అపూర్వ

తనను రెండు కళ్లు గమనిస్తున్నాయని గుర్తించింది అపూర్వ.
ఆవైపుగా తనూ దృష్టి సారించింది.
అవే కళ్లు.. తనకిష్టమైన కళ్లు.. 15 ఏళ్ల తర్వాత…
ఆశ్చర్యంతో ఒక్క క్షణం చూసింది. వెంటనే కనుమరుగయ్యాయి.
ఇంకా చూడాలనిపించింది. కానీ అర్జున్‌ బండిమీద తాను.
అర్జున్‌ అపూర్వను అక్కడకు దగ్గరలోనే ఉన్న గ్రంథాలయం ముందు దించి, అరగంటలో వస్తానంటూ వెళ్లిపోయాడు.
ఆ కళ్లు మళ్లీ కనిపిస్తాయని అన్నివైపులా దృష్టి సారించింది అపూర్వ.
కనిపించలేదు..
నిరాశతో అక్కడే ఉన్న సుగుణా ఆంటీ వాళ్లింటికి వెళ్లింది.
సుగుణా ఆంటీతో మాట్లాడుతున్నా.. అపూర్వ మనస్సంతా గందరగోళంగా ఉంది. ఆంటీ అడుగుతున్న వాటికి ఏదో సమాధానాలు చెపుతూ ఉంది కానీ..
మళ్లీ బయటకు వెళితే ఆ కళ్లు కనిపిస్తే బాగుండనుకుంటుంది మనస్సులో.
ఇక అక్కడ కూర్చోలేక బయటకు వచ్చింది. మళ్లీ అవే కళ్లు కనిపించాయి. ఆ కళ్లతో తన కళ్లూ కలిపింది అపూర్వ.
ఒక్కసారి గుండె వేగంగా కొట్టుకోవడం ఆరంభించింది.. అలాగే నిగ్రహించుకుని ఆ కళ్లల్లోకే చూస్తోంది అపూర్వ.
గ్రంథాలయంలోకి వస్తూ ‘బాగున్నావా?’ అన్న విశాల్‌ పలకరింపుతో కనురెప్పలు రెపరెపలాడించింది.
‘బాగున్నా’ అని ట్రాన్స్‌లో ఉన్నట్లే సమాధానం చెప్పింది. ‘మీరు బాగున్నారా?’ అడిగింది అపూర్వ.
‘బాగానే ఉన్నా.. మరి ఉంటా..’ అన్నాడు విశాల్‌.
‘అంతే ఖచ్చితం… ఏమాత్రం మార్పులేదు మనిషిలో.. ‘ విశాల్‌ గూర్చి అనుకుంది అపూర్వ.
ఆ కళ్లు దూరమైపోతున్నాయి. విశాల్‌ ఇంకాస్సేపు అక్కడే ఉండి మాట్లాడితే ఎంత బాగుండు అనుకుంది. దూరమైపోతున్నాడు… అయినా ఆవైపుగానే చూస్తుండిపోయిన అపూర్వకు గతం ఒక్కసారి గుర్తుకొచ్చింది.
××××
అపూర్వ చాలా చలాకీ అయిన అమ్మాయి. సమస్య ఏదైనా వస్తే దాన్ని పరిష్కారానికి ఆలోచించాలిగానీ, బాధపడకూడదనేది ఆమె సిద్ధాంతం. అసలే పేదరికం.. ఆపైన కుటుంబ బరువు, బాధ్యతలు పట్టకుండా తండ్రి దేశాన్ని పట్టుకుని పోయాడు. ఆ బాధను తట్టుకోలేక.. అవమానాలు తట్టుకోలేక తల్లి ఉరివేసుకుని చనిపోయింది. అపూర్వే కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. బాధ్యతలను ఎన్నడూ బరువుగా అనుకోలేదు అపూర్వ. చెల్లెల్ని డిగ్రీ వరకూ చదివించి, వివాహం చేసింది. తనొక్కతే ఉంటోంది.
ఈ సమాజంలో కొందరు మాత్రమే గొప్పవారు. చాలా మంది పేదవారు. ఇందుకు కారణమైన ఈ వ్యవస్థ మారాలనే ఎప్పుడూ బలంగా కోరుకునేది అపూర్వ. ఆ సంకల్పంతో పనిచేస్తున్న ఒక రాజకీయపార్టీ కార్యాలయంలో చిరు ఉద్యోగిగా చేరింది. అక్కడ పనిచేయడం అపూర్వకు చాలా ఇష్టం. ఎంతో అంకితభావంతో పనిచేస్తుండేది అపూర్వ. అందరూ ఆమె పనితీరుకు ముగ్ధులై ప్రశంసించేవారు.
అలా గడిచిపోతున్న జీవితంలోకి విశాల్‌ ప్రవేశించాడు. అతను పేరుకు తగ్గట్టే విశాల భావాలు కలవాడు. విశాల్‌ను కొద్దికాలంగా గమనిస్తోంది అపూర్వ.
అపూర్వ కోరుకున్నట్లే అతనూ ఈ వ్యవస్థ మారాలనుకుంటున్నవాడు. అనుకుంటున్నవాడే కాదు ఆచరణలో నిజంగా అలా చేసేవాడే. అతను తెల్లవారితే మురికివాడల్లో ప్రత్యక్షమవుతాడు. వాళ్ల సమస్యలనే తన సమస్యల్లా నిరంతరం వాటి గురించే ఆలోచిస్తాడు. ఆ సమస్యలకు పరిష్కార రూపాల కోసం శోధిస్తాడు. అందుకనుగుణంగా పోరాటాలు జరపడంలో ముందుంటాడు. ఆ క్రమంలోనే అతను అక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి మరింత ఎక్కువ సమయం గడుపుతూ వారితో మమేకమై పనిచేస్తున్నాడు.
ఉదయం లేచి పేపరు చూస్తోంది అపూర్వ.
మంచినీళ్లు కొనుక్కుని తాగాలా? అని విశాల్‌ కౌన్సిల్లో మాట్లాడిన తీరును ప్రశంసిస్తూ అన్ని పక్షాల వాళ్లు చెప్పిన అభిప్రాయాలు రాశారు. వాటిల్లో ‘నిబద్ధతగల నేత, సమస్యలన్నీ బాగా స్టడీ చేస్తాడు.. పరిష్కారం కూడా తేలిగ్గా అప్పటికప్పుడే చెపుతాడు.. మంచి నాయకుడు’ అని ఒకటే పొగడ్తలు.
అవన్నీ చదువుతుంటే విశాల్‌ అంటే అపూర్వకు మరింత అభిమానం కలిగింది.
×××
అప్పటికే మూడునెలలుగా పేదలకు ఇళ్లస్థలం ఇవ్వాలని పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. అనేక రూపాల్లో విశాల్‌ నాయకత్వంలో పోరాటాలు జరుగుతున్నాయి.
ఒకరోజు…
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకూ ఆహారం తీసుకోనంటూ విశాల్‌ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు.
వచ్చిన వాళ్లంతా ‘విశాల్‌ దాతృత్వాన్ని, మానవత్వాన్ని పొగుడ్తూ మాట్లాడేవారే..’
పేదలంతా పిల్లాజల్లాతో సహా ఆ దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టి ఉన్నారు..
‘అయ్య ఏమవుతాడో అంటూ’ కావలి కాస్తూ మగవాళ్లు రాత్రిళ్లు అక్కడే పడుకుంటున్నారు. ఆడవాళ్లు తెల్లారి వంటలు అవీ చేసుకొని పిల్లల్ని తీసుకుని వస్తున్నారు..
విశాల్‌ రోజు రోజుకు నీరసించిపోతున్నాడు.. అయినా అతను ఆ పేదలందర్నీ చూసి మరింత ఉత్తేజితడవుతున్నాడు.
విశాల్‌కి ఏమవుతుందోనని అపూర్వ చాలా ఆందోళనపడుతోంది. రాత్రిళ్లు ఏడుస్తుంది కూడా. మరోపక్క అతని మానవీయతకు ఆశ్చర్యం కలుగుతుంది.
రోజులు గడుస్తున్నాయి.. పాలకులు దిగి రావడం లేదు..
రోజురోజుకు విశాల్‌కు ప్రజాదరణ ఎక్కువైపోతోంది.
విశాల్‌ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు పరీక్షలు చేసి వెల్లడించారు.
ఒకరోజు అర్ధరాత్రి విశాల్‌ను ఆసుపత్రికి తరలించడానికి పోలీసులు వ్యానుల్లో వచ్చారు..
అంతే ప్రజలంతా ఒక్కటై విశాల్‌ను తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. అయినా వారందరినీ చెల్లాచెదురు చేసి, లాఠీఛార్జీ జరిపి బలవంతంగా విశాల్‌ను వ్యాన్‌లో ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో కూడా విశాల్‌ తన దీక్షను కొనసాగించాడు. వైద్యాన్ని నిరాకరించాడు.
పేదలంతా ఆసుపత్రి భవనాన్ని చుట్టుముట్టారు.
దీంతో పాలకులు దిగి వచ్చారు.
పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారు.
విశాల్‌ దీక్ష విరమింపజేసేందుకు మంత్రి నిమ్మరసం ఇవ్వబోయాడు.
అయితే అందుకు విశాల్‌ ఒప్పుకోలేదు. పేదల చేతితో ఇస్తేనే తాగుతానన్నాడు.
అందుకు అక్కడున్న పేదలు ‘మా అయ్యే.. మా అయ్యే.. నువ్వు నూరేళ్లు బాగుండాలయ్యా…’ అంటూ మొటికలు విరిచారు.. అందులో ఒక పెద్దాయన వచ్చి నిమ్మరసం తాగించాడు.
దాంతో విశాల్‌ దీక్ష విరమించాడు.
వైద్యులు అతనికి వెంటనే సిలైన్స్‌ పెట్టి వైద్యం చేశారు.
ఈ సంఘటన అపూర్వ మనస్సును కదిలించి వేసింది.
విశాల్‌ కోలుకునే వరకూ అక్కడే ఉండి సేవలు చేసింది అపూర్వ.
అతను వివాహం కూడా చేసుకోకుండా ప్రజల కోసం అంకితమైపోయాడని తెలిసింది అపూర్వకి.
దాంతో విశాల్‌పై అపూర్వకు మరింత గౌరవం పెరిగింది.
అప్పటి నుండి అతన్ని ఆరాధిస్తోంది అపూర్వ. రోజురోజుకు అతని ధ్యాస ఎక్కువైపోయింది అపూర్వకు.
ప్రజలకోసం అతను అలాగే ఉండిపోతాడు. అతను ముసలివాడైపోతే ఎవరు చూస్తారు? అతనికి తోడెవరు? అన్న ప్రశ్నలు అపూర్వని వేధించసాగాయి.
అంతే అరోజు నుండి చాలా రాత్రులు అపూర్వకు నిద్ర దూరమైంది.
ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది అపూర్వ.
×××
ఒకరోజు…
వసంతకాలం అవటాన చెట్లన్ని చిగురులు వేస్తున్నాయి. తన తోడులేక విరహంతో కోయిలలు అదే పనిగా కూ..ఊ.. కూ..ఊ.. అంటూ కూస్తున్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది.
ఆరుబయట రెండు కుర్చీలు వేసి విశాల్‌ని రమ్మని ఆహ్వానించింది అపూర్వ.
‘నమస్తే’ కుర్చీలో కూర్చుంటూ అంది అపూర్వ.
‘నమస్తే.. ఏంటి అపూర్వ ఇవ్వాళ నీ మొహం చాలా వెలిగిపోతుంది’ అన్నాడు విశాల్‌.
‘నిజంగానా?’ అడగకుండా ఉండలేకపోయింది అపూర్వ.
‘అవును.. సరే ఏంటి విషయం?’ అన్నాడు విశాల్‌.
‘ఇతను ఇంతే.. భలే సూటిగా మాట్లాడేస్తాడు. డొంకతిరుగుడు ఉండదు.’ అని మనస్సులో అనుకుంటూ అలాగే మౌనంగా ఉండిపోయింది అపూర్వ.
‘ఏంటి?’ మళ్లీ రెట్టించి అడిగాడు విశాల్‌.
‘నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నా’ అంటూ గబగబా చెప్పేసింది అపూర్వ. చెప్పిందన్నమాటేగానీ ఒకటే దడ. ఎద ఎగసి ఎగసి పడుతోంది. అప్రయత్నంగా ఎదపై చేయిపెట్టుకొని విశాల్‌ సమాధానం కోసం ఎదురుచూస్తోంది అపూర్వ. అదేంటో కళ్లు పైకెత్తి చూడలేకపోయింది.
‘అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు’ సూటిగా చెప్పేశాడు విశాల్‌.
‘మీ విషయం తెలిసే అడుగుతున్నా’ అంది అపూర్వ.
‘ఏం తెలుసు?’ అన్నాడు విశాల్‌.
‘మీరు వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోవాలనుకుంటున్నారని’ మాటలు కూడదీసుకొని మరీ చెప్పింది అపూర్వ. ‘ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నాకూ నా కుటుంబానికీ నీలాంటి వ్యక్తి అండ కావాలి’ అంది అపూర్వ.
విశాల్‌ మౌనంగా కాసేపు ఉండిపోయాడు. నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ ‘నీ అభిప్రాయం మార్చుకో. నాకలాంటి ఆలోచనలేదు’ అన్నాడు విశాల్‌.
‘మీకు లేదు. నాకు ఉంది. ఆలోచించుకొని చెప్పండి. తొందరేమీ లేదు.. నేనే ముందడిగానని చులకనగా చూడొద్దు’ అంది అపూర్వ.
‘ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్న వారి మధ్య వాదన తెగదు’ అన్నాడు విశాల్‌.
‘అది అర్థమయ్యింది కదా! ఆలోచించుకొని చెప్పండి విశాల్‌’ అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది అపూర్వ.
ఏదైనా మంచి పుస్తకం మార్కెట్‌లోకి వస్తే చాలు. బస్సు ఎక్కకుండా ఇంటికి నడిచి వెళ్లి కూడేసిన డబ్బుతో విశాల్‌కు ఆ పుస్తకం కొని తెచ్చేది. అందులో చాలా ఆనందాన్ని పొందేది అపూర్వ. ఇది ఆమెకు నిత్యకృత్యం అయ్యింది.
రోజులు గడుస్తున్నాయి…
×××
‘రా కూర్చో’ ఆహ్వానించాడు విశాల్‌.
‘ఏమాలోచించుకున్నారు విశాల్‌?’ సూటిగా అడిగేసింది అపూర్వ. ‘మనకు పిల్లలు కూడా వద్దులే. వాళ్లకి టైమ్‌ కేటాయించలేము..మన లక్ష్యానికి ఇబ్బంది కదా!’ అంది అపూర్వే.
విశాల్‌ మాత్రం నోరు మెదపటం లేదు. కొద్దిసేపు నిశ్శబ్ధం రాజ్యమేలిన తర్వాత..
‘నేను వివాహం చేసుకోవాలనుకోవడం లేదు’ చెప్పాడు విశాల్‌.
‘ఎందుకు? ఏమిటీ? అని అడగలేదు అపూర్వ. అప్పటికే గుండెలో బాధ కళ్లల్లో నీళ్లరూపంలో వచ్చి చెంపలపైకి చేరాయి. కళ్లుతుడుచుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది.
మొదటిసారి విశాల్‌కో లేఖ రాసింది. దాన్ని ‘ప్రేమలేఖ’ అన్నా తప్పులేదేమో.
ఆ లేఖలో…
‘ప్రియమైన విశాల్‌..!
నీ ఆశయాలు, ఆలోచనలు నాకు చాలా దగ్గర ఉన్నాయి. నువ్వు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతే ఎలా? నువ్వు ముసలివాడివైపోయాక నిన్ను ఎవరు చూస్తారు?.. నువ్వు పెళ్లి చేసుకుంటే సరి.. లేకపోతే నేనూ అలాగే ఉండిపోతా.. నీకు వృద్ధాప్యంలో ఓ తోడు కావాలి కదా! మన లక్ష్యం మాత్రం మర్చిపోవద్దు.. ఈ వ్యవస్థ మార్పుకు మనకు చేతనైనంత చేయాలి. నాకు నువ్వు.. నీకు నేను.. ఒకరికొకరు తోడూ నీడగా ఉంటే మన ఆశయం మరింత జయప్రదమవుతుందని నేను ఆశపడుతున్నా.. నీ అభిప్రాయం చెపుతావుగా..
నీ శ్రేయోభిలాషి
అపూర్వ.’
అంటూ ఆ లేఖలో తనభావాలన్నీ పెట్టింది అపూర్వ. అయినా విశాల్‌ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. అలా కొన్నిరోజులు గడిచిపోయాయి.
పెద్దవాళ్ల ముందు ఈ విషయం పెట్టింది. వాళ్లు కూడా విశాల్‌ అభిప్రాయాన్ని అర్థం చేసుకోమని అపూర్వకే సలహా ఇచ్చారు.
××××
కొన్ని రోజులుగా.. అపూర్వ దిగులుగా ఉంటోంది.. ఆఫీసు వరండాలో బల్లమీద కూర్చుని ఉండగా అప్పుడే అక్కడకు వచ్చింది రజిత.
‘అపూర్వ! నీతో ఒక విషయం మాట్లాడాలి.’ అంది రజిత.
‘ఏమిటీ? అన్నట్లు చూసింది అపూర్వ.
నన్ను విశాల్‌ పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఏం చేయమంటావు? అంది.
అంతే నెత్తిమీద పిడుగు పడినట్లయింది అపూర్వకు.
‘నిజమా!’ అంటూ కూడబలుక్కొని అడిగింది అపూర్వ. ‘అవును!’ అంది రజిత.
మనం ప్రేమించినవారికన్నా.. మనల్ని ప్రేమించినవారి దగ్గర ఎక్కువ సుఖపడతాం..’ అంది అపూర్వ పెద్ద ఆరిందాలా. ‘ఎంత అదృష్టవంతురాలివి రజిత! ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ తన కంట్లోంచి వస్తున్న కన్నీరును బయటకు రానీయకుండా. ఇంకాసేపుంటే ఏం జరుగుతుందోనని అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయింది అపూర్వ.
‘ఎందుకిలా జరిగింది?’ అంటూ ఆలోచించింది అపూర్వ.
కొన్నిరోజులు నిద్రాహారాలు మానేసింది.
విశాల్‌, రజితల పెళ్లిరోజు రానే వచ్చింది. అక్కడకు ఎలా వెళ్లిందో అపూర్వకే తెలియదు. ఆ కాసేపు ఉండడానికి మనస్సుకెంతో కష్టంగా అనిపించింది. కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి. భోజనం కూడా చేయకుండానే అక్కడ నుంచి బయటకు వచ్చేసింది అపూర్వ.
కొన్ని నెలలు గడిచాయి.
××××
‘అర్జున్‌ పై నీ అభిప్రాయం ఏమిటి?’ అంటూ ఉత్తరం రాసింది అపూర్వ స్నేహితురాలు అఖిల.
అర్జున్‌ కూడా అదే లక్ష్యంతో ఆ సంస్థలోనే పనిచేస్తున్న వ్యక్తి. తనంటే అర్జున్‌కి చాలా ఇష్టమని అఖిల ఉత్తరం ద్వారా తెలుసుకుంది అపూర్వ.
అపూర్వ ఒక నిర్ణయానికి వచ్చింది. విశాల్‌ జీవితానికి తోడుగా ఉండాలనుకున్నా. అతనికో తోడు దొరికింది కదా! సరే నన్ను అంతగా ఇష్టపడుతున్న అర్జున్‌ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందనుకుంది. అయితే తన గతం అతనికి చెప్పడం సరైందని భావించింది అపూర్వ.
అర్జున్‌తో మాట్లాడాలని అఖిలతో చెప్పింది అపూర్వ. అఖిల అందుకు ఏర్పాటు చేసింది.
తన భావాలు, అభిప్రాయాలు, శ్రీశ్రీ, చలం సాహిత్యమంటే తనకెంత ఇష్టమో… విశాల్‌తో తన అనుబంధం చెప్పింది. అర్జున్‌ చాలా ఓపిగ్గా విన్నాడు. అపూర్వ అలా ఆలోచించడంలో అతనికేం తప్పు అనిపించలేదు. అదే విషయాన్ని అపూర్వకు చెప్పాడు. చాలా సంతోషించింది అపూర్వ.
అయినా కొన్నాళ్లు ఒకరినొకర్ని అర్థం చేసుకున్నాకే వివాహం చేసుకోవాలని అపూర్వ అడిగింది. అందుకు అర్జున్‌ సమ్మతించాడు.
అర్జున్‌ రోజూ ఫోనులు చేస్తుండేవాడు. అలా వారిద్దరూ తమ అభిప్రాయాల్ని పంచుకొన్నారు.
ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకున్నారు.
ఒకరోజు అర్జున్‌ వచ్చాడు.. ‘అలా హోటల్‌కి వెళ్దామా?’ఆహ్వానించాడు అపూర్వని. సరే అన్నట్లు అతనివెంటే దారితీసింది అపూర్వ.
హోటల్‌లో ఒక కార్నర్‌లో పక్కపక్కనే కూర్చున్నారిద్దరూ. అపూర్వ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అర్జున్‌. అంతే కళ్లు అరమోడ్పులై, ఒళ్లంతా పులకరింతతో ఏం చేయాలో తెలియని స్థితి. ‘ఏమిటీ సినిమాల్లోనే అలా ఫీలింగ్స్‌ ఉంటాయనుకుంది ఇన్నాళ్లు.. మనస్సుకూ శరీరానికి ఉన్న లింకేమిటో అనుభవపూర్వకంగా తెలుస్తోంది.. ఏదో తీయని అనుభూతిగా ఉంది’ అనుకుంది మనస్సులో అపూర్వ. అతని చేతిలో నుండి తన చేతిని తీసుకోవాలని అనిపించలేదు.
అపూర్వ, అర్జున్‌ చాలా నిరాడంబరంగా రిజిష్టరు ఆఫీసులో వివాహం చేసుకున్నారు. పెద్దలంతా దీవించారు. విశాల్‌ కూడా వివాహానికి వచ్చాడు. రెండు పూలదండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చి వేసుకోమన్నాడు. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. మూడునెలల తర్వాత అర్జున్‌ ఉన్న ఊరికి వెళ్లిపోయింది అపూర్వ.
×××
అర్జున్‌, అపూర్వ ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. అపూర్వకు అర్జున్‌ ఎంతో సహకరించేవాడు. అర్జున్‌కు ఓర్పు అపూర్వకన్నా ఐదుపాళ్లు ఎక్కువే. వారి అన్యోన్యానికి నిదర్శనంగా వారికొక బాబు. అర్జున్‌కు యాక్సిడెంట్‌ అయ్యి ఆరోగ్యం బాగా దెబ్బతింది. నాలుగైదు ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది.
ప్రకృతి వైపరీత్యానికి ఎదురొడ్డి.. అర్జున్‌ను కంటికి రెప్పలా చూసుకొని కాపాడుకుంది అపూర్వ. తను చాలా అదృష్టవంతురాలినని.. అందుకే అర్జున్‌ తనకు దూరంకాలేదని అపూర్వ అప్పుడప్పుడూ అనుకుంటూ ఉండేది. అర్జున్‌ తనకు దూరమవుతాడన్న ఊహను కూడా అపూర్వ భరించలేదు. అతనంటే ఆమెకంత ఇష్టం. వారి అనుబంధం అలా కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో విశాల్‌ను కూడా అపూర్వ మర్చిపోలేదు. అతనికి ఆమె హృదయంలో పవిత్రమైన స్థానమే ఉంది.
×××
అపూర్వకు విశాల్‌ గురించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేవి. కానీ విశాల్‌ని కలవాలని ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అపూర్వ ప్రయత్నించలేదు. విశాల్‌ ప్రజానాయకుడు. అతను మరింత ఉన్నతమైన నాయకుడు కావాలన్నది అపూర్వ ఆశ.
15 ఏళ్ల విరామం తర్వాత ఆ కళ్లు మళ్లీ కనిపించాయి. మాట్లాడాయి. అందుకే చాలా ఉద్విగంగా ఉంది అపూర్వకు. అయినా కొన్నిరోజులు అలా మౌనంగానే ఉండిపోయింది.
ఒకరోజు విశాల్‌ అపూర్వ పనిచేస్తున్న ఆఫీసుకు ఫోను చేశాడు.. ఏదో సమాచారం కోసం. అపూర్వే ఫోను ఎత్తింది. ‘బాగున్నావా?’ అన్నాడు.’బాగానే ఉన్నా’ అని సమాధానం చెప్పింది. వివరాలు అడగాలనుకున్నా మాట రాలేదు. అతను అడిగిన సమాచారం ఇచ్చింది. అపూర్వ కళ్లవెంట కన్నీళ్లు ఆమెకు తెలియకుండానే కారిపోతున్నాయి. మనస్సు చాలా బరువుగా అనిపించింది.
‘రజిత ఎలా ఉంది? ఎంతమంది పిల్లలు?’ అడిగింది అపూర్వ. ‘బాగుంది.. ఒక పాప.. నీకెంతమంది పిల్లలు?’
‘నాకొక బాబు..’ అప్పటికే దుఃఖంతో గొంతు పూడుకుపోతుంది.. విషయం చెప్పి ఫోను పెట్టేసింది అపూర్వ.
ఇన్నాళ్లూ గుండెలో ఉన్న మంచు కరిగినట్లయింది..
విశాల్‌కి మళ్లీ లేఖ రాసింది అపూర్వ.
ఆ లేఖలో..
‘ప్రియమైన నేస్తమా!
నా హృదయంలో నీకెప్పుడూ పవిత్రమైన స్థానం ఉంటుంది. ఆరోజు నన్ను వివాహం చేసుకోలేదని నాకు బాధగా ఉన్నా. నీ జీవితంలో వివాహం అనేది కూడా ఆదర్శంగా ఉండాలని అనుకున్నావు. అందుకే ఒక దళిత యువతిని వివాహం చేసుకున్నావు. నేనూ అలాగే అర్థం చేసుకున్నా. అందుకే నేను కూడా వివాహం చేసుకోగలిగాను. మనందరి లక్ష్యం ఒక్కటే. ఇప్పుడు నా ముఖ్య బాధ్యత అర్జున్‌ ఆరోగ్యం. అతన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడమే. నీవు మాత్రం మరింత ఉన్నత శిఖరాలని అధిరోహించాలి. నువ్వు జాతీయ నేతవి కావాలి. అందుకు నా సహాయం ఏమైనా అవసరమైతే మొహమాటపడక అడుగు. నువ్వూ, నీ భార్య, పిల్లలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ…
నీ శ్రేయోభిలాషి
అపూర్వ.’
×××
ఆ ఉత్తరం అందుకున్న విశాల్‌ ఆశ్చర్యపోయాడు.
నిజంగా.. ‘లవ్‌ ఈజ్‌ ఎటర్నల్‌!’ అని గొణుక్కున్నాడు.
‘అపూర్వ ప్రేమ నిజంగా అపూర్వమైంది.. అనంతమైంది.. దానికి అంతంలేదు’ అనుకున్నాడు విశాల్‌.
ఆమె చెప్పినట్లే తనూ ఆమె సహాయం తీసుకున్నాడు. ఇంటర్నెట్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని అతనికి నేర్పింది. మెయిల్‌ క్రియేట్‌ చేసి అది ఎలా ఉపయోగించుకోవాలో చెప్పింది. రోజూ మెయిల్స్‌ చేసుకునేవాళ్లు. అతనికి ఎప్పటికప్పుడూ అవసరమైన విషయాలపైనా, అతని ఉపన్యాసాలకు వీలుగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మెయిల్‌ చేస్తూ ఉండేది. ఇదంతా ఆమె నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. ఇలా కొన్నిరోజులు గడిచిపోయాయి.
అనుకోకుండా ఒకరోజు ఈ విషయం అర్జున్‌కు తెలిసింది.
‘ఏంటి నాకు తెలిసిన విషయం నిజమేనా?’ అంటూ నిలేసినట్లు అడిగాడు అర్జున్‌. మొదటిసారి అర్జున్‌ అలా మాట్లాడటం బాధగా అనిపించినా. ముందుగా చెప్పకపోవడం తనదే తప్పు. అదే విషయాన్ని అర్జున్‌తో అంది అపూర్వ. విషయం అర్జున్‌కు వివరించింది.
ఎంతైనా విశాల్‌కు అపూర్వ సహాయపడటం ఒకపట్టాన అర్జున్‌కు మింగుడుపడలేదు. సహజమైన పురుషాంకారం ఒకసారి అర్జున్‌లో తొంగి చూసింది. కొన్నిరోజులు ఇద్దరూ తర్జనభర్జనలు పడ్డారు.
‘విశాల్‌ గురించి నాకు వేరే అభిప్రాయం లేదు.. నీకు దూరంగా నేను ఉండలేను’ అని అర్జున్‌ ఎదపై తలవాల్చి చెప్పింది అపూర్వ. దిగ్గున ఆమెను పక్కకు నెట్టి… ‘మీ గురించి తెలిసిన వారికి అలా అనిపించదు. అనుమానం కలుగుతుంది. దానివల్ల మనకూ, విశాల్‌కూ ఇద్దరికీ నష్టమే. అలాంటప్పుడు అతనితో నీకున్న సంబంధాలన్నీ తెంచుకుంటే మంచిది’ అని సలహా ఇచ్చాడు అర్జున్‌.
‘నువ్వన్నది నిజమే అర్జున్‌. అది ఈ వ్యవస్థ దృష్టిలోంచి చూస్తే.. నువ్వూ అలాగే చూస్తున్నావా? విశాల్‌ అంటే నాకు ఆరాధన’ అంది అపూర్వ.
‘మరి నా పరిస్థితి ఏంటి? మనస్సులో అతను, తనువు మాత్రమే నాదా’ కటువుగానే అన్నాడు అర్జున్‌.
‘అలాంటిదేమీ లేదు. నిన్ను నేను ఎలా చూసుకుంటానో నీకు నేను చెప్పాలా?’ అంది అపూర్వ చాలా బాధగా. అయినా అర్జున్‌ ముభావంగా అటుతిరిగి పడుకున్నాడు.
ఈ విషయాలు తెలిసిన విశాల్‌ చాలా నొచ్చుకున్నాడు. ‘నావల్లే నీకు ఈ కష్టాలు’ అన్నాడు విశాల్‌.
‘అబ్బే అదేంలేదు. అర్జున్‌ అలా రియాక్ట్‌ కావడం సహజం కదా! అయినా తనకు నచ్చజెపుతాను. ఈ వ్యవస్థలో మనమంతా ఉన్నాం కదా! ఆ ప్రభావం సహజంగానే ఉంటుంది. శ్రీశ్రీ, చలం, మనం కోరుకున్నట్లు సమాజం లేదు కదా? తనూ నీకు సహాయపడతాడని ఆశిస్తున్నాను. నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా ప్రజలకు సేవ చేస్తున్నావు. నీలాంటివాళ్లు సమాజానికి ఎంతో అవసరం. అందుకే నువ్వు మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నా. అందులో నా స్వార్థం ఉంది. అర్జున్‌ ఆరోగ్యం బాగుండి ఉంటే అతనే ఎంతో ఉన్నతంగా ఎదిగేవాడు. ఇప్పుడూ ఏం తక్కువకాదు. నేననుకున్న లక్ష్యాలకి దగ్గరలోనే ఉన్నాడు. అతనూ ఒకింత ఉన్నతంగానే ఉన్నాడు. తనూ ప్రజాసేవలో ఈ స్థాయికి ఎదుగుతాడని అనుకోలేదు. నా కృషి ఫలించింది. మరింత ఉన్నతంగా ఎదగడానికి అర్జున్‌కు ఆరోగ్యం సహకరించదు. నీపై నా ఆలోచనలన్నీ మొదటి నుంచి ఉన్నవే కదా! ఈ లక్ష్యం ఈనాటిది కాదు. ఏనాటిదో. నువ్వు ఎంత ఎత్తు ఎదిగితే ఈ హృదయం అంత సంతోషిస్తుంది’ అంది అపూర్వ.
విశాల్‌కి హృదయం కరిగినట్లయ్యింది. (ఇందులో ఉన్నతం అంటే బాధ్యతగా అనుకోవాలి)
ఒక్కసారి తన గుండెలకు అపూర్వను హత్తుకోవాలనిపించింది. ‘ఛీ… ఛీ.. ఏంటి ఇలా ఆలోచిస్తున్నా’ అనుకున్నాడు మనస్సులో.
‘మనల్ని ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనమంతా కలుద్దాం. అప్పటివరకూ జాగ్రత్తగా ఉండు విశాల్‌. నువ్వు నీ లక్ష్యం మర్చిపోకూ. ఎప్పటికీ నీకు నేను సహాయంగా ఉంటా.’ అంది అపూర్వ.
బరువైన హృదయంతో ఫోను పెట్టేశాడు విశాల్‌.
‘అపూర్వ నిజంగా అపూర్వమైంది. ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా ప్రపంచంలో… నిజంగా ఇప్పటికీ నమ్మలేకపోతున్నా… అయినా ఇది నిజం.. అపూర్వ నిజం…ఆమె ఆశను తప్పక నెరవేర్చాలి. అయినా నా ఆశయం కూడా అదేకదా!’ అనుకుంటూ నిద్రకుపక్రమించాడు విశాల్‌.
0×0
ఇప్పటివరకూ వారి మధ్య ఇమెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌లే సంధానమయ్యాయి. ఎదురుపడి కలుసుకున్నది లేదు. ఇన్నాళ్లకు విశాల్‌ వస్తున్నాడని చాలా సంతోషంగా ఉంది అపూర్వకు.
సాయంత్రం 8 గంటలు కావస్తోంది..వర్షం సన్నగా జల్లులా పడుతోంది. అదికూడా చాలా హాయిగా అనిపించింది అపూర్వకు. విశాల్‌ ఉన్న భవనం ముందు ఆగింది. అక్కడి వాచ్‌మెన్‌ను అడిగితే రెండో అంతస్థులో ఎడమపక్క రూములో విశాల్‌ ఉన్నాడని చెప్పాడు. ఆ వైపుగా మెట్లు ఎక్కుతూ వెళ్లింది.
‘రా కూర్చో అపూర్వా!’ అంటూ తనకెదురుగా ఉన్న కుర్చీ జరిపాడు విశాల్‌.
విష్‌ చేసి కుర్చీలో కూర్చుంది.
‘ఏంటి.. ఎలా ఉన్నావు?’ అన్నాడు విశాల్‌.
‘బాగానే ఉన్నా?’ చెప్పింది అపూర్వ.
‘ఏంటి మాట్లాడు..’ అన్నాడు విశాల్‌.
‘ఏం మాట్లాడను?’ ఎదురు ప్రశ్నించింది అపూర్వ.
‘ఏం లేదా?’ అన్నాడు విశాల్‌.
‘నువ్వే మాట్లాడు’ అంది అపూర్వ.
‘నువ్వు ఇంత సహాయం చేస్తున్నావు. నేనేమీ నీకు ఇవ్వలేకపోతున్నా’ అన్నాడు విశాల్‌.
‘ఏమిస్తావు.. మనమిలా స్నేహంగా ఉంటే చాలు..’ అప్రయత్నంగానే అంది అపూర్వ.
‘అదే ఏమివ్వాలో అర్థం కావటంలేదు.. అలాగే నువ్వన్నట్లే ఉందాం.. నాకు నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా.. అపూర్వంగా అనిపిస్తోంది. నా గురించి నువ్వు ఇంత కష్టపడుతున్నావు. కానీ నీలో ఉన్న శక్తిని తక్కువ అంచనా వేసుకుంటున్నావు’ అన్నాడు విశాల్‌.
అప్పుడు కొద్దిగా కళ్లెత్తి చూసింది అపూర్వ.
‘ఎంత బాగున్నాయి ఆ కళ్లు’ అనుకున్నాడు విశాల్‌ మనస్సులోనే.
విశాల్‌ జుట్టు కొద్దిగా నెరిసినట్లనిపించింది. నాది కూడా అక్కడక్కడా నెరిసిందిలే… అనుకుంది మనస్సులో అపూర్వ.
‘ఏమిటి ఆలోచిస్తున్నావు?’ అడిగాడు విశాల్‌.
‘ఏమీలేదు.. ఇదిగో విశాల్‌ రేపు నువ్వు మాట్లాడే సబ్జెక్టుకు సంబంధించిన మెటీరియల్‌.. ‘ అంటూ ఒక ఫైల్‌ను అతని చేతికి ఇచ్చింది.
అందుకుని.. అపూర్వ వంక అభినందనగా చూశాడు విశాల్‌.
‘ఈరోజు నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. అందుకే నిన్ను ఎలాగైనా కలవాలనుకున్నా’ అన్నాడు విశాల్‌.
ఏమిటీ అన్నట్లు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టింది అపూర్వ.
‘నన్ను ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఇంత శ్రమపడుతున్నావు. నీ సమయంలో చాలావరకూ నాకే కేటాయిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు.. నువ్వే ఎందుకు ఒక ఉన్నత వ్యక్తివి కాకూడదు?’ అని ఆపాడు విశాల్‌.
‘నేనా…?’ ఆశ్చర్యంగా అడిగింది అపూర్వ.
‘అవును నీవే..’ అన్నాడు విశాల్‌.
‘నువ్వు నాకు ఎన్నో సబ్జెక్టులపై ప్రసంగాలు తయారుచేసి ఇస్తున్నావు. వివరాలు సేకరిస్తున్నావు. అవన్నీ నువ్వు ఉపయోగించుకుంటే నువ్వూ మహౌన్నతంగా ఎదుగుతావు…నాయకులతో కూడా మాట్లాడతాను’ అన్నాడు విశాల్‌.
‘నాకంత టాలెంట్‌ లేదు విశాల్‌.. నువ్వు ఒక స్థాయికి ఎదిగిన నాయకుడివి. నే చేసే సహాయమెంత..నీలో ఉన్న శక్తిసామర్థ్యాలతోనే నువ్వు ఉన్నతంగా ఎదుగుతున్నావు. నాకు నీకున్నంత నాయకత్వ లక్షణాలు లేవు కదా..!’
‘ఇందాక ఏమిస్తావు అని అడిగావు కదా..! నువ్వు ఆ నాయకత్వ లక్షణాలు అలవర్చుకునేలా నేను సహాయపడతా.. అసలు నీవు నాయకురాలివే.. కొన్ని మెళకువలు తెలుసుకుంటే చాలు.. దాంతో నువ్వు ఉన్నత శిఖరాలకు ఇట్టే అల్లుకుపోగలవు…’ చాలా కాన్ఫిడెన్స్‌గా చెప్పాడు విశాల్‌..
తనపై అతనికున్న ఉన్నతమైన అభిప్రాయానికి, అంచనాకి చాలా సంతోషించింది అపూర్వ.
‘ఈ రోజు నుంచే ఆచరణలో పెడతావా మరి..’ అన్నాడు విశాల్‌.
‘నువ్వు సహాయపడతానంటున్నావుగా.. ఓకే.. అలాగే కానీవు అంది’ అపూర్వ.
లేచి నిలబడి.. వెళతానంది.. అపూర్వ.
‘అప్పుడే..’ అన్నాడు విశాల్‌..
చాలాసేపు అయిందిగా.. బాబు ఎదురుచూస్తూ ఉంటాడు ఇంటి దగ్గర.
తనూ లేచి నిలబడ్డాడు.
వెళతానంటూ కళ్లతోనే చెపుతూ వెళ్లిపోయింది అపూర్వ.
అపూర్వ వెళ్లినవైపే చూస్తూ ఉండిపోయాడు విశాల్‌.
×××
అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. విశాల్‌ ఎమ్మెల్యేగా పోటీచేశాడు.
ఆమె స్వయంకృషికి విశాల్‌ సహకారం తోడై అపూర్వ రాష్ట్రస్థాయి నాయకురాలిగా ఎదిగింది. చాలాచోట్ల ఉపన్యాసాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటోంది.
ఎన్నికల్లో విశాల్‌ నిలబడ్డాడని తెలిసిందగ్గర నుండి అతను గెలవాలని అపూర్వ తనకు చేతనైనంతా సహకారం అందిస్తోంది.
‘ఏమిటి.. నే విన్నది నిజమేనా?’ అడిగాడు అర్జున్‌.
‘ఏమిటది?’ అమాయకంగా ప్రశ్నించింది అపూర్వ.
‘విశాల్‌కి అవసరమైన సమాచారన్నంతా సమకూర్చిపెడుతున్నావట’ అంటూ ‘ట’ని వత్తి పలికాడు అర్జున్‌.
‘నీకూ ఈ వ్యవస్థలో ఉన్న మామూలు మగవాళ్లకీ తేడాలేకుండా మాట్లాడకు అర్జున్‌’ అంది అపూర్వ.
‘మనం ఈ వ్యవస్థలోనే ఉన్నాం కదా! ప్రభావం పడకుండా ఎలా ఉంటుంది?’ ఎదురు ప్రశ్నించాడు అర్జున్‌.
‘అవును అర్జున్‌.. చేశాను.. నేను ఈరోజు ఇంత ఉన్నతంగా తయారవడానికి అతని సహకారం కూడా ఉంది. ఇది అంతా మన లక్ష్యంలో భాగమే అర్జున్‌.. నువ్వు నువ్వుగా ఆలోచించు.. ఈ వ్యవస్థలో పురుషుడిని మాటిమాటికి బయటకు తీసుకురాకు…’ ఖచ్ఛితంగానే చెప్పింది అపూర్వ.
‘సరే.. మరి అతని పర్మిషన్‌ తీసుకున్నావా? ఇవి బయటకు తెలిస్తే ఏమవుతుందో ఇంతకుముందే నీకోసారి చెప్పాను. అయినా ఎవరైనా నన్ను వేలెత్తి చూపితే నేను తట్టుకోలేను’ అన్నాడు అర్జున్‌ ఉద్వేగంతో..
కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ..
విశాల్‌కు ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తున్నా.. చాలా కేర్‌ఫుల్‌గానే ఉన్నాం.. నువ్వనుకునే పరిస్థితి ఎప్పటికీ రానీయను.. ఓకేనా.. అంది అపూర్వ.
‘ఓకే.. నాకూ అంతకన్నా కావల్సిందేముంది?’ అన్నాడు అర్జున్‌.
ప్రచారానికి వెళతానికి రెడీ అవుతుంది అపూర్వ.
‘ఏమిటీ వెళుతున్నావా?’ అడిగాడు అర్జున్‌.
‘అవును నీకు చెబుదామనుకునేలోపు నువ్వే అడిగేశావు. నిన్ననే పార్టీ నిర్ణయించింది’ చెప్పింది అపూర్వ. ‘సరే.. జాగ్రత్త’ అంటూ బస్సెక్కించాడు అర్జున్‌..
అందరూ విశాల్‌ గెలుపుకోసం అహర్నిశలూ పనిచేశారు. అక్కడ జరిగిన ప్రతి సభలోనూ అపూర్వ చేసిన ప్రసంగాలు విని..’నాకు తెలిసిన అపూర్వేనా…’ అని ఆశ్చర్యపోయాడు విశాల్‌. ‘ఎంత బాగా మాట్లాడుతుంది. ఆడవాళ్లు తమ శక్తిని దాచుకుంటారు. వారి మనస్సు ఎప్పుడూ ఎదుటివారి ఉన్నతినే కోరుతుంది. మగవాడే చంచలంగా ఆలోచిస్తాడు.. స్వార్థంగా ఉంటాడు. అందుకే తీగకు పందిర వేసినట్లు ఆడవాళ్లకు అవకాశమిస్తే ఉన్నతశిఖరాలకు అధిరోహిస్తారనడానికి అపూర్వే నిదర్శనం’ అనుకున్నాడు విశాల్‌.
మీడియాలో కూడా అపూర్వ ప్రసంగాలకు విస్తృత ప్రచారం వచ్చింది.
పోలింగ్‌ అవగానే తిరిగి వచ్చేసింది అపూర్వ.
వారంరోజులకు ఫలితాలు వచ్చాయి.
విశాల్‌ ఎమ్మేల్యేగా గెలిచినట్లు టీవీలో చూసింది. అపూర్వ సంతోషానికి పట్టపగ్గాలు లేవు.
అర్జున్‌ మాత్రం ఒకింత ముభావంగానే ఉన్నా మరీ అంత సీరియస్‌గా లేడనిపించింది.
విశాల్‌ ఫోన్‌ చేశాడు. ఒక్క అంగలో ఫోను ఎత్తింది అపూర్వ.
‘ఇది నీ విజయమే’ అన్నాడు విశాల్‌.
‘కాదు మన విజయం… ప్రజా విజయం’ అంది అపూర్వ.
‘ఏమైనా మాటకారివి.. నీ మాటలు నాకు రావు అపూర్వా!’ అన్నాడు విశాల్‌.
‘నా లక్ష్యంలో నువ్వో మెట్టు ఎదిగినందుకు నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను విశాల్‌!’
‘అర్జున్‌ ఉన్నాడా?’ అడిగాడు విశాల్‌.
‘ఉన్నాడు’ చెప్పింది అపూర్వ.
‘అర్జున్‌కి ఫోనివ్వు’ అన్నాడు విశాల్‌.
‘నీకే’ అంటూ అర్జున్‌కి ఫోనిచ్చింది అపూర్వ.
‘కంగ్రాట్స్‌’ అన్నాడు ఫోనందుకున్న అర్జున్‌.
‘థ్యాంక్యూ… మీ ఇద్దరి సహకారంలేనిదీ ఇది సాధ్యం అయ్యేది కాదు’ అన్నాడు విశాల్‌.
‘నీ అభిప్రాయంతో ఏకీభవించను.. ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారు.. అందుకు మనమంతా సంతోషించాలి’ అన్నాడు అర్జున్‌.
‘నువ్వన్నది నిజమే…’ మెచ్చుకోలుగా అన్నాడు విశాల్‌.
‘మీరిద్దరూ కలిసి మా ఇంటికి రండి’ అని ఆహ్వానించాడు విశాల్‌.
‘ఓకే తప్పకుండా…’ అన్నాడు అర్జున్‌.
‘ఎప్పుడు?’ అన్నాడు విశాల్‌.
‘ఇది నవంబరు కదా! జనవరిలో బాబుకి సంక్రాంతి సెలవులుంటాయిగా.. అప్పుడు తప్పకుండా వస్తాం..’
‘చాలా థ్యాంక్సు అర్జున్‌.. అపూర్వకు చెప్పు.. ఉంటాను..’ అంటూ చాలా ఆనందంగా ఫోన్‌ పెట్టేశాడు విశాల్‌..
‘ఏమంటున్నాడు.. జనవరిలో వస్తామంటున్నావు..?’ అడిగింది అపూర్వ.
‘వాళ్లింటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు విశాల్‌..’ అన్నాడు అర్జున్‌..
‘నిజంగా తీసికెళతావా?’ అమాయకంగా అడిగింది అపూర్వ.
అంత పెద్ద పెద్ద ఆలోచనలు చేసే అపూర్వ అంతలోనే చిన్నపిల్లలా అలా అడిగేసరికి నవ్వకుండా ఉండలేకపోయాడు అర్జున్‌.
అపూర్వను దగ్గరకు తీసుకొని.. ‘నిజంగా..’ అన్నాడు అర్జున్‌..
‘హమ్మయ్య…’ అని ఊపిరి పీల్చుకుంది అపూర్వ…. ‘నా కల నెరవేరుతుంది.. మనమంతా కలుస్తున్నాం…’ అనుకుంది మనస్సులో.
000
‘విశాల్‌!…. సారీ.. ఎమ్మెల్యే విశాల్‌ గారూ…!’ అంది అపూర్వ..
‘ప్లీజ్‌ అపూర్వ.. నన్ను ‘విశాల్‌’ అనే పిలువు.. అలా పొడుగ్గా పిలిచి దూరం చెయ్యకు అన్నాడు’ విశాల్‌.
‘దూరంగానే ఉన్నాం కదా…!’ హాస్యంగా అంది అపూర్వ..
‘మన దూరంగా ఉన్నా… మన ఆలోచనలు ఒక్కటే.. అపూర్వ..’ ఆర్ద్రంగా అన్నాడు విశాల్‌..
‘చాలా థ్యాంక్సు విశాల్‌.. నా మనస్సులో మాట చెప్పావు.. మన ఆలోచనలు ఎప్పటికీ ఒక్కటే.. కాకపోతే ఈ స్నేహబంధం ఇలాగే ఉండనీ… ఎప్పటికీ చెక్కుచెదరనివ్వొద్దు విశాల్‌.. ఇంతకన్నా ఇంకేం కావాలి..’ అంతే ఆర్ద్రతతో చెప్పింది అపూర్వ.
‘ఇంతకీ అసలు విషయం నాకు చెప్పలేదు’ కొంచెం కినుకుగా అడిగాడు విశాల్‌.
‘ఏమిటి?’ అమాయకంగా అడిగింది అపూర్వ.
‘అదే నువ్వు జాతీయకమిటీలో సభ్యురాలివి అయ్యావుగా…’ అన్నాడు విశాల్‌..
‘అదేముందీ..బాధ్యతలు మరింత పెరగాయి..ఇంకాస్త సమయం కేటాయించి, జాగ్రత్తగా స్టడీ చేయాలి’ అంది అపూర్వ.
‘అదే నీలో ఉన్న గొప్పతనం.. ఎంత ఉన్నతికి ఎదిగినా ఒదిగే ఉంటావు’ మెచ్చుకోలుగా అన్నాడు విశాల్‌.
‘నీ సహకారంలేనిదీ ఇది సాధ్యమా విశాల్‌’ అంది అంతే మెచ్చుకోలుతో అపూర్వ.
‘నీకు అప్పుడూ చెప్పా.. ఇప్పుడూ చెపుతున్నా.. నీలో ఆ టాలెంట్‌ లేనిదీ ఇది సాధ్యం కాదు. నేను నీకు చేసిన సాయం సముద్రంలో నీటిబొట్టంత. నీ గురించి నీవు తక్కువ అంచనా వేసుకోకు.. ఎప్పుడూ నీ లక్ష్యం ఉన్నతంగానే ఉండాలి సుమా…’ హితవు చెప్పాడు విశాల్‌..
‘నీలాంటి హితులు.. స్నేహితులు ఉంటే అది సాధ్యమే విశాల్‌.. నువ్వు చెప్పిన విషయం ఎప్పటికీ మర్చిపోను..గమనంలోనే ఉంచుకుంటా’ అంది అపూర్వ..
‘నా జీవితంలో మంచి స్నేహితుడివి.. ఆత్మీయుడివి నువ్వు..’ అని మనస్సులో అనుకుంది అపూర్వ.
‘ఆడవాళ్ల శక్తి అపూర్వమైనది…’ ఫోన్‌ పెట్టేస్తూ.. అనుకున్నాడు విశాల్‌..
- శాంతిశ్రీ

0 Response to "అపూర్వ"

కామెంట్‌ను పోస్ట్ చేయండి