు తమ వంతు సహకారమిచ్చారు. 1871లో పారిస్ కమ్యూన్ స్థాపనకు కార్మికవర్గమే కారణమైనా మేధావులు, కవులు కూడా తమ వంతు పాలుపంచుకున్నారు. పారిస్ కమ్యూన్ పతనానంతరం లండన్‌లో తలదాచుకున్న యాజీవ్ పొట్టియార్ (ఈయన పేరును యాజినీ పాటిల్‌గా కూడా రాస్తున్నారు) నాడు రాసిన ఓ గీతం తరువాత కాలంలో అంతర్జాతీయ గీతంగా ఖ్యాతిగాంచింది. ఈ గీతాన్ని బాలాంత్రపు నళినీ కాంతారావు తెలుగులోకి అనువదించారు.
”ఆకలి మంటలు మలమలలాడే
అనాథలందరూ లేవండోరు
హింసారతిని సహించలేక
ఈసడించినది యెల్ల ధర్మము
మంచి దినాలు రానున్నారు
మనకందరకు లేవండోరు”
అని ప్రారంభమయ్యే ఈ గీతాన్ని నేటికీ వామపక్ష పార్టీలు ప్రత్యేకంగా సిపిఎం తమ సభల ముగింపులో నేతల నుండి కార్యకర్తల వరకూ ఈ పాట పాడి కర్తవ్యోన్ముఖులై కదులుతారు.
దోపిడీవర్గం, కష్టజీవుల శ్రమ ఫలితం చేజిక్కించుకుంటున్న తీరుని కవి ఎత్తిచూపుతారు. ‘ఈ రక్తపిపాసుల పీడ వదిలితే జగతి సమస్తం శాంతి తేజమూ.. దిక్కు దిక్కులా ఆనందమే’ అంటారు.
కార్మికులు-కర్షకులు దోపిడీకి గురవుతున్న తీరుపై మహాకవి శ్రీశ్రీ పలు గీతాలు రాశారు. ఆయన రాసిన ”ప్రతిజ్ఞ” కవితను ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొనాల్సిందే.
గనిలో, పనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనిక స్వామికి దాస్యం చేసే
యంత్ర భూతముల కోరలు తోమే
కార్మికవీరుల కన్నులనిండా
కణకణ మంటే
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోరు”
అంటారాయన. శరీరం కష్టం స్ఫురింపజేసే సమస్త చిహ్నాలూ తాను రచించే గీతాలకు భావం – భాగ్యమన్న ఈ కవి లోకంలో కష్టజీవులకు ఎదురవుతున్న అన్యాయాలు, ఆకలి, వేదన పరిష్కరించే దిశగా పాటలు రాస్తున్నానని చెబుతారు.
వస్తు సంపదను సృష్టించేది కార్మికవర్గం. లాభాలు గడించేది మాత్రం యజమాని ఒక్కడే. ఇది అన్యాయమంటే ‘అనుభవించాలి మీ కర్మం’ అంటూ కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తాడు యజమాని. ఈ భావాన్ని ‘వాడు’ అనే కవితలో ఇలా ప్రతిబింబించారు శ్రీశ్రీ-
”అందరం కలిసి చేసిన ఈ
అందమైన వస్తు సముదాయం అంతా
ఎక్కడో ఒక్కడే వచ్చి
ఎత్తుకుపోతూ వుంటే చూచి
”అన్యాయం, అన్యాయం!” అని మేమంటే
”అనుభవించాలి మీ కర్మం” అంటాడు.
సామాజిక సంపదపై అందరికీ హక్కుంది. సంపదపై ఒక్కడు గుత్తాధికారం కలిగి ఉండటానికి వీల్లేదంటారు ఈ కవి.
ఇదియే సూత్రం ఒక్కడు మాత్రం
భూమిని గుత్తకు కొనరాదు – కడు
సోమరిపోతై మనరాదు
నేలా నీరు గాలీ వెలుగూ
కొందరి సొత్తని అనరాదు – అవి
అందరి హక్కై అలరారు
శ్రీశ్రీ కవిత్వంలో ఇలాంటి భావాలు అనేకచోట్ల దర్శనమిస్తాయి. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం జరపాలనే సందేశం అనేక గీతాల్లో వ్యక్తమవుతుంది.
”పోయేవి, తెగిరాలిపోయేవి, తెగటారిపోయేవి మన దాస్య బంధాలే’
అన్న చరణం ”ప్రపంచ కార్మికులారా! ఏకంకండు. పోయేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప” అన్న కారల్‌మార్క్స్ పిలుపును తలపింపజేస్తుంది.
శ్రమించే వారొకరు, అనుభవించే వారు వేరొకరా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తాడు జాతీయోద్యమ కవి గరిమెళ్ళ సత్యనారాయణ తను రాసిన గీతంలో -
అన్యాయ కాలంబు దాపురించిందిపుడు
అందరము మేలుకోవాలండి
మాన్యాలు భోగాలు మనుజులందరి కబ్బు
మార్గాలు వెతకాలి రండి
ఏటి పొడుగున దున్ని యెరువేసి నీరెట్టి నూర్పి
పండించేది మనమంతా
గోటు చేయుచు బూతు కూతలను కూసి
కలకొట్టి కొనుపోవుటింకొకరంతా
సామాజిక సంపదను ప్రజలందరూ అనుభవించాలి తప్ప ఏ ఒక్క వర్గమో హస్తగతం చేసుకోవడం కూడదంటున్న గరిమెళ్ళ సోషలిస్టు భావాలు, కార్మిక-కర్షక ఉద్యమాలకు ప్రభావితులయ్యారనిపిస్తుంది.
అధికార భూతములడుగు లంచములిచ్చి
పరిపరి విధముల పన్నులిచ్చి
మునసబు కరణాల ముడుపులన్నియునిచ్చి
కోసినూడ్పిన వరికూలికిచ్చి
కచ్చేరి బంట్రోతు గాముల కీనామిచ్చి
పాలేళ్ళకు కొంత పంటనిచ్చి
యజమానులకు పంట నర్ధభాగమునిచ్చి
పైకమిచ్చిన వాని వడ్డికిచ్చి
గడ్డిమాత్రమే మిగిలించుకాపువాడు
సేద్యమున తాను పశువుల రక్షించుకొరకు
కటకటా యెట్టులున్నదో కాపులదశ
సుగుణధనులారా జనులార చూడరయ్యా
చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన పై కవిత దాదాపు వందేళ్ళ క్రితం రైతాంగం ప్రత్యేకంగా కౌలురైతు కష్టఫలం ఏవిధంగా దోపిడీదార్ల హస్తగతమయ్యేదో స్పష్టం చేస్తోంది. చెమటోచ్చి పండించినా గింజలే కరువైన రైతాంగ దుస్థితిని..
”ఏటికేతం బెట్టి యెయిపుట్లు పండిస్తె
ఎన్నడూ మెతుకెరుగనన్నా
నేను గంజిలో మెతుకెరగనన్నా”
అంటూ జానపదులు పాడుకొనే గీతం కూడా దీన్నే ప్రతిబింబిస్తుంది.
సి. నారాయణరెడ్డి ఒక గీతంలో
అధికారం ఒక వర్గం ఆటబొమ్మ కాదు
ఐశ్వర్యం ఒక వర్గం అబ్బసొమ్ము కాదు
రెక్కలు విరిగిన పీడితులొక్కటై ఉప్పెనలా లేస్తున్నారు
దోపిడి రుచులను మరిగిన దొరలను తుడుచుకుపోతున్నారు
అనడంలో వర్గ దోపిడీ అంతమవ్వాలనే భావం ధ్వనించడంతోపాటు కష్టజీవులు ఉద్యమిస్తూ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ దొరలను అంతమొందియ్యటం కనిపిస్తుంది.
”మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు” అంటూ కరుణశ్రీ రచించిన గీతం ప్రజలను బాగా ఆకట్టుకుంది.
మా నోట్లో ఆకలి భగభగ
మీ నోట్లో సిగార్సు భుగభుగ
మా కీ పడిపోయిన మేడలు
మీ కేడంతస్తుల గోడలు
సమాజంలో కొందరికి కట్టు గుడ్డే కరువైతే ఇంకొందరికి ఒంటినిండా బంగారం. కొందరు మండుటెండల్లో చెమటోడ్చి చాకిరి చేస్తుంటే ఇంకొందరు పండు వెన్నెల్లో ఆడుకొంటున్నారు. పేదవారి పూరిపాకలో కారుచీకటి కమ్ముకొంటే వున్నవాడి మరుగుదొడ్లో పట్టపగలే లైట్లు వెలుగుతుంటాయి. ఇలా ధనిక-పేద వర్గాల జీవన విధానంలో తలెత్తిన వ్యత్యాసాన్ని తేలిగ్గా అర్థమయ్యే పదాలతో తనదైన శైలిలో రచించారు కరుణశ్రీ.
దేశం స్వాతంత్య్రం సాధించి దశాబ్దాలు గడిచినా భూస్వాముల పట్టు సమసిపోలేదు. పాలకవర్గం భూసంస్కరణల గురించి చట్టాలు చేసింది తప్ప ఆచరణలో కష్టజీవులకు భూములివ్వబూనుకోలేదు. పైగా బూర్జువా, భూస్వామ్య వర్గ ప్రయోజనాలను కాపాడేందుకే కంకణం కట్టుకుంది. భూస్వామ్య వర్గం పద ఘట్టనల కింద శ్రామికులు నలిగిపోతున్న దుస్థితి నేటికీ పలు రాష్ట్రాల్లో ఉంది. దేశవ్యాపితంగా వెట్టిచాకిరిలో మగ్గిపోతున్న ప్రజలు ఇప్పటికీ లక్షలాదిగా ఉన్నారు. తెలంగాణా ప్రాంతంలో శ్రామికులు ఒకప్పుడు వెట్టిచాకిరిలో ఎంతో మగ్గిపోయారు. నాడు తెలంగాణాలోని భూస్వామ్య కుటుంబాలకు ప్రతి హరిజన కుటుంబం నుండి ఒకరిని వెట్టిచాకిరి చేయించేందుకు పంపక తప్పేదికాదు.
రావుగారి ఇంటిముందు రాత్రిపగలు కాపలరా
పుట్లకొలది వడ్లుదంచి పోటు తెల్లగెయ్యాలి
గుట్టల కొలదిగ పంటకు కట్టెలు పలగ్గొట్టాలి
అడవితిర్గ విస్తరాకు లెన్నైనా తేవాలి
అంటూ సుద్దాల హనుమంతు రాసిన గీతం నాటి తెలంగాణాలోని వెట్టి చాకిరీకి అద్దంపడ్తుంది.
ఎంత చేసినా వెట్టిచాకిరీ పొట్టనిండదేలా
పండిన గింజలు పన్నుకు పోతే పస్తులు మనకేరో
ఆరుగాలము కష్టపడిన మన మావురుమని యేడ్చి
పొలమేదిక్కో తెలియని దొరలూ గాదెలు నింపెడి
చేవలేని యీ బ్రతుకు పుట్టు చలిచీమల చేసిన కూర్పు
అంటూ ఆరుద్ర ‘త్వమేవాహమ్’లో బుర్రకథ వరసలో శ్రమజీవులు, భూస్వాముల దోపిడీకి గురవుతున్న తీరును కవిత్వీకరించారు.
కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గునీకు వచ్చి చేరెను తెలుసుకో..
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడకట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా?
కడుపుకాలే కష్టజీవులు వడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారూ తెలుసుకో
కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు..
… అన్నాడు మనస్సు కవి ఆత్రేయ. ఈయన శ్రామికుల శ్రమతో గొప్పవారు ఎలా సొబగులు అద్దుకుంటున్నారో ఎంతో చక్కగా వర్ణించారు పై గీతంలో..
వర్గదోపిడీకి, కష్టజీవుల వెతలకు అద్దంపట్టే అనేక గీతాలను నేడు ప్రజానాట్యమండలి కళాకారులు జనంలో పాడుతున్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించే ఈ గీతం నాడు జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.
చెట్టూ పుట్టా చదునూచేసి
మెట్టా పల్లం చదరం చేసి
కొండ కోన బారులు పేల్చి
వాగుల ఏరుల దారులు మార్చి
చెమటతో భూమిని తడిపిన వాడా
జాతికి జీవం పోసేవాడా
………..
నీవంట్లో ప్రతి రక్తం బొట్టు
దోపిడీ దొంగల సంపద పెట్టు
కష్టజీవులంతా ఐతే జట్టు
పరన్నాభుక్కుల ఆటలు కట్టు
చూపర ఐక్యత ఉడుంపట్టు
పనిదొంగల గుట్టు చెయ్యర రట్టు
ఈ నేలతో శ్రమజీవులకున్న బాంధవ్యం మరెవ్వరికీ వుండదు. తన శ్రమతో జగతిలో జిలుగులు నింపుతున్న, దోపిడీదార్లకు సంపద చేకూర్చిపెడుతున్న శ్రమజీవులు దండుగా కదలి దోపిడీవర్గం ఆటకట్టించమంటున్న ఈ గీత రచయిత దేవేంద్ర.
సమస్త వస్తుసంపద సృష్టించిన శ్రమజీవికి వాటిపై అధికారం లేదు. ఈ అధర్మాన్ని అంతంచేసి సమధర్మమున్న సమాజం కోసం పోరాడమన్నారు ప్రజాకవి వడ్లమూడి-
కష్టించే బలమున్నది
సృష్టించే శక్తున్నది
నీరెక్కల కదలికతో
ప్రతివస్తువు రూపుదాల్చె
నీ పూనిక లేనినాడు
నడువలేదు ఈ లోకం
అధర్మం అంతుతేల్చి
సమధర్మం స్థాపనకై
మోగించు నగారా
సాగించుము తుది సమరం అంటారు.
నల్లి ధర్మారావు శ్రమజీవుల కష్టంతో దోపిడీవర్గం ఆస్తులు పెంచుకొంటున్న వైనంపై ఇలా పాటగట్టారు.
”నినుదోచిన దొరలందరు – విలాసాల బతుకుతూని
నీ సెమట సెంటుజేసి – ఒళ్ళంతా పూసుకొని
కరిగిన నీ కట్టమంతా – రూపాయిల కట్టలుగా
సిందిన నీ నెత్తురంతా – సింధూరపు బొట్టులుగా
మార్చుకొని మేడలు గొట్టే కూలన్నా
మిగిలేను నీకు పిడికెడు మట్టే – కూలన్నా”
శ్రమజీవులపై సాగుతున్న దోపిడీని ప్రతిబింబిస్తూ ఇంక అనేకమంది కవులు తమవైన బాణీల్లో పలు గీతాలు రాశారు.
ఒక వర్గంపై మరో వర్గం సాగించే దోపిడీ అంతం కావడం, జాతి సంపద మొత్తం ప్రజల పరం కావడం కమ్యూనిస్టుల అభిమతం.
నేలహక్కు ప్రజలదే
నీటిహక్కు ప్రజలదే
ప్రజల దోచు దోపిడీండ్ర
బ్రతుకు లెత్తిచూపరా
భారీ యంత్రాలన్నియున్
ప్రభుత్వపరము గావలెన్
పాలనాధికారముల్
ప్రజల వశముగావలెన్
అంటూ నార్ల చిరంజీవి రాసిన కవాతు పాట పైభావాలనే ప్రతిబింబిస్తుంది. వర్గ దోపిడీని చిత్రీకరించిన ఇలాంటి గీతాలు ఇంకా ఎన్నో వున్నాయి. పలు గీతాలు ప్రజలను వల్లె వేయిస్తూనే ఉన్నాయి. సదా ఉత్తేజపరుస్తూ ఉత్సాహాన్ని నింపుతూనే వున్నాయి. సమాజంలో వర్గదోపిడీ అంతమయ్యే వరకు ఇలాంటి గీతాలు సజీవమై, స్ఫూర్తినిస్తూ అలరారుతూనే ఉంటాయి.
0 Response to "శ్రామిక(వి)త్వం"
కామెంట్‌ను పోస్ట్ చేయండి