ప్రకృతి

అబ్బ పొద్దున పొద్దున్నే చెమటలు ఎట్టా దిగకారుతున్నాయో….. ఒకటే ఉబ్బరించేస్తోంది…
పొద్దున్నే ఎక్కడే.. పది కొట్టింది టైము… అన్నాడు రత్తయ్య.
ఇప్పుడే ఇట్టా ఉంటే ముందు ముందు ఇంకెట్టా ఉంటుందో.. పైటకొంగు తీసుకొని మెడ, ముఖమూ తుడుచుకుంటూ అంటోంది లక్ష్మమ్మ.
భూమి ఎడెక్కిపోతోందంటే…. మరి ఇక ముందు ముందు ఎండలు ఇట్టాగే మండిపోతాయి.. అన్నాడు రత్తయ్య.
అట్టాగా మామా..! భూమి ఎడెక్కి పేలిపోద్దా..? నోరంతా తెరిచి ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మమ్మ.
ఓసీ ఎర్రిమొఖమా..! పేలిపోద్దో లేదో గానీ.. పెద్ద పెళయం వస్తదేమో.. అన్నాడు రత్తయ్య.
అమ్మో ఎట్టా..? మనమంతా చచ్చిపోతామా మామా? భయంగా కళ్లింత చేసి అడిగింది లక్ష్మమ్మ!
ఓసి పిచ్చి లచ్చిమీ! పాణమంటే ఎంత తీపే నీకు.. అన్నాడు రత్తయ్య
అబ్బో.. నీకు లేదేంటి పాణమీద తీపి..? మూతి తిప్పింది లక్ష్మమ్మ.
ఈ అగ్గికి పాణం ఎట్టాగో అయిపోతోంది… ఏం తినాతి కావడంలేదు… అయినా తప్పుద్దా..? అంటూ చేను దగ్గర నుండి తెచ్చిన ములక్కాయలను, కత్తిపీట, ఉల్లిపాయలు అన్నీ ముందేసుకుని కూర్చుంది లక్ష్మమ్మ.
ఏం కూరే..? అడిగాడు రత్తయ్య.
కనపడట్లా.. అంత పొడుగ్గా.. ములక్కాయకూర.. అంది విసుగ్గా లక్ష్మమ్మ…
ఓసోసి ఎందుకే అంత ఇసుగు… ములక్కాయలు కనపడతున్నాయిలే.. ఆటితో ఏం కూర చేత్తన్నావని…? ఎండి చేపలుగానీ, ఎండిరొయ్యల గానీ ఉంటే నాలుగు తగిలించు కొంచెం వాసనన్నా తగులుద్ది అన్నాడు రత్తయ్య.
అబ్బో.. ఈ రుచులకేం తక్కువలేదు.. హుహూ.. హుహూ.. అంది లక్ష్మమ్మ….
అబ్బ ఎంత నిగ్గే నీకు.. రేపు ఆదివారం పచ్చిరొయ్యలు తెస్తాగానీ.. దొడ్డేపు చింతచెట్టుకి చిగురు బాగా ఏసింది.. కాసింత చింతచిగురేసి వండవే చాలా బాగుంటుంది అన్నాడు రత్తయ్య.
అబ్బో… ఏంటో మా రుచులు పోతున్నావు.. ఏంటీ మామా… కతా..?
కతా లేదు కాకరకాయా లేదే.. తినాలనిపించింది అడిగా.. నీకోపికుంటే చేసిపెట్టు.. నీ ఇట్టం.. అన్నాడు రత్తయ్య..
అబ్బో మాలోవు పువరుసమండీ… నేనేమ్మా చేయనన్నానా..ఏంది?.. కోపంగా అంది లక్ష్మమ్మ…
ఓసోసి ఏంటే ఆ ముక్కుపుటాలలా ఎగరేస్తూ .. అబ్బో బుగ్గలు చూడు మందారాలు పూసినట్లున్నారు… చతురాడాడు రత్తయ్య.
మూతి మూడు తిప్పులు తిప్పి… చెంగు ఒక్క దులుపు దులిపి నడుంచుట్టాతా తిప్పి బొడ్లో దోపుకుని కూరగాయ ముక్కలు తీసుకొని వంటింట్లోకి దారి తీసింది లక్ష్మమ్మ…
వెనకే వెళ్లాడు రత్తయ్య..
అవ్వ.. వదులు మామా… ఏంటి? పట్టపగలూ.. పగలు రేత్రికి తేడాలేకుండా..అయినా ఈ వయస్సులో.. అంటూ గింజుకుంటుంది లక్ష్మమ్మ….
నిన్నట్టుకోవడానికి పగలు.. రేత్రి చూడాలేంటే..? అన్నాడు మురిపెంగా రత్తయ్య.
అబ్బ వదులు మామా..! అన్నం తిని నువ్వు మళ్లీ పొలం ఎల్లాలి.. గుర్తు చేసింది లక్ష్మమ్మ…
లక్ష్మి మాటలకు పనులు గుర్తుకొచ్చి.. ఆ.. ఆ… తొందరగా కానీ… నేను కాళ్లూ చేతులు కడుక్కొస్తా.. అంటూ చింతచెట్టుకింద తొట్టికాడకి వెళ్లాడు.
అన్నం పళ్లెంలో పెట్టి, చిన్న గిన్నెలో కూరేసి పళ్లెంలోనే పెట్టి దోసకాయ చెంబుతో నీళ్లు తీసుకొని… ‘మామా…! మామా…! ఏడున్నా..?’ అంటూ పిలిచింది లక్ష్మమ్మ…
‘ఈడే ఉన్నానే.. ఈ చింతచెట్టు కిందే చల్లగా ఉంది ఇక్కడే తింటా’ అని బదులిచ్చాడు రత్తయ్య.
పళ్లెం తీసుకొని అటువైపు వెళ్లింది లక్ష్మమ్మ. నులకమంచం వాల్చుకుని కండవ తలకింద చుట్టి పెట్టుకొని పడుకొని ఉన్నాడు రత్తయ్య.
లే మామా..! అన్నం తిను.. వేళవుతోంది.. అని పళ్లెం రత్తయ్యకు అందించి.. తనూ పళ్లెంలో అన్నం పెట్టుకొని తెచ్చుకొంది.
మంచం దగ్గరే కిందే కూర్చొని అన్నం తింటూ..’బాగుందా మామా కూర?’ అడిగింది లక్ష్మమ్మ.
ఆ ఎండిచేపలు ఏసావు కాబట్టి కాసింత ముద్ద దిగుతుంది అన్నాడు రత్తయ్య.
ఎండిచేపలవల్లేగానీ.. కూర బాగోలేదన్నమాట..? గునిసింది లక్ష్మమ్మ.
ఓయబ్బా ఏం కోపమే… నువ్వు ఏదొండినా బాగుంటదే… మురిపెంగా అన్నాడు రత్తయ్య.
పళ్లెం తొట్టికాడ పెట్టి, చేయి కడుక్కొని, చెంబుడు నీళ్లూ తాగి, కండవా దులుపుకుని తలకు చుట్టుకున్నాడు. లక్ష్మమ్మ ఇచ్చిన ప్లాస్టిక్‌ బాటిల్‌ అందుకుని, ‘ఈ సీసాకు ఆ తడిగుడ్డ చుట్టబట్టి నీళ్లు ఏడెక్కకుండా ఉంటున్నాయో.. అంటూ ఏమైనా నీ బుర్ర బాగా పదును’ అంటూ మెచ్చుకున్నాడు రత్తయ్య.
మామెంక మురిపెంగా చూస్తూ… ‘పెందరాళే రా మామా..!’ అంటూ సాగనంపింది.
000
ఓ మామా! ఈ ఇడ్డూరం ఇన్నావా?
మొన్న నువ్వు చెప్పినట్లు భూమి బాగా ఏడెక్కి పోతుందంట మామా? ఇంకా రెండు పాయెంటీలు పెరిగితే అంతేనంట…
అంతే అంటే ఏంటే.. పెళయం వచ్చేస్తదా..? అయినా ఇదవరకటిలా లేదే పరిస్థితి..అంతా మారిపోయినాదే.. మనుషుల్లో స్వార్థం పెచ్చుమీరిపోనాది.. చానా మార్పు వచ్చేసినాదే.. అదే ఈ విపరీతానికి దారితీసింది.. అన్నాడు రత్తయ్య..
ఏంటి మామా.. ఏదాంతం మాటాడుతున్నా..? అడిగింది లక్ష్మమ్మ.
ఏదాంతం కాదే.. ఎదార్థం.. అన్నాడు రత్తయ్య.
ఏంది మామా..? నువ్వేమంటున్నావో.. నాకొక్కటి తలకెక్కడంలా.. కాసింత అర్థమయ్యేలా చెప్పు మామా.. అంది లక్ష్మమ్మ.
ఏం లేదే.. మన మనుసులు చాలా ఇరుకైపోయినాయే.. ఇదివరకటిలా లేదే జీవనం.. అన్నాడు రత్తయ్య.
అవును మామా నువ్వు చెప్పేది నూటికి నూరు శాతం కరెట్టు మామా..! అంది లక్ష్మమ్మ.
ఇదివరకు ఎవరికేమన్నా అయినా పదిమందీ ఆదుకొనేవారు..
అదిగాదే.. పిచ్చిమొఖమా.. అయ్యెట్టాగో మారిపోయినాయిలే.. జీవనంలో మార్పు రాబట్టే మన సంబంధాల్లోనూ మార్పులొచ్చాయి..
మరి నేనూ అదేగదా చెప్పేది కాసింత కోపంగా అంది లక్ష్మమ్మ.
ఇద్దరూ నాది కరెక్టు అంటే నాది కరెక్టు అనుకుంటుండగా..
హైదరాబాద్‌లో ఉన్న కొడుకు కూతురు మమత వచ్చింది. మొన్ననే పదోతరగతి పరీక్షలు రాసింది. వస్తూనే ‘ఏంటి నానమ్మా? ఏంటి విషయం?..’ అంది మనవరాలు మమత.
అది కాదమ్మారు..! నువ్వు చెప్పు మీ తాతేమో మన జీవనం మారిపోనాది అందుకే భూమి ఎడేక్కిపోతుందంటున్నాడు.
నేనేమో మనషుల మధ్య పేమలు తగ్గిపోయినాయి.. ఇదివరకటిల్లా లేరు అంటున్నా.. ఎవరిది కరెక్టో చదువుకున్నదానివి నువ్వు చెప్పమ్మారు.. అంటూ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. లక్ష్మమ్మ.
చేతిలో బ్యాగు అందుకుని అరుగుమీద పెడుతూ కాసింత పిల్లను కూర్చోనియ్యవే.. అంతదూరం నుండి పెయానం చేసి వస్తే..ఆనక్కి అన్నీ చెప్తుందిలే.. అంటూ ‘అలా పొలం ఎల్లి వత్తానమ్మా..!’ అంటూ మనమరాలి బుగ్గలు సవరదీస్తూ.. కండవా తలకు చుట్టుకుని బయల్దేరాడు రత్తయ్య.
000
భోజనాలయ్యాక లక్ష్మమ్మ గిన్నెలన్నీ సర్దుకుని వచ్చేలోపు…
అందరికీ ఆరుబయట మంచాలేశాడు రత్తయ్య.
తాతా, మనమరాలు కబుర్లు మొదలుపెట్టారు..
అమ్మారు.. నేనొచ్చే వరకూ విషయాలేమీ తాతకు చెప్పబోకు.. అంది లక్ష్మమ్మ.
అలాగే నానమ్మా.. ఏమీ చెప్పటం లేదు.. ఊరికే మాట్లాడుకుంటున్నాం అంది మమత.
మనిషి అక్కడ ఉంది గానీ.. దాని పాణమంతా ఈడే ఉందమ్మా.. అన్నాడు రత్తయ్య..
వూరుకో తాతయ్య.. పాపం నానమ్మ! అన్నీ సర్దుకుని రావాలిగా.. తనకూ విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది గదా?’ అంది మమత.
నానమ్మను బాగానే ఎనకేసుకొస్తున్నావుగా..? అంటూ మనమరాల్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు రత్తయ్య.
నేను చెప్పింది నిజమా? కాదా? చెప్పు తాతయ్యా? అంటూ నిలేసింది మనమరాలు.
నువ్వు చెప్పిందే నిజమమ్మా! అంటూ వచ్చి మంచం మీద కూర్చొంది లక్ష్మమ్మ.
ఇక మనం మాట్లాడేదేమీ లేదు.. అంటూ ఉడికించాడు రత్తయ్య
అబ్బో…. ఇప్పుడుదాకా వసపిట్టలా మాట్లాడింది ఎవరో.. అంటూ.. అదిసరేగానమ్మారు.. భూమి ఏడెక్కడం ఏమిటి? ఏంటో ఇంకా రెండు పాయింటీలు దాటితే మనమంతా అంతేనంటగా..? ఆదుర్దాగా అడిగింది లక్ష్మమ్మ.
నానమ్మ ఆందోళనకు ఒకింత ఆశ్చర్యపోతూనే అమాయకంగా అడుగుతున్న తీరు నవ్వుకూడా తెప్పించింది మమతకు.
అదేంకాదుగానీ నానమ్మా! నువ్వు ఉదయం చెప్పావే.. మనసులు మారిపోయారనీ.. తాతయ్య మన జీవనం మారిపోయిందనీ.. ఇద్దరూ చెప్పిందీ కరెక్టే..
నా తల్లే.. ఇద్దరికీ పేచీలేకుండా ఎంచక్కా చెప్పావమ్మా.. అంటూ మనమరాల్ని ముద్దాడింది లక్ష్మమ్మ.
అసలు సంగతేంటంటే… అంది మమత..
ఆ ఏంటమ్మా.. అసలు సంగతి..? ఆత్రుతగా అడిగింది లక్ష్మమ్మ.
అమ్మాయిని చెప్పినివ్వవే.. మధ్యలో ఎదురు ప్రశ్నలు ఎయ్యబోకా..? అన్నాడు రత్తయ్య..
అదేంలేదులే తాతయ్య మధ్యలో సందేహాలుంటే తీర్చుకోవాలి కదా! అడగనీ.. మా భారతి టీచర్‌ అలాగే చెప్తారు. అంది మమత.
అద్గదీ అలా చెప్పమ్మారు.. మీ తాతకు పెశ్నేస్తే మా ఇసుగు.. అంటూ లక్ష్మమ్మ ముసిముసిగా నవ్వుకుంది.
చాల్లే సంబడం.. సరే నువ్వు చెప్పమ్మారు.. అన్నాడు రత్తయ్య.
తాతయ్య చెప్పినట్లు మన జీవనంలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు మనం వంట చేసుకోడానికి కట్టెల పొయ్యలు వాడేవాళ్లం. ఇప్పుడు గ్యాస్‌, ఎలక్ట్రికల్‌ స్టౌవ్‌లు వచ్చాయి. మనం వండుకునే పాత్రల్లోనూ తేడా వచ్చేసింది. మనం తాగే మంచినీళ్ల సీసాల నుండి స్నానం చేసే బకెట్‌ల వరకూ ప్లాస్టిక్‌వే వాడుతున్నాం కదా! అలాగే ఇదివరకు మన విషయాలు వేరే ఊళ్లో వారికి తెలియాలంటే ఉత్తరాలు రాసేవాళ్లం. ఇప్పుడా ప్రతి ఒక్కరికీ సెల్‌ ఫోన్‌. అలాగే పల్లెల్లో ఇంటికి కనీసం ఒక చెట్టయినా ఉండేది ఇదివరకు. ఇప్పుడు పల్లెల్లో కూడా అందరూ నాపరాయి వేయించేసుకుని, మేడలు కట్టేస్తున్నారు. ఒక్క చెట్టన్నా ఉన్న ఇల్లు వేళ్లమీద లెక్కపెట్టాలి.
నిజమే..ఆహా.. ఏం చెప్పావమ్మా… అన్నాడు రత్తయ్య..
ఇవేమీ అర్థంకాని లక్ష్మమ్మ… అవన్నీ వాడుకోవడానికి, చెట్లు లేకపోవడానికి భూమి ఏడెక్కడానికి ఏమిటీ సంబంధం? అంటూ అడిగింది.
అందుకే నిన్ను ఎర్రిమొగమనేది అన్నాడు రత్తయ్య..
అదిగో చూడమ్మా మీతాతయ్య ఇసయం తనకు అర్థమైతే చాలా? నాకర్థం కానక్కర్లేదా? అంటూ మూతి ముడుచుకుంది.
ఆగు నానమ్మా.. నేను చెప్తాకదా?
ఈ ప్లాస్టిక్‌వి విరిగిపోయావనుకో నువ్వేం చేస్తావ్‌? చెత్తలో పడేస్తావ్‌. ఇదివరకు చిన్న చిన్న జాడిలు ఉండేవి అవి పగిలిపోతే…
అవీ చెత్తలోనే వేసేదాన్ని అంది లక్ష్మమ్మ.
ఓకే.. అయితే జాడి కొన్నిరోజులకు మట్టిలో కలిసిపోతుంది. ఈ ప్లాస్టిక్‌ ఎన్నాళ్లయినా మట్టిలో కలవదు. దానివల్ల వాతావరణంలో విషవాయువులు వస్తాయి. అంతెందుకు ప్లాస్టిక్‌ కవర్ల వాడకం ఇటీవల బాగా పెరిగిపోయింది కదా? అవి కూడా అంతే మట్టిలో కలవు. అలాగే చెట్లు లేకపోతే మనం పీల్చే గాలిలో ఆక్సిజన్‌ తగ్గిపోతుంది. ఆక్సిజన్‌ మనకు ప్రాణవాయువు. అది తక్కువైతే మనకు రోగాలు వస్తాయి. ఈ భూమి వేడెక్కడానికి అవీ కారణమే.
అవునా..! ఆశ్చర్యంగా అడింది లక్ష్మమ్మ.
అంతేకాదు నానమ్మా! పట్టణాల్లో అయితే చాలావరకూ ఇళ్లల్లో ఫ్రిజ్‌లు, కొంచెం ఉన్నవాళ్ల ఇళ్లల్లో అయితే ఏసీలు తప్పనిసరి. వాటివల్ల వాతావరణంలో వేడి బాగా పెరుగుతుంది. అలాగే ఉత్తరాలు మనం చదివాక కొన్నాళ్లకు పారేసినా అది మట్టిలో కలిసిపోతుంది. అదే సెల్‌ఫోన్‌ పాడైతే… అది భూమిలో కలవదు. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటిలోని లెడ్‌ అనే పదార్థం మన శరీరంలోకి మనకు తెలియకుండానే వెళ్లిపోతుంది. సెల్‌ఫోన్లు ఎక్కువ వాడే చోట్ల ఈ విషయాన్ని ఇటీవలే కనిపెట్టారు.
అబ్బో.. నీకు చాలా విషయాలు తెలుసమ్మా.. అంటూ రెండు చేతులతో ఈ చెంపా, ఆ చెంపా సవరదీసి మొటికలు విరిచింది లక్ష్మమ్మ.
అవును నానమ్మా! అలాగే మన తాతయ్య బియ్యం ఇదివరకు గోతాముల్లో పోసేవాడు. ఇప్పుడు వాటికీ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు వచ్చాయి. గోతాములైతే మట్టిలో కలిసిపోతాయి. అదే ప్లాస్టిక్‌ బ్యాగులు మట్టిలో కలిసిపోవు.
ఈ వస్తువుల వాడకం మన జీవనంలో చాలా మార్పు తెచ్చింది. అలాగే నువ్వన్నట్లు మనుషుల్లోనూ చాలా మార్పు వచ్చింది. ఇది వరకటి మనుషులు మన ముందు తరాలు బాగుండాలని కోరుకునే వారు. ఇప్పటి మనుషుల్లో బాగా స్వార్థం పెరిగిపోయింది. ఎవరి ఇంటి సంగతి వారు.. చివరకు ఎవరి సంగతి వారు చూసుకుంటున్నారు.
అవునమ్మా! ఇంటి ఎనకాల చింతచెట్టు, మామిడి చెట్టు మీతాత నాన్న నాటాడు. ఇప్పుడు బాగా ఏపుగా పెరిగి కాయలు కాస్తుంటే మేము తిన్నాం, మీరు తింటున్నారు. నిజమే వెనకటోళ్లు ముందుతరాల గురించి ఆలోచించేవాళ్లు.
నీకివన్నీ ఎట్టా తెలిసాయే అమ్మారు.. ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మమ్మ..
పేపర్లో వస్తాయి.. మా భారతీ టీచర్‌ ఇలాంటివన్నీ బాగా చెప్తారు.
అసలు దేశాల్లో కూడా మార్పు వచ్చింది నానమ్మా.. అసలు ఇలా వాతావరణం వేడెక్కడానికి మన దేశమే కారణం కాదు. పెద్ద పెద్ద దేశాలున్నాయే.. అమెరికాలాంటి దేశాలు ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాయి..
అవును అక్కడ పెతొక్కళ్లకీ, కారు, పిజ్‌, చల్లగా ఉండే మిషన్‌ అన్నీ ఉంటాయంటాగా..? అంది లక్ష్మమ్మ.
అబ్బో.. మీ నానమ్మకు చాలా తెలిసమ్మారు.. అమెరికా ఎల్లొచ్చినట్లే ఎట్లా చెపుతుందో.. చతురగా అన్నాడు రత్తయ్య.
అబ్బో నీకే తెలుసు అన్నీ.. అట్లా వెటకారమాడితేనే కోపమొచ్చేది.. అంటూ మూతి తిప్పింది లక్ష్మమ్మ.
అబ్బో మీ నానమ్మకు కోపమొచ్చిందమ్మారు.. అన్నాడు రత్తయ్య..
‘మరి నానమ్మను నువ్వు అలా అనడం తప్పే తాతయ్య’ అంది మమత.
అద్గది అట్టా బుద్ధిచెప్పు అమ్మారు! మీ తాతకి… సరే విషయం చెప్పు చానా పొద్దుపోయింది.. అంది లక్ష్మమ్మ.
అమెరికాలాంటి వాళ్లు కార్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇలా అనేక మిషన్లు వాడటం వల్ల అక్కడ వాతావరణంలో విషపదార్థాలు మనకన్నా మూడురెట్లు ఎక్కువ విడుదలవుతాయి. అవి అలా అలా గాలిలో కలిసి మొత్తం భూగోళం వేడెక్కడానికి కారణమవుతాయి. మన మనుషుల మనస్తత్వాల్లో ఎంత మార్పు వచ్చిందో ఆ అమెరికాలాంటి దేశాలు అంతే.. ఎక్కువ నష్టం చేసేది వాళ్లయినప్పుడు దాన్ని పూడ్చడానికి ఎక్కువ ఖర్చూ వాళ్లే పెట్టాలి కదా? అంది మమత.
అవును అది నాయం కూడా.. అన్నాడు రత్తయ్య.
అవునవును అంది లక్ష్మమ్మ.
చదువుకోకపోయినా మీకు ఇంత బాగా అర్థమవుతుంది. ఆ అమెరికాలాంటి దేశాలు మాత్రం అలా కుదరదూ అందరం సమానంగా ఖర్చుపెడదాం అంటోంది.
అర్థంకాక కాదమ్మా.. ఎదటోళ్ల మీద నెట్టేసి కాలుమీద కాలేసి కూకుంటానికీ.. అన్నాడు రత్తయ్య.
కరెక్ట్‌ తాతయ్య.. మా టీచర్‌ కూడా ఇదే విషయం చెప్పింది. అందుకే మనుషులైనా, దేశాలైనా.. ఆలోచనల్లో మార్పు రావాలి. ఎదుట మనిషిబాగు కోరాలి.. అందరం ఒకటి అనుకోవాలి. అప్పుడే ఇది బాగుపడుతుంది అని చెప్పటం ముగించింది మమత.
ఆ అలా జరుగుద్దంటావా? ఆందోళన అడిగింది లక్ష్మమ్మ.
ఎందుకు జరగదు నానమ్మా.. మొన్న బొలీవియా అనే దేశంలో మళ్లీ సదస్సు పెట్టి ఈ భూమాతను మనమందరం కాపాడుకోవాలని అందరూ అందుకు కట్టుబడాలని నిర్ణయించుకున్నారు. అలా జరగకపోతే ప్రకృతి వికృతిగా మారుతుంది. ఆ వైపరీత్యాలే ఇంత ఎండల్లో అకాల వర్షాలు.
అవునా.. నిజమే ఈ భూమాతను నమ్ముకున్నోడు ఎన్నడూ నష్టపోడమ్మా.. మరి అలాంటి భూమాతకే కష్టాలొచ్చినప్పుడు.. మనమంతా కలిసి దాన్ని కాపాడుకోవల్సిందే.. అలా జరిగితే నువ్వు చెప్పినట్లు అంతా మంచే జరుగుతుంది.. అన్నాడు రత్తయ్య..
‘ప్రకృతిని కాపాడుకోకపోతే దాని కోపానికి మనమంతా మట్టిలో కలిసిపోవాల్సిందే.. అమ్మాయి ఎంతబాగా చెప్పిందో..’ అంటూ మనమరాల్ని మెచ్చుకుంటూ..’పొద్దుననంగా వచ్చావు. రాత్రి పయానంలో నిద్రపట్టిందో లేదో.. పొడుకోమ్మా… చాలా మంచి విషయాలు చెప్పావు.. రేపు మనోళ్లందిరికీ ఈ విషయాలు చెప్పాలి.. పొడుకో తల్లీ..!’ అంటూ తనూ మంచం మీద నడుం వాల్చింది లక్ష్మమ్మ.
- శాంతిశ్రీ

0 Response to "ప్రకృతి"

కామెంట్‌ను పోస్ట్ చేయండి